ఆదికాండం 19:1-38

  • దేవదూతలు లోతును సందర్శించడం (1-11)

  • లోతును, అతని కుటుంబాన్ని ​త్వరపెట్టడం (12-22)

  • సొదొమ, గొమొర్రాల నాశనం (23-29)

    • లోతు భార్య ఉప్పు స్తంభం అవ్వడం (26)

  • లోతు, అతని కూతుళ్లు (30-38)

    • మోయాబీయుల, అమ్మోనీయుల ఆరంభం (37, 38)

19  సాయంకాలానికల్లా ఆ ఇద్దరు దేవదూతలు సొదొమకు చేరుకున్నారు, అప్పుడు లోతు సొదొమ నగర ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. లోతు వాళ్లను చూసినప్పుడు లేచి, వాళ్లను కలవడానికి వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేశాడు.+  అతను వాళ్లతో ఇలా అన్నాడు: “నా ప్రభువులారా, దయచేసి మీ సేవకుని ఇంటికి వచ్చి ఈ రాత్రి అక్కడే బస చేయండి, మీ పాదాల్ని కడగనివ్వండి. ఆ తర్వాత తెల్లవారుజామునే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” దానికి వాళ్లు, “లేదు, మేము ఈ రాత్రి వీధిలోనే ఉంటాం” అన్నారు.  కానీ లోతు చాలా పట్టుబట్టడంతో వాళ్లు అతని ఇంటికి వెళ్లారు. అతను వాళ్లకు విందు ఏర్పాటు చేసి, పులవని రొట్టెలు కాల్చాడు, వాళ్లు తిన్నారు.  వాళ్లు పడుకోకముందు, సొదొమ నగరంలోని పురుషులంతా అంటే పిల్లవాడి నుండి ముసలివాడి వరకు అందరూ మూకుమ్మడిగా వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారు.  వాళ్లు లోతును పిలుస్తూ, “ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన మనుషులు ఏరి? వాళ్లను బయటికి తీసుకురా, మేము వాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకోవాలి” అన్నారు.+  అప్పుడు లోతు బయటికి వచ్చి ఇంటి తలుపు వేసేశాడు.  అతను వాళ్లతో ఇలా అన్నాడు: “నా సహోదరులారా, దయచేసి చెడుగా ప్రవర్తించకండి.  దయచేసి నా మాట వినండి, నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు, వాళ్లు కన్యలు. వాళ్లను బయటికి తీసుకొస్తాను, వాళ్లతో మీకు ఇష్టమొచ్చినట్టు చేయండి. కానీ ఈ మనుషులు నా నీడన చేరారు కాబట్టి వాళ్లను ఏమీ చేయకండి.”+  దానికి వాళ్లు అతనితో, “నువ్వు పక్కకు తప్పుకో!” అని, “ఈ ఏకాకి పరదేశిగా నివసించడానికి ఇక్కడికి వచ్చాడు. అయినా మనకే తీర్పు తీర్చడానికి తెగిస్తున్నాడు! మేము నీకిప్పుడు వాళ్లకు చేయాలనుకున్న దానికన్నా ఎక్కువ చెడు చేస్తాం” అన్నారు. వాళ్లు గుంపుగా లోతు మీదికి ఎగబడి, అతన్ని నెట్టుకుంటూ తలుపు బద్దలుగొట్టడానికి ప్రయత్నించారు. 10  అప్పుడు లోతు ఇంట్లో ఉన్న మనుషులు తమ చేతులు చాపి లోతును లోపలికి లాగి తలుపు వేసేశారు. 11  అయితే వాళ్లు గుమ్మం దగ్గరున్న పురుషులకు, అంటే చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ గుడ్డితనం కలగజేశారు. దాంతో బయట ఉన్నవాళ్లు తలుపు ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ప్రయత్నించీ ప్రయత్నించీ అలసిపోయారు. 