కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

మద్యం తాగడం తప్పా?

మద్యం తాగడం తప్పా?

 చట్టరీత్యా నేరం కానట్లయితే, మద్యాన్ని మితంగా తాగడం తప్పు కాదని బైబిలు చెప్తోంది. కాకపోతే అతిగా త్రాగడం తప్పని బైబిలు చెప్తోంది.—కీర్తన 104:15; 1 కొరింథీయులు 6:10.

 చట్టం అనుమతించకపోయినా లేదా మీ అమ్మానాన్నలు ఒప్పుకోకపోయినా తాగాలని అనిపిస్తే ఏమి చేయాలి?

 తాగిన తర్వాత పర్యవసానాల గురించి ఆలోచించండి

 సరదాగా గడపాలంటే తాగి తీరాల్సిందేనని మీ స్నేహితులు కొంతమంది అనవచ్చు. కానీ తాగిన తర్వాత ఏమి జరిగే అవకాశం ఉంది?

  •  చట్టపరంగా మీపై చర్యలు తీసుకుంటారు. మీరు ఉంటున్న ప్రాంతాన్ని బట్టి, మీరు తాగడం చట్టరీత్యా తప్పయితే మీరు జరిమానా కట్టాల్సి రావచ్చు, మీ మీద కేసు పెట్టవచ్చు, మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు, శిక్షలో భాగంగా మీరు ఏదైనా సమాజ సేవ చేయాల్సి రావచ్చు లేదా జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు.—రోమీయులు 13:3.

  •  మీ పేరు పాడౌతుంది. మద్యం తాగితే మీ మీద మీరు అదుపు కోల్పోతారు. తాగిన మత్తులో ఉన్నప్పుడు మీరేమి మాట్లాడుతున్నారో, చేస్తున్నారో మీకు తెలీదు. దానివల్ల, తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. (సామెతలు 23:31-33) ఈరోజుల్లో ఏదైనా జరిగితే సోషల్‌ మీడియా ద్వారా క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతోంది. మరి మీ పేరుకు కూడా మచ్చ రావచ్చు.

  •  మీపై దాడి జరిగితే మీరేమీ చేయలేరు. మీరు మత్తులో ఉన్నప్పుడు ఇతరులు మీపై తేలిగ్గా శారీరక లేదా లైంగిక దాడి చేయగలుగుతారు. అంతేకాదు ఆ పరిస్థితుల్లో ఇతరులు ఏమి చెప్పినా చేసేలా ఉంటారు. దానివల్ల ముందుముందు చాలా ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. లేదా చట్ట వ్యతిరేక పనులు చేయాల్సి రావచ్చు.

  •  బానిసలైపోతారు. ఎంత చిన్నవయసులో తాగడం మొదలుపెడితే, దానికి బానిసలయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. ఒత్తిడి వల్ల, ఒంటరితనం వల్ల, ఏమి చేయాలో తోచకపోవడం వల్ల తాగడం మొదలుపెడితే, దానిని మానడం మీ తరంకాదు.

  •  మరణం. ఈ మధ్య ఒక సంవత్సరంలో, తాగి డ్రైవింగ్‌ చేయడం వల్ల అమెరికాలో ప్రతీ 52 నిమిషాలకు ఒకరు చనిపోయారు. ఒక ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో, తాగి బైక్‌ నడపడం వల్ల 1500 కన్నా ఎక్కువమంది చనిపోయారు. వాళ్లలో 21 కన్నా తక్కువ వయసున్న వాళ్లే ఉన్నారు. ఒకవేళ మీరు తాగకపోయినా, తాగి డ్రైవింగ్‌ చేస్తున్నవాళ్ల బండి ఎక్కినా సరే మీ ప్రాణాలకు పెనుప్రమాదం ఉన్నట్లే.

 ఒక నిర్ణయం తీసుకోండి

 అదుపులేకుండా తాగడం వల్ల కలిగే దారుణమైన, ఘోరమైన పర్యవసానాల్ని తప్పించుకోవాలంటే మీరు ముందుగానే ఒక నిర్ణయం తీసుకోవాలి.

 బైబిలు సూత్రం: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును.” (సామెతలు 22:3) డ్రైవింగ్‌ చేయడానికి ముందు లేదా పూర్తి ఏకాగ్రతతో చేయాల్సిన ఒక పనిని మొదలుపెట్టడానికి ముందు తాగడం తెలివైన పని కాదు.

 ఇలా నిర్ణయించుకోండి: ‘ఒకవేళ నేను తాగాలనుకుంటే, చట్టపరంగా అనుమతి ఉండి, పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రమే తాగుతాను.’

 బైబిలు సూత్రం: ‘ఓ వ్యక్తికి లోబడుతూ ఉంటే అతనికి దాసులౌతారు.’ (రోమీయులు 6:16) మీ స్నేహితులు తాగుతున్నారు కదా అని మీరు కూడా తాగితే, మీరు వాళ్ల చెప్పుచేతల్లో ఉన్నట్లే. ఒకవేళ ఏమీ తోచడం లేదనో లేదా ఒత్తిడిని తట్టుకోవడానికో మీరు తాగుతుంటే, మీ సమస్యల్ని తట్టుకోవడానికి అవసరమయ్యే నైపుణ్యాల్ని మీరు పెంచుకోవట్లేదని దానర్థం.

 ఇలా నిర్ణయించుకోండి: ‘తాగమని నా స్నేహితులు బలవంతపెడితే నేను వాళ్ల మాటలకు లొంగను.’

 బైబిలు సూత్రం: ‘తాగుబోతులతో సహవాసం చెయ్యకు.’ (సామెతలు 23:20పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) చెడు స్నేహితులు మిమ్మల్ని మీ నిర్ణయానికి కట్టుబడనివ్వరు. అతిగా మద్యం తాగేవాళ్లతో స్నేహం చేస్తే ప్రమాదంలో పడతారు.

 ఇలా నిర్ణయించుకోండి: ‘అతిగా తాగేవాళ్లతో నేను స్నేహం చేయను.’