కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

యవ్వనంలో వచ్చే మార్పులతో ఎలా నెట్టుకురావాలి?

యవ్వనంలో వచ్చే మార్పులతో ఎలా నెట్టుకురావాలి?

 “అమ్మాయిలకు ప్యూబర్టీ దశ (యవ్వన దశ) సరదాగా ఏమీ సాగదు. అది నొప్పి, చిరాకు, గందరగోళం కలిగిస్తుంది, నిజానికి దానికి సంబంధించినవన్నీ బాధాకరంగానే ఉంటాయనిపిస్తుంది.”—ఒక్సాన.

 “కాసేపు సంతోషంగా ఉండేవాణ్ణి, మరుక్షణమే బాధగా అనిపించేది. అబ్బాయిలందరికీ అలాగే అవుతుందో లేదో తెలీదుగానీ, నాకు మాత్రం అలాగే జరిగేది.”—బ్రైయన్‌.

 ప్యూబర్టీ దశ రోలర్‌-కోస్టర్‌ (కింది బొమ్మ చూడండి) ఎక్కినట్లు ఉంటుంది, ఒకే సమయంలో అటు థ్రిల్లింగ్‌గానూ ఇటు భయంగానూ ఉంటుంది. మీరు ఆ దశను ఎలా దాటవచ్చు?

 ప్యూబర్టీ అంటే ఏంటి?

 ఒక్కమాటలో చెప్పాలంటే, ప్యూబర్టీ అనేది మీరు శారీరక, భావోద్వేగ విషయాల్లో వేగంగా పెద్దవాళ్లు అయ్యే దశ. మీ శరీరం ఈ దశలో ఆకస్మికమైన భౌతిక మార్పులకు, హార్మోన్ల మార్పులకు లోనవుతుంది, ఆ మార్పులు మిమ్మల్ని పిల్లల్ని కనడానికి సిద్ధం చేస్తాయి.

 అంటే, దానర్థం మీరు తల్లి లేదా తండ్రి అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారని కాదు. కానీ మీరు బాల్యాన్ని దాటేశారనడానికి ప్యూబర్టీ ఒక గుర్తు. ఈ వాస్తవం మీలో కుతూహలాన్ని, అలాగే బాధను కలిగించవచ్చు.

 క్విజ్‌: ప్యూబర్టీ మామూలుగా ఏ వయసులో మొదలౌతుందని మీరు అనుకుంటున్నారు?

  • 8

  • 9

  • 10

  • 11

  • 12

  • 13

  • 14

  • 15

  • 16

 జవాబు: పైన ఇచ్చిన అన్ని వయసులు. అంటే, వాటిలో ఏ వయసులో ప్యూబర్టీ మొదలైనా, అది మామూలే.

 ఒకవేళ మీకు సగం టీనేజ్‌ దాటిపోయినా మీలో ప్యూబర్టీ మొదలవకపోతే కంగారుపడాల్సిన అవసరంలేదు. అలాగే, మీకు పట్టుమని పదేళ్లు నిండకుండానే అది మొదలైపోయినా కంగారుపడాల్సిన అవసరం లేదు. శరీర తత్వాన్ని బట్టి దానికొక టైం టేబుల్‌ ఉంటుంది, అది మీ చేతుల్లో ఉండదు.

ప్యూబర్టీ దశ రోలర్‌-కోస్టర్‌ ఎక్కినట్లు ఉంటుంది, ఒకే సమయంలో అటు థ్రిల్లింగ్‌గానూ ఇటు భయంగానూ ఉంటుంది. కానీ మీరు ఆ దశను విజయవంతంగా దాటగలరు

 శారీరక మార్పులు

 బహుశా కొట్టొచ్చినట్టు కనిపించే ఒక మార్పు, ఆకస్మిక ఎదుగుదల. కానీ సమస్యేంటంటే, మీ శరీర భాగాలన్నీ ఒకే వేగంతో పెరగవు. కాబట్టి, మీలో ఎదుగుదల కాస్త అటుఇటుగా ఉన్నా ఆశ్చర్యపోకండి. సమయం గడిచేకొద్దీ అన్నీ సర్దుకుంటాయని గుర్తుంచుకోండి.

