కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తొమ్మిదవ అధ్యాయం

మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామా?

మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామా?
  • మన కాలంలోని ఏ సంఘటనలు బైబిల్లో ముందే చెప్పబడ్డాయి?

  • “అంత్యదినములలో” ప్రజలు ఎలా ఉంటారని దేవుని వాక్యం చెబుతోంది?

  • ‘అంత్యదినములకు’ సంబంధించి బైబిలు ఎలాంటి మంచి విషయాలు చెబుతోంది?

1. భవిష్యత్తు గురించి మనం ఎక్కడ తెలుసుకోవచ్చు?

 టీవీలో వార్తలు చూసి మీరెప్పుడైనా ‘ఈ లోక భవిష్యత్తు ఏమిటి’ అని ఆశ్చర్యపోయారా? విషాదకర సంఘటనలు ఎంత అకస్మాత్తుగా, ఊహించని రీతిలో జరుగుతున్నాయంటే రేపేమి జరుగుతుందో ఏ మానవుడూ చెప్పలేడు. (యాకోబు 4:14) కానీ యెహోవాకు భవిష్యత్తు గురించి తెలుసు. (యెషయా 46:10) ఆయన వాక్యమైన బైబిలు ఎంతోకాలం ముందే, మనకాలంలో జరిగే చెడు విషయాలనే కాక, సమీప భవిష్యత్తులో జరిగే అద్భుతమైన విషయాల గురించి కూడా చెప్పింది.

2, 3. శిష్యులు యేసును ఏ ప్రశ్న అడిగారు, దానికి ఆయన ఏమని జవాబిచ్చాడు?

2 దుష్టత్వాన్ని అంతం చేసి ఈ భూమిని పరదైసుగా మార్చే దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు మాట్లాడాడు. (లూకా 4:43) ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందో ప్రజలు తెలుసుకోవాలని కోరుకున్నారు. నిజానికి యేసు శిష్యులు ఆయనను ఇలా ప్రశ్నించారు: “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” (మత్తయి 24:3) దానికి జవాబుగా ఆయన, ఈ విధానాంతం ఖచ్చితంగా ఎప్పుడు సంభవిస్తుందో యెహోవా దేవునికి మాత్రమే తెలుసని చెప్పాడు. (మత్తయి 24:36) అయితే ఆ రాజ్యం మానవాళికి నిజమైన శాంతిభద్రతలు తీసుకువచ్చే ముందు ఈ భూమ్మీద జరిగే సంఘటనల గురించి యేసు ముందే చెప్పాడు. ఆయన ముందు చెప్పినవే ఇప్పుడు జరుగుతున్నాయి!

3 మనం ‘యుగసమాప్తిలో’ జీవిస్తున్నామనేందుకు రుజువును పరిశీలించే ముందు, బహుశా ఏ మానవుడూ గమనించని ఒక యుద్ధాన్ని మనం క్లుప్తంగా పరిశీలిద్దాం. అది పరలోకంలో జరిగింది, దాని ఫలితం మనమీద ప్రభావం చూపిస్తుంది.

పరలోకంలో యుద్ధం

4, 5. (ఎ) యేసు రాజుగా సింహాసనాసీనుడైన వెంటనే పరలోకంలో ఏమి జరిగింది? (బి) ప్రకటన 12:12 ప్రకారం పరలోకంలో జరిగిన యుద్ధ ఫలితం ఎలా ఉంటుంది?

4 ఈ పుస్తకంలోని ముందరి అధ్యాయం, యేసుక్రీస్తు 1914లో పరలోకంలో రాజయ్యాడని వివరించింది. (దానియేలు 7:13, 14 చదవండి.) ఆ రాజ్యాధికారం పొందిన వెంటనే యేసు చర్య తీసుకున్నాడు. “అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును [యేసుకున్న మరో పేరు] అతని దూతలును ఆ ఘటసర్పముతో [అపవాదియగు సాతానుతో] యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి” అని బైబిలు చెబుతోంది. a సాతాను, అతని దుష్టదూతలైన దయ్యాలు యుద్ధంలో ఓడిపోవడంతో, వారు పరలోకం నుండి భూమ్మీదికి పడద్రోయబడ్డారు. సాతాను, అతని దయ్యాలు పడద్రోయబడ్డారని దేవుని నమ్మకమైన ఆత్మ సంబంధ కుమారులు ఆనందించారు. కానీ, మానవులు అలాంటి ఆనందం అనుభవించలేరు. బదులుగా, “భూమీ . . . [నీకు] శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు” అని బైబిలు ముందే చెప్పింది.—ప్రకటన 12:7-9, 12.

5 పరలోకంలో జరిగిన యుద్ధ ఫలితం ఎలా ఉంటుందో దయచేసి గమనించండి. విపరీతమైన కోపంతో సాతాను ఈ భూమ్మీద ఉన్నవారి మీదికి శ్రమను లేదా కష్టాన్ని తీసుకొస్తాడు. మీరు చూడబోతున్నట్లుగా, మనం ఇప్పుడు ఆ శ్రమల కాలంలోనే జీవిస్తున్నాం. అయితే అది తక్కువకాలమే అంటే ‘కొంచెం సమయమే’ ఉంటుంది. ఆ విషయం సాతానుకు కూడా తెలుసు. ఈ కాలాన్ని బైబిలు “అంత్యదినములు” అని సూచిస్తోంది. (2 తిమోతి 3:1) దేవుడు త్వరలోనే ఈ భూమ్మీదున్న అపవాది ప్రభావాన్ని తొలగిస్తాడని తెలుసుకోవడం మనకెంత సంతోషాన్నిస్తుందో కదా! బైబిల్లో ముందే చెప్పబడినట్లుగా ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలను మనమిప్పుడు పరిశీలిద్దాం. ఇవి మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామనీ, దేవుని రాజ్యం త్వరలోనే యెహోవాను ప్రేమించేవారికి శాశ్వతమైన ఆశీర్వాదాలు తీసుకొస్తుందనీ నిరూపిస్తాయి. మొదట, మనం జీవిస్తున్న కాలాన్ని గుర్తిస్తాయని యేసు చెప్పిన సూచనలోని నాలుగు అంశాలను పరిశీలిద్దాం.

అంత్యదినాల ముఖ్య సంఘటనలు

6, 7. యుద్ధాల, కరవుల గురించిన యేసు మాటలు నేడు ఎలా నెరవేరుతున్నాయి?

6 “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.” (మత్తయి 24:7) గత శతాబ్దంలో, యుద్ధాల్లో లక్షలాదిమంది చనిపోయారు. ఒక బ్రిటీష్‌ చరిత్రకారుడు ఇలా వ్రాశాడు: “లిఖిత చరిత్రలో 20వ శతాబ్దం అత్యంత రక్తపాతం జరిగిన శతాబ్దం. . . . ఏదో కొద్దికాలం తప్ప, మిగతా అన్ని సమయాల్లో అది నిరంతరం వ్యవస్థీకృత యుద్ధాలతో నిండిపోయింది.” వరల్డ్‌వాచ్‌ సంస్థ నివేదిక ఒకటి ఇలా చెబుతోంది: “క్రీ.శ. మొదటి శతాబ్దం నుండి 1899 వరకు జరిగిన యుద్ధాలన్నింటిలో గాయపడినవారికన్నా, [20వ] శతాబ్దపు యుద్ధాల్లో గాయపడినవారు మూడురెట్లు ఎక్కువగా ఉన్నారు.” 1914 నుండి జరిగిన యుద్ధాలవల్ల 10 కోట్లకన్నా ఎక్కువమంది చనిపోయారు. తమ ప్రియమైనవారు యుద్ధంలో చనిపోయినప్పుడు కలిగే దుఃఖాన్ని బాధను, కోట్లాదిమంది అనుభవించారు. బహుశా మీరుకూడా మీ ప్రియమైనవారిని ఈ విధంగా కోల్పోయి ఉండవచ్చు.

7 “కరవులు . . . కలుగును.” (మత్తయి 24:7-8) గత 30 సంవత్సరాల్లో ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని పరిశోధకులు చెబుతున్నారు. అయినప్పటికీ, చాలామంది దగ్గర ఆహారం కొనడానికి కావలసిన డబ్బు లేదా పంటలు పండించుకోవడానికి పొలం లేకపోవడం మూలంగా కరవులు కొనసాగుతున్నాయి. వర్ధమాన దేశాల్లో వంద కోట్లకన్నా ఎక్కువమంది రోజుకు ఒక డాలరు లేదా అంతకన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారు. ప్రతీ సంవత్సరం కుపోషణ అనే ప్రధాన కారణంగా యాభైలక్షలకన్నా ఎక్కువమంది పిల్లలు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనావేసింది.

8, 9. భూకంపాలు, తెగుళ్ల గురించిన యేసు ప్రవచనాలు నిజమయ్యాయని ఏవి చూపిస్తున్నాయి?

8 “గొప్ప భూకంపములు కలుగును.” (లూకా 21:11) ప్రతీ సంవత్సరం సగటున 19 భారీ భూకంపాలు సంభవించవచ్చని అమెరికా భూవిజ్ఞాన సర్వే చెబుతోంది. అవి భవనాలకు హాని కలిగిస్తూ, భూమి బీటలు పడేంత ఉధృతంగా ఉంటాయి. భవనాలను పూర్తిగా నాశనం చేసేంతటి శక్తిమంతమైన భూకంపాలు ఇప్పటివరకు దాదాపు ప్రతీ సంవత్సరం సంభవించాయి. 1900వ సంవత్సరం నుండి భూకంపాల వల్ల 20 లక్షలకన్నా ఎక్కువమంది చనిపోయారని అందుబాటులో ఉన్న నివేదికలు చూపిస్తున్నాయి. ఒక గ్రంథం ఇలా చెబుతోంది: “సాంకేతిక అభివృద్ధి ఆ మరణాలను కేవలం కొద్ది పరిమాణంలోనే తగ్గించగలిగింది.”

9 “తెగుళ్లు . . . తటస్థించును.” (లూకా 21:11) వైద్య అభివృద్ధి జరిగినా, పాత క్రొత్త జబ్బులు మానవాళిని పీడిస్తూనే ఉన్నాయి. క్షయ, మలేరియా, కలరా వంటి వ్యాధులతోపాటు బాగా తెలిసిన దాదాపు 20 రకాల వ్యాధులు ఇటీవల దశాబ్దాల్లో సర్వసాధారణమై పోయాయనీ, కొన్ని రకాల వ్యాధులను మందులతో నయం చేయడం అంతకంతకు కష్టమవుతున్నదనీ ఒక నివేదిక చెబుతోంది. నిజానికి, 30 రకాల కొత్త వ్యాధులు పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్నింటికి చికిత్స లేదు, అవి మరణకరమైనవి.

అంత్యదినాల్లోని ప్రజలు

10. రెండవ తిమోతి 3:1-5 లో ముందే చెప్పబడిన ఎలాంటి లక్షణాలను మీరు నేటి ప్రజల్లో చూస్తున్నారు?

10 ప్రపంచ ముఖ్య సంఘటనలను కొన్నింటిని వర్ణించిన తర్వాత, మానవ సమాజంలో వచ్చే మార్పుతో అంత్యదినాలను గుర్తించవచ్చని బైబిలు ప్రవచించింది. సాధారణ ప్రజానీకం ఎలా ఉంటుందో అపొస్తలుడైన పౌలు వర్ణించాడు. ఆయన ఇలా చెప్పాడు: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును.” (2 తిమోతి 3:1-5 చదవండి.) ఆ కాలాల్లో ప్రజలు ఇలా ఉంటారని పౌలు చెప్పాడు

  • స్వార్థప్రియులు

  • ధనాపేక్షులు

  • తలిదండ్రులకు అవిధేయులు

  • కృతజ్ఞతలేనివారు

  • అనురాగరహితులు

  • అజితేంద్రియులు

  • క్రూరులు

  • దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు

  • పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారు

11. దుష్టులకు సంభవించే దానిని కీర్తన 92:7 ఎలా వర్ణిస్తోంది?

11 మీ సమాజంలోని ప్రజలు అలా ఉన్నారా? నిస్సందేహంగా అలా ఉన్నారు. చెడు లక్షణాలున్న ప్రజలు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. దేవుడు త్వరలోనే చర్య తీసుకుంటాడని అది చూపిస్తోంది, ఎందుకంటే బైబిలు ఇలా చెబుతోంది: “నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.”—కీర్తన 92:7.

ప్రయోజనకరమైన పరిణామాలు!

12, 13. ఈ “అంత్యకాలములో” నిజమైన “తెలివి” ఎలా అధికమయ్యింది?

12 బైబిలు ముందే చెప్పినట్లు ఈ అంత్యదినాలు నిజంగానే శ్రమతో నిండిపోయాయి. అయితే ఈ కష్టభరిత లోకంలో యెహోవా ఆరాధకుల మధ్య మంచి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

13 “తెలివి అధికమగును” అని బైబిలు పుస్తకమైన దానియేలు ముందే చెప్పింది. అదెప్పుడు జరుగుతుంది? “అంత్యకాలములో.” (దానియేలు 12:4) ప్రత్యేకంగా 1914 నుండి, తనను సేవించాలని నిజంగా కోరుకున్నవారు బైబిలు అవగాహనలో ఎదిగేలా యెహోవా వారికి సహాయం చేశాడు. వారు దేవుని పేరు, సంకల్పం, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి, చనిపోయినవారి స్థితి, పునరుత్థానం వంటివాటి గురించిన అమూల్యమైన సత్యాలకు సంబంధించిన తమ అవగాహనలో ఎదిగారు. అంతేకాక, యెహోవా ఆరాధకులు తమకు ప్రయోజనం కలిగే రీతిలో, దేవునికి స్తుతి తీసుకొచ్చే రీతిలో ఎలా జీవించాలో కూడా తెలుసుకున్నారు. అలాగే దేవుని రాజ్యం ఎలాంటి పాత్ర పోషిస్తుంది, అది ఈ భూసంబంధ విషయాలను ఎలా చక్కదిద్దుతుంది అనే అంశాల్లో స్పష్టమైన అవగాహనను కూడా వారు సంపాదించుకున్నారు. ఈ జ్ఞానంతో వారేమి చేస్తారు? ఆ ప్రశ్న, ఈ అంత్యదినాల్లో నెరవేరుతున్న మరో ప్రవచనానికి మనలను నడిపిస్తుంది.

“ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.”—మత్తయి 24:14

14. నేడు రాజ్య సువార్త ప్రకటనా పని ఎంత విస్తృతంగా జరుగుతోంది, దానిని ఎవరు ప్రకటిస్తున్నారు?

14 “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును” అని యేసుక్రీస్తు “యుగసమాప్తికి” సంబంధించిన తన ప్రవచనంలో చెప్పాడు. (మత్తయి 24:3, 14 చదవండి.) ఆ రాజ్య సువార్త, అంటే ఆ రాజ్యమంటే ఏమిటి, అదేమి చేస్తుంది, దాని ఆశీర్వాదాలను మనమెలా పొందవచ్చు అనేవి ఇమిడివున్న సువార్త ప్రపంచవ్యాప్తంగా 230 కన్నా ఎక్కువ దేశాల్లో వందల భాషల్లో ప్రకటించబడుతోంది. లక్షలాదిమంది యెహోవాసాక్షులు ఆసక్తిగా ఆ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. వారు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు” వచ్చారు. (ప్రకటన 7:9) బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో తెలుసుకోవాలని కోరుకునే లక్షలాదిమందితో సాక్షులు ఉచిత గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. నిజ క్రైస్తవులు “మనుష్యులందరిచేత ద్వేషించబడుదురు” అని యేసు ముందే చెప్పాడు కాబట్టి, ఆ ప్రవచనం నెరవేరడం ఎంత ఉత్తేజకరమో కదా!—లూకా 21:17.

మీరేమి చేస్తారు?

15. (ఎ) మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని మీరు నమ్ముతారా, అలా ఎందుకు నమ్ముతారు? (బి) యెహోవాను వ్యతిరేకించే వారికి, దేవుని రాజ్య పరిపాలనకు లోబడే వారికి “అంతము” అంటే ఏమిటి?

15 బైబిలు ప్రవచనాలు నేడు అనేకం నెరవేరుతున్నాయి కాబట్టి, మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని మీరు అంగీకరించరా? యెహోవా తృప్తి మేరకు సువార్త ప్రకటించబడిన తర్వాత “అంతము” తప్పక వస్తుంది. (మత్తయి 24:14) “అంతము” అంటే దేవుడు ఈ భూమ్మీద నుండి దుష్టత్వాన్ని తొలగించే సమయమని అర్థం. ఉద్దేశపూర్వకంగా యెహోవాను వ్యతిరేకించే వారినందరినీ నాశనం చేయడానికి ఆయన యేసును, బలమైన దూతలను ఉపయోగిస్తాడు. (2 థెస్సలొనీకయులు 1:6-9) సాతానుకూ అతని దయ్యాలకూ జనాంగాలను తప్పుదోవ పట్టించే అవకాశమే ఇక ఉండదు. ఆ తర్వాత, దేవుని రాజ్యం దాని నీతియుక్త పరిపాలనకు లోబడే వారందరిమీద ఆశీర్వాదాలను కుమ్మరిస్తుంది.—ప్రకటన 20:1-3; 21:3-5.

16. మీరిప్పుడు ఏమి చేయడం జ్ఞానయుక్తం?

16 సాతాను విధానపు అంతం సమీపించింది కాబట్టి, ‘నేనేమి చేయాలి’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం యెహోవా గురించి ఆయన కట్టడల గురించి నేర్చుకుంటూ ఉండడం జ్ఞానయుక్తం. (యోహాను 17:3) బైబిలును శ్రద్ధగా చదివే విద్యార్థిగా ఉండండి. యెహోవా చిత్తం చేయడానికి ప్రయత్నించే ఇతరులతో క్రమంగా సహవసించడాన్ని మీ అలవాటుగా చేసుకోండి. (హెబ్రీయులు 10:24-25 చదవండి.) బైబిల్ని అధ్యయనం చేస్తూ యెహోవా గురించి తెలుసుకుని, ఆయన అనుగ్రహం పొందే విధంగా మీ జీవితంలో అవసరమైన మార్పులు చేసుకోండి.—యాకోబు 4:8.

17. దుష్టుల నాశనం హఠాత్తుగా ప్రజలమీద ఎందుకు విరుచుకుపడుతుంది?

17 మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామనే రుజువును చాలామంది పట్టించుకోరని యేసు ముందే చెప్పాడు. దుష్టుల నాశనం అకస్మాత్తుగా, అనూహ్యంగా వస్తుంది. రాత్రిపూట వచ్చే దొంగలా అది ప్రజలమీద హఠాత్తుగా విరుచుకుపడుతుంది. (1 థెస్సలొనీకయులు 5:2 చదవండి.) యేసు ఇలా హెచ్చరించాడు: “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.”—మత్తయి 24:37-39.

18. యేసు ఇచ్చిన ఏ హెచ్చరికను మనం గంభీరంగా తీసుకోవాలి?

18 కాబట్టి యేసు తన శ్రోతలకు ఇలా చెప్పాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట [ఆమోదంగలవారిగా] నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.” (లూకా 21:34-36) యేసు మాటలను గంభీరంగా తీసుకోవడం మంచిది. ఎందుకు? ఎందుకంటే, యెహోవా దేవుని ఆమోదం, “మనుష్యకుమారుని” అంటే యేసుక్రీస్తు ఆమోదం ఉన్నవారికి సాతాను విధానాన్ని తప్పించుకొని, అతి సమీపంలో ఉన్న అద్భుతమైన నూతనలోకంలో నిత్యం జీవించే ఉత్తరాపేక్ష ఉంది.—యోహాను 3:16; 2 పేతురు 3:13.

a మిఖాయేలు అనేది యేసