కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షుల పనికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుంది?

యెహోవాసాక్షుల పనికి ఆర్థిక మద్దతు ఎలా లభిస్తుంది?

 యెహోవాసాక్షులు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాల సహాయంతోనే మా ప్రపంచవ్యాప్త పని జరుగుతోంది. a మా కూటాలు జరిగే స్థలాల్లో విరాళాల పెట్టెలు ఉంటాయి, విరాళాలు ఇవ్వడానికి గల ఇతర పద్ధతుల గురించి మా వెబ్‌సైట్‌లోని విరాళాల పేజీలో ఉంది. ప్రపంచవ్యాప్త పని కోసం లేదా స్థానిక అవసరాల కోసం విరాళం ఇచ్చేందుకు వీలుగా రెండు వేర్వేరు ఆప్షన్‌లు ఉన్నాయి. కావాలనుకుంటే, రెండింటి కోసం విరాళం ఇచ్చే సౌలభ్యం కూడా ఉంది.

 దశ దశమభాగం గానీ, సంపాదనలో ఖచ్చితంగా ఇంత డబ్బు గానీ ఇచ్చే పద్ధతి యెహోవాసాక్షుల్లో లేదు. (2 కొరింథీయులు 9:7) మా కూటాల్లో చందాలు అడగం లేదా మా కూటాలకు వచ్చినందుకు డబ్బులు తీసుకోం. అంతేకాదు, బాప్తిస్మం ఇచ్చినందుకు, అంత్యక్రియలు గానీ పెళ్లిళ్లు గానీ చేసినందుకు, లేదా ఇతర మతపరమైన కార్యక్రమాలు నిర్వహించినందుకు యెహోవాసాక్షులు ఎవ్వరూ డబ్బులు తీసుకోరు. విరాళం సేకరించేందుకు బేకరీ పదార్థాలను అమ్మడం, బజార్లు ఏర్పాటు చేయడం, బింగో గేమ్స్‌, కార్నివాల్స్‌, భోజన కార్యక్రమాలు నిర్వహించడం, లాటరీ టికెట్లు లాంటివి అమ్మడం లేదా అలాంటి ఇతర కార్యక్రమాలు నిర్వహించడం మేం అస్సలు చేయం. విరాళమిచ్చే వాళ్ల పేర్లను మేం ఎవ్వరికీ చెప్పం. (మత్తయి 6:2-4) మా వెబ్‌సైట్‌లలో, ప్రచురణల్లో యాడ్‌లు వేసి మేం డబ్బులు సంపాదించం.

 యెహోవాసాక్షుల సంఘాలన్నిటిలో, ప్రతీ నెలకు అయిన ఖర్చు వివరాలను సంఘ కూటాల్లో తెలియజేస్తారు. మా కూటాలకు ఎవరైనా రావచ్చు. సంఘ ఖర్చులకు సంబంధించిన రికార్డులను క్రమంగా ఆడిట్‌ చేస్తారు కాబట్టి విరాళాల ద్వారా వచ్చిన డబ్బు సరైన విధంగా ఉపయోగపడుతోందో లేదో తెలుస్తుంది.—2 కొరింథీయులు 8:20, 21.

విరాళాలిచ్చే పద్ధతులు

  •   విరాళాల పెట్టెలు: రాజ్యమందిరాల్లో, సమావేశ హాళ్లలో, లేదా మా కూటాలు జరిగే ఇతర స్థలాల్లో ఏర్పాటు చేసిన విరాళాల పెట్టెల్లో మీరు డబ్బును గానీ చెక్‌లను గానీ వేయవచ్చు.

  •   ఆన్‌లైన్‌ విరాళాలు:యెహోవాసాక్షులకు విరాళం ఇవ్వండి” అనే పేజీకి వెళ్లి మీ క్రెడిట్‌ కార్డు ద్వారా గానీ, డెబిట్‌ కార్డు ద్వారా గానీ, లేదా బ్యాంకు ట్రాన్స్‌ఫర్‌ ద్వారా గానీ, మరితర ఎలక్ట్రానిక్‌ పద్ధతుల ద్వారా గానీ విరాళం ఇవ్వవచ్చు. b కొంతమంది యెహోవాసాక్షులు, ప్రతీనెల తమ సంపాదనలో ‘కొంత తీసి పక్కకు పెట్టుకుని,’ ఇక్కడ చెప్పిన ఏదైనా పద్ధతిలో క్రమంగా విరాళమిస్తారు.—1 కొరింథీయులు 16:2.

  •   ప్రణాళిక వేసుకొని ఇచ్చే విరాళాలు: కొన్ని రకాల పద్ధతుల్లో విరాళాలు ఇవ్వాలంటే దానికి కొంత ప్రణాళిక అవసరం. కొన్ని సందర్భాల్లో చట్టపరమైన సలహాలు కూడా తీసుకోవాల్సి రావచ్చు. అలాంటి ప్రణాళిక వేసుకోవడం ద్వారా, మీ దేశంలో పన్నుకు సంబంధించి మీరు కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. చాలామంది తాము బ్రతికుండగా లేదా తమ మరణం తర్వాత డబ్బును లేదా ఆస్తులను విరాళంగా ఇవ్వగల ఏర్పాట్ల గురించి తెలుసుకుని ప్రయోజనం పొందారు. మీరు కింద ఉన్న ఏదైనా పద్ధతిలో విరాళం ఇవ్వాలనుకుంటే, దయచేసి స్థానికంగా ఉన్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించి ఎక్కువ వివరాలు తెలుసుకోండి.

    •   బ్యాంకు ఖాతాలు

    •   భీమా, రిటైర్మెంట్‌ పథకాలు

    •   స్థిరాస్తులు

    •   షేర్లు, బాండ్లు

    •   వీలునామాలు, ట్రస్టులు

  ప్రాంతంలో ఏయే పద్ధతుల్లో విరాళం ఇవ్వవచ్చో తెలుసుకోవడానికి “యెహోవాసాక్షులకు విరాళం ఇవ్వండి” అనే పేజీ చూడండి.

a కొంతమంది యెహోవాసాక్షులు కానివాళ్లు కూడా మా పనికి మద్దతిస్తూ విరాళం ఇస్తుంటారు.

b ఎక్కువ సమాచారం కోసం ఎలక్ట్రానిక్‌ రూపంలో విరాళాలు ఎలా ఇవ్వాలో తెలుసుకోండి అనే వీడియో చూడండి.