కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

ఇల్లు వదిలి వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నానా?

ఇల్లు వదిలి వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నానా?

 ఇల్లు వదిలి వెళ్లడం అంటే ఒక పక్క ఉత్సాహంగా ఉన్నా, ఇంకో పక్క భయంగా ఉంటుంది. మీరు ఇల్లు వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవచ్చు?

 ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆలోచించండి

 మీరు ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు, అయితే అవన్నీ తెలివైనవి కాకపోవచ్చు. ఉదాహరణకు, 21 ఏళ్ల మారీయో ఇలా అంటున్నాడు: “నేను ఇంటి బాధ్యతల్ని తప్పించుకోవడానికే ఇల్లు వదిలి వెళ్లాలనుకున్నాను.”

 మీరు ఇంటి నుండి వచ్చేస్తే నిజానికి మీ స్వేచ్ఛ తగ్గిపోవచ్చు. 18 ఏళ్ల ఓన్యా ఇలా అంటుంది, “మీరు ఇళ్లు వదిలి వెళ్లినప్పుడు మీ ఇంటి సంగతి, మీ భోజనం సంగతి, మీ ఖర్చుల సంగతి మీరే చూసుకోవాలి. మీకు అవసరమైనప్పుడు సహాయం చేయడానికి అమ్మానాన్నలు పక్కనే ఉండరు.”

 ఒక్కమాటలో: మీరు ఇల్లు వదిలి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో మీకు స్పష్టంగా తెలిస్తేనే, మీరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలుస్తుంది.

 లెక్క చూసుకోండి

 యేసు ఇలా అన్నాడు: “మీలో ఎవరైనా ఒక భవనం కట్టాలనుకుంటే, దాన్ని పూర్తిచేయడానికి కావాల్సినంత డబ్బు తన దగ్గర ఉందో లేదో చూడడానికి ముందుగా కూర్చొని లెక్కలు వేసుకోడా?” (లూకా 14:28) మీరు ఇల్లు వదిలి వెళ్లే విషయంలో ఏ ‘లెక్కలు వేసుకోవాలి’? ఈ మూడు విషయాల్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.

మీరు డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెడతారా?

 బైబిలు ఇలా చెప్తోంది: “డబ్బు రక్షణగా ఉంటుంది.”—ప్రసంగి 7:12, NW.

  •  మీకు డబ్బు ఆదా చేయడం కష్టమా?

  •  మీరు డబ్బును అతిగా ఖర్చు పెడుతుంటారా?

  •  మీరు తరచూ అప్పు చేస్తుంటారా?

 ఈ ప్రశ్నల్లో దేనికైనా మీ జవాబు “అవును” అయితే, ఇల్లు వదిలి వెళ్లాలనుకున్న మీ కల పీడకలలా తయారవ్వవచ్చు.

 “మా అన్నకు 19 ఏళ్లు ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లాడు. ఒక్క సంవత్సరంలోనే డబ్బంతా అయిపోయింది, ఆయన కారును బ్యాంకు తిరిగి తీసేసుకుంది, ఎవ్వరూ అప్పు ఇవ్వలేదు. చివరికి, తిరిగి ఇంటికి వచ్చేస్తానని అమ్మానాన్నల్ని బ్రతిమాలాడు.”—డానియెల్‌.

 ఇప్పుడు మీరేం చేయవచ్చు? మీ ఇంట్లో నెలకు ఎంత ఖర్చు అవుతుందో అమ్మానాన్నల్ని అడగండి. ఏయే బిల్స్‌ కడుతున్నారో, వాటికోసం ఖర్చులు ఎలా ప్లాన్‌ చేసుకుంటున్నారో అడగండి. వాళ్లు డబ్బును ఎలా ఆదా చేస్తున్నారో తెలుసుకోండి.

 ఒక్కమాటలో: మీరు అమ్మానాన్నలతో ఉన్నప్పుడే డబ్బును ఎలా వాడాలో తెలుసుకుంటే, మీరు ఇల్లు వదిలి వెళ్లినప్పుడు ఆర్థిక సమస్యల్ని చక్కగా ఎదుర్కోగలరు.

మీరు బాధ్యతగా నడుచుకునే వాళ్లా?

 బైబిలు ఇలా చెప్తోంది: “ప్రతీ వ్యక్తి తన బరువు తానే మోసుకోవాలి.”—గలతీయులు 6:5.

  •  మీరు పనుల్ని వాయిదా వేస్తుంటారా?

