కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను మంచి రోల్‌ మోడల్‌ని ఎలా ఎంచుకోవాలి?

నేను మంచి రోల్‌ మోడల్‌ని ఎలా ఎంచుకోవాలి?

 “స్కూల్లో సమస్యలు వచ్చినప్పుడు, నేను బాగా ఇష్టపడే వ్యక్తి ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నాడో గుర్తు తెచ్చుకున్నాను. తర్వాత తనను అనుకరించడానికి ప్రయత్నించాను. రోల్‌ మోడల్‌ని పెట్టుకోవడం వల్లే కష్టమైన పరిస్థితుల్ని సులభంగా నెట్టుకురాగలిగాను.”—హేలీ.

 రోల్‌ మోడల్‌ని పెట్టుకోవడం వల్ల మీరు సమస్యల్ని తప్పించుకోవచ్చు, అలాగే మీ లక్ష్యాల్ని చేరుకోవచ్చు. అందుకు కావాల్సిందల్లా ఒక మంచి రోల్‌ మోడల్‌ని ఎంచుకోవడమే.

 జాగ్రత్తగా ఎందుకు ఎంచుకోవాలి?

  •    మీరు ఎలాంటి రోల్‌ మోడల్స్‌ని ఎంచుకుంటారో అలాగే ప్రవర్తిస్తారు.

     ఆదర్శం ఉంచినవాళ్లను గుర్తుచేసుకోమని చెప్తూ, బైబిలు ఇలా ప్రోత్సహిస్తుంది: “మీరు వాళ్ల ప్రవర్తన వల్ల వచ్చే మంచి ఫలితాల గురించి ఆలోచిస్తూ వాళ్ల విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకోండి.”—హెబ్రీయులు 13:7.

     టిప్‌: మీరు ఎంచుకున్న రోల్‌ మోడల్స్‌ మీ మీద మంచి ప్రభావం చూపించవచ్చు లేదా చెడ్డ ప్రభావం చూపించవచ్చు. కాబట్టి పేరుప్రఖ్యాతలు ఉన్నవాళ్లను లేదా మీ వయసువాళ్లను ఎంచుకునే బదులు, చక్కని లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని రోల్‌ మోడల్స్‌గా ఎంచుకోండి.

     “యాడమ్‌ అనే తోటి క్రైస్తవుని నుండి నేను చాలా నేర్చుకున్నాను. అతని వైఖరి, అందరితో ప్రవర్తించే విధానం నాకు నచ్చాయి. అతను చెప్పిన కొన్ని విషయాలు, చేసిన కొన్ని పనులు ఇప్పటికీ గుర్తున్నాయంటే నమ్మండి. నా మీద ఇంత ప్రభావం చూపించాడని అతనికి కూడా తెలీదు.”—కోలన్‌.

  •    మీరు ఎంచుకున్న రోల్‌ మోడల్స్‌ని బట్టే మీ ఆలోచనలు, భావాలు ఉంటాయి.

     “మోసపోకండి. చెడు సహవాసాలు మంచి అలవాట్లను పాడుచేస్తాయి” అని బైబిలు చెప్తుంది.—1 కొరింథీయులు 15:33.

     టిప్‌: కేవలం పైకి అందంగా కనిపించేవాళ్లను కాకుండా మంచి లక్షణాలు ఉన్న వాళ్లను ఎంచుకోండి. లేదంటే చివరికి మీకు నిరాశే మిగులుతుంది.

     “అందంగా ఉన్నవాళ్లతో పద్దాక పోల్చుకుంటూ ఉంటే మీరు అందంగా లేరని, మీరు అంత ప్రాముఖ్యమైన వాళ్లు కాదని మీకు అనిపిస్తుంది. దానివల్ల మీరు మీ అందం గురించే అతిగా ఆలోచించే అవకాశం ఉంది.”—టామరా.

     ఒక్కసారి ఆలోచించండి: సెలబ్రిటీలను, అథ్లెట్లను రోల్‌ మోడల్స్‌గా పెట్టుకుంటే వచ్చే నష్టాలు ఏంటి?

  •    మీరు మీ లక్ష్యాల్ని సాధిస్తారా లేదా అనేది, మీరు ఎంచుకున్న రోల్‌ మోడల్స్‌ని బట్టి ఉంటుంది.

     “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును” అని బైబిలు చెప్తుంది.—సామెతలు 13:20.

     టిప్‌: మీరు మెరుగు చేసుకోవాలనుకుంటున్న లక్షణాలను చక్కగా చూపించే వ్యక్తుల్ని రోల్‌ మోడల్స్‌గా ఎంచుకోండి. వాళ్లను గమనిస్తూ, వాళ్ల అడుగుజాడల్లో నడిచినప్పుడు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.

