కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నా మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వాలి?

నా మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వాలి?

 మనస్సాక్షిని వీటిలో దేనితో పోల్చవచ్చు?

  •   మ్యాప్‌

  •   అద్దం

  •   ఫ్రెండ్‌

  •   జడ్జ్‌

 నాలుగూ కరెక్టే. ఎందుకో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

 మనస్సాక్షి అంటే ఏంటి?

 ఇది తప్పు, ఇది కరెక్ట్‌ అని చెప్పే మీలోని సామర్థ్యమే మనస్సాక్షి. బైబిలు దాన్ని ‘హృదయాల్లో రాసివున్న ధర్మశాస్త్రం’ అని చెప్తుంది. (రోమీయులు 2:15) సరిగ్గా పనిచేసే మనస్సాక్షి, మీరు వెళ్తున్న దారి లేదా వెళ్లాలనుకుంటున్న దారి సరైనదో కాదో తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది.

  •   మనస్సాక్షి మ్యాప్‌ లాంటిది. అది సరైన దారిలో మిమ్మల్ని నడిపించి, సమస్యలు రాకుండా కాపాడుతుంది.

  •   మనస్సాక్షి అద్దం లాంటిది. అది మీ ప్రవర్తన ఎలా ఉందో మీకు చూపిస్తుంది, మీరు లోపల ఎలా ఉన్నారో మీకు చెప్తుంది.

  •   మీ మనస్సాక్షి మంచి ఫ్రెండ్‌ లాంటిది. అది మీకు మంచి సలహాలు ఇస్తుంది, దాని మాట వింటే మిమ్మల్ని విజయానికి నడిపిస్తుంది.

  •   మీ మనస్సాక్షి జడ్జ్‌ లాంటిది. మీరు ఏదైనా తప్పు చేస్తే, మీరు తప్పు చేశారని మీకు చెప్తుంది.

మంచి మనస్సాక్షి తెలివైన నిర్ణయాలు తీసుకునేలా మీకు సహాయం చేస్తుంది

 ఒక్క మాటలో: మీ మనస్సాక్షి మీరు (1) తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే (2) తప్పుల్ని సరిదిద్దుకోవడానికి మీకు సహాయం చేసే ఒక ముఖ్యమైన పనిముట్టు.

 మనస్సాక్షికి ఎందుకు శిక్షణ ఇవ్వాలి?

 బైబిలు మనకు ఇలా చెప్తుంది, “మంచి మనస్సాక్షిని కాపాడుకోండి.” (1 పేతురు 3:16) అలా చేయాలంటే మనస్సాక్షికి శిక్షణ ఇవ్వాలి.

 “నేను ఎక్కడెక్కడికి వెళ్లేదాన్నో మా అమ్మానాన్నలకు చెప్పేదాన్ని కాదు. మొదట్లో నా మనస్సాక్షికి ఇబ్బందిగా అనిపించేది. కానీ మెల్లమెల్లగా నేను చేసేది పెద్ద తప్పు కాదని నాకు అనిపించింది.”—జెన్నిఫర్‌.

 అయితే కొంతకాలానికి, జెన్నిఫర్‌ మనస్సాక్షి ఆ విషయం గురించి వాళ్ల అమ్మానాన్నలకు చెప్పేలా ఆమెను కదిలించింది, వాళ్లను మోసం చేయడం తప్పని చెప్పింది.

 ఆలోచించండి: జెన్నిఫర్‌ తన తప్పును ఒప్పుకునేలా ఆమె మనస్సాక్షి ఎప్పుడు కదిలించి ఉండాల్సింది?

 “పైకి ఒకలా, లోపల ఒకలా ఉండడం చాలా కష్టం, చాలా ఒత్తిడికి గురౌతాం. ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మీ మనస్సాక్షి ఒప్పుకుంటే, ఆ తర్వాత ఇంకో తప్పుడు నిర్ణయం తీసుకోవడం అంత కష్టంగా అనిపించదు.”—మాథ్యూ.

 కొంతమంది మనస్సాక్షిని అసలు ఎప్పుడూ లెక్కచేయరు. ‘వాళ్లు నైతిక విచక్షణను పూర్తిగా కోల్పోయారు’ అని బైబిలు చెప్తుంది. (ఎఫెసీయులు 4:19) పవిత్ర గ్రంథము, వ్యాఖ్యాన సహితం బైబిలు, వాళ్లు “సిగ్గుమాలినవారు” అని చెప్తుంది.

 ఆలోచించండి: తప్పు చేసి బాధపడకుండా ఉండడం నిజంగా మంచిదేనా? అలాంటివాళ్లకు తప్పకుండా ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి?

 ఒక్క మాటలో: మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలంటే “వివేచనా సామర్థ్యాల్ని ఉపయోగిస్తూ వాటికి శిక్షణ” ఇవ్వాలి. అప్పుడు మీరు “తప్పొప్పులను గుర్తించగలుగుతారు.”—హెబ్రీయులు 5:14.

 మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వాలి?