 మీ శరీరంలో ఇంకా చాలా రకాల మార్పులు జరుగుతాయి.

 అబ్బాయిల్లో వచ్చే మార్పులు:

  •   మర్మాంగాలు పెరగడం

  •   చంకలో, మర్మాంగాల దగ్గర జుట్టు రావడం, మీసాలు, గడ్డాలు రావడం

  •   గొంతు మారడం

  •   అంగం దానంతటదే గట్టిపడడం, రాత్రిపూట వీర్యం పడడం

 అమ్మాయిల్లో వచ్చే మార్పులు:

  •   రొమ్ములు పెరగడం

  •   చంకలో, మర్మాంగాల దగ్గర జుట్టు రావడం

  •   ఋతుస్రావం మొదలవ్వడం

 అబ్బాయిల్లోనూ, అమ్మాయిల్లోనూ వచ్చే మార్పులు:

  •   చెమట, బాక్టీరియాల వల్ల శరీరం నుండి దుర్వాసన రావడం

     టిప్‌: రోజూ స్నానం చేయడం వల్ల, ఆ దుర్వాసనను కొంతవరకు తగ్గించుకోవచ్చు, అలాగే బాడీ స్ప్రే లేదా డియోడరెంట్‌ లాంటివి వాడవచ్చు

  •   నూనె గ్రంథుల్లో బాక్టీరియా చేరడం వల్ల మొటిమలు రావడం

     టిప్‌: మొటిమలు అంత తేలిగ్గా తగ్గవు, కానీ ముఖాన్ని ఎక్కువసార్లు కడుక్కోవడం వల్ల, చర్మాన్ని శుభ్రపర్చే వాటిని వాడడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది

 భావోద్వేగ మార్పులు

 హార్మోన్ల ప్రభావం మీలో శారీరక మార్పుల్ని కలిగించడమే కాదు, అది మీ భావోద్వేగాల మీద కూడా బలంగా పనిచేసే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఉన్నట్టుండి మీ మూడ్‌ మారిపోవచ్చు.

 “ఒకరోజు ఏడుపొస్తుంది, మర్నాడు బాగానే ఉంటుంది. ఓ క్షణం కోపంగా ఉంటుంది, మరుక్షణం క్రుంగుదలతో రూమ్‌లో ఉండిపోవాలనిపిస్తుంది.”​—ఒక్సాన.

 యౌవనంలో చాలామంది తమ గురించి తాము అతిగా ఆలోచించుకోవడం మొదలుపెడతారు. అందరూ తమనే చూస్తున్నారనీ, తమ గురించి ఏదేదో అనేసుకుంటున్నారనీ వాళ్లు అనుకుంటారు. దానికితోడు, ఉన్నట్టుండి శరీర ఆకారం మారిపోయిందనే విషయం ఇంకా బాధపెడుతుంది!

 “ఆ వయసులో నేను, కావాలనే కాస్త ముందుకు వంగి ఉండేదాన్ని, పెద్దపెద్ద చొక్కాలు వేసుకునేదాన్ని. నా శరీరంలో మార్పులు ఎందుకు వస్తున్నాయో తెలిసినా, చాలా ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించేది. అదోలా ఉండేది.”​—జానస్‌.

 బహుశా మీలో కలిగే పెద్ద భావోద్వేగపరమైన మార్పు, మీరు అమ్మాయిల్ని లేదా అబ్బాయిల్ని చూసే విధానం మారిపోవడం.

