కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

బరువు తగ్గాలంటే నేను ఏం చేయాలి?

బరువు తగ్గాలంటే నేను ఏం చేయాలి?

 నేను బరువు తగ్గాలంటే ఏం చేయాలి?

 కొంతమంది టీనేజర్లు, తాము బరువు తగ్గాలని అనుకుంటున్నట్టు చెప్తారు. నిజానికి ...

  •   చాలామంది ఆరోగ్యం గురించి కన్నా, శరీరాకృతి గురించే ఎక్కువ ఆలోచిస్తారు. కొంతమంది భోజనం మానేయడం లేదా బరువు తగ్గించే మాత్రలు వాడడం లాంటి సులువైన పద్ధతిలో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు. వాటివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా, కొన్నిసార్లు ఆరోగ్యం పాడౌతుంది.

     “కొంతమంది అమ్మాయిలు త్వరగా సన్నబడాలని భోజనం చేయడం మానేస్తుంటారు. దానివల్ల వాళ్ల ఆరోగ్యం పాడౌతుంది. మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది.”—హేలీ.

  •   చాలామంది సన్నగా ఉన్నా, ఇంకా బరువు తగ్గాలని అనుకుంటారు. నిజానికి వాళ్లు సన్నగానే ఉంటారు, కాకపోతే తమ వయసువాళ్లతో, లేదా నాజూగ్గా ఉండే సినిమా తారలతో పోల్చుకోవడం వల్ల తాము లావుగా ఉన్నట్టు భ్రమపడతారు.

     “నాకు 13 ఏళ్లు ఉన్నప్పుడు, నా స్నేహితులతో నన్ను పోల్చుకునేదాన్ని. నేను కూడా వాళ్లలా సన్నగా కర్రపుల్లలా ఉంటే, వాళ్లు నన్ను ఇంకా ఎక్కువ ఇష్టపడతారని అనుకున్నాను.”—పౌలా.

 ఇది ఇలా ఉంటే, కొంతమంది యౌవనులు బరువు తగ్గాల్సిన అవసరం నిజంగా ఉంది. వల్డ్‌  హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక ప్రకారం ...

  •   ప్రపంచవ్యాప్తంగా, 5 నుండి 19 ఏళ్ల వయసున్న వాళ్లలో దాదాపు 34 కోట్ల యౌవనులు అధిక బరువు కలిగివున్నారు.

  •   1975 నాటికి, 5 నుండి 19 ఏళ్ల వయసులోపు వాళ్లలో కేవలం 4 శాతం మంది మాత్రమే అధిక బరువు ఉండేవాళ్లు. కానీ 2016 నాటికి ఆ సంఖ్య 18 శాతానికి పెరిగింది.

  •   ప్రపంచంలోని చాలా దేశాల్లో, తక్కువ బరువున్న వాళ్లకన్నా ఊబకాయంతో ఉన్నవాళ్లే ఎక్కువ.

  •   సాధారణంగా పేద దేశాల్లో ఊబకాయంతో బాధపడేవాళ్లు ఎక్కువ కనిపిస్తారు, ఆఖరికి పోషకాహార లోపంతో బాధపడుతున్న కుటుంబాల్లో కూడా ఊబకాయులు కనిపిస్తారు.

 బరువు తగ్గడానికి ఏది మంచి పద్ధతి?

 మీరు ఏ పద్ధతిని ఎంచుకుంటారు?

  1.   భోజనం మానేయడం.

  2.   వ్యాయామంతో పాటు, సరైన ఆహారం తీసుకోవడం.

  3.   బరువు తగ్గించే మాత్రలు వాడడం.

 సరైన జవాబు: 2వ పద్ధతి: వ్యాయామంతో పాటు, సరైన ఆహారం తీసుకోవడం.

 భోజనం మానేయడం లేదా తక్కువ తినడం వల్ల త్వరగా సన్నబడవచ్చు. కానీ అలాంటి పద్ధతుల వల్ల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, మీరు మామూలుగా తినడం మొదలుపెట్టినప్పుడు మళ్లీ లావు అయిపోయే అవకాశం ఉంటుంది.

 అలా కాకుండా, ఆరోగ్యవంతులు అవ్వాలనే లక్ష్యం పెట్టుకుంటే, మీరు ఆరోగ్యంగా కనిపిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు కూడా. “మీ జీవన శైలిలో మార్పులు చేసుకుని వాటిని జీవితాంతం పాటిస్తే, ... ఎలాంటి హాని జరగదు, ఆరోగ్యంగా ఉంటారు, ఫలితాలు ఎక్కువ కాలంపాటు ఉంటాయి” అని డాక్టర్‌ మైకెల్‌ బ్రాడ్లీ రాశారు. a గుర్తించాల్సిన విషయం ఏంటంటే: మీరు బరువు తగ్గాలనుకుంటే డైటింగ్‌ చేయడం గురించి ఆలోచించకండి, దానికి బదులు మీ జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులు గురించి ఆలోచించండి.

