కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

లైంగిక దాడి గురించి నేను తెలుసుకోవాల్సినవి ఏమిటి?—1వ భాగం: ముందు జాగ్రత్తలు

లైంగిక దాడి గురించి నేను తెలుసుకోవాల్సినవి ఏమిటి?—1వ భాగం: ముందు జాగ్రత్తలు

 లైంగిక దాడి అంటే ఏమిటి?

 “లైంగిక దాడి” అని సాధారణంగా ఉపయోగించే ఈ పదానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో చట్టపరమైన నిర్వచనం ఉన్నప్పటికీ, ఇష్టం లేకపోయినా, కొన్నిసార్లు అయితే బలవంతంగా కూడా పెట్టుకునే శారీరక సంబంధాన్ని ఆ పదం సూచిస్తుంది. పిల్లలమీద లేదా టీనేజర్లమీద జరిగే లైంగిక అత్యాచారం, రక్త సంబంధికులతో సంబంధం పెట్టుకోవడం, మానభంగం చేయడం, పెద్ద స్థానంలో ఉండి మనకు సహాయం చేయాల్సిన వాళ్లు బహుశా డాక్టర్లు, టీచర్లు, మతగురువులు వంటివాళ్లు చేసే లైంగిక అత్యాచారం ఇవన్ని లైంగిక దాడి కిందకే వస్తాయి. అయితే ఈ దాడి చేసేవాళ్లు, మాటలతోనైనా లేదా శారీరకంగానైనా దాడి చేస్తారు. అయితే, జరిగినదాని గురించి ఎవరికైనా చెప్తే హాని చేస్తామని వాళ్లు బెదిరిస్తారు.

 ఒక సర్వే ప్రకారం, ఒక్క అమెరికా దేశంలోనే, రెండున్నర లక్షలకన్నా ఎక్కువమందిపై లైంగిక దాడి జరుగుతున్నట్లు నివేదిక ఉంది. వాళ్లలో సగంమంది 12 నుండి 18 ఏళ్ల వయసు వాళ్లు.

 మీరు తెలుసుకోవాల్సినవి

  •   లైంగిక దాడిని బైబిలు ఖండిస్తోంది. సుమారు 4,000 సంవత్సరాల క్రితం సొదొమ పట్టణానికి ఇద్దరు అబ్బాయిలు వచ్చినప్పుడు ఆ పట్టణంలోని అల్లరి మూక లైంగిక పిచ్చితో వాళ్లను పాడుచేయడానికి చూసినట్లు బైబిలు చెప్తుంది. యెహోవా దేవుడు తర్వాత ఆ పట్టణాన్ని నాశనం చేశాడు, అయితే దానికి ఆ అల్లరిమూక చేసిన ఆ పని ఒక ముఖ్య కారణం. (ఆదికాండము 19:4-13) అంతేకాదు, దాదాపు 3,500 సంవత్సరాల క్రితం దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఒక కుటుంబ సభ్యునిపై లేదా దగ్గరి బంధువుపై లైంగిక దాడి చేయకూడదని ఉంది.— లేవీయకాండము 18:6.

  •   చాలావరకూ ఈ దాడులు తెలిసినవాళ్లే చేస్తున్నారు. టాకింగ్‌ సెక్స్‌ విత్‌ యువర్‌ కిడ్స్‌ పుస్తకం ఏమి చెప్తుందంటే, “మానభంగానికి గురైన ముగ్గురిలో ఇద్దరికి తమపై దాడిచేసినవాడు తెలిసినవ్యక్తే. అతడు, గోడ చాటున దాక్కుని, ఉన్నట్టుండి దాడి చేసే తెలియనివ్యక్తేం కాదు.”

  •   లైంగిక దాడి అబ్బాయిలమీద, అమ్మాయిలమీద జరుగుతుంది. అమెరికాలో, ఈ దాడికి గురైనవాళ్లలో 10 శాతం మంది అబ్బాయిలు ఉన్నారు. దాడికి గురైన అబ్బాయిలు “ఈ దాడి తమను గేలా తయారు చేస్తుందేమో అని” లేదా “తమలో మగతనం అంతగా లేదేమో అని భయపడే అవకాశం ఉంది” అని రేప్‌, అబ్యూజ్‌ & ఇన్‌సెస్ట్‌ నేషనల్‌ నెట్‌వర్క్‌ (RAINN) చెప్తుంది.

