కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

లైంగిక దాడి గురించి నేను ఏమి తెలుసుకోవాలి?—2వ భాగం: కోలుకోవడం

లైంగిక దాడి గురించి నేను ఏమి తెలుసుకోవాలి?—2వ భాగం: కోలుకోవడం

 తప్పు చేశాననే ఫీలింగ్‌ని తట్టుకోవడం

 లైంగిక దాడికి గురైనవాళ్లు తమకు జరిగినదాని గురించి చాలా సిగ్గుపడతారు. దానికి బాధ్యులు తామేనని కూడా అనుకుంటారు. ప్రస్తుతం 19 ఏళ్లున్న క్యారన్‌ అనుభవాన్ని చూడండి. ఆరు నుండి పదమూడు ఏళ్ల మధ్య వయసులో ఉన్నప్పుడు ఆ అమ్మాయిపై లైంగిక దాడి జరిగింది. ఆమె ఇలా చెప్తోంది, “తప్పు చేశాననే ఫీలింగ్‌ నన్ను పట్టిపీడించేది. ‘అసలు అంతకాలంపాటు నా మీద లైంగిక దాడి జరగడానికి నేనెలా అనుమతించాను’ అని నాలో నేను అనుకునేదాన్ని.”

 ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తుంటే, ఒకసారి ఈ విషయాల గురించి ఆలోచించండి.

  •   పిల్లలు సెక్స్‌ చేయడానికి శారీరకంగా గానీ మానసికంగా గానీ సిద్ధంగా ఉండరు. అసలు సెక్స్‌ అంటే ఏమిటో కూడా వాళ్లకు తెలియదు. కాబట్టి తమపై అలాంటి దాడి జరగడానికి వాళ్లు ఏ రకంగా కూడా ఒప్పుకోలేరు. అందుకే చిన్నపిల్లలపై జరిగే లైంగిక దాడులకు ఆ చిన్నపిల్లలు బాధ్యులు కాదు.

  •   సాధారణంగా చిన్నపిల్లలు పెద్దవాళ్లను గుడ్డిగా నమ్మేస్తారు, చెడ్డవాళ్లు చేసే మోసాల గురించి వాళ్లకేం తెలీదు. దాంతో అలాంటివాళ్ల చేతుల్లో పిల్లలు మోసపోతున్నారు. “లైంగిక దాడులు చేసేవాళ్లు, మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకోవడంలో ఆరితేరి ఉంటారు. వాళ్ల తెలివితేటల ముందు పిల్లలు ఇట్టే మోసపోతారు” అని ది రైట్‌ టు ఇన్నోసెన్స్‌ అనే పుస్తకం చెప్తోంది.

  •   పిల్లలు లైంగిక దాడికి గురౌతున్న సమయంలో వాళ్లు కూడా లైంగికంగా ఉద్రేకానికి గురవ్వవచ్చు. ఒకవేళ మీకు అలా అనిపించివుంటే, సాధారణంగా మనల్ని కొన్ని విధాల్లో ముట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన శరీరంలో అలాంటి మార్పులు జరుగుతాయని గుర్తుంచుకోండి. అంతమాత్రాన మీపై లైంగిక దాడి జరగడానికి మీరు అనుమతిచ్చారనో లేదా అలా జరగడానికి మీరే బాధ్యులనో అనుకోకండి.

 సలహా: మీరు ఏ వయసులోనైతే లైంగిక దాడికి గురయ్యారో, ప్రస్తుతం అదే వయసున్న మీకు తెలిసిన ఓ పాపనో, బాబునో ఊహించుకోండి. ‘ఒకవేళ ఈ పాపపై లేదా బాబుపై లైంగిక దాడి జరిగితే, అందుకు కారణం వాళ్లేనని అనడం ఎంతవరకు న్యాయం?’ అని ఒకసారి ఆలోచించండి.

