కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

మర్యాదగా ప్రవర్తించడం నిజంగా అవసరమా?

మర్యాదగా ప్రవర్తించడం నిజంగా అవసరమా?

‘నా కోసం ఎవ్వరూ తలుపులు తెరవరు. మరి నేనెందుకు వాళ్ల కోసం తెరవాలి?’

‘ప్లీజ్‌,’ ‘థాంక్యూ,’ ‘ఎస్క్యూస్‌ మీ’ చెప్పడం తప్ప నాకు ఇంకేం పని లేదా?

‘మేం అంతా ఒక కుటుంబం. మా ఇంట్లో వాళ్లతో కూడా మర్యాదగా ఉండడం అవసరమా?’

పైన చదివిన మాటల్లో ఏవైనా మీరు మాట్లాడే మాటల్లా ఉన్నాయా? అయితే మర్యాదగా ప్రవర్తించడం వల్ల వచ్చే మంచి ఫలితాలు మీరు కోల్పోతున్నారేమో!

 మర్యాదగా ఎందుకు ప్రవర్తించాలి?

 మర్యాదగా ప్రవర్తించడం వల్ల మీ జీవితంలోని మూడు విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు:

  1.   మీ పేరు. మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు అనేదాన్నిబట్టి ఇతరులకు మీమీద మంచి లేదా చెడు అభిప్రాయం ఏర్పడవచ్చు. మీరు మర్యాదగా ప్రవర్తిస్తే, మీరు ఎంతో ఎదిగారని, బాధ్యతగా ప్రవర్తిస్తున్నారని అనుకుంటారు. దాన్ని మనసులో ఉంచుకొని మీతో ప్రవర్తిస్తారు! అదే మీరు కటువుగా ప్రవర్తిస్తే, మీ గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తారని, ఇతరులంటే పట్టింపు లేదని అనుకుంటారు. దానివల్ల మీకు వెంటనే ఉద్యోగం దొరక్కపోవచ్చు. ఇతర అవకాశాలను కూడా మీరు కోల్పోవచ్చు. “క్రూరుడు తన శరీరమునకు బాధ” లేదా అవమానం కొనితెచ్చుకుంటాడని బైబిలు చెబుతోంది.—సామెతలు 11:17.

  2.   “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి” అని బైబిలు చెబుతోంది. (కొలొస్సయులు 3:14) స్నేహం విషయంలో ఈ మాటలు ముమ్మాటికీ నిజం. మర్యాదగా నడుచుకునేవాళ్లను, తమకు మర్యాద ఇచ్చేవాళ్లను ప్రజలు ఇష్టపడతారు. కటువుగా లేదా అసహ్యకరంగా ప్రవర్తించేవాళ్లతో ఉండాలని ఎవరైనా కోరుకుంటారా?

  3.   ఇతరులు మీతో ప్రవర్తించే తీరు. “మీరు ఎప్పుడూ మర్యాదగా నడుచుకుంటే, కొంతకాలానికి సాధారణంగా కటువుగా ప్రవర్తించేవాళ్లు కూడా కాస్త మెత్తబడతారని, మీతో వాళ్లు వ్యవహరించే తీరు మెరుగౌతుందని గమనిస్తారు” అని జెన్నిఫ అనే యువతి చెప్పింది. ఒకవేళ, మీరు కటువుగా ప్రవర్తిస్తే వాళ్లు మెత్తబడే అవకాశం ఉండదు. “మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును” అని బైబిలు చెబుతోంది.—మత్తయి 7:2

 గుర్తుంచుకోవాల్సిన విషయం: మనం రోజూ ఎంతోమందిని కలుస్తుంటాం. మనం వాళ్లతో ఎలా వ్యవహరిస్తున్నామో వాళ్లు గమనిస్తారు. దాన్నిబట్టే వాళ్లకు మనమీద ఒక అభిప్రాయం ఏర్పడి, మనతో అలాగే వ్యవహరిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు మర్యాదగా ప్రవర్తించడం ఎంతో అవసరం!

 ఎలా మెరుగవ్వాలి?

  1.   మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆలోచించండి. ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘నేను పెద్దవాళ్లతో మర్యాదగా మాట్లాడతానా? నేను “ప్లీజ్‌,” “థాంక్యూ,” “ఎస్క్యూస్‌ మీ” లాంటి పదాలు ఎన్నిసార్లు వాడుతుంటాను? ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నా ధ్యాస పక్కకు మళ్లుతుందా? నేను ఆ సమయంలో మెస్సేజ్లు చదువుతూ లేదా జవాబిస్తూ ఉంటానా? నేను తల్లిదండ్రులతో, తోబుట్టువులతో మర్యాదగా ప్రవర్తిస్తానా లేదా “ఇంటివాళ్లే కదా” అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తానా?’

     బైబిలు ఇలా చెబుతోంది: “ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.”—రోమీయులు 12:10.

  2.   లక్ష్యాలు పెట్టుకోండి: మీరు మెరుగవ్వాల్సిన మూడు విషయాలను రాసుకోండి. ఉదాహరణకు, 15 ఏళ్ల ఆలస, “నేను మాటలు తగ్గించి అవతలి వ్యక్తి చెప్పేది బాగా వినడం నేర్చుకోవాలి” అంటోంది. 19 ఏళ్ల డేవి, ఇంటివాళ్లతో, స్నేహితులతో ఉన్నప్పుడు మెస్సేజ్లు పంపించడం మానేయాలని అనుకుంటున్నాడు. “అలా మెస్సేజ్లు పంపించడం మర్యాద కాదు. అలా చేస్తే వాళ్లతో మాట్లాడడం కన్నా వేరేవాళ్లతో మాట్లాడడం ఇష్టమని చెప్పినట్లు అవుతుంది” అని ఆయన అన్నాడు. 17 ఏళ్ల ఎడ్వర్డ్‌ అయితే, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుతగిలే అలవాటును మానుకోవాలని అనుకున్నాడు. పెద్దవాళ్లతో తాను ప్రవర్తిస్తున్న తీరును మెరుగుచేసుకోవాలని జెన్నిఫ నిశ్చయించుకుంది. “చెప్పాలి కదా అన్నట్టు ‘హలో’ చెప్పి ఏదో పనున్నట్లు నా వయసువాళ్ల దగ్గరికి వెళ్లేదాన్ని. అయితే, ఇప్పుడు పెద్దవాళ్లతో పరిచయం పెంచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను. దానివల్ల నా ప్రవర్తనలో కూడా ఎంతో మార్పు వచ్చింది!” అని ఆమె అంటోంది.

     బైబిలు ఇలా చెబుతోంది: “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.”—ఫిలిప్పీయులు 2:4.

  3.   మీరు ఎంత ప్రగతి సాధించారో చూసుకుంటూ ఉండండి. మీరు మెరుగుపడాలని అనుకున్న అంశాల్లో మీ మాట, మీ ప్రవర్తన ఎలా ఉందో ఒక నెలరోజులపాటు చూడండి. నెల చివర్లో, ‘నేను మర్యాదగా నడుచుకోవడం వల్ల నేనెలా మంచి వ్యక్తిగా తయారయ్యాను? నేను ఏయే విషయాల్లో ఇంకా మెరుగవ్వాలి?’ అని ప్రశ్నించుకోండి. వాటి జవాబులనుబట్టి కొత్త లక్ష్యాలు పెట్టుకోండి.

     బైబిలు ఇలా చెబుతోంది: “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.”—లూకా 6:31.