కంటెంట్‌కు వెళ్లు

బైబిల్లోని సంఖ్యలకు అర్థమేంటి? న్యూమరాలజీ బైబిలు నుండి వచ్చిందా?

బైబిల్లోని సంఖ్యలకు అర్థమేంటి? న్యూమరాలజీ బైబిలు నుండి వచ్చిందా?

బైబిలు ఇచ్చే జవాబు

 సాధారణంగా బైబిల్లోని సంఖ్యలు అక్షరార్థమైనవి, అంటే వాటికి వేరే అర్థం ఉండదు. కొన్నిచోట్ల మాత్రం వాటిని సూచనగా ఉపయోగించారు. బైబిల్లోని ఒక సంఖ్య దేనికైనా సూచనగా ఉందో లేదో తెలుసుకోవడానికి లేఖన సందర్భం సహాయం చేస్తుంది. ఈ ఉదాహరణలు పరిశీలించి బైబిల్లో ఉన్న కొన్ని సంఖ్యలు వేటికి సూచనగా ఉన్నాయో తెలుసుకోండి.

  •   1 ఐక్యత. ఒకసారి యేసు తన అనుచరుల గురించి ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: ‘వారందరూ ఒక్కటిగా ఉండాలి. నేను నీలో, నీవు నాలో ఉన్న విధంగా వారు మాలో ఒక్కటిగా ఉండాలి.’—యోహాను 17:21, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం; మత్తయి 19:6.

  •   2 చట్టపరమైన విషయాల్లో ఒక విషయం నిజం అని తేల్చాలంటే, ఇద్దరి సాక్ష్యం అవసరం. (ద్వితీయోపదేశకాండము 17:6) అదేవిధంగా, ఒక దర్శనం రెండుసార్లు వచ్చినా లేదా ఒక మాటను రెండుసార్లు చెప్పినా, అది ఖచ్చితమైనదని, నిజమని అర్థం. ఉదాహరణకు, ఐగుప్తు రాజైన ఫరోకు వచ్చిన కలకు అర్థం చెప్తున్నప్పుడు యోసేపు ఇలా అన్నాడు: “దేవుడు ఇలా జరిగించడానికి నిశ్చయించుకొన్నాడు. ... ఈ కల ఫరోకు రెండు సార్లు రావడంలో భావం ఇదే.” (ఆదికాండము 41:32, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.) ప్రవచనాల విషయానికొస్తే, దానియేలు ప్రవక్త చెప్పిన ఒక ప్రవచనంలోని “రెండు కొమ్ములు” రెండు రాజ్యాల పరిపాలనకు అంటే, మాదీయ-పారసీక పరిపాలనకు సూచనగా ఉన్నాయి.—దానియేలు 8:20, 21; ప్రకటన 13:11.

  •   3 ముగ్గురి సాక్ష్యం, ఒక విషయం ఖచ్చితంగా నిజమైనదని తేల్చిచెప్పినట్టే, మూడుసార్లు చెప్పడం ఒక విషయాన్ని స్థిరపరుస్తుంది లేదా నొక్కిచెప్తుంది.—యెహెజ్కేలు 21:27; అపొస్తలుల కార్యాలు 10:9-16; ప్రకటన 4:8; 8:13.

  •   4 ఒక విషయం లేదా పని సంపూర్ణంగా నెరవేరడానికి సూచనగా నాలుగు ఉపయోగించబడింది. ఉదాహరణకు “భూమి నాలుగు గాలులు” అని అంటున్నప్పుడు, పని సంపూర్ణంగా జరుగుతుందని అర్థం.—ప్రకటన 7:1; 21:16; యెషయా 11:12.

  •   6 సాధారణంగా ఏడు సంపూర్ణతకు సూచన. ఏడు కన్నా ఆరు ఒక స్థానం తక్కువ కాబట్టి అది అసంపూర్ణతను లేదా అపరిపూర్ణతను లేదా దేవుని శత్రువులకు సంబంధించిన విషయాన్ని సూచిస్తుంది.—1 దినవృత్తాంతములు 20:6; దానియేలు 3:1; ప్రకటన 13:18.

  •   7 ఈ సంఖ్య తరచూ సంపూర్ణతను సూచిస్తుంది. ఉదాహరణకు, యెరికో చుట్టూ వరుసగా ఏడు రోజులు నడవమని, ఏడవ రోజున ఏడుసార్లు నడవమని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. (యెహోషువ 6:15) ఏడు అనే సంఖ్యను బైబిల్లో ఆ విధంగా చాలాసార్లు ఉపయోగించారు. (లేవీయకాండము 4:6; 25:8; 26:18; కీర్తన 119:164; ప్రకటన 1:20; 13:1; 17:10) తన సహోదరుణ్ణి క్షమించే విషయం గురించి యేసు పేతురుతో, “ఏడుసార్లు కాదు, 77 సార్లు” క్షమించమని చెప్పాడు. ఏడు అనే సంఖ్యను రెండుసార్లు ఉపయోగించడం, అపరిమితంగా క్షమించాలని సూచిస్తుంది.—మత్తయి 18:21, 22.

  •   10 ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా లేదా సమగ్రంగా తెలియజేయడాన్ని పది సూచిస్తుంది.—నిర్గమకాండము 34:28; లూకా 19:13; ప్రకటన 2:10.

  •   12 దేవుని ఏర్పాట్లలోని సంపూర్ణతను 12 సూచిస్తుంది. ఉదాహరణకు, పరలోకం గురించి యోహానుకు ఒక దర్శనం వచ్చింది. అందులో, “12 పునాదిరాళ్లు కూడా ఉన్నాయి. వాటిమీద గొర్రెపిల్ల 12 మంది అపొస్తలుల 12 పేర్లు ఉన్నాయి.” (ప్రకటన 21:14; ఆదికాండము 49:28) 12ను గుణించగా వచ్చే సంఖ్యలు కూడా అదే విషయాన్ని సూచిస్తాయి.—ప్రకటన 4:4; 7:4-8.

  •   40 ఈ సంఖ్య, చాలా తీర్పులకు లేదా శిక్షా సమయాలకు సంబంధించినది.—ఆదికాండము 7:4; యెహెజ్కేలు 29:11, 12.

న్యూమరాలజీ

 బైబిల్లోని సంఖ్యల్ని కొన్నిసార్లు వేరేవాటికి సూచనగా ఉపయోగించిన మాట వాస్తవమే. అయితే వాటికి న్యూమరాలజీతో (సంఖ్యాశాస్త్రంతో) సంబంధం లేదు. న్యూమరాలజీలో సంఖ్యలకు, సంఖ్యల కూడికలకు, వాటిని కలిపితే వచ్చే మొత్తానికి ఏదో మంత్రతంత్ర సంబంధమైన అర్థం ఉందని చెప్తారు. ఉదాహరణకు, కబాలిస్టులు అనే యూదుల తెగ వాళ్లు గెమట్రియ అనే ఒక పద్ధతిలో హీబ్రూ లేఖనాల్ని విశ్లేషించి బైబిల్లోని సంఖ్యల్లో ఏదో రహస్య కోడ్‌ను వెతికేవాళ్లు. న్యూమరాలజీ సోదె చెప్పడం లాంటిది, దేవుడు దాన్ని ఇష్టపడడు.—ద్వితీయోపదేశకాండము 18:10-12.