 క్యారన్‌కు ముగ్గురు పిల్లల ఆలనాపాలనా చూసుకునే పని దొరికినప్పుడు ఆమె ఈ చివరి అంశం గురించే ఆలోచించింది. వాళ్లలో ఒకరికి సుమారు ఆరేళ్లు. క్యారన్‌ ఆ వయసులో ఉన్నప్పుడే ఆమెపై లైంగిక దాడి జరగడం మొదలైంది. క్యారన్‌ ఇలా అంటోంది, “ఆ వయసులోని పిల్లలకు తమను తాము రక్షించకునే శక్తి ఉండదని నేను గ్రహించాను. నేను కూడా ఆ వయసులో అలానే ఉన్నాను.”

 నిజమేంటంటే: తప్పంతా మీపై లైంగిక దాడి చేసిన వాళ్లదే. బైబిలు ఇలా చెప్తోంది, “దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.”—యెహెజ్కేలు 18:20.

 ఎవరికైనా చెప్పడం మంచిది

 మీరు బాగా నమ్మిన పెద్దవాళ్లతో మీపై జరుగుతున్న దాడి గురించి చెప్తే, వాళ్లు మిమ్మల్ని ఓదారుస్తారు. బైబిలు ఇలా చెప్తోంది, “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”—సామెతలు 17:17.

 కానీ మీకు జరిగిన దానిగురించి ఎవ్వరితో చెప్పకపోవడమే మంచిదని మీకు అనిపించవచ్చు, అది అర్థంచేసుకోదగిన విషయమే. జరిగిన ఘోరం గురించి అలా బయటికి చెప్పకపోవడం, ముందుముందు మీపై అలాంటి దాడులు జరగకుండా రక్షణగా ఉండే ఓ గోడలా ఉంటుందని మీరనుకోవచ్చు. అయితే కొన్నిసార్లు, రక్షణగా ఉంటుందని మీరనుకుంటున్న ఆ గోడే, మీకు సహాయం అందకుండా చేసే అడ్డుగోడ కావచ్చు.

రక్షణగా ఉంటుందని మీరనుకుంటున్న గోడే, మీకు సహాయం అందకుండా చేసే అడ్డుగోడ కావచ్చు

 తనపై జరిగిన దాడి గురించి ఇతరులకు చెప్పినప్పుడు చాలా ఊరటగా అనిపిస్తుందని జానెట్‌ అనే ఓ యువతి అంటోంది. ఆమె ఇలా చెప్పింది, “చాలా చిన్నవయసులోనే నాపై ఒకరు లైంగికంగా దాడి చేశారు. ఆ వ్యక్తి నాకు బాగా తెలిసిన, నేను నమ్మిన వ్యక్తే. ఆ విషయాన్ని కొన్ని సంవత్సరాలపాటు నేను ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఒకసారి ఆ విషయాన్ని మా అమ్మతో చెప్పగానే, నా తల మీద నుండి పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపించింది.”

 తన గతాన్ని బట్టి, కొంతమంది తమపై జరిగిన దాడి గురించి చెప్పడానికి ఎందుకు వెనకాడతారో జానెట్‌ అర్థం చేసుకోగలదు. ఆమె ఇంకా ఇలా చెప్తోంది, “జరిగిన లైంగిక దాడి గురించి మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ నా విషయంలోనైతే, ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పనంతవరకు నేను చాలా నరకం అనుభవించాను. మరీ ఆలస్యం చేయకుండా ఆ విషయాన్ని బయటికి చెప్పి మంచి పని చేశాను.”

 కోలుకునే సమయం

 లైంగిక దాడి వల్ల మీ గురించి మీరు తప్పుగా అనుకుంటూ చాలా బాధపడుతుండవచ్చు. ఉదాహరణకు, మీ శీలం పోయిందని, మీకు విలువలేదని లేదా వేరేవాళ్ల లైంగిక కోరికలు తీర్చడానికి మాత్రమే మీరు పనికొస్తారని మీకు అనిపించవచ్చు. కానీ అలాంటి అబద్ధాల నుండి బయటపడడానికి మీకు ఇదే మంచి సమయం, ఈ సమయాన్ని కోలుకోవడానికి ఉపయోగించుకోండి. (ప్రసంగి 3:3) అలా కోలుకోవడానికి మీకేది సహాయం చేస్తుంది?

