కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షుల నమ్మకాలు ఏమిటి?

యెహోవాసాక్షుల నమ్మకాలు ఏమిటి?

యెహోవాసాక్షులుగా మేము యేసు బోధించిన, ఆయన అపొస్తలులు పాటించిన క్రైస్తవ విధానాల్ని అనుసరించడానికి కృషి చేస్తాం. ఈ ఆర్టికల్‌ మా నమ్మకాలను క్లుప్తంగా చెబుతుంది.

  1. దేవుడు. మేము నిజమైన, సర్వశక్తిమంతుడైన ఒకే ఒక దేవుడిని, సృష్టికర్తను ఆరాధిస్తాం. ఆయన పేరు యెహోవా. (కీర్తన 83:18; ప్రకటన 4:10, 11) ఆయనే అబ్రాహాముకు, మోషేకు, యేసుకు కూడా దేవుడు.—నిర్గమకాండము 3:6; 32:11; యోహాను 20:17.

  2. బైబిలు. బైబిలు మనుషుల కోసం దేవుడు ఇచ్చిన సందేశమని మేము నమ్ముతాం. (యోహాను 17:17; 2 తిమోతి 3:16, 17) మా నమ్మకాలు మొత్తం 66 పుస్తకాల మీద, అంటే “పాత నిబంధన”, “కొత్త నిబంధన” రెండిటి మీద ఆధారపడి ఉంటాయి. ప్రొఫెసర్‌ జేసన్‌ డేవిడ్‌ బెడూన్‌ రాసిన మాటల్లో కూడా సరిగ్గా ఇదే విషయం కనిపిస్తుంది. యెహోవాసాక్షుల “నమ్మకాలు, ఆచారాలు బైబిలు నిజంగా చెప్పే విషయాలమీదే ఆధారపడివుంటాయి. అంతేగానీ తాము అనుకున్న విషయాన్నే బైబిలు చెప్పాలని వాళ్లు ముందుగా నిర్ణయించుకోరు” * అని ఆయన రాశారు.

    మేము మొత్తం బైబిలును నమ్ముతాం కానీ, అక్షరార్థంగా అనువదించిన బైబిలే సరైనదని వాదించేవాళ్లం కాదు (ఫండమెంటలిస్టులం కాదు). బైబిలులోని కొన్ని భాగాలు అలంకార భాషలో, సూచనల రూపంలో ఉన్నాయని వాటిని ఉన్నవున్నట్టుగా అర్థం చేసుకోకూడదని మా అభిప్రాయం.—ప్రకటన 1:1.

  3. యేసు. మేము యేసుక్రీస్తు బోధనలను, ఆదర్శాన్ని అనుసరిస్తాం. ఆయనను మా రక్షకునిగా, దేవుని కుమారునిగా ఘనపరుస్తాం. (మత్తయి 20:28; అపొస్తలుల కార్యములు 5:31) అందుకే, మేము క్రైస్తవులం. (అపొస్తలుల కార్యములు 11:26) అయితే, మేము బైబిలును పరిశీలించి, యేసు సర్వశక్తిగల దేవుడు కాదని, త్రిత్వ సిద్ధాంతానికి బైబిలులో ఎలాంటి ఆధారం లేదని తెలుసుకున్నాం.—యోహాను 14:28.

  4. దేవుని రాజ్యం. ఇది పరలోకంలో ఉండే ఒక నిజమైన ప్రభుత్వం, అంతేగానీ ఒక క్రైస్తవుని హృదయంలో ఉండే పరిస్థితి కాదు. అది ఈ భూమ్మీదున్న మనుషుల ప్రభుత్వాల్ని తీసేసి, దేవుని సంకల్పాన్ని భూమ్మీద నెరవేరుస్తుంది. (దానియేలు 2:44; మత్తయి 6:9, 10) దేవుని రాజ్యం ఆ పనులన్నీ త్వరలోనే చేస్తుంది, ఎందుకంటే, బైబిలు ప్రవచనాల ప్రకారం, మనం “అంత్యదినములలో” జీవిస్తున్నాం.—2 తిమోతి 3:1-5; మత్తయి 24:3-14.

    పరలోకంలో ఉన్న దేవుని రాజ్యానికి రాజు యేసు. ఆయన 1914లో పరిపాలన మొదలుపెట్టాడు.—ప్రకటన 11:15.