  •   సర్వసాధారణమైపోయిన ఈ లైంగిక దాడి విషయంలో ప్రజలు అంతగా ఆశ్చర్యపోవట్లేదు. “అంత్యదినములలో” ప్రజలు అనురాగం లేకుండా, క్రూరంగా, ఆశానిగ్రహం లేనివాళ్లుగా ఉంటారని బైబిలు ముందే చెప్పింది. (2 తిమోతి 3:1-3) ఇతరులపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్లలో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  •   దీనిలో దాడికి గురైనవాళ్ల తప్పేమీ లేదు. ఒకరి మీద లైంగిక దాడి జరగడంలో దానికి గురైన వ్యక్తి బాధ్యతేమీ లేదు. ఆ దాడి చేసిన అబ్బాయి లేదా అమ్మాయే దానికి బాధ్యులు. అయినప్పటికీ, మీ మీద ఇలాంటి దాడి జరిగే అవకాశాన్ని తగ్గించడానికి మీరు తగిన చర్యలు తీసుకోవచ్చు.

 మీరేమి చేయవచ్చు?

  •   సిద్ధపడి ఉండండి. ఎవరైనా మిమ్మల్ని బలవంతపెడితే, అది మీ డేటింగ్‌ పార్ట్‌నర్‌ లేదా మీ బంధువైనా సరే, మీరు ఏం చెయ్యాలో ముందుగానే ఆలోచించుకొని ఉండండి. ఎరిన్‌ అనే యువ సహోదరి ఏంచెప్తుందంటే, తోటివాళ్లు మీమీదకు తీసుకొచ్చే ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధపడాలంటే, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారో ప్రాక్టీసు చేయండి. ఎరిన్‌ ఇలా అంటోంది, “అది మీకు మూర్ఖత్వం అనిపించవచ్చు, కానీ అలా చేస్తే మీరు అలాంటి దాడికి గురైయ్యే అవకాశాలు తక్కువుంటాయి.”

     బైబిలు ఇలా చెప్తుంది: “దినములు చెడ్డవి గనుక, . . . అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.”—ఎఫెసీయులు 5:15, 16.

     ఇలా ప్రశ్నించుకోండి: ‘నాకు ఇబ్బంది కలిగేలా నన్ను ఎవరైనా ముట్టుకుంటే నేను ఏం చేస్తాను?’

  •   పారిపోవడానికి ప్లాన్‌ చేసుకోండి: RAINN ఏం చెప్తుందంటే, “మీకూ మీ స్నేహితులకూ లేదా కుటుంబ సభ్యులకు తెలిసేలా ఒక కోడ్‌ పదం పెట్టుకోండి. అలాచేస్తే, మీకు ఇబ్బంది కలిగినప్పుడు మీరు మీ దగ్గర ఉన్నవాళ్లకు అర్థమవ్వకుండానే మీ ఇబ్బంది గురించి మీ వాళ్లకు చెప్పవచ్చు. అప్పుడు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మిమ్మల్ని వాళ్లనుండి విడిపించడానికి అక్కడి రావడమో లేదా అక్కడి నుండి ఎలా తప్పించుకోవచ్చో మీకు సలహా ఇవ్వడమో చేయవచ్చు.” ప్రమాదాన్ని మొదట్లోనే తప్పించుకుంటే మీకు ఎక్కువ బాధ తప్పుతుంది.

     బైబిలు ఇలా చెప్తుంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.”—సామెతలు 22:3.

     ఇలా ప్రశ్నించుకోండి: ‘తప్పించుకోవడానికి నా దగ్గర ఏ ఉపాయం ఉంది?’

    తప్పించుకోవడానికి ఎప్పుడూ ఒక ప్లాన్‌ సిద్ధంచేసుకుని ఉండండి

  •   పరిమితులను పెట్టుకొని—వాటిని పాటించండి. ఉదాహరణకు, ఒకవేళ మీరు డేటింగ్‌ చేస్తున్నట్లైతే ఎలాంటి ప్రవర్తన సరైనదో ఎలాంటి ప్రవర్తన సరైనది కాదో మీరు మీ ఫ్రెండ్‌ మాట్లాడుకోండి. మీతో డేటింగ్‌ చేసే వ్యక్తికి ఇలా పరిమితులు పెట్టడంలో అర్థంలేదని అనిపిస్తే, మీ ఇష్టాలను గౌరవించే మరో పార్ట్‌నర్‌ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది.

     బైబిలు ఇలా చెప్తుంది: “ప్రేమ . . . అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు.”—1 కొరింథీయులు 13:4, 5.

     ఇలా ప్రశ్నించుకోండి: ‘నా ప్రమాణాలు ఏమిటి? ఎలాంటి ప్రవర్తన సరైనది కాదు?’