లూకా సువార్త 6:1-49

  • యేసు, “విశ్రాంతి రోజుకు ప్రభువు” (1-5)

  • చెయ్యి ఎండిపోయిన వ్యక్తి బాగవ్వడం (6-11)

  • 12 మంది అపొస్తలులు (12-16)

  • యేసు బోధించడం, బాగుచేయడం (17-19)

  • సంతోషాలు, శ్రమలు (20-26)

  • శత్రువుల మీద ప్రేమ (27-36)

  • తీర్పుతీర్చడం మానేయండి (37-42)

  • దాని పండ్లను బట్టి తెలుస్తుంది (43-45)

  • చక్కగా కట్టిన ఇల్లు; బలమైన పునాది లేని ఇల్లు (46-49)

6  విశ్రాంతి రోజున యేసు పంటచేలలో నుండి వెళ్తుండగా ఆయన శిష్యులు ధాన్యం వెన్నులు తుంచి,+ వాటిని చేతులతో నలుపుకొని తింటున్నారు.+  అప్పుడు కొంతమంది పరిసయ్యులు, “విశ్రాంతి రోజున చేయకూడని పనిని మీరెందుకు చేస్తున్నారు?” అని అన్నారు.+  దానికి యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “దావీదుకు, అతని మనుషులకు ఆకలేసినప్పుడు దావీదు ఏమి చేశాడో మీరు ఎప్పుడూ చదవలేదా?+  అతను దేవుని మందిరంలోకి వెళ్లి, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు తప్ప ఎవ్వరూ తినకూడని సముఖపు రొట్టెలు*+ తిని, తన మనుషులకు కూడా ఇచ్చాడని మీరు చదవలేదా?”  తర్వాత ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు.”+  ఇంకో విశ్రాంతి రోజున+ ఆయన సమాజమందిరంలోకి వెళ్లి బోధించడం మొదలుపెట్టాడు. అక్కడ, కుడిచెయ్యి ఎండిపోయిన* ఒక వ్యక్తి ఉన్నాడు.+  యేసు విశ్రాంతి రోజున ఎవరినైనా బాగుచేస్తే, ఆయన మీద నిందలు వేయాలని శాస్త్రులు, పరిసయ్యులు ఆయన్నే జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు.  అయితే వాళ్లు ఏమి ఆలోచిస్తున్నారో యేసుకు తెలుసు+ కాబట్టి ఆయన చెయ్యి ఎండిపోయిన* వ్యక్తితో, “లేచి, మధ్యలో నిలబడు” అన్నాడు. దాంతో అతను లేచి, మధ్యలో నిలబడ్డాడు.  తర్వాత యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మిమ్మల్ని ఒక మాట అడుగుతాను: విశ్రాంతి రోజున ఏమి చేయడం న్యాయం? మంచి చేయడమా, చెడు చేయడమా? ఏది ధర్మం? ప్రాణం కాపాడడమా, ప్రాణం తీయడమా?”+ 10  ఆయన వాళ్లందర్నీ ఒకసారి చూసి ఆ వ్యక్తితో, “నీ చెయ్యి చాపు” అన్నాడు. అతను చెయ్యి చాపాడు, అది బాగైంది. 11  అప్పుడు వాళ్లు కోపంతో వెర్రెత్తిపోయి, యేసును ఏంచేయాలా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. 12  ఒకరోజు యేసు ప్రార్థించడానికి కొండకు వెళ్లి,+ రాత్రంతా దేవునికి ప్రార్థిస్తూ గడిపాడు.+ 13  తెల్లవారినప్పుడు ఆయన తన శిష్యుల్ని తన దగ్గరికి పిలిచి, వాళ్లలో 12 మందిని ఎంచుకున్నాడు. ఆయన వాళ్లకు అపొస్తలులు* అనే పేరు కూడా పెట్టాడు. వాళ్లు ఎవరంటే:+ 14  సీమోను (యేసు ఇతనికి పేతురు అని పేరు పెట్టాడు), అతని సహోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, 15  మత్తయి, తోమా,+ అల్ఫయి కుమారుడు యాకోబు, “ఉత్సాహవంతుడు” అని పిలవబడిన సీమోను, 16  యాకోబు కుమారుడు యూదా, ఇస్కరియోతు యూదా. ఆ తర్వాత యేసుకు నమ్మకద్రోహం చేసింది ఇతనే. 17  తర్వాత ఆయన వాళ్లతోపాటు కొండ దిగి, సమంగా ఉన్న చోట నిలబడ్డాడు. అక్కడ ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు. అంతేకాదు ఆయన చెప్పేది వినాలని, తమ రోగాలు నయం చేసుకోవాలని యూదయ అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు-సీదోనుల తీరప్రాంతం నుండి వచ్చిన ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. 18  చివరికి అపవిత్ర దూతల* వల్ల పీడించబడినవాళ్లు కూడా బాగయ్యారు. 19  ఆయనలో నుండి శక్తి వెళ్లి+ వాళ్లందర్నీ బాగుచేస్తుండడంతో ప్రజలందరూ ఆయన్ని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 20  అప్పుడు ఆయన తల ఎత్తి తన శిష్యుల్ని చూస్తూ ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు: “పేదవాళ్లయిన మీరు సంతోషంగా ఉంటారు,* ఎందుకంటే దేవుని రాజ్యం మీదే.+ 21  “ఇప్పుడు ఆకలిగా ఉన్న మీరు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే మీరు తృప్తిపర్చబడతారు.+ “ఇప్పుడు ఏడుస్తున్న మీరు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే మీరు నవ్వుతారు.+ 22  “మానవ కుమారుణ్ణి బట్టి ప్రజలు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి,+ నిందించి, మీరు చెడ్డవాళ్లని అంటూ మీ పేరు పాడు చేసినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు.+ 23  ఆ రోజు సంతోషించండి, ఆనందంతో గంతులు వేయండి. ఎందుకంటే, పరలోకంలో మీకోసం గొప్ప బహుమానం వేచివుంది. వాళ్ల పూర్వీకులు ప్రవక్తల విషయంలో అలాగే చేసేవాళ్లు.+ 24  “కానీ ధనవంతులైన మీకు శ్రమ,+ ఎందుకంటే మీరు పొందబోయే సౌకర్యాలన్నీ ఇప్పటికే పొందేశారు.+ 25  “ఇప్పుడు తృప్తిగా ఉన్న మీకు శ్రమ, ఎందుకంటే మీరు ఆకలితో అలమటిస్తారు. “ఇప్పుడు నవ్వుతున్న మీకు శ్రమ, ఎందుకంటే మీరు దుఃఖిస్తారు, ఏడుస్తారు.+ 26  “మనుషులందరూ మీ గురించి మంచిగా మాట్లాడినప్పుడల్లా మీకు శ్రమ,+ ఎందుకంటే వాళ్ల పూర్వీకులు అబద్ధ ప్రవక్తల విషయంలో అలాగే చేశారు. 27  “అయితే నా మాటలు వింటున్న మీకు నేను చెప్పేది ఏమిటంటే, మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి; మిమ్మల్ని ద్వేషించేవాళ్లకు మంచి చేస్తూ ఉండండి.+ 28  మిమ్మల్ని శపించేవాళ్లను దీవిస్తూ ఉండండి, మిమ్మల్ని అవమానించేవాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉండండి.+ 29  మిమ్మల్ని ఒక చెంప మీద కొట్టే వాళ్లకు ఇంకో చెంప కూడా చూపించండి. మీ పైవస్త్రాన్ని లాగేసే వాళ్లకు మీ లోపలి వస్త్రాన్ని కూడా ఇచ్చేయండి.+ 30  మిమ్మల్ని అడిగే వాళ్లందరికీ ఇవ్వండి,+ మీకున్నవి తీసుకునేవాళ్లను తిరిగి ఇచ్చేయమని అడగకండి. 31  “అంతేకాదు, ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.+ 32  “మిమ్మల్ని ప్రేమించేవాళ్లనే మీరు ప్రేమిస్తే, అందులో మీ గొప్ప ఏముంది? పాపులు కూడా తమను ప్రేమించేవాళ్లను ప్రేమిస్తారు.+ 33  మీకు మంచి చేసేవాళ్లకే మీరు మంచి చేస్తే, అందులో మీ గొప్ప ఏముంది? పాపులు కూడా అలా చేస్తారు. 34  అంతేకాదు, తిరిగిస్తారని అనుకున్నవాళ్లకే మీరు అప్పు* ఇస్తే, అందులో మీ గొప్ప ఏముంది?+ తాము ఇచ్చినంత తిరిగి పొందాలని పాపులు కూడా పాపులకు అప్పు ఇస్తారు. 35  అయితే మీరు మీ శత్రువుల్ని ప్రేమిస్తూ, మంచి చేస్తూ, తిరిగి ఏమీ ఆశించకుండా అప్పు ఇస్తూ ఉండండి.+ అప్పుడు మీకోసం గొప్ప ప్రతిఫలం వేచివుంటుంది. మీరు సర్వోన్నతుని పిల్లలుగా ఉంటారు. ఎందుకంటే ఆయన కృతజ్ఞతలేని చెడ్డవాళ్ల మీద దయ చూపిస్తున్నాడు.+ 36  మీ తండ్రిలాగే మీరూ కరుణ చూపిస్తూ ఉండండి.+ 37  “అంతేకాదు, తీర్పు తీర్చడం ఆపేయండి, అప్పుడు మీకు అస్సలు తీర్పు తీర్చబడదు;+ విమర్శించడం మానేయండి, అప్పుడు మీరు అస్సలు విమర్శించబడరు. క్షమిస్తూ* ఉండండి, అప్పుడు మీరు క్షమించబడతారు.*+ 38  ఇవ్వడం అలవాటు చేసుకోండి, అప్పుడు ప్రజలు మీకు ఇస్తారు.+ వాళ్లు మంచి కొలతతో మీ ఒళ్లో పోస్తారు; వాటిని అదిమి, కుదిపి, పొర్లిపోయేంతగా పోస్తారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో, వాళ్లూ మీకు అదే కొలతతో కొలుస్తారు.” 39  తర్వాత ఆయన వాళ్లకు ఈ ఉదాహరణ* కూడా చెప్పాడు: “ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించగలడా? అలాచేస్తే ఇద్దరూ గుంటలో పడిపోతారు కదా?+ 40  విద్యార్థి* తన బోధకుడి కన్నా గొప్పవాడు కాడు. అయితే సంపూర్ణంగా శిక్షణ పొందిన ప్రతీ విద్యార్థి తన బోధకుడిలా ఉంటాడు. 41  మరైతే నువ్వు నీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించుకోకుండా నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును ఎందుకు చూస్తున్నావు?+ 42  నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా నీ సహోదరునితో, ‘సహోదరుడా, నన్ను నీ కంట్లో ఉన్న నలుసును తీసేయనివ్వు’ అని అతనితో ఎలా అంటావు? వేషధారీ! ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును ఎలా తీసేయాలో నీకు స్పష్టంగా కనిపిస్తుంది. 43  “ఏ మంచి చెట్టూ పనికిరాని పండ్లను ఇవ్వదు. అలాగే ఏ పనికిరాని చెట్టూ మంచి పండ్లను ఇవ్వదు.+ 44  చెట్టు ఏది అనేది దాని పండ్లను బట్టే తెలుస్తుంది.+ ఉదాహరణకు, ప్రజలు ముళ్లపొదల్లో అంజూర పండ్లను గానీ, ద్రాక్ష పండ్లను గానీ ఏరుకోరు. 45  మంచి వ్యక్తి తన హృదయమనే మంచి ఖజానాలో నుండి మంచివాటిని బయటికి తెస్తాడు. అయితే చెడ్డ వ్యక్తి తన చెడ్డ ఖజానాలో నుండి చెడ్డవాటిని బయటికి తెస్తాడు. ఎందుకంటే, హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది.+ 46  “మీరు నేను చెప్పేవి చేయకుండా, ‘ప్రభువా! ప్రభువా!’ అని నన్నెందుకు పిలుస్తున్నారు?+ 47  నా దగ్గరికి వచ్చి, నా మాటలు విని, వాటిని పాటించే ప్రతీ వ్యక్తి ఎలా ఉంటాడో నేను మీకు చెప్తాను.+ 48  అతను ఇల్లు కట్టడానికి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వ్యక్తిలా ఉంటాడు. వరద వచ్చినప్పుడు నదీ ప్రవాహం ఆ ఇంటిని కొట్టింది. అయితే ఆ ఇల్లు చక్కగా కట్టబడింది కాబట్టి ప్రవాహం దాన్ని కదిలించలేకపోయింది.+ 49  అయితే, నా మాటలు విని కూడా ఏమీ చేయని వ్యక్తి,+ పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తిలా ఉంటాడు. నదీ ప్రవాహం ఆ ఇంటిని కొట్టగానే అది కూలిపోయింది, పూర్తిగా నాశనమైపోయింది.”

అధస్సూచీలు

లేదా “సన్నిధి రొట్టెలు.”
లేదా “చచ్చుబడిన.”
లేదా “చచ్చుబడిన.”
పదకోశం చూడండి.
పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
అక్ష., “ధన్యులు.”
అంటే, వడ్డీ లేకుండా.
లేదా “వదిలేయబడతారు.”
లేదా “వదిలేస్తూ.”
లేదా “ఉపమానం.”
లేదా “శిష్యుడు.”