  5. రక్షణ. యేసు అర్పించిన విమోచన క్రయధన బలి వల్లే మనుషులకు పాపం, మరణం నుండి విడుదల సాధ్యమవుతుంది. (మత్తయి 20:28; అపొస్తలుల కార్యములు 4:12) ఆ బలి వల్ల ప్రయోజనం పొందాలంటే, ప్రజలు యేసు మీద విశ్వాసం ఉంచాలి, అంతేకాదు తమ జీవన విధానాన్ని మార్చుకుని బాప్తిస్మం పొందాలి. (మత్తయి 28:19, 20; యోహాను 3:16; అపొస్తలుల కార్యములు 3:19, 20) ఒక వ్యక్తి చేసే పనులే అతని విశ్వాసం నిజమైనదో కాదో నిరూపిస్తాయి. (యాకోబు 2:24, 26) అయినా, రక్షణ అనేది సంపాదించుకునేది కాదు, “దేవుని కృప” వల్ల అది మనకు లభిస్తుంది.—గలతీయులు 2:16, 21.

  6. పరలోకం. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు, నమ్మకమైన దేవదూతలు అందరూ అదృశ్య ప్రాణులు, వాళ్లు పరలోకంలో ఉంటారు. * (కీర్తన 103:19-21; అపొస్తలుల కార్యములు 7:55) యేసుతో పాటు పరలోకంలో రాజ్యపాలన చేయడానికి దేవుడు భూమ్మీద నుండి కొద్దిమందిని అంటే 1,44,000 మందిని మళ్లీ బ్రతికిస్తాడు.—దానియేలు 7:27; 2 తిమోతి 2:12; ప్రకటన 5:9, 10; 14:1, 3.

  7. భూమి. ఈ భూమి ఎప్పటికీ మనుషులకు ఇల్లుగా ఉండాలని, దేవుడు దీన్ని సృష్టించాడు. (కీర్తన 104:5; 115:16; ప్రసంగి 1:4) దేవుడు తన మాట వినే ప్రజలకు పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, అందమైన తోటలా ఉండే భూమ్మీద వాళ్లు నిత్యం జీవించేలా ఆశీర్వదిస్తాడు.—కీర్తన 37:11, 34.

  8. చెడుతనం, బాధ. ఒక దేవదూత దేవునికి ఎదురుతిరిగినప్పుడు ఇవి మొదలయ్యాయి. (యోహాను 8:44) అప్పటి నుండి ఆ దూతకు “సాతాను,” “అపవాది” అనే పేర్లు వచ్చాయి. ఆ దూత, మొదటి మానవ జంటను ఒప్పించి వాళ్లు కూడా తనతో కలిసేలా చేసుకున్నాడు. (ఆదికాండము 3:1-6; రోమీయులు 5:12) సాతాను తీసుకొచ్చిన వివాదాలను పరిష్కరించడానికి దేవుడు ఈ లోకంలో చెడుతనాన్ని, బాధను ఉండనిచ్చాడు. కానీ దేవుడు వాటిని శాశ్వతంగా కొనసాగనివ్వడు.

  9. మరణం. చనిపోయినవాళ్లు ఎక్కడా ఉండరు. (కీర్తన 146:4; ప్రసంగి 9:5, 10) వాళ్లేమీ నిత్యం యాతన పెట్టే నరకంలో బాధలు అనుభవించరు.

  10. కుటుంబం. పెళ్లికి సంబంధించి దేవుడు నియమించిన అసలు ప్రమాణం: ఒక పురుషుడు, ఒక స్త్రీతో కలిసి జీవించాలి; లైంగిక పాపం మాత్రమే విడాకులు తీసుకోవడానికి ఆధారం. దీనికి మేము కట్టుబడి ఉంటాం. (మత్తయి 19:4-9) కుటుంబాలు సంతోషంగా ఉండడానికి బైబిల్లోని జ్ఞానం సహాయం చేస్తుందని మేము నమ్ముతాం.—ఎఫెసీయులు 5:22–6:1.

