యోహానుకు ఇచ్చిన ప్రకటన 5:1-14

  • ఏడు ముద్రలున్న గ్రంథపు చుట్ట (1-5)

  • గొర్రెపిల్ల గ్రంథపు చుట్టను తీసుకోవడం (6-8)

  • ముద్రలు విప్పడానికి గొర్రెపిల్ల అర్హుడు (9-14)

5  ఆ తర్వాత నేను, సింహాసనం మీద కూర్చున్న దేవుని కుడిచేతిలో ఒక గ్రంథపు చుట్ట ఉండడం చూశాను. అది రెండువైపులా* రాయబడి, ఏడు ముద్రలతో గట్టిగా ముద్రించబడి ఉంది.  అంతేకాదు, బలంగా ఉన్న ఒక దేవదూతను నేను చూశాను. అతను పెద్ద స్వరంతో, “గ్రంథపు చుట్ట మీదున్న ముద్రలు విప్పి దాన్ని తెరవడానికి ఎవరు అర్హులు?” అన్నాడు.  అయితే పరలోకంలో, భూమ్మీద, భూమికింద ఉన్నవాళ్లలో ఏ ఒక్కరూ ఆ గ్రంథపు చుట్టను తెరవలేకపోయారు, దానిలో ఏముందో చూడలేకపోయారు.  గ్రంథపు చుట్టను తెరవడానికి, దానిలో ఏముందో చూడడానికి అర్హులైనవాళ్లు ఎవరూ కనిపించకపోయేసరికి నేను చాలా ఏడ్చాను.  అయితే ఆ పెద్దల్లో ఒకతను నాతో ఇలా అన్నాడు: “ఏడ్వకు. ఇదిగో! యూదా గోత్రపు సింహం,+ దావీదు వేరు+ అయిన వ్యక్తి జయించాడు+ కాబట్టి గ్రంథపు చుట్టను, దాని ఏడు ముద్రల్ని విప్పడానికి ఆయన అర్హుడు.”  సింహాసనానికి దగ్గర్లో,* నాలుగు జీవుల మధ్యలో, ఆ పెద్దల మధ్యలో నేను ఒక గొర్రెపిల్లను+ చూశాను. అది వధించబడినట్టు ఉంది. దానికి ఏడు కొమ్ములు, ఏడు కళ్లు ఉన్నాయి. ఆ ఏడు కళ్లు, భూమంతటి మీదికి పంపించబడిన దేవుని ఏడు శక్తుల్ని సూచిస్తున్నాయి.  ఆయన* వెంటనే ముందుకొచ్చి, సింహాసనం మీద కూర్చున్న దేవుని+ కుడిచేతిలో నుండి ఆ గ్రంథపు చుట్టను తీసుకున్నాడు.  ఆయన గ్రంథపు చుట్టను తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు, 24 మంది పెద్దలు+ గొర్రెపిల్ల ముందు మోకరించారు. ఆ పెద్దలలో ప్రతీ ఒక్కరి దగ్గర ఒక వీణ,* ధూపంతో నిండిన ఒక బంగారు గిన్నె ఉన్నాయి. (ఆ ధూపం పవిత్రుల ప్రార్థనల్ని సూచిస్తుంది.)+  వాళ్లు ఒక కొత్త పాట పాడుతూ+ ఇలా అన్నారు: “గ్రంథపు చుట్టను తీసుకొని దాని ముద్రలు విప్పడానికి నువ్వు అర్హుడివి. ఎందుకంటే నువ్వు వధించబడి, నీ రక్తంతో ప్రతీ తెగకు, భాషకు, జాతికి, దేశానికి చెందినవాళ్లలో నుండి దేవుని కోసం ప్రజల్ని కొన్నావు;+ 10  మన దేవుణ్ణి సేవించడానికి వాళ్లను ఒక రాజ్యంగా,+ యాజకులుగా+ చేశావు. వాళ్లు రాజులుగా ఈ భూమిని పరిపాలిస్తారు.”+ 11  నేను సింహాసనం చుట్టూ, ఆ జీవుల చుట్టూ, పెద్దల చుట్టూ ఎంతోమంది దేవదూతలు ఉండడం చూశాను, వాళ్ల స్వరం విన్నాను. ఆ దేవదూతల సంఖ్య లక్షల్లో-కోట్లలో ఉంది.+ 12  వాళ్లు పెద్ద స్వరంతో ఇలా అంటూ ఉన్నారు: “వధించబడిన గొర్రెపిల్ల+ శక్తిని, ఐశ్వర్యాన్ని, తెలివిని, బలాన్ని, ఘనతను, మహిమను, స్తుతిని పొందడానికి అర్హుడు.”+ 13  పరలోకంలో, భూమ్మీద, భూమికింద, సముద్రం మీద ఉన్న ప్రతీ ప్రాణి,+ అవును వాటిలో ఉన్నవన్నీ, “సింహాసనం మీద కూర్చున్న దేవునికి, గొర్రెపిల్లకు+ యుగయుగాలు స్తుతి, ఘనత,+ మహిమ, శక్తి కలగాలి” అని అనడం నేను విన్నాను. 14  ఆ నాలుగు జీవులు, “ఆమేన్‌!” అంటూ ఉండగా ఆ పెద్దలు మోకరించి దేవుణ్ణి ఆరాధించారు.

అధస్సూచీలు

లేదా “లోపల, బయట.”
లేదా “మధ్యలో.”
లేదా “గొర్రెపిల్ల.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.