 మనస్సాక్షికి శిక్షణ ఇవ్వాలంటే, మీ ప్రవర్తనను ఒక ప్రమాణంతో పోల్చుకుంటూ సరిచూసుకుంటూ ఉండాలి. కొంతమంది ఇలాంటివాళ్ల ప్రమాణాల్ని పాటిస్తారు:

  •   కుటుంబం, సంస్కృతి

  •   స్నేహితులు

  •   సెలబ్రిటీలు

 అయితే, బైబిల్లో ఉన్న ప్రమాణాలు అన్నిటికన్నా చాలా గొప్పవి. అందులో ఆశ్చర్యమేమీ లేదు, ఎందుకంటే బైబిల్ని “దేవుడు ప్రేరేపించాడు.” మనల్ని సృష్టించింది ఆయనే, మనకు ఏది అన్నిటికన్నా మంచిదో ఆయనకు తెలుసు.—2 తిమోతి 3:16.

 కొన్ని ఉదాహరణలు చూడండి.

 ప్రమాణం: “మేము అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించాలని అనుకుంటున్నాం.”—హెబ్రీయులు 13:18.

  •   పరీక్షలో కాపీ కొట్టాలని, అమ్మానాన్నలకు అబద్ధం చెప్పాలని లేదా దొంగతనం చేయాలని మీకు అనిపించినప్పుడు, ఆ మాటలు గుర్తుచేసుకుంటే మీ మనస్సాక్షి మీకు ఏమని చెప్తుంది?

  •   మీ మనస్సాక్షి మాట విని మీరు అన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటే, మీరు ఇప్పుడూ అలాగే భవిష్యత్తులో ఎలా ప్రయోజనం పొందుతారు?

 ప్రమాణం: “లైంగిక పాపానికి దూరంగా పారిపోండి!”—1 కొరింథీయులు 6:18.

  •    అశ్లీల చిత్రాలు చూడాలని లేదా పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనాలని మీకు అనిపించినప్పుడు, ఆ మాటలు గుర్తుచేసుకుంటే మీ మనస్సాక్షి మీకు ఏమని చెప్తుంది?

  •   మీ మనస్సాక్షి మాట విని మీరు లైంగిక పాపానికి దూరంగా పారిపోతే, మీరు ఇప్పుడూ అలాగే భవిష్యత్తులో ఎలా ప్రయోజనం పొందుతారు?

 ప్రమాణం: “ఒకరితో ఒకరు దయగా మెలగండి, కనికరం చూపించండి, ... ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి.”—ఎఫెసీయులు 4:32.

  •    మీ తోబుట్టువుతో లేదా ఫ్రెండ్‌తో గొడవ అయినప్పుడు ఆ మాటలు గుర్తుచేసుకుంటే, మీ మనస్సాక్షి మీకు ఏమని చెప్తుంది?

  •   మీ మనస్సాక్షి మాట విని మీరు దయ, కనికరం చూపిస్తే, మీరు ఇప్పుడూ అలాగే భవిష్యత్తులో ఎలా ప్రయోజనం పొందుతారు?

 ప్రమాణం: ‘హింసను ప్రేమించేవాళ్లంటే యెహోవాకు అసహ్యం.’—కీర్తన 11:5.

  •    మీరు ఏ సినిమాలు, టీవీ ప్రోగ్రామ్‌లు చూడాలి, ఏ వీడియో గేమ్‌లు ఆడాలి అని ఆలోచించేటప్పుడు, ఆ మాటలు గుర్తుచేసుకుంటే మీ మనస్సాక్షి మీకు ఏమని చెప్తుంది?

  •   మీ మనస్సాక్షి మాట విని మీరు హింస ఉన్న వినోదానికి దూరంగా ఉంటే, మీరు ఇప్పుడూ అలాగే భవిష్యత్తులో ఎలా ప్రయోజనం పొందుతారు?

 నిజంగా జరిగిన కథ: “నా ఫ్రెండ్స్‌ హింసతో నిండిన వీడియో గేములు ఆడేవాళ్లు, నేను కూడా ఆడేవాణ్ణి. అయితే మా నాన్న అలాంటివి ఆడకూడదని చెప్పాడు. దాంతో నేను నా ఫ్రెండ్స్‌ దగ్గరికి వెళ్లినప్పుడు వాటిని ఆడేవాణ్ణి, ఇంటికి వచ్చినప్పుడు దాని గురించి ఏమీ మాట్లాడేవాణ్ణి కాదు. ఏంటి అలా ఉన్నావని నాన్న అడిగితే, ఏం లేదని అనేవాణ్ణి. అయితే ఒకరోజు నేను కీర్తన 11:5 చదివాను, నేను చేసేది తప్పని నాకనిపించింది. అలాంటి వీడియో గేములు ఆడడం ఆపేయాలని నాకర్థమైంది. నేను ఆపేశాను. నన్ను చూసి నా ఫ్రెండ్స్‌లో ఒకతను కూడా అలాంటి వీడియో గేములు ఆడడం మానేశాడు.”—జెరెమీ.

 ఆలోచించండి: జెరెమీ మనస్సాక్షి ఎప్పుడు పనిచేయడం మొదలుపెట్టింది? అతను ఎప్పుడు దాని మాట వినడం మొదలుపెట్టాడు? జెరెమీ నుండి మీరేం నేర్చుకున్నారు?

 ఒక్క మాటలో: మీ మనస్సాక్షి మీరు ఎలాంటివాళ్లో, వేటిని ముఖ్యమైనవిగా ఎంచుతారో చూపిస్తుంది? మీ మనస్సాక్షి మీ గురించి ఏం చెప్తోంది?