కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

ఆన్‌లైన్‌లో ఫోటోలు పెట్టడం గురించి నేనేమి తెలుసుకోవాలి?

ఆన్‌లైన్‌లో ఫోటోలు పెట్టడం గురించి నేనేమి తెలుసుకోవాలి?

 మీరు సరదాగా వేరే ప్రాంతానికి వెళ్లి చాలా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడి విశేషాలన్నీ మీ స్నేహితులకు చెప్పాలనుకుంటున్నారు. అయితే ఎలా చెప్తారు?

  1.   స్నేహితుల్లో ప్రతీఒక్కరికి పోస్ట్‌కార్డు పంపుతారా?

  2.   అందరికీ ఈమెయిల్‌ పంపుతారా?

  3.   ఫోటోలను ఆన్‌లైన్‌లో పెడతారా?

 మీ అమ్మమ్మ తాతయ్యలకు మీ వయసు ఉన్నప్పుడు, ఆప్షన్‌ ఎ మాత్రమే సాధ్యమయ్యేది.

 మీ అమ్మానాన్నలకు మీ వయసు ఉన్నప్పుడు ఆప్షన్‌ బి సాధ్యమయ్యేదేమో.

 ఈరోజుల్లో చాలామంది యువతీయువకులు ఆప్షన్‌ సి ఎంచుకుని ఫోటోలను ఆన్‌లైన్‌లో పెట్టడానికే ఇష్టపడతారు. మీకు కూడా అదే ఇష్టమా? అయితే దానివల్ల వచ్చే కొన్ని ప్రమాదాల్ని తప్పించుకోవడానికి ఈ ఆర్టికల్‌​ మీకు సహాయం చేస్తుంది.

 ప్రయోజనాలు ఏమిటి?

 వెంటనే పంచుకోగలుగుతాం. “ఏదైనా ట్రిప్‌కి వెళ్లి బాగా ఎంజాయ్‌ చేసినప్పుడు, లేదా ఫ్రెండ్స్‌తో సరదాగా టైం గడిపినప్పుడు ఆ ఆనందాన్ని మర్చిపోకముందే ఫోటోలను అందరితో పంచుకోగలుగుతాను.”—మెలనీ.

 తేలికగా పంచుకోగలుగుతాం. “నా స్నేహితులు ఏమి చేస్తున్నారో ఈమెయిల్‌ చేసి తెలుసుకోవడం కన్నా, వాళ్లు అప్‌డేట్‌ చేసిన ఫోటోలను చూసి తెలుసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది.”—జోర్డన్‌.

 టచ్‌లో ఉండడానికి వీలౌతుంది. “నా స్నేహితుల్లో, కుటుంబసభ్యుల్లో కొంతమంది దూరప్రాంతాల్లో ఉంటారు. వాళ్లు ఎప్పటికప్పుడు పెట్టే ఫోటోలను నేను చూస్తూ ఉంటే వాళ్లను రోజూ చూస్తున్నట్లు అనిపిస్తుంది.”—క్యారన్‌.

 ప్రమాదాలు ఏమిటి?

 మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీ కెమెరాకు జియో టాగింగ్‌ ఉన్నట్లయితే, మీరు పోస్ట్‌ చేసిన ఫోటోల ద్వారా మీరు చెప్పని ఎన్నో విషయాలు తెలుసుకోవడం సాధ్యమౌతుంది. “ఫోటోలను, వీడియోలను జియో టాగింగ్‌తోపాటు ఇంటర్నెట్‌లో పెడితే, తప్పుడు ఉద్దేశాలుగల కొంతమంది తమ దగ్గరున్న ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి ఫోటోలు పెట్టిన వ్యక్తి ఉన్న స్థలాన్ని తెలుసుకోగలుగుతారు” అని డిజిటల్‌ ట్రెండ్స్‌ అనే వెబ్‌సైట్‌ చెప్తుంది.

 నిజమే, కొంతమంది నేరస్థులు మీరు ఉన్న చోటుకు రావాలని అనుకోరు. అయితే డిజిటల్‌ ట్రెండ్స్‌ రిపోర్టు ప్రకారం, ముగ్గురు దొంగలు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దోచుకున్న సంఘటనలు 18 జరిగాయి. ఆ సంఘటనల్లో దాదాపు లక్ష డాలర్ల కన్నా ఎక్కువ విలువచేసే సామాన్లను దోచుకెళ్లారు. ఇంతకీ ఇంట్లో ఎవ్వరూ లేరన్న సంగతి వాళ్లకెలా తెలిసింది? వాళ్లు ఆన్‌లైన్‌లో ఆ ఇంటివాళ్ల కదలికలను ట్రాక్‌ చేసి వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకున్నారు. అలా తెలుసుకునే పద్ధతిని సైబర్‌కేసింగ్‌ (cybercasing) అంటారు.

 తప్పుడు విషయాలు చూసే ప్రమాదం ఉంది. కొంతమంది ఏమాత్రం సిగ్గులేకుండా ఎలాంటి ఫోటోలనైనా పోస్ట్‌ చేస్తారు. శారా అనే టీనేజర్‌ ఇలా అంటోంది, ‘మ్యాపు లేకుండా కొత్త ప్రాంతంలో తిరుగుతూ ఉంటే చివరికి వెళ్లకూడని చోటుకు వెళ్లి ఆగుతారు. అదేవిధంగా మీకు పరిచయంలేని వ్యక్తుల అకౌంట్‌లను తెరచి చూసినప్పుడు ప్రమాదంలో పడతారు.’

