కంటెంట్‌కు వెళ్లు

అశ్లీల చిత్రాలు చూసే అలవాటుకు నేను బానిసనైతే?

అశ్లీల చిత్రాలు చూసే అలవాటుకు నేను బానిసనైతే?

మీరేమి చెయ్యవచ్చు

 అశ్లీల చిత్రాల ఉద్దేశం ఏమిటో అర్థంచేసుకోండి. దేవుడు చేసిన ఒక ఘనమైన ఏర్పాటును దిగజార్చే ప్రయత్నమే ఈ అశ్లీల చిత్రాలు. మీరు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే ‘చెడుతనమును అసహ్యించుకోగలుగుతారు.’—కీర్తన 97:10.

 పర్యవసానాల గురించి ఆలోచించండి. అశ్లీల చిత్రాల్లో చిత్రించబడిన వ్యక్తులకు ఎలాంటి విలువ ఉండదు. వాటిని చూసే వాళ్లకున్న గౌరవం కూడా తగ్గిపోతుంది. అందుకే బైబిలు మంచి కారణంతోనే ఇలా ఉపదేశమిస్తుంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.”—సామెతలు 22:3.

 ఒక ఒప్పందం చేసుకోండి. “ఒక యువతిని కామవాంఛతో చూడకూడదని నా కళ్లతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.” (యోబు 31:1, పరిశుద్ధ బైబల్‌, తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మీరు చేసుకోగల కొన్ని ‘ఒప్పందాలు’ కింద ఉన్నాయి:

  •  నేను ఒంటరిగా ఉన్నపుడు ఇంటర్నెట్‌ వాడను.

  •  అశ్లీల చిత్రాలకు సంబంధించిన సైట్‌లను లేదా పాప్‌అప్‌లను వెంటనే క్లోస్‌ చేస్తాను.

  •  నేను మళ్లీ ఎప్పుడైనా చూస్తే, నా పరిస్థితిని అర్థంచేసుకుని సరైన సహాయం చేసే వ్యక్తితో మాట్లాడతాను.

అశ్లీల చిత్రాలను ఎన్నిసార్లు చూస్తే ఆ అలవాటుకు అంతగా బానిసలవుతారు, దానిని మానుకోవడం కూడా అంతే కష్టంగా ఉంటుంది

 ఈ విషయం గురించి ప్రార్థించండి. కీర్తనకర్త, యెహోవా దేవునికి ఇలా ప్రార్థించాడు: “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము.” (కీర్తన 119:37) ఈ అలవాటు మీద మీరు విజయం సాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఆయనకు ప్రార్థిస్తే సరైనది చేయడానికి మీకు కావాల్సిన శక్తిని ఇస్తాడు!—ఫిలిప్పీయులు 4:13.

 ఎవరికైన చెప్పండి. ఈ అలవాటు నుండి బయట పడడానికి మీకు సహాయం చేయగల, మీరు నమ్మదగిన ఒక మంచి స్నేహితున్ని ఎన్నుకోండి.—సామెతలు 17:17.

 ఈ విషయం గుర్తుపెట్టుకోండి: అశ్లీల చిత్రాలు చూడని ప్రతిసారి మీరు ఒక గొప్ప విజయం సాధించినట్లే. ఆ విజయం గురించి యెహోవా దేవునితో చెప్పండి, ఆయన మీకు శక్తిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పండి. అశ్లీల చిత్రాలు చూసే అలవాటును మానుకోవడం ద్వారా మీరు యెహోవా హృదయాన్ని ఎంతగానో సంతోషపెడతారు.—సామెతలు 27:11.