 “అబ్బాయిలందరూ అల్లరి పెట్టేవాళ్లే అనే ఆలోచన పోయింది. ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు అందంగా కనిపిస్తున్నారు, ప్రేమలో పడడం కూడా తప్పేమీ కాదనిపిస్తోంది. నిజానికి, ‘ఎవరు ఎవర్ని ఇష్టపడుతున్నారు’ అనేది ఎక్కువగా మాట్లాడుకునే టాపిక్‌ అయిపోయింది.”​—అలెక్సిస్‌.

 అయితే ఈ దశలో, కొంతమంది అబ్బాయిలు వేరే అబ్బాయిలకు ఆకర్షితులౌతారు, అలాగే అమ్మాయిలు వేరే అమ్మాయిలకు ఆకర్షితులౌతారు. ఒకవేళ మీరు కూడా అలా ఆకర్షితులైతే, మీరు ‘గే’ అని నిర్ధారించేసుకోకండి. చాలామందిలో, కాలం గడిచేకొద్దీ అలాంటి భావాలు తగ్గిపోతాయి.

 “నేను ఎంతసేపూ వేరే అబ్బాయిలతో పోల్చుకుంటూనే ఉండడం వల్ల, వాళ్లకు ఆకర్షితుణ్ణి అవుతున్నట్లు అనిపించేది. నాకు అమ్మాయిల మీద ఆకర్షణ కలగడానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు నాలో, అబ్బాయిల పట్ల ఆకర్షణ లేదు.”​—అలెన్‌.

 మీరు చేయగలిగింది

  •    సానుకూలంగా ఆలోచించడం అలవాటు చేసుకోండి. నిజం చెప్పాలంటే, ఈ దశలో మీరు శారీరకంగా, భావోద్వేగపరంగా మెరుగౌతారు, అది మీకు అవసరమైనదే. కీర్తనకర్తయైన దావీదు చెప్పిన ఈ మాటల్నిబట్టి మీరు ఆ విషయాన్ని నమ్మవచ్చు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి.”​—కీర్తన 139:⁠14.

  •    వేరేవాళ్లతో పోల్చుకోకండి, మీ శరీర ఆకారం మీద ఎక్కువగా దృష్టి పెట్టకండి. బైబిలు ఇలా చెప్తుంది: “మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.”—1 సమూయేలు 16:7.

  •    తగినంత వ్యాయామం చేయండి, అవసరమైనంత విశ్రాంతి తీసుకోండి. తగినంతసేపు నిద్రపోతే మీ చిరాకు, ఆందోళన, కృంగుదల కొంతవరకు తగ్గుతాయి.

  •    మిమ్మల్ని మీరు విమర్శించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ప్రతీఒక్కరూ నిజంగా గమనిస్తున్నారా? ఒకవేళ మీ శరీరం గురించి ఎవరైనా కామెంట్‌ చేసినా, దాన్ని పట్టించుకోవడం ఎంతవరకు అవసరమో ఆలోచించండి. బైబిలు ఇలా చెప్తుంది: “ఇతరులు చెప్పే ప్రతి మాటమీదా నీ మనసు పెట్టకు.”—ప్రసంగి 7:21, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

  •    లైంగిక కోరికలకు లొంగిపోకుండా ఉండేలా, వాటిని ఎలా అదుపులో పెట్టుకోవాలో నేర్చుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: “జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ... జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.”—1 కొరింథీయులు 6:18.

  •    మీ తల్లి లేదా తండ్రితో, లేదా మీరు నమ్మే పెద్దవాళ్లతో మాట్లాడండి. అది మొదట్లో ఇబ్బందిగానే ఉంటుంది. కానీ దానివల్ల మీకు మంచి సహాయం దొరుకుతుంది.—సామెతలు 17:17.

 ఒక్క మాటలో: ప్యూబర్టీ దశ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మీరు శారీరకంగానే కాకుండా మానసికంగానూ, భావోద్వేగపరంగానూ, ఆధ్యాత్మికంగానూ ఎదగడానికి అది అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది.—1 సమూయేలు 2:26.