     “‘నేను బాధ్యత తెలిసిన వ్యక్తిగా అవ్వాలి’ అని లక్ష్యం పెట్టుకునే బదులు, ‘నేను జేనీలా బాధ్యత తెలిసిన వ్యక్తిగా అవ్వాలి’ అని నిర్దిష్టంగా లక్ష్యం పెట్టుకున్నాను. జేనీ ఎప్పుడూ టైం పాటిస్తుంది, తనకు ఇచ్చిన పనుల్ని నమ్మకంగా చేస్తుంది.”—మిరియామ్‌.

     ఒక్క మాటలో: మీరు మంచి రోల్‌ మోడల్‌ని ఎంచుకుంటే మంచి వ్యక్తి అవుతారు.

మంచి రోల్‌ మోడల్‌ని అనుసరిస్తే, మీ లక్ష్యాల్ని తొందరగా చేరుకుంటారు!

 ఎలా ఎంచుకోవాలి?

 రెండు విధాలుగా ఎంచుకోవచ్చు.

  1.   మీరు మెరుగు చేసుకోవాలనుకుంటున్న లక్షణాన్ని ఎంచుకోండి, తర్వాత ఆ లక్షణాన్ని చక్కగా చూపించే వ్యక్తిని ఎంచుకోండి.

  2.   మీకు బాగా ఇష్టమైనవాళ్లను ఎంచుకోండి, తర్వాత వాళ్లలో ఉన్న ఏ లక్షణాన్ని మీరు అలవర్చుకోవాలనుకుంటున్నారో ఎంచుకోండి.

 ఈ ఆర్టికల్‌కు సంబంధించిన వర్క్‌షీట్‌ ఈ విషయంలో మీకు సహాయం చేస్తుంది.

 మీరు ఎవర్ని రోల్‌ మోడల్స్‌గా పెట్టుకోవచ్చంటే:

  •  మీ వయసువాళ్లు. “నా బెస్ట్‌ ఫ్రెండే నా రోల్‌ మోడల్‌. తను ఎంత బిజీగా ఉన్నా, అందర్నీ శ్రద్ధగా చూసుకుంటుంది. తను నా కన్నా చిన్నదే. కానీ నాలో లేని మంచి లక్షణాలు ఆమెలో ఉన్నాయి. అందుకే నేను ఆమెను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాను.”—మిరియామ్‌.

  •  పెద్దవాళ్లు. మీరు మీ అమ్మానాన్నల్ని గానీ తోటి విశ్వాసుల్ని గానీ ఎంచుకోవచ్చు. “మా అమ్మానాన్నలే నా రోల్‌ మోడల్స్‌. ఎందుకంటే వాళ్లలో మంచి లక్షణాలు ఉన్నాయి. వాళ్లలో కొన్ని లోపాలు ఉన్నా వాళ్లు నమ్మకంగా ఉన్నారు. నేను వాళ్ల వయసుకు వచ్చేసరికి, నా గురించి నా పిల్లలు కూడా అలాగే చెప్పాలని కోరుకుంటున్నాను.”—యానెట్‌.

  •  బైబిల్లోని వ్యక్తులు. “నేను బైబిల్లో ఉన్న తిమోతి, రూతు, యోబు, పేతురు, ఇశ్రాయేలు బాలిక వంటి చాలామంది వ్యక్తుల్ని రోల్‌ మోడల్స్‌గా పెట్టుకున్నాను. ఒక్కొక్కరిలో ఒక్కో విషయం నాకు నచ్చింది. వాళ్ల గురించి తెలుసుకుంటున్న కొద్దీ, వాళ్లు నాకు నిజమైన వ్యక్తులుగా అనిపిస్తున్నారు. వాళ్లలా విశ్వాసం చూపించండి అనే పుస్తకంలో, అలాగే యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మక సమాధానాలు (ఇంగ్లీషు) అనే పుస్తకం రెండు సంపుటుల్లో ఉన్న ‘రోల్‌ మోడల్‌ ఇండెక్స్‌’లో వాళ్ల గురించి ఉన్న కథలు నాకు బాగా నచ్చాయి.”—మెలిండా.

 టిప్‌: ఒక్కర్నే రోల్‌ మోడల్‌గా పెట్టుకోకండి. అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “మేము ఉంచిన ఆదర్శానికి తగ్గట్టు నడుచుకునే వాళ్లను బాగా గమనించండి.”—ఫిలిప్పీయులు 3:17.

 మీకు తెలుసా? మీరు కూడా వేరేవాళ్లకు రోల్‌ మోడల్‌గా ఉండవచ్చు! బైబిలు ఇలా చెప్తుంది: “మాట్లాడే విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాసం విషయంలో, పవిత్రత విషయంలో నమ్మకస్థులకు ఆదర్శంగా ఉండు.”—1 తిమోతి 4:12.

 “మీరు కొన్ని లక్షణాలను మెరుగుపర్చుకుంటూ ఉండగానే, మిమ్మల్ని వేరేవాళ్లు ఆదర్శంగా తీసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరు గమనిస్తున్నారో, మీ మాటలు వాళ్ల జీవితాన్ని ఎలా మారుస్తాయో మీకు తెలీదు.”—కియాన.