కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు యుద్ధాల్లో ఎందుకు పాల్గొనరు?

యెహోవాసాక్షులు యుద్ధాల్లో ఎందుకు పాల్గొనరు?

 యెహోవాసాక్షులు యుద్ధాల్లో పాల్గొనకపోవడానికి కారణాలు:

  1.   దేవునికి విధేయత. దేవుని సేవకులు తమ “ఖడ్గములను నాగటినక్కులుగా” చేసుకుంటారు, “యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక” మానివేస్తారు.—యెషయా 2:4.

  2.   యేసుకు విధేయత. అపొస్తలుడైన పేతురుకు యేసు ఇలా చెప్పాడు: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (మత్తయి 26:52) యుద్ధానికి సంబంధించిన ఆయుధాలను తన అనుచరులు ఉపయోగించరని యేసు చెబుతున్నాడు.

     యేసు శిష్యులు రాజకీయ విషయాల్లో పూర్తిగా తటస్థ వైఖరి చూపిస్తూ ‘లోకసంబంధులుగా’ ఉండకూడదనే ఆజ్ఞను పాటిస్తారు. (యోహాను 17:16) వారు ఎటువంటి సైనిక చర్యలను వ్యతిరేకించరు, అలాగే సైన్యంలో సేవచేసేవారి వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు.

  3.   ఇతరుల మీద ప్రేమ. “ఒకరినొకరు ప్రేమింపవలెను” అని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (యోహాను 13:34, 35) అందుకే వారు ఒక అంతర్జాతీయ సహోదర బృందంగా ఏర్పడతారు, అందులో ఏ ఒక్కరూ తన తోటి సహోదరునితో గానీ సహోదరితో గానీ ఎప్పటికీ యుద్ధం చేయరు.—1 యోహాను 3:10-12.

  4.   తొలి క్రైస్తవుల ఆదర్శం. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలీజియన్‌ అండ్‌ వార్‌ ఇలా చెబుతోంది: “యేసు బోధించిన నీతియుక్తమైన ప్రేమపూర్వక పాఠాలను, శత్రువుల్ని కూడా ప్రేమించమనే హితవులను” మనస్సులో ఉంచుకొని “తొలినాటి అనుచరులు యుద్ధం చేయడానికి, సైన్యంలో చేరడానికి నిరాకరించారు.” అలాగే, జర్మన్‌ మత బోధకుడైన పీటర్‌ మీన్‌హోల్డ్‌, యేసు తొలి అనుచరుల గురించి ఇలా అన్నాడు: “క్రైస్తవులు, సైన్యంలో పనిచేయడం తగదని భావించేవారు.”

సమాజానికి తోడ్పడతారు

 యెహోవాసాక్షులు సమాజంలో బాధ్యతగల వ్యక్తులుగా ఉంటారు. తాము నివసించే దేశంలో భద్రతకు ముప్పు వాటిల్లే ఏ పనీ చేయరు. మేము ఈ బైబిలు సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారాన్ని గౌరవిస్తాం:

  •   “పై అధికారులకు లోబడియుండవలెను.”—రోమీయులు 13:1.

  •   “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి.”—మత్తయి 22:21.

 కాబట్టి, మేము చట్టానికి లోబడతాం, పన్నులు కడతాం, ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపట్టే పనులకు సహకరిస్తాం.