 బైబిల్ని అధ్యయనం చేయండి. బైబిల్లో దేవుని ఆలోచనలు ఉన్నాయి, వాటికి ‘దుర్గములను పడద్రోసేంత బలం’ ఉంది. కాబట్టి మీరు విలువైనవాళ్లు కాదని మీలో ఉన్న తప్పుడు ఆలోచనల్ని కూడా తీసేయగలవు. (2 కొరింథీయులు 10:4, 5) ఉదాహరణకు మీరు ఈ వచనాలను చదివి, వాటి గురించి ఆలోచించండి: యెషయా 41:10; యిర్మీయా 31:3; మలాకీ 3:16, 17; లూకా 12:6, 7; 1 యోహాను 3:19, 20.

 ప్రార్థన చేయండి. ఎందుకూ పనికిరారనే ఫీలింగ్‌ లేదా తప్పు చేశారనే బాధ మిమ్మల్ని వేధిస్తుంటే ప్రార్థనలో మీ ‘భారము యెహోవామీద మోపండి.’ (కీర్తన 55:22) మీరు ఎప్పటికీ ఒంటరివాళ్లు కాదు!

 సంఘపెద్దలతో మాట్లాడండి. వీళ్లు “గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను” ఉండేలా శిక్షణ పొందారు. (యెషయా 32:2) మీపై మీకు సరైన అభిప్రాయం కలగడానికి, జరిగిపోయిన వాటిగురించే ఆలోచిస్తూ కుమిలిపోకుండా ముందుకు సాగడానికి సంఘపెద్దలు సహాయం చేయగలరు.

 మంచివాళ్లతో స్నేహం చేయండి. క్రైస్తవుల ప్రమాణాలకు తగ్గట్లుగా జీవించే స్త్రీపురుషులను గమనించండి. వాళ్లు ఒకర్నొకరు ఎలా చూసుకుంటున్నారో పరిశీలించండి. పైకి ప్రేమిస్తున్నట్లు నటిస్తూ అవకాశం దొరికినప్పుడు లైంగిక దాడి చేసేవాళ్లలా అందరూ ఉండరని మీరు కొంతకాలానికే తెలుసుకుంటారు.

 టాన్య అనే ఓ యువతి ఈ ప్రాముఖ్యమైన విషయాన్నే అర్థంచేసుకుంది. చాలా చిన్నవయసు నుండే, ఎంతోమంది మగవాళ్లు ఆమెను తమ లైంగిక కోరికలు తీర్చే వస్తువులా చూశారు. “నేను నమ్మి స్నేహం చేసిన మగవాళ్లందరూ నన్ను బాధపెట్టారు” అని టాన్య చెప్పింది. కానీ, మగవాళ్లలో కూడా నిజమైన ప్రేమ చూపించేవాళ్లు ఉన్నారని కాలం గడుస్తుండగా టాన్య తెలుసుకుంది. ఎలా?

 క్రైస్తవ ప్రమాణాలకు తగ్గట్లుగా జీవిస్తున్న ఓ జంటతో స్నేహం చేయడంవల్ల టాన్య అభిప్రాయం మారింది. “మగవాళ్లందరూ లైంగిక దాడి చేసేవాళ్లు కాదని ఆ భర్తను చూశాక అర్థమైంది. అతను తన భార్యను కంటికి రెప్పలా చూసుకునేవాడు, అలా చూసుకోవాలనే దేవుడు కూడా కోరుకున్నాడు.” aఎఫెసీయులు 5:28, 29.

a ఒకవేళ మీరు డిప్రెషన్‌, ఆకలి వేయకపోవడం, మిమ్మల్ని మీరు గాయపర్చుకోవడం, వస్తువుల్ని విసరడం, నిద్రపట్టకపోవడం, ఆత్మహత్య చేసుకోవాలనిపించడం వంటి సమస్యలతో బాధపడుతుంటే డాక్టరు దగ్గరకు వెళ్లడం మంచిది.