12  ఆ తర్వాత, లోతు ఇంట్లో ఉన్న ఇద్దరు మనుషులు అతనితో ఇలా అన్నారు: “ఇక్కడ నీవాళ్లు ఇంకెవరైనా ఉన్నారా? అల్లుళ్లు, కుమారులు, కూతుళ్లు, నీవాళ్లు ఇంకెవరైనా ఈ నగరంలో ఉంటే వాళ్లందర్నీ ఈ చోటు నుండి బయటికి తీసుకెళ్లు! 13  ఎందుకంటే మేము ఈ నగరాన్ని నాశనం చేయబోతున్నాం. యెహోవా ముందు వీళ్ల గురించిన మొర చాలా బిగ్గరగా వినిపిస్తోంది,+ అందుకే ఈ నగరాన్ని నాశనం చేయడానికి యెహోవా మమ్మల్ని పంపించాడు.” 14  కాబట్టి లోతు బయటికి వెళ్లి, తనకు కాబోయే అల్లుళ్లతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అతను వాళ్లతో, “లెండి! ఈ చోటు నుండి బయటికి వచ్చేయండి. ఎందుకంటే యెహోవా ఈ నగరాన్ని నాశనం చేస్తాడు!” అని అంటూ ఉన్నాడు. కానీ అతను చెప్పేది అతని అల్లుళ్లకు నవ్వులాటలా అనిపించింది.+ 15  తెల్లవారుతున్నప్పుడు ఆ దేవదూతలు లోతును తొందరపెడుతూ, “లే! ఈ నగర పాపంలో మీరు కూడా కొట్టుకొనిపోకుండా ఉండేలా నీ భార్యను, ఇద్దరు కూతుళ్లను తీసుకొని వెళ్లు!” అన్నారు.+ 16  లోతు ఆలస్యం చేస్తుండడంతో, అతని మీద యెహోవాకు ఉన్న కనికరం వల్ల,+ ఆ దేవదూతలు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కూతుళ్ల చేతుల్ని పట్టుకొని వాళ్లను బయటికి తీసుకొచ్చి, నగరం బయట నిలబెట్టారు.+ 17  వాళ్లను నగర పొలిమేర్లకు తీసుకొచ్చిన వెంటనే, ఆ ఇద్దరు దూతల్లో ఒక దూత, “నీ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపో! వెనక్కి తిరిగి చూడకు,+ ఈ ప్రాంతంలో+ ఇంకెక్కడా ఆగకు! నువ్వు తుడిచిపెట్టబడకుండా ఉండేలా కొండ ప్రాంతానికి పారిపో!” అన్నాడు. 18  అప్పుడు లోతు వాళ్లతో ఇలా అన్నాడు: “యెహోవా, దయచేసి నన్ను అక్కడికి పంపించకు! 19  నీ సేవకుడు నీ అనుగ్రహం పొందాడు, నన్ను ప్రాణాలతో ఉంచడం+ ద్వారా నువ్వు నా మీద గొప్ప దయ* చూపిస్తున్నావు. కానీ నేను ఆ కొండ ప్రాంతానికి పారిపోలేను, ఎందుకంటే నేను పారిపోయేలోగా ఆ విపత్తు నా మీదికి కూడా వచ్చి చనిపోతానేమో అని భయంగా ఉంది.+ 20  ఈ పట్టణం దగ్గరగా ఉంది, నేను అక్కడికి పారిపోగలను; అది చిన్న పట్టణమే. దయచేసి, నేను అక్కడికి పారిపోవచ్చా? అది చిన్న పట్టణమే. అక్కడికి వెళ్తే నేను తప్పించుకోగలను.”* 21  అప్పుడు ఆ దూత అతనితో ఇలా అన్నాడు: “సరే, నేను నీ విన్నపాన్ని అంగీకరిస్తాను,+ నువ్వు చెప్తున్న ఆ పట్టణాన్ని నాశనం చేయను.+ 22  త్వరగా అక్కడికి పారిపో! ఎందుకంటే నువ్వు అక్కడికి చేరుకునే వరకు నేను ఏమీ చేయలేను!”+ అందుకే ఆ పట్టణానికి సోయరు*+ అనే పేరు వచ్చింది. 23  లోతు సోయరుకు చేరుకునేసరికల్లా సూర్యుడు ఉదయించాడు. 24  తర్వాత యెహోవా సొదొమ, గొమొర్రాల మీద అగ్నిగంధకాల్ని కురిపించాడు. అవి యెహోవా దగ్గర నుండి, ఆకాశం నుండి కురిశాయి.