  •  ఇంటిపనులు చేయమని మీ అమ్మానాన్నలు పదేపదే మీకు చెప్తూ ఉండాలా?

  •  ఎప్పుడూ చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా ఇంటికి వస్తుంటారా?

 ఈ ప్రశ్నల్లో దేనికైనా మీ జవాబు “అవును” అయితే, మీరు ఇల్లు వదిలి వెళ్లినప్పుడు బాధ్యతగా ఉండడం ఇంకా కష్టంగా తయారవ్వవచ్చు.

 “మీరు ఇంటినుండి వెళ్లి బయట జీవిస్తుంటే, మీకు నచ్చకపోయినా కొన్ని పనులకు ఖచ్చితంగా సమయం కేటాయించాలి. వాటిని చేయమని ఎవ్వరూ మీకు చెప్పరు, కాబట్టి మీ అంతట మీరే వాటిని చేసుకుంటూ,ఒక పద్ధతికి అలవాటుపడాలి.”—జెసికా.

 ఇప్పుడు మీరేం చేయవచ్చు? ఒక నెల రోజులు ఇంట్లో మీరు చేయగలిగే పనులన్నీ చేయండి. ఉదాహరణకు, మీరే ఇంటిని శుభ్రం చేయండి, మీ బట్టలు మీరే ఉతుక్కోండి, సరుకులు కొని తీసుకురండి, ప్రతీరోజు రాత్రి వంట చేయండి, తర్వాత వాడిన గిన్నెలు తోమండి. ఇలా చేస్తే, ఇంటి నుండి వెళ్లిపోయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థమౌతుంది.

 ఒక్కమాటలో: మీరు ఇల్లు వదిలి వెళ్లాలనుకుంటే బాధ్యతగా ఉండడం చాలా ముఖ్యం.

సిద్ధపడకుండా ఇంట్లో నుండి వెళ్లిపోవడం, పారాషూట్‌ ఎలా వాడాలో తెలుసుకోకుండా విమానం నుండి దూకడం లాంటిది

మీ భావోద్వేగాలను అదుపు చేసుకోగలరా?

 బైబిలు ఇలా చెప్తోంది: “మీరు ఆగ్రహం, కోపం, చెడుతనం, తిట్టడం మానేయాలి.”—కొలొస్సయులు 3:8.

  •  ఇతరులతో మెలగడం మీకు కష్టంగా ఉంటుందా?

  •  మీకు త్వరగా కోపం వస్తుందా?

  •  అన్నీ మీకు నచ్చినట్టే జరగాలనుకుంటారా?

 ఈ ప్రశ్నల్లో దేనికైనా మీ జవాబు “అవును” అయితే, ఒక రూమ్‌మేట్‌తో కలిసి ఉండడం, లేదా భవిష్యత్తులో మీ భార్యతో/భర్తతో కలిసి ఉండడం కూడా మీకు కష్టంగానే ఉండవచ్చు.

 “రూమ్‌మేట్స్‌తో కలిసి ఉన్నప్పుడు నా బలహీనతలు నాకు తెలిశాయి. టెన్షన్స్‌ వల్ల నా మూడ్‌ బాలేనప్పుడు ఎదుటివాళ్లు నన్ను భరించాలని అనుకోవడం తప్పని నాకు అర్థమైంది. నా టెన్షన్‌ తీసేసుకోవడానికి వేరేలా ప్రయత్నించాల్సి వచ్చింది.”—హెలెనా.

 ఇప్పుడు మీరేం చేయవచ్చు? మీ అమ్మానాన్నలతో, తోబుట్టువులతో చక్కగా మెలగడం నేర్చుకోండి. మీరు ఇప్పుడు వాళ్ల లోపాలను ఎలా చూస్తారనే దాన్నిబట్టే, ముందుముందు మీరు కలిసుండే వాళ్ల లోపాల్ని ఎలా చూస్తారనేది కూడా తెలుస్తుంది.

 ఒక్కమాటలో: ఇంటి నుండి వెళ్లిపోతే బాధ్యతలన్నిటినీ తప్పించుకోవచ్చని అనుకోకండి. అలా వెళ్లాలంటే చాలా సిద్ధపడాలి. ఈ విషయంలో మంచి ఆదర్శంగా ఉన్నవాళ్లతో మాట్లాడండి. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఏం చేసుంటే బాగుండేదని, ఏ విషయాలు ముందే తెలిసుంటే బాగుండేదని అనిపిస్తుందో అడగండి. మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇలా చేయడం మంచిది.