 టైం వేస్ట్‌ అవుతుంది. “లేటెస్ట్‌ పోస్ట్‌లను చూస్తూ, అందరి కామెంట్లను చదువుతూ ఉంటే దానికే అలవాటు పడిపోతాం. చివరికి మీరు ఎలా మారిపోతారంటే, ఏమాత్రం కొంచెం టైం దొరికినా అప్‌డేట్స్‌ చూసుకోవడానికి ఫోన్‌ తీస్తుంటారు” అని యోలాండా అనే యువతి అంటోంది.

మీకు ఆన్‌లైన్‌లో అకౌంట్‌ ఉంటే దాన్ని వాడే విషయంలో మీ మనసును అదుపులో పెట్టుకోవాలి

 సమంత అనే టీనేజీ అమ్మాయి ఏమంటుందంటే, “అలాంటి సైట్లను చూస్తూ గడిపే సమయాన్ని నేను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఒకవేళ మీకు వాటిలో అకౌంట్‌ ఉంటే దాన్ని ఉపయోగించే విషయంలో మీ మనసును అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి.”

 మీరు ఏమి చేయవచ్చు?

  •   తప్పుడు విషయాల్ని చూడకుండా ఉండాలని గట్టిగా నిర్ణయించుకోండి. బైబిలు ఇలా చెప్తోంది, ‘వ్యర్థమైనదేదీ నా కళ్లముందు ఉంచుకోను.’—కీర్తన 101:3, NW.

     “ఆన్‌లైన్‌లో నేను ఫాలో అయ్యేవాళ్ల పోస్ట్‌లన్నీ ఎప్పటికప్పుడు చూస్తుంటాను. ఒకవేళ వాళ్ల పోస్ట్‌లు మంచివి కావనిపిస్తే అన్‌ఫాలో చేసేస్తా.”—స్టీవెన్‌.

  •   మీలాంటి విలువలు లేనివాళ్లతో పరిచయాలు పెట్టుకోకండి, ఎందుకంటే వాళ్లు మీ మంచి నైతిక విలువల్ని పాడుచేస్తారు. బైబిలు ఇలా చెప్తోంది, “మోసపోకండి. చెడు సహవాసాలు మంచి అలవాట్లను పాడుచేస్తాయి.”​—1 కొరింథీయులు 15:33, అధస్సూచి.

     “ఆన్‌లైన్‌లో అందరూ చూస్తున్న ఫోటోల్ని మీరు కూడా చూడాలని అనుకోకండి. ఎందుకంటే వాటిలో మతభ్రష్టత్వానికి, అశ్లీలతకు లేదా చెడ్డ పనులకు సంబంధించిన ఫోటోలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.”—జెసికా.

  •   ఎంతసేపు చూడాలో, ఎన్నిసార్లు ఫోటోలు పోస్ట్‌ చేయాలో ముందే లిమిట్‌ పెట్టుకోండి. బైబిలు ఇలా చెప్తోంది, “మీరు ఎలా నడుచుకుంటున్నారో చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. మీరు తెలివితక్కువ వాళ్లలా కాకుండా తెలివిగల వాళ్లలా నడుచుకోండి. మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి.”​—ఎఫెసీయులు 5:​15, 16.

     “అనవసరమైన విషయాల్ని అతిగా పోస్ట్‌ చేసేవాళ్లను ఫాలో అవ్వడం మానేశాను. కొంతమంది ఎలా ఉంటారంటే, బీచ్‌కి వెళ్లి ఒకే గవ్వను 20 రకాలుగా ఫోటో తీసి వాటిని పోస్ట్‌ చేస్తారు. వాటన్నిటినీ చూడడానికి నిజంగా చాలా టైం పడుతుంది.”—రెబెకా.

  •   ఎప్పుడూ మీ ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తూ ఉంటే, మీరు మీ గురించి మరీ ఎక్కువగా ఆలోచించుకుంటున్నారని చూసేవాళ్లకు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. బైబిలు రచయిత పౌలు ఇలా అన్నాడు, “మీలో ప్రతీ ఒక్కరికి నేను చెప్పేదేమిటంటే, ఎవ్వరూ తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకోవద్దు.” (రోమీయులు 12:3) మీ గురించి, మీరు చేసేవాటి గురించిన ఫోటోల్ని చూసి మీ ఫ్రెండ్స్‌ మీగురించి గొప్పగా అనుకుంటారని ఊహించుకోకండి.

     “కొంతమంది అడ్డూ అదుపులేకుండా సెల్ఫీలను పోస్ట్‌ చేస్తూనే ఉంటారు. ఒకవేళ మీరు నా ఫ్రెండ్‌ అయితే, మీరెలా ఉంటారో నాకు గుర్తుంటుంది. సెల్ఫీలు పెట్టి పదేపదే నాకు గుర్తుచేయాల్సిన అవసరం ఉండదు!”—ఆలసన్‌.