+ 25  ఆయన ఆ నగరాల్ని, ఆ ప్రాంతమంతటినీ, ఆ నగరాల్లో ఉన్న ప్రజలందర్నీ, మొక్కల్నీ నాశనం చేశాడు.+ 26  అయితే లోతు వెనకాలే వస్తున్న అతని భార్య మాత్రం వెనక్కి చూడడం మొదలుపెట్టింది, దాంతో ఆమె ఉప్పు స్తంభం అయ్యింది.+ 27  అబ్రాహాము తెల్లవారుజామునే లేచి, అంతకుముందు తాను యెహోవా ఎదుట నిలబడిన చోటికి వెళ్లాడు.+ 28  అతను కింది వైపు సొదొమను, గొమొర్రాను, ఆ ప్రాంతమంతటినీ చూసినప్పుడు, ఇదిగో! కొలిమిలో* నుండి లేచినట్టు ఆ ప్రాంతం నుండి దట్టమైన పొగ పైకి లేస్తోంది!+ 29  అలా దేవుడు ఆ ప్రాంతంలోని నగరాల్ని నాశనం చేసినప్పుడు అబ్రాహామును మనసులో ఉంచుకున్నాడు. ఎలాగంటే, దేవుడు తాను నాశనం చేసిన నగరాల నుండి, అంటే లోతు ఏ నగరాల్లోనైతే నివసిస్తున్నాడో వాటి నుండి అతన్ని బయటికి పంపించాడు.+ 30  ఆ తర్వాత లోతు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి సోయరు నుండి కొండ ప్రాంతానికి+ వెళ్లిపోయి అక్కడ నివసించడం మొదలుపెట్టాడు, ఎందుకంటే సోయరులో+ జీవించడానికి అతను భయపడ్డాడు. అలా అతను తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒక గుహలో నివసించడం మొదలుపెట్టాడు. 31  అప్పుడు పెద్ద కూతురు తన చెల్లితో ఇలా అంది: “మన తండ్రి ముసలివాడు. మనం అందరిలా పెళ్లి చేసుకోవడానికి ఈ ప్రాంతంలో ఒక్క పురుషుడు కూడా లేడు. 32  కాబట్టి, మన తండ్రికి ద్రాక్షారసం తాగించి, ఆ తర్వాత అతనితో పడుకొని మన తండ్రి ద్వారా వంశాన్ని నిలబెడదాం.” 33  కాబట్టి ఆ రాత్రి వాళ్లు తమ తండ్రికి ద్రాక్షారసం ఇస్తూనే ఉన్నారు; తర్వాత పెద్ద కూతురు లోపలికి వెళ్లి తన తండ్రితో పడుకుంది. కానీ ఆమె ఎప్పుడు పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్లిపోయిందో అతనికి తెలియలేదు. 34  ఆ తర్వాతి రోజు పెద్దామె తన చెల్లితో ఇలా అంది: “నిన్న రాత్రి నేను మన తండ్రితో పడుకున్నాను. ఈ రాత్రి కూడా అతనికి ద్రాక్షారసం ఇద్దాం. ఆ తర్వాత నువ్వు వెళ్లి అతనితో పడుకో. అలా మన తండ్రి ద్వారా వంశాన్ని నిలబెడదాం.” 35  కాబట్టి ఆ రాత్రి కూడా వాళ్లు తమ తండ్రికి అదేపనిగా ద్రాక్షారసం ఇస్తూ ఉన్నారు; ఆ తర్వాత చిన్న కూతురు వెళ్లి అతనితో పడుకుంది. కానీ ఆమె ఎప్పుడు పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్లిపోయిందో అతనికి తెలియలేదు. 36  అలా లోతు ఇద్దరు కూతుళ్లూ తమ తండ్రి ద్వారా గర్భవతులయ్యారు. 37  పెద్దామె ఒక కుమారుణ్ణి కని, అతనికి మోయాబు+ అని పేరు పెట్టింది. అతను నేటి మోయాబీయులకు+ తండ్రి. 38  చిన్నామె కూడా ఒక కుమారుణ్ణి కని, అతనికి బెన్నమ్మి అని పేరు పెట్టింది. అతను నేటి అమ్మోనీయులకు+ తండ్రి.

అధస్సూచీలు

లేదా “విశ్వసనీయ ప్రేమ.”
లేదా “నా ప్రాణాలు దక్కుతాయి.”
“చిన్న” అని అర్థం.
లేదా “బట్టీ.” ఇటుకలు, మట్టి పాత్రలు కాల్చడానికి ఉపయోగించే ఒక రకమైన పొయ్యి.