మత్తయి సువార్త 28:1-20

  • యేసు పునరుత్థానం అవ్వడం (1-10)

  • అబద్ధం చెప్పేలా సైనికులకు లంచం ఇవ్వడం (11-15)

  • శిష్యుల్ని చేయమనే ఆజ్ఞ (16-20)

28  విశ్రాంతి రోజు గడిచిపోయి, వారం మొదటి రోజు* తెల్లవారుతున్నప్పుడు మగ్దలేనే మరియ, ఇంకో మరియ సమాధిని చూడడానికి వచ్చారు.+  అప్పటికే అక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చింది! ఎందుకంటే యెహోవా* దూత పరలోకం నుండి వచ్చి సమాధికి అడ్డంగా ఉన్న రాయిని దొర్లించి, దాని మీద కూర్చున్నాడు.+  ఆ దూత మెరుపులా తళతళ మెరిసిపోతున్నాడు, అతని వస్త్రాలు మంచు అంత తెల్లగా ఉన్నాయి.+  కాపలా కాస్తున్న వాళ్లు అతనికి భయపడి వణికిపోయారు, వాళ్లు చచ్చినవాళ్లలా అయ్యారు.  దేవదూత ఆ స్త్రీలకు ఇలా చెప్పాడు: “భయపడకండి, కొయ్యపై మరణశిక్ష వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు.+  ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే+ ఆయన బ్రతికించబడ్డాడు. వచ్చి, ఆయన్ని ఉంచిన చోటును చూడండి.  త్వరగా వెళ్లి, ఆయన మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడని ఆయన శిష్యులకు చెప్పండి. అలాగే వాళ్లతో, ‘ఇదిగో! ఆయన మీకన్నా ముందు గలిలయకు వెళ్తున్నాడు.+ అక్కడ మీరు ఆయన్ని చూస్తారు’ అని చెప్పండి. మీకు ఈ విషయం చెప్పడానికే నేను వచ్చాను.”+  కాబట్టి వాళ్లు వెంటనే ఆ విషయం శిష్యులకు చెప్పడానికి భయంతో, ఎంతో సంతోషంతో పరుగెత్తుకుంటూ ఆ సమాధి* దగ్గర నుండి వెళ్లారు.+  అప్పుడు ఇదిగో! యేసు ఆ స్త్రీలను కలిసి పలకరించాడు. వాళ్లు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు వంగి నమస్కారం చేశారు. 10  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “భయపడకండి! మీరు వెళ్లి నా సహోదరుల్ని గలిలయకు రమ్మని చెప్పండి, అక్కడ వాళ్లు నన్ను చూస్తారు.” 11  ఆ స్త్రీలు వెళ్తుండగా, కాపలా ఉన్న సైనికుల్లో కొందరు+ నగరంలోకి వెళ్లి జరిగిన వాటన్నిటి గురించి ముఖ్య యాజకులకు చెప్పారు. 12  వాళ్లు పెద్దలతో సమావేశమై మాట్లాడుకున్న తర్వాత, ఆ సైనికులకు పెద్ద మొత్తంలో వెండి నాణేలు ఇచ్చి, 13  ఇలా అన్నారు: “ ‘రాత్రిపూట ఆయన శిష్యులు వచ్చి మేము నిద్రపోతున్నప్పుడు ఆయన్ని ఎత్తుకెళ్లిపోయారు’ అని చెప్పండి.+ 14  ఇది అధిపతి చెవిలో పడితే అతన్ని ఒప్పించే పూచీ మాది, మీరు కంగారుపడాల్సిన అవసరం ఉండదు.” 15  సైనికులు ఆ వెండి నాణేలు తీసుకొని వాళ్లు చెప్పినట్టే చేశారు. వాళ్లు చెప్పిన కథ యూదుల్లో బాగా వ్యాప్తిచెంది ఈ రోజు వరకు ప్రాచుర్యంలో ఉంది. 16  అయితే, ఆ 11 మంది శిష్యులు మాత్రం గలిలయలో+ యేసు తమను కలుస్తానని చెప్పిన కొండ దగ్గరికి వెళ్లారు.+ 17  ఆయన్ని చూసినప్పుడు వాళ్లు వంగి నమస్కారం చేశారు, కొందరు మాత్రం సందేహపడ్డారు. 18  యేసు వాళ్ల దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “పరలోకంలో, భూమ్మీద నాకు పూర్తి అధికారం ఇవ్వబడింది.+ 19  కాబట్టి, మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి;+ తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి;+ 20  నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.*+ ఇదిగో! ఈ వ్యవస్థ* ముగింపు+ వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.”

అధస్సూచీలు

అంటే, ఆదివారం. యూదులకు ఇది వారంలో మొదటి రోజు.
అనుబంధం A5 చూడండి.
లేదా “స్మారక సమాధి.”
లేదా “బోధించండి.”
లేదా “యుగం.” పదకోశం చూడండి.