కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

అమ్మానాన్నలు పెట్టిన రూల్స్‌ గురించి వాళ్లతో నేనెలా మాట్లాడాలి?

అమ్మానాన్నలు పెట్టిన రూల్స్‌ గురించి వాళ్లతో నేనెలా మాట్లాడాలి?

 నాకు 15 ఏళ్లప్పుడు అమ్మానాన్న పెట్టిన రూల్స్‌ నాకు సరిగ్గా సరిపోయాయి, కానీ నాకు ఇప్పుడు 19 ఏళ్లు వచ్చాయి, ఇంకాస్త ఎక్కువ స్వేచ్ఛ కావాలి.—సిల్వియా.

 మీకూ సిల్వియాలానే అనిపిస్తుందా? అలా అయితే, మీ అమ్మానాన్నలతో ఈ విషయం గురించి మాట్లాడడానికి మీకు ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

 మీరు ఏమి తెలుసుకోవాలి?

 అమ్మానాన్నలు పెట్టిన రూల్స్‌ లేదా నియమాల గురించి వాళ్లతో మాట్లాడే ముందు ఈ విషయాల గురించి ఆలోచించండి:

  •  రూల్స్‌ లేని లోకం గందరగోళంగా ఉంటుంది. ఒక బిజీ రోడ్డు గురించి ఆలోచించండి. సూచనలు, ట్రాఫిక్‌ లైట్‌లు, స్పీడ్‌ లిమిట్‌లు లేకపోతే ఎలా ఉంటుంది? రోడ్డు నియమాల్లానే ఇంట్లో కూడా నియమాలు ఉంటే అంతా పద్ధతిగా ఉంటుంది.

  •  మీ అమ్మానాన్నలకు మీమీద ఉన్న ప్రేమకు రుజువు వాళ్లు పెట్టే నియమాలు. వాళ్లు ఏ నియమాలూ పెట్టకపోతే, మీకేం జరిగినా వాళ్లకు అనవసరమని అర్థమౌతుంది. అలా చేస్తే వాళ్లు నిజంగా ప్రేమగల తల్లిదండ్రులేనా?

 మీకు తెలుసా? తల్లిదండ్రులు కూడా నియమాలు పాటించాలి! ఒకసారి ఆదికాండము 2:​24; ద్వితీయోపదేశకాండము 6:​6, 7; ఎఫెసీయులు 6:4; 1 తిమోతి 5:8 చదవండి, మీకే అర్థమౌతుంది.

 అయినాసరే, మీ అమ్మానాన్నలు పెట్టిన రూల్స్‌ మిమ్మల్ని మరీ ఎక్కువ కట్టుదిట్టం చేస్తున్నాయని మీకనిపిస్తే?

 మీరేమి చేయవచ్చు?

 వాళ్లతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి. ఇప్పటివరకు మీ అమ్మానాన్న పెట్టిన రూల్స్‌ అన్నిటినీ మీరు చక్కగా పాటించారా? లేదంటే, ఇప్పుడు వాళ్లను స్వేచ్ఛ ఇవ్వమని అడగడం సరికాదు. ముందుగా, “మా అమ్మానాన్నల నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే నేనేమి చేయాలి?” అనే ఆర్టికల్‌ చదవండి.

 మీ అమ్మానాన్నలు ఇప్పటివరకు పెట్టిన రూల్స్‌ అన్నిటినీ మీరు చక్కగా పాటిస్తే, మీరు వాళ్లతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో సిద్ధపడండి. మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో ముందే ఆలోచించి పెట్టుకుంటే, మీరు వాళ్లను అడిగేవి ఎంతవరకు సమంజసమో మీకే అర్థమౌతుంది. ప్రశాంతంగా, హడావిడి లేకుండా ఎప్పుడు మాట్లాడుకుంటే బావుంటుందో, ఎక్కడ మాట్లాడుకుంటే బావుంటుందో చెప్పమని మీ తల్లిదండ్రుల్ని అడగండి. తర్వాత, మీ అమ్మానాన్నలతో మాట్లాడేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి:

 గౌరవంగా మాట్లాడండి. బైబిలు ఇలా అంటుంది: “నొప్పించు మాట కోపమును రేపును.” (సామెతలు 15:1) కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి: మీరు మీ అమ్మానాన్నలతో వాదిస్తే, వాళ్లు అనవసరమైన రూల్స్‌ పెడుతున్నారని నిందిస్తే, మాట్లాడుకునే బదులు పోట్లాడుకునే పరిస్థితి వస్తుంది.

 మా అమ్మానాన్నల్ని నేనెంత ఎక్కువగా గౌరవిస్తే, వాళ్లు కూడా నన్ను అంతే ఎక్కువగా గౌరవిస్తారు. ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల ఒక మంచి ముగింపుకు రావడం మాకు చాలా తేలికైంది.”​—బియాంక, 19.

 వినండి. “వినడానికి సిద్ధంగా ఉండాలి, తొందరపడి మాట్లాడకూడదు” అని బైబిలు చెప్తుంది. (యాకోబు 1:​19) మీరందరూ కలిసి మాట్లాడుకుంటున్నారే గానీ మీరు మీ తల్లిదండ్రులకు క్లాస్‌ పీకట్లేదని గుర్తుపెట్టుకోండి.

 వయసు పెరిగే కొద్దీ, మన తల్లిదండ్రుల కంటే మనకే ఎక్కువ తెలుసని అనిపిస్తుంది. కానీ, అది నిజం కాదు. వాళ్లు చెప్పే సలహాలు వింటే ప్రయోజనం పొందుతాం.”​—డెవన్‌, 20.

 వాళ్ల భావాల్ని అర్థం చేసుకోండి. విషయాల్ని మీ అమ్మానాన్నల వైపు నుండి చూడడానికి ప్రయత్నించండి. “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి” అని బైబిలు చెప్తోంది. ఈ బైబిలు సలహా ప్రకారం, మీరు మీ తల్లిదండ్రుల మీద కూడా శ్రద్ధ చూపించాలి.​—ఫిలిప్పీయులు 2:4.

ఈ రెండు పద్ధతుల్లో దేనివల్ల మంచి ఫలితాలు వస్తాయి?

 మా అమ్మానాన్నల్ని నేను నా టీమ్‌మేట్స్‌లా కాకుండా శత్రువులుగా చూసేవాణ్ణి. అయితే నేను కాస్త ఆలస్యంగా అర్థం చేసుకున్న విషయం ఏమిటంటే, మా అమ్మానాన్నలు కూడా నాలాగే నేర్చుకునే స్టేజిలో ఉన్నారు. నేనేమో బాధ్యతగా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాను, వాళ్లేమో నన్ను చక్కగా ఎలా పెంచాలో నేర్చుకుంటున్నారు. వాళ్లు ఏది చేసినా ప్రేమతో నా బాగోగులను మనసులో పెట్టుకునే చేశారు.”​—జాషువా, 21.

 కొన్ని పరిష్కారాలు చెప్పి చూడండి. ఉదాహరణకు, గంటసేపు ప్రయాణం చేసేంత దూరంలో ఒక పార్టీ జరుగుతుంది. దానికి వెళ్లొద్దని మీ అమ్మానాన్నలు చెప్పారు. అయితే, వాళ్లు అలా ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి. అంతసేపు ప్రయాణం చేయడం వాళ్లకు నచ్చట్లేదా? ఆ పార్టీనే వాళ్లకు నచ్చట్లేదా?

  •   అంతసేపు ప్రయాణమే సమస్య అయితే, చక్కగా డ్రైవింగ్‌ వచ్చిన ఒక మంచి ఫ్రెండ్‌తో కలిసి వెళ్తానని చెప్పి చూడండి.

  •   పార్టీనే సమస్య అయితే, వాళ్లు మిమ్మల్ని దానికి ధైర్యంగా పంపించేలా ఎవరెవరు వస్తున్నారో, పెద్దవాళ్లు ఎవరు ఉంటారో చెప్పి చూడండి.

 గౌరవంగా మాట్లాడడం మర్చిపోకండి, మీ అమ్మానాన్నలు ఏం చెప్తున్నారో ఓపిగ్గా వినండి. మీరు మీ ‘తండ్రిని తల్లిని సన్మానిస్తున్నారని’ మీ మాటల్లో, మీ ప్రవర్తనలో చూపించండి. (ఎఫెసీయులు 6:​2, 3) వాళ్లు మీకు కాస్త స్వేచ్ఛ ఇస్తారా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఏదేమైనా . . .

 మీ అమ్మానాన్నల నిర్ణయాన్ని గౌరవించండి. చాలామంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు, కానీ ఇది నిజంగా చాలా ముఖ్యమైంది. మీరు అనుకున్నది జరగనప్పుడు, మీరు మీ అమ్మానాన్నలతో వాదించడం మొదలుపెడితే, మళ్లీ ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీకే కష్టంగా ఉంటుంది. అలా కాకుండా మీరు మర్యాదగా ప్రవర్తిస్తూ వాళ్లు చెప్పినదానికి ఒప్పుకుంటే, వాళ్లు కాస్త స్వేచ్ఛ ఇవ్వవచ్చు.