కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

ఇంట్లో రూల్స్‌ అవసరమా?

ఇంట్లో రూల్స్‌ అవసరమా?

 ఇంట్లో పెట్టే రూల్స్‌ కష్టంగా అనిపిస్తున్నాయా? ఈ విషయం గురించి మీ అమ్మానాన్నలతో మాట్లాడడానికి ఈ ఆర్టికల్‌, అలాగే దీనికి సంబంధించిన వర్క్‌షీట్‌ మీకు సహాయం చేస్తాయి.

 రూల్స్‌ని సరైన దృష్టితో చూడండి

 అపోహ: ఒక్కసారి ఇల్లు వదిలి వెళ్లిపోతే, ఏ రూల్సూ లేకుండా హాయిగా ఉండొచ్చు.

 నిజం:  ఇల్లు వదిలి బయటికి వెళ్లిపోయినా కొన్ని రూల్స్‌ పాటించక తప్పదు. బహుశా మీ మేనేజరు గానీ, మీ ఇంటి ఓనరు గానీ, ప్రభుత్వం గానీ పెట్టే రూల్స్‌ని మీరు పాటించాల్సి ఉంటుంది. 19 ఏళ్ల డాన్యెల్‌ ఇలా అంటుంది, “ఇంట్లో పెట్టే రూల్స్‌ పాటించకపోతే, పెద్దయ్యాక బయటికి వెళ్లి జీవించడం చాలా కష్టంగా ఉంటుంది.”

 బైబిలు ఇలా చెప్తోంది: ‘పరిపాలకులకు, అధికారులకు విధేయులై ఉండాలి.’ (తీతు 3:1, 2 పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) చిన్నప్పటినుండి మీ అమ్మానాన్నలు పెట్టే రూల్స్‌ని పాటిస్తే, పెద్దయ్యాక వేరేవాళ్లు పెట్టే రూల్స్‌ని పాటించడం మీకు తేలికౌతుంది.

 మీరు ఇలా చేయవచ్చు: రూల్స్‌ వల్ల వచ్చే ప్రయోజనాల గురించి ఆలోచించడం నేర్చుకోండి. జెరమీ అనే ఒక అబ్బాయి ఇలా అంటున్నాడు, “మా అమ్మానాన్నలు పెట్టిన రూల్స్‌ వల్లే, నేను ఎలాంటి వాళ్లతో స్నేహం చేయాలో, సమయాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. అంతేకాదు టీవీకి, వీడియోగేమ్‌కి అతుక్కుపోయే బదులు, ముఖ్యమైన పనుల కోసం సమయం పెట్టగలిగాను. అలా చేయడం నాకు ఇప్పటికీ ఇష్టం.”

 సరైన విధంగా మాట్లాడండి

 మీ అమ్మానాన్నలు పెట్టిన ఓ రూల్‌ అర్థంపర్థం లేనిదని మీకనిపిస్తే, అప్పుడేంటి? టమారా అనే ఒక అమ్మాయి ఇలా అంటుంది, “నేను వేరే దేశానికి వెళ్లడానికి మా అమ్మానాన్నలు ఒప్పుకున్నారు, కానీ తిరిగొచ్చాక, పక్క ఊరికి వెళ్లొస్తానంటే కూడా ఒప్పుకోవట్లేదు!”

 మీ అమ్మానాన్నలు కూడా అలాంటి ఓ రూల్‌ పెట్టారా? దాని గురించి వాళ్లతో మాట్లాడడం తప్పా? కానే కాదు! అయితే మీరు వాళ్లతో ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నదే ముఖ్యం.

 ఎప్పుడు మాట్లాడాలి. అమెండ అనే ఒక టీనేజీ అమ్మాయి ఇలా అంటుంది, “మీరు చెప్పినమాట వింటారని మీ అమ్మానాన్నలకు నమ్మకం కుదిరాకే, ఏదైనా ఒక రూల్ని మార్చమని మీరు వాళ్లను అడగగలరు.”

 డార్య అనే ఓ అమ్మాయి విషయంలో అదే జరిగింది. ఆమె ఇలా అంటుంది, “మా అమ్మ పెట్టిన ఒక రూల్‌ నాకు నచ్చకపోయినా, నేను దాన్ని ఖచ్చితంగా పాటించాను. అది చూశాక మా అమ్మ ఆ రూల్ని మార్చడానికి ఇష్టపడింది.” నమ్మకం అనేది బలవంతంగా అడిగేది కాదు, దాన్ని సంపాదించుకోవాలి.

ఇంట్లో రూల్స్‌ ఏమీ లేకుండా ఉండాలనుకోవడం, అసలు ఏ నియమాలూ లేని ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అవ్వాలనుకోవడం లాంటిది

 బైబిలు ఇలా చెప్తోంది: “నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.” (సామెతలు 6:20) ఈ సలహా పాటిస్తే మీరు మీ అమ్మానాన్నల నమ్మకాన్ని సంపాదించుకుంటారు. దానివల్ల, పాటించడానికి కష్టంగా ఉన్న ఓ రూల్‌ గురించి వాళ్లతో మాట్లాడడం తేలికౌతుంది.

 ఎలా మాట్లాడాలి. స్టీవెన్‌ అనే ఓ అబ్బాయి ఇలా అంటున్నాడు, “మీ అమ్మానాన్నలతో వాదించడం, అరవడం లాంటివి చేయకుండా వాళ్లతో నెమ్మదిగా, మర్యాదగా మాట్లాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.”

 డార్య ఇంకా ఇలా అంటుంది, “మా అమ్మతో వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనం రాకపోగా, అలా వాదించినందుకు ఆమె నన్ను ఇంకా కట్టుదిట్టం చేసింది.”

 బైబిలు ఇలా చెప్తోంది: ‘బుద్ధిహీనుడు తన కోపాన్నంతా కనుపరుస్తాడు జ్ఞానంగలవాడు కోపాన్ని అణచుకొని దాన్ని చూపించడు.’ (సామెతలు 29:11) అలా నిగ్రహించుకోవడం వల్ల ఇంట్లోనే కాదు స్కూల్లో, ఆఫీసులో కూడా మంచి ఫలితాలు వస్తాయి.

 మీరు ఇలా చేయవచ్చు: మాట్లాడేముందు కాస్త ఆలోచించండి. ఒక్కసారి నోరుజారారంటే మీరు సంపాదించుకున్న నమ్మకమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకే బైబిలు ఇలా చెప్తుంది, “దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి.”—సామెతలు 14:29.

 ఒక చిన్న సలహా: ఈ ఆర్టికల్‌కు సంబంధించిన వర్క్‌షీట్‌ను నింపండి. అవసరమైతే, మీకు కష్టంగా ఉన్న రూల్‌ గురించి మీ అమ్మానాన్నలతో మాట్లాడండి.