  11. ఆరాధన. మేము సిలువను గానీ, ఏ విగ్రహాన్ని గానీ పూజించం. (ద్వితీయోపదేశకాండము 4:15-19; 1 యోహాను 5:21) మా ఆరాధనలో ముఖ్య విషయాలు:

  12. మా సంస్థ. మేము సంఘాలుగా సంస్థీకరించబడి ఉంటాం, ఒక్కో సంఘాన్ని ఒక సంఘపెద్దల సభ పర్యవేక్షిస్తుంది. అలాగని పెద్దలు మత నాయకుల ప్రత్యేక గుంపుగా ఏమీ ఉండరు, వాళ్లకు జీతాలు ఉండవు. (మత్తయి 10:8; 23:8) మేము దశమభాగం అనే ఆచారాన్ని పాటించం, మా కూటాల్లో చందాలు వసూలు చేయం. (2 కొరింథీయులు 9:7) పేరు తెలియకుండా వచ్చే విరాళాల ద్వారానే మా సంస్థ కార్యకలాపాలన్నీ జరుగుతాయి.

    మా ప్రధాన కార్యాలయంలో సేవచేసే కొద్దిమంది పరిణతిగల క్రైస్తవులతో ఏర్పడిన ‘పరిపాలక సభ’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులను నడిపిస్తుంది.—మత్తయి 24:45.

  13. మా ఐక్యత. విశ్వాసం విషయంలో మేము భూవ్యాప్తంగా ఐక్యంగా ఉన్నాం. (1 కొరింథీయులు 1:10) ప్రాంతీయ, కుల, జాతి, వర్గ భేదాలు లేకుండా ఐక్యంగా ఉండడానికి మేము తీవ్రంగా కృషి చేస్తాం. (అపొస్తలుల కార్యములు 10:34, 35; యాకోబు 2:4) మేమంతా ఐక్యంగా ఉన్నా ఎవరి నిర్ణయం వాళ్లే తీసుకునే అవకాశం మాకు ఉంది. ప్రతీ యెహోవాసాక్షి, బైబిలు శిక్షణ పొందిన తన మనస్సాక్షికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు.—రోమీయులు 14:1-4; హెబ్రీయులు 5:14.

  14. మా ప్రవర్తన. మేము చేసే ప్రతీ పనిలో నిస్వార్థమైన ప్రేమ చూపించడానికి కృషి చేస్తాం. (యోహాను 13:34, 35) రక్తం ఎక్కించుకోవడం లేదా ఇవ్వడం ద్వారా రక్తాన్ని తప్పుగా ఉపయోగించడం వంటి దేవునికి బాధ కలిగించే పనులు మేము చేయం. (అపొస్తలుల కార్యములు 15:28, 29; గలతీయులు 5:19-21) మేము శాంతికాముకులం, యుద్ధాల్లో పాల్గొనం. (మత్తయి 5:9; యెషయా 2:4) దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన నియమాలు పెట్టనంతవరకు, మేము నివసిస్తున్న దేశంలోని ప్రభుత్వాన్ని గౌరవిస్తాం, చట్టానికి లోబడతాం.—మత్తయి 22:21; అపొస్తలుల కార్యములు 5:29.

  15. ఇతరులతో మా సంబంధాలు. “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అని యేసు ఆజ్ఞాపించాడు. క్రైస్తవులు “లోకసంబంధులు కారు” అని కూడా ఆయన అన్నాడు. (మత్తయి 22:39; యోహాను 17:16) కాబట్టి, మేము ‘అందరికీ మేలు చేయడానికి’ ప్రయత్నిస్తాం. కానీ, రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉంటాం, వేరే మతాలతో సంబంధాలు పెట్టుకోం. (గలతీయులు 6:10; 2 కొరింథీయులు 6:14) అయినా ఇలాంటి విషయాల్లో ఎదుటివాళ్ల నిర్ణయాలను మేము గౌరవిస్తాం.—రోమీయులు 14:11, 12.

యెహోవాసాక్షుల నమ్మకాల గురించి మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే, మీరు మా వెబ్‌సైట్‌లో మరిన్ని విషయాలు చదవవచ్చు, మా ఆఫీసుల్లో ఒకదానిని కాంటాక్ట్‌ చేయవచ్చు, మీ దగ్గర్లోని ఒక రాజ్యమందిరంలో కూటానికి వెళ్లవచ్చు, మీ ప్రాంతంలో ఉండే ఒక యెహోవాసాక్షితో మాట్లాడవచ్చు.

^ పేరా 4 ట్రూత్‌ ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ అనే పుస్తకంలో 165వ పేజీ చూడండి.

^ పేరా 10 చెడ్డ దూతలను పరలోకం నుండి గెంటేశారు, అయినా వాళ్లు కూడా అదృశ్య ప్రాణులే.