 నేను చేయాల్సిన పనులు

 మన “అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి” అని బైబిలు ఇస్తున్న సలహా ఆహార అలవాట్లకు కూడా వర్తిస్తుంది. (1 తిమోతి 3:11) అతిగా తినకూడదని కూడా బైబిలు ఖచ్చితంగా చెప్తోంది. (సామెతలు 23:20; లూకా 21:34) ఆ సూత్రాల్ని మనసులో పెట్టుకుని, ఆరోగ్యవంతమైన జీవన శైలి కోసం వీటిని పాటించడానికి ప్రయత్నించండి:

  •   ఎలాంటి ఆహారం ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి.

     ఎలాంటి ఆహారం ఆరోగ్యానికి మంచిదనే విషయంలో కాస్త జ్ఞానం పెంచుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. అలాగని, ఏం తినాలన్నా ఆలోచించాల్సిన అవసరం లేదు. పైగా సరైన ఆహారం తీసుకోవడమే తగిన బరువు కలిగివుండడానికి అత్యుత్తమ పద్ధతి.

  •   క్రమంగా వ్యాయామం చేయండి.

     చురుగ్గా ఉండేందుకు ప్రతీరోజు ఏం చేయవచ్చో ఆలోచించండి. ఉదాహరణకు, లిఫ్ట్‌లో వెళ్లే బదులు మెట్లు ఎక్కి వెళ్లండి. ఫోన్‌లో గేమ్స్‌ ఆడడానికి వెచ్చించే సమయంలో ఒక అరగంట, వాకింగ్‌ చేయడానికి ఉపయోగించండి.

  •   జంక్‌ ఫుడ్‌ బదులు ఆరోగ్యకరమైన ఆహారం తినండి.

     సోఫియా అనే టీనేజీ అమ్మాయి ఏం చెప్తుందంటే, ‘ఆకలేసినప్పుడు తినడానికి పండ్లు, కూరగాయలు లాంటి ఆరోగ్యకరమైన ఆహారం నా దగ్గర ఉండేలా చూసుకుంటాను. అలా చేయడం వల్ల, శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.’

  •   నెమ్మదిగా తినండి.

     కొంతమందికి గబగబా తినేసే అలవాటు ఉంటుంది. దానివల్ల, ఎంత తింటున్నారో కూడా తెలియనంతగా తినేస్తారు. అలా జరగకూడదంటే నెమ్మదిగా తినండి. రెండోసారి భోజనం పెట్టుకునే ముందు కాసేపు ఆగండి. అలా ఆగితే, మీ కడుపు అప్పటికే నిండిందనే విషయాన్ని బహుశా మీరు గ్రహించవచ్చు.

  •   ఎన్ని కేలరీలు తింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి.

     ప్యాకింగ్‌ చేసిన ఆహారం తింటున్నట్లయితే, మీరు తింటున్న ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో ప్యాకెట్‌ మీద చూడండి. కూల్‌డ్రింకుల్లో, ఫాస్ట్‌ ఫుడ్‌లో, స్వీట్స్‌లో, ఐస్‌క్రీమ్స్‌లో ఎక్కువ కేలరీలు ఉంటాయి; వాటివల్ల బరువు పెరుగుతారు.

  •   మితంగా ఉండండి.

     16 ఏళ్ల శారా ఇలా చెప్తోంది: “ఒకానొక సమయంలో కేలరీల గురించి ఎంత ఎక్కువగా ఆలోచించే దాన్నంటే ప్లేట్‌ చూడగానే నా కళ్లకు ఆహారం కనిపించేది కాదు, వాటిలో ఉండే కేలరీలే కనిపించేవి.” అప్పుడప్పుడు కేలరీల గురించి ఆలోచించకుండా మీకు నచ్చిన ఆహారం తినొచ్చు.

 టిప్‌: మీరు ఎక్కువ బరువు ఉన్నట్టు అనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించండి. ఆ డాక్టర్‌ మీ శరీరం గురించి, ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకున్నాక, మీ జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారో చెప్తారు.

a వెన్‌ థింగ్స్‌ గెట్‌ క్రేజీ విత్‌ యువర్‌ టీన్‌ అనే పుస్తకం నుండి.