గలతీయులు 6:1-18

  • ఒకరి భారాలు ఒకరు మోయండి (1-10)

    • ఏమి విత్తుతామో అదే పంట కోస్తాం (7, 8)

  • సున్నతికి విలువలేదు (11-16)

    • కొత్త సృష్టి (15)

  • ముగింపు మాటలు (17, 18)

6  సహోదరులారా, ఒక వ్యక్తి తెలియక తప్పటడుగు వేసినా సరే, పరిణతిగల* మీరు సౌమ్యంగా+ అతన్ని సరైన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. అయితే, మీరు కూడా ప్రలోభానికి గురయ్యే ప్రమాదముందని+ గుర్తుంచుకొని మీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి.+  ఒకరి భారం ఒకరు మోసుకుంటూ,+ అలా క్రీస్తు నియమాన్ని పాటించండి.+  ఒక వ్యక్తి ఏమీ కాకపోయినా తాను గొప్పవాణ్ణని అనుకుంటే,+ అతను తనను తాను మోసం చేసుకుంటున్నాడు.  అయితే ప్రతీ వ్యక్తి తాను చేసే పనుల్ని పరిశీలించుకోవాలి,+ అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు.+ అప్పుడు, తాను చేసే పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.  ఎందుకంటే, ప్రతీ వ్యక్తి తన బరువు* తానే మోసుకోవాలి.+  అంతేకాదు, దేవుని వాక్యాన్ని నేర్చుకునేవాళ్లు,* తమకు దాన్ని నేర్పేవాళ్లతో* మంచి వాటన్నిటినీ పంచుకోవాలి.+  మోసపోకండి, దేవుణ్ణి వెక్కిరించలేం. ఎందుకంటే మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు;+  శరీర కోరికల ప్రకారం విత్తే వ్యక్తి, తన శరీరం నుండి నాశనం* అనే పంట కోస్తాడు. పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం విత్తే వ్యక్తి, పవిత్రశక్తి వల్ల శాశ్వత జీవితం అనే పంట కోస్తాడు.+  కాబట్టి మనం మానకుండా మంచిపనులు చేద్దాం; ఎందుకంటే, మనం అలసిపోకుండా ఉంటే* సరైన సమయంలో పంట కోస్తాం.+ 10  అందుకే మనకు అవకాశం* ఉన్నంతవరకు అందరికీ మంచి చేద్దాం, ముఖ్యంగా తోటి విశ్వాసులకు. 11  నేను నా స్వహస్తాలతో ఎంత పెద్దపెద్ద అక్షరాలతో ఈ ఉత్తరం రాశానో చూడండి. 12  మనుషుల్ని మెప్పించాలని* అనుకునేవాళ్లే మిమ్మల్ని సున్నతి చేయించుకోమని బలవంతపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. క్రీస్తు హింసాకొయ్య* గురించి ఎదురయ్యే హింసల్ని తప్పించుకోవడానికే వాళ్లు అలా చేస్తున్నారు. 13  నిజానికి సున్నతి చేయించుకుంటున్నవాళ్లు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించరు,+ అయితే సున్నతి చేయించుకునేలా మిమ్మల్ని ఒప్పించామని గొప్పలు చెప్పుకోవడానికే వాళ్లు మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటారు. 14  నేను మాత్రం, మన ప్రభువైన యేసుక్రీస్తు హింసాకొయ్య* విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ గొప్పలు చెప్పుకోను.+ ఆయన వల్ల నా దృష్టిలో లోకం, లోకం దృష్టిలో నేను చనిపోయాం.* 15  ఎందుకంటే సున్నతి చేయించుకోవడంలో గానీ చేయించుకోకపోవడంలో గానీ ఏమీలేదు;+ కానీ కొత్త సృష్టి అయ్యామా లేదా అన్నదే ముఖ్యం.+ 16  ఈ నియమం* ప్రకారం జీవించేవాళ్ల విషయానికొస్తే, వాళ్లమీద అంటే దేవుని ఇశ్రాయేలు+ మీద శాంతి, కరుణ ఉండాలి. 17  ఇకమీదట ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే నేను యేసు దాసుణ్ణని చూపించే ముద్రలు నా ఒంటి మీద ఉన్నాయి.+ 18  సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీరు చూపించే స్ఫూర్తికి తోడుండాలి. ఆమేన్‌.

అధస్సూచీలు

లేదా “ఆధ్యాత్మిక అర్హతలు గల.”
లేదా “బాధ్యత అనే బరువు.”
లేదా “ఉపదేశం పొందేవాళ్లు.”
లేదా “ఉపదేశించేవాళ్లతో.”
లేదా “కుళ్లు; క్షయం.”
లేదా “మానకుండా చేస్తే.”
అక్ష., “నియమిత సమయం.”
లేదా “పైకి మంచివాళ్లలా కనిపించాలని.”
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
లేదా “కొయ్య శిక్షకు గురయ్యాం.”
లేదా “ప్రవర్తనా నియమం.”