కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నాకు ఎవరైనా సలహా ఇస్తే ఎలా స్పందించాలి?

నాకు ఎవరైనా సలహా ఇస్తే ఎలా స్పందించాలి?

 మిమ్మల్ని పరిశీలించుకోండి

 కొన్నిసార్లు మనందరికీ వేరేవాళ్ల సలహా అవసరం. అలాంటి సలహాలు మన పనిని లేదా ప్రవర్తనను మార్చుకోవడానికి సహాయం చేస్తాయి. దాన్ని మనసులో ఉంచుకుని ఈ కింది సన్నివేశాల గురించి ఆలోచించండి.

  1.  మీరు స్కూల్‌ ప్రాజెక్ట్‌ను సరిగ్గా చేయలేదని మీ టీచర్‌ చెప్పారు. “నువ్వు కొంచెం టైం తీసుకుని రీసర్చ్‌ చేయాలి” అని ఆయన సలహా ఇచ్చారు.

     మీకు ఇచ్చిన సలహాకు ఎలా స్పందిస్తారు?

    1.   వినను. (‘టీచర్‌కు నేనంటే ఇష్టం లేదు.’)

    2.   వింటాను. (‘ఈసారి ప్రాజెక్ట్‌ చేస్తున్నప్పుడు టీచర్‌ చెప్పినట్టు చేస్తాను.’)

  2.  మీ రూమ్‌ని కాసేపటి క్రితమే శుభ్రం చేశారు, కానీ మీ అమ్మ వచ్చి మీ రూమ్‌ చిందరవందరగా ఉంది, శుభ్రంగా పెట్టుకోమని చెప్పింది.

     మీకు ఇచ్చిన సలహాకు ఎలా స్పందిస్తారు?

    1.   వినను. (‘నేనేం చేసినా అమ్మకు నచ్చదు.’)

    2.   వింటాను. (‘అవును, రూమ్‌ని ఇంకాస్త శుభ్రంగా పెట్టుకోవాలి.’)

  3.  ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని మీరు తన మీద పెత్తనం చేయడం తనకు నచ్చలేదని మీ చెల్లి మీతో చెప్పింది.

     మీకు ఇచ్చిన సలహాకు ఎలా స్పందిస్తారు?

    1.   వినను. (‘నాకు చెప్పే ముందు తను ఎలా ఉందో చూసుకోవాలి.’)

    2.   వింటాను. (‘నిజమే, నేను తనతో అలా ప్రవర్తించకూడదు.’)

 కొంతమంది యౌవనుల మనసు ఎంత సున్నితంగా ఉంటుందంటే, చిన్న సలహాకు కూడా చాలా బాధపడిపోతారు. మీరు కూడా అలాంటివాళ్లేనా? అలాగైతే, మీరు జీవితంలో చాలా కోల్పోతున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? వేరేవాళ్లు ఇచ్చిన సలహాను తీసుకోవడం మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడే కాదు, పెద్దయ్యాక కూడా ఉపయోగపడుతుంది.

మీలో ఉన్న లోపాల గురించి వినడం మీకు ఇష్టం లేకపోవచ్చు, అంతమాత్రాన వాటిని వినడం అనవసరమని అనుకోకండి

 నాకు వేరేవాళ్ల సలహా ఎందుకు అవసరం?

  •   ఎందుకంటే మీరు పరిపూర్ణులు కారు. బైబిలు ఇలా చెప్తుంది: “మనందరం తరచూ పొరపాట్లు చేస్తుంటాం.” (యాకోబు 3:2) అందుకే మనలో ప్రతీఒక్కరికి వేరేవాళ్ల సలహా అవసరం.

     “మనందరం అపరిపూర్ణులం అనీ, పొరపాట్లు జరగడం మామూలు విషయం అనీ గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. అందుకే నాకెవరైనా సలహా ఇచ్చినప్పుడు దాన్ని తీసుకుంటాను, ఇంకోసారి ఆ పొరపాటు చేయకుండా ఉంటాను.”డేవిడ్‌.

  •   ఎందుకంటే మీరు ఇంకా మంచిగా అవ్వగలరు. బైబిలు ఇలా చెప్తుంది: “తెలివిగలవాడికి ఉపదేశం ఇవ్వు, అతను ఇంకా తెలివిగలవాడు అవుతాడు.” (సామెతలు 9:9) వేరేవాళ్లు ఇచ్చే సలహాను వింటే మీకు ప్రయోజనం కలుగుతుంది.

     “నాకొక తప్పుడు అభిప్రాయం ఉండేది, ఎవరైనా నాకు సలహా ఇచ్చారంటే నా పేరు పాడౌతుంది అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు సలహాను అంగీకరించడం నేర్చుకున్నాను, కొన్నిసార్లు నేనే అడుగుతుంటాను. నేనింకా ఎలా మెరుగవ్వవచ్చో తెలుసుకోవాలని ఉంది.”—సెలీనా.

 మనమే అడిగి సలహా తీసుకుంటే ఏమనిపించదు. కానీ మనం అడగకుండా ఎవరైనా సలహా ఇస్తే మనకు నచ్చకపోవచ్చు. నాటలీ అనే అమ్మాయికి ఒకరు కార్డు పంపించారు. అందులో ఆమె మార్చుకోవాల్సిన ఒక విషయం గురించి రాసివుంది. అది చూసినప్పుడు ఆమెకు ఎలా అనిపించిందో వివరిస్తూ నాటలీ ఇలా అంది: “నాకు భయంగా, నిరుత్సాహంగా అనిపించింది. అప్పటికే మారడానికి చాలా ప్రయత్నిస్తున్నాను, అందుకు మెచ్చుకోకపోగా నాలో లోపాల్ని వేలెత్తి చూపించారు.”

 అలా మీకెప్పుడైనా జరిగిందా? జరిగితే మీరేం చేయవచ్చు?

 నాకు ఇచ్చిన సలహాను అంగీకరించాలంటే ఏం చేయాలి?

  •   వినండి.

     బైబిలు ఇలా చెప్తుంది: “జ్ఞానం గలవాడు తన మాటల్ని అదుపులో ఉంచుకుంటాడు, వివేచన గలవాడు ప్రశాంతంగా ఉంటాడు.” (సామెతలు 17:27) ఒకరు మీకు ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ల మాటలకు అడ్డుపడకండి. వెంటనే కోప్పడి, వాళ్లను ఏదోకటి అనేసి ఆ తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోకండి.

     “నాకొక అలవాటు ఉంది, నేను చేసిన పొరపాటు గురించి ఎవరైనా చెప్తే వెంటనే నన్ను నేను సమర్థించుకుంటాను. కానీ అలా చేయకూడదు. వాళ్లు చెప్తున్న దానిగురించి ఆలోచించి, ఇంకోసారి ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్తపడాలి.”—శారా.

  •   చెప్తున్న విషయాన్ని చూడండి, వ్యక్తిని కాదు.

     మీకు సలహా ఇస్తున్న వ్యక్తిలో కూడా లోపాలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు, వాటిని వేలెత్తి చూపించాలని అనిపించవచ్చు. కానీ బైబిలు ఇస్తున్న ఈ సలహా పాటించడం చాలా మంచిది: “వినడానికి త్వరపడాలి, మాట్లాడడానికి తొందరపడకూడదు, త్వరగా కోపం తెచ్చుకోకూడదు.” (యాకోబు 1:19) మీరు ఏదైనా విషయంలో మారాలని ఒకరు చెప్తున్నారంటే, అందులో ఎంతోకొంత నిజం ఉంటుంది. మీలో ఉన్న లోపాల గురించి వినడం మీకు ఇష్టం లేకపోవచ్చు, అంతమాత్రాన వాటిని వినడం అనవసరమని అనుకోకండి.

     “మా అమ్మానాన్నలు నాకు ఏదైనా చెప్తే కోపం వచ్చేది. వాళ్లు చెప్తున్నది వినకుండా ‘నాకు తెలుసులే మీరేం చెప్పక్కర్లేదు’ అనేవాడిని. కానీ అసలు వాళ్లేం చెప్తున్నారో విని, దాని ప్రకారం చేశాక వాళ్లు చెప్పేది కరెక్టే అని అర్థమైంది.”ఎడ్వర్డ్‌.

  •   మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోండి.

     మీకు ఒకరు సలహా ఇచ్చారంటే మీరు జీవితంలో ఓడిపోయినట్టు కాదు. అందరిలాగే మీలో కూడా లోపాలు ఉన్నాయని దానర్థం. అంతెందుకు, మీకు సలహా ఇస్తున్న వ్యక్తికి కూడా అప్పుడప్పుడు మరొకరి సలహా అవసరమౌతుంది. నిజానికి బైబిలు ఇలా చెప్తుంది: “అస్సలు పాపం చేయకుండా ఎప్పుడూ మంచి చేసే నీతిమంతుడు భూమ్మీద ఒక్కడూ లేడు.”—ప్రసంగి 7:20

     “నా ఫ్రెండ్‌ నాకొక సలహా ఇచ్చింది. కానీ నాకది అవసరం అనిపించలేదు. నిజాయితీగా మాట్లాడినందుకు నా ఫ్రెండ్‌కి థ్యాంక్స్‌ చెప్పాను గానీ, మనసులో మాత్రం బాధపడ్డాను. కానీ తను చెప్పింది నిజమేనని కొన్నిరోజులు గడిచాక అర్థమైంది. తను ఆ సలహా ఇవ్వడం వల్లే నేను మారగలిగాను.”సోఫియా.

  •   మారాలనే లక్ష్యం పెట్టుకోండి.

     “వివేకం గలవాడు దిద్దుబాటును స్వీకరిస్తాడు” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 15:5) మీరు సలహాను స్వీకరిస్తే, బాధపడడం మానేసి, మీకు ఇచ్చిన సలహా ప్రకారం మార్పులు చేసుకోవడంలో బిజీగా ఉంటారు. ముందు, మార్పులు చేసుకోవడానికి ఏం చేయాలో ఆలోచించండి. తర్వాత, ఎంతవరకు ప్రగతి సాధిస్తున్నారో గమనించుకుంటూ ఉండండి.

     “సలహాను తీసుకోవడం అనేది మన నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పొరపాట్లను ఒప్పుకోవాలన్నా, క్షమాపణ అడగాలన్నా, మార్చుకోవాలన్నా మనలో నిజాయితీ ఉండాలి.”ఎమ్మా.

 ఒక్కమాటలో: బైబిలు ఇలా చెప్తుంది: “ఇనుము ఇనుమువల్ల పదును అవుతుంది. అలాగే మనిషి సాటి మనిషివల్ల చురుకైనవాడు అవుతాడు.” (సామెతలు 27:17, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మంచి సలహాలు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకోవడానికి సహాయం చేస్తాయి. అలాంటి సలహాలు ఇప్పుడే కాదు, మీరు పెద్దవాళ్లయ్యాక కూడా ఉపయోగపడతాయి.