కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

డేటింగ్‌—1వ భాగం: నేను డేటింగ్‌ చేయడానికి రెడీగా ఉన్నానా?

డేటింగ్‌—1వ భాగం: నేను డేటింగ్‌ చేయడానికి రెడీగా ఉన్నానా?

 డేటింగ్‌ అంటే ఏంటి?

 డేటింగ్‌ అంటే సరదా కోసం చేసేది అని కొంతమంది అనుకుంటారు. కానీ “డేటింగ్‌” అంటే ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఒకరికొకరు సరిపోతారా లేదా అని తెలుసుకోవడానికి గడిపే సమయమని ఈ ఆర్టికల్‌ చెప్తుంది. అవతలి వ్యక్తి ఇష్టపడుతుంటే ఆనందించడం మాత్రమే కాదు గానీ డేటింగ్‌ చేయడానికి ఒక ఉద్దేశం ఉంటుంది.

 డేటింగ్‌ చేస్తున్నవాళ్లు కాలం గడిచేకొద్దీ, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా లేకపోతే ఆ బంధాన్ని అక్కడితోనే ఆపేయాలా అనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అందుకే డేటింగ్‌ మొదలుపెడుతున్నప్పుడే ఆ రెండిటిలో దేనికైనా రెడీగా ఉండాలి.

 ఒక్క మాటలో చెప్పాలంటే: మీరు డేటింగ్‌ చేయడానికి రెడీగా ఉన్నారంటే, ఒకరకంగా పెళ్లికి కూడా రెడీగా ఉన్నట్లే.

పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేకుండా డేటింగ్‌ చేయడం, ఉద్యోగం చేయాలనే ఆలోచన లేకుండా ఇంటర్వ్యూకి వెళ్లడం లాంటిది

 డేటింగ్‌ చేయడానికి మీరు రెడీనా?

 డేటింగ్‌ పెళ్లికి నడిపిస్తుంది కాబట్టి ఏ లక్షణాలు మీ బంధాన్ని కాపాడతాయో, ఏవి పాడు చేస్తాయో జాగ్రత్తగా ఆలోచించండి. ఒకసారి ఈ కిందున్న వాటిని చూడండి:

  •   కుటుంబ సభ్యులతో ఎలా ఉంటున్నారో చూసుకోండి: మీ అమ్మానాన్నలతో, తోబుట్టువులతో మీరు ఎలా ఉంటారు, ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనే దాన్ని బట్టే మీ భార్య లేదా భర్తతో కూడా ఎలా ఉంటారనే విషయం తెలుస్తుంది.

     బైబిలు సూత్రం: “మీరు అన్నిరకాల ద్వేషం, అలాగే కోపం, ఆగ్రహం, అరవడం, తిట్టడం, అన్నిరకాల చెడుతనం మానేయండి.”—ఎఫెసీయులు 4:31.

     ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను అమ్మానాన్నల్ని, తోబుట్టువుల్ని గౌరవిస్తానని వాళ్లు నా గురించి చెప్తారా? వాళ్లతో ఏదైనా సమస్య వస్తే, నేను ప్రశాంతంగా మాట్లాడతానా లేదా ఆవేశంగా అరుస్తానా?’

    మీ అమ్మానాన్నలతోనే సమస్యల్ని పరిష్కరించుకోలేనప్పుడు, మీకు కాబోయే భార్య లేదా భర్తతో అలా చేయడం ఎలా కుదురుతుంది?

  •   మీ గురించే ఆలోచించకండి: పెళ్లయ్యాక మీకు నచ్చింది కాకుండా, మీ భార్య లేదా భర్తకి ఏం నచ్చుతుందో తెలుసుకుని వాటిని చేయడానికి చూడాలి.

     బైబిలు సూత్రం: “ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచిస్తూ ఉండాలి.”—1 కొరింథీయులు 10:24.

     ఇలా ప్రశ్నించుకోండి: ‘ప్రతీసారి నాకు నచ్చిందే చేయాలని నేను పట్టుపడుతున్నానా? నేను సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటానని ఇతరులకు తెలుసా? నా అవసరాల కన్నా ఎదుటివాళ్ల అవసరాలనే ఎక్కువ పట్టించుకుంటానని నేనెలా చూపిస్తున్నాను?’

  •   వినయం చూపించండి. ఒక మంచి భార్య లేదా భర్త, తమ తప్పుల్ని ఒప్పుకుని, మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతారు.

     బైబిలు సూత్రం: “మనందరం తరచూ పొరపాట్లు చేస్తుంటాం.”—యాకోబు 3:2, అథస్సూచి.

     ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను నా పొరపాట్లని ఒప్పుకోవడానికి ఇష్టపడతానా లేదా సాకులు చెప్తానా? ఏదైనా విషయంలో అవసరమైన సలహా ఇస్తే నేను నొచ్చుకుంటానా?’

  •   డబ్బులు ఎలా ఖర్చు చేస్తారో ఆలోచించండి. తరచూ కుటుంబాల్లో, డబ్బు విషయాల్లో గొడవలు అవుతుంటాయి. కాబట్టి ఆ విషయంలో మీరెంత ఎక్కువ బాధ్యతగా ఉంటే, అంత తక్కువ గొడవలు అవుతాయి.

     బైబిలు సూత్రం: “మీలో ఒక వ్యక్తి భవనం కట్టాలనుకుంటే, దాన్ని పూర్తిచేయడానికి కావాల్సినంత డబ్బు తన దగ్గర ఉందో లేదో చూడడానికి ముందుగా కూర్చొని లెక్కలు వేసుకోడా?”—లూకా 14:28.

     ఇలా ప్రశ్నించుకోండి: ‘నా ఖర్చుల్ని నేను కంట్రోల్‌ చేసుకుంటున్నానా లేక అతిగా ఖర్చుపెట్టి అప్పుల పాలు అవుతున్నానా? నేను డబ్బును జాగ్రత్తగా ఉపయోగిస్తానని ఎలా చూపిస్తాను?’

  •   దేవునికి ఇష్టమైన పనులు చేయండి. మీరు ఒక యెహోవాసాక్షి అయితే, క్రమంగా బైబిలు చదవడం, మీటింగ్స్‌కి వెళ్లడం లాంటివి చేస్తూ ఉండాలి.

     బైబిలు సూత్రం: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”—మత్తయి 5:3.

     ఇలా ప్రశ్నించుకోండి: ‘దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ, నా విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? ఆరాధనలో భాగంలో చేసే పనుల్ని ప్రాముఖ్యంగా ఎంచుతున్నానా లేక వేరే విషయాలకు టైం ఇస్తున్నానా?’

 ఒక్క మాటలో చెప్పాలంటే: మిమ్మల్ని చేసుకునే వ్యక్తి, మీరు తనకు తగిన జోడీగా ఉండాలని ఆశిస్తారు. అలా ఉండడానికి మీరు కష్టపడితే, అవతలి వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా ఇష్టపడతారు.