కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

విషాదాన్ని తట్టుకోవడానికి నేను ఏమి చేయాలి?

విషాదాన్ని తట్టుకోవడానికి నేను ఏమి చేయాలి?

 విషాదం ఎవరిమీదైనా ప్రభావం చూపుతుంది. బైబిలు ఇలా చెప్తోంది: ‘వేగంగా పరిగెత్తేవాళ్లు ఎల్లప్పుడూ పరుగుపందెంలో గెలవరు; బలమైనవాళ్లు కూడా అన్నిసార్లూ యుద్ధంలో విజయం సాధించరు.’ అది ఇంకా ఇలా అంటోంది: ‘అనుకోని సంఘటనలు అందరికీ ఎదురవుతాయి.’ (ప్రసంగి 9:11NW) జీవితంలో విషాదాన్ని చవిచూసిన కొందరు యౌవనులు కూడా అందులో ఉన్నారు. మరి వాళ్లు దాన్ని ఎలా తట్టుకున్నారు? ఇద్దరి ఉదాహరణలు చదవండి.

 రిబెక

 నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నారు

 మా అమ్మానాన్నలు విడిపోరని, మా నాన్న ఏదో కొంతకాలమే దూరంగా ఉంటాడని నేను అనుకునేదాన్ని. మా అమ్మంటే నాన్నకు చాలా ఇష్టం, తనను ఎందుకు వదిలేస్తాడు? నన్ను ఎందుకు వదిలేస్తాడు?

 జరుగుతున్న దాని గురించి ఎవరితోనైనా మాట్లాడాలంటే కష్టంగా అనిపించేది. దాని గురించి ఆలోచించకూడదని అనుకున్నాను. ఆ సమయంలో నాకు తెలియకుండానే నేను కోపంగా ఉండేదాన్ని. ఆందోళన వల్ల సమస్యలు మొదలయ్యాయి, రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు.

 నాకు 19 ఏళ్లు వచ్చేసరికి అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. తను నా బెస్ట్‌ ఫ్రెండ్‌.

 అమ్మానాన్నల విడాకుల వల్ల దిగ్భ్రాంతికి గురైన నేను, అమ్మ చనిపోవడంతో కుప్పకూలిపోయాను. ఇప్పటికీ నేను తేరుకోలేదు. నిద్రపోవడం మరింత కష్టమైపోయింది, ఇప్పటికీ ఆందోళనగానే ఉంది.

 ఆ సమయంలోనే, నాకు సహాయకరంగా ఉండే కొన్నింటిని నేను కనుగొన్నాను. ఉదాహరణకు, మనం అందరికీ దూరంగా, విడిగా ఉండకూడదని సామెతలు 18:1 హెచ్చరిస్తోంది, నేను ఆ సలహాను పాటించడానికి ప్రయత్నిస్తాను.

 అంతేకాదు, ఒక యెహోవాసాక్షిగా నేను ప్రోత్సాహకరమైన బైబిలు ఆధారిత ప్రచురణలు చదవడానికి ప్రయత్నిస్తాను. అమ్మానాన్నలు విడిపోయినప్పుడు, యువత అడిగే ప్రశ్నలు—మంచి సలహాలు (ఇంగ్లీషు) అనే పుస్తకం నాకు సహాయం చేసింది. ప్రత్యేకించి, 2వ సంపుటిలోని “తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబంలో నేను సంతోషంగా ఉండగలనా?” అనే అధ్యాయం చదవడం నాకు ఇప్పటికీ గుర్తుంది.

 నేను ఆందోళనను అధిగమించడానికి సహాయం చేసిన లేఖనాల్లో నాకు చాలా ఇష్టమైనది మత్తయి 6:25-34 వచనాల్లో ఉంది. 27వ వచనంలో యేసు ఈ ప్రశ్న అడిగాడు: “మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?”

 చెడు సంఘటనలు మనందరి జీవితాల్లో జరుగుతాయి, అయితే వాటితో మనం ఎలా వ్యవహరిస్తామనేదే ముఖ్యమని నేను మా అమ్మను చూసి నేర్చుకున్నాను. ముందు విడాకులు, ఆ తర్వాత ప్రాణాంతకమైన అనారోగ్యం ఇలా తను చాలా కష్టాలు పడింది. కానీ ఆ పరిస్థితుల్లో కూడా తను పాజిటివ్‌గా ఉండేది, చివరి వరకు దేవుని మీద బలమైన విశ్వాసాన్ని చూపించింది. యెహోవా గురించి తను నాకు నేర్పిన విషయాల్ని నేను ఎప్పటికీ మర్చిపోను.

 ఆలోచించండి: బైబిలు, బైబిలు ఆధారంగా తయారైన ప్రచురణలు చదవడం విషాదంలో నుండి బయటపడడానికి ఎలా సహాయం చేస్తుంది?—కీర్తన 94:19.

 కోర్డెల్‌

 నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు, మా నాన్నగారు తుదిశ్వాస విడిచారు. ఆయన్ని పోగొట్టుకోవడం నా జీవితంలో జరిగిన అత్యంత బాధాకరమైన సంఘటన. నా జీవితం తల్లకిందులైపోయింది.

 నాన్న శవం మీద దుప్పటి కప్పినప్పుడు, ఆ దుప్పటి కిందవున్నది మా నాన్న కాదని, ఆయన నిజంగా చనిపోలేదని నాకు అనిపించింది. ‘నాన్న రేపు లేస్తారు’ అని నేను మనసులో అనుకున్నాను. నాకు అంతా వెలితిగా, అన్నీ పోగొట్టుకున్నట్టుగా అనిపించింది.

 మా కుటుంబంలో అందరం యెహోవాసాక్షులం. మా నాన్నగారు చనిపోయినప్పుడు, మా సంఘంలో వాళ్లు మాకు చాలా సహాయం చేశారు. వాళ్లు మాకు ఆహారం పెట్టారు, మాకు తోడుంటామని మాటిచ్చారు, కష్టాల్లో మాకు అండగా ఉన్నారు. అలా ఏదో కొంతకాలం కాదు, చాలాకాలంపాటు మాకు సహాయం చేశారు. వాళ్లు మాకు చేసిన సాయం, యెహోవాసాక్షులే నిజమైన క్రైస్తవులనడానికి ఒక రుజువులా అనిపించింది.—యోహాను 13:35.

 నాకు నిజంగా ప్రోత్సాహాన్నిచ్చిన ఒక లేఖనం, 2 కొరింథీయులు 4:17, 18. అది ఇలా చెప్తోంది: “మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.”

 అందులోని చివరి మాటలు నామీద చాలా శక్తివంతంగా పనిచేశాయి. మా నాన్నగారు పడ్డ బాధ తాత్కాలికమే, కానీ భవిష్యత్తు గురించి దేవుడు చేసిన వాగ్దానం మాత్రం శాశ్వతం. మా నాన్న మరణం, నా జీవితం గురించి ఆలోచించుకుని, నా లక్ష్యాలను మార్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చింది.

 ఆలోచించండి: మీరు ఎదుర్కొన్న ఒక విషాదం మీ జీవిత లక్ష్యాలను మరోసారి పరిశీలించుకోవడానికి మీకు ఎలా సహాయం చేస్తుంది?—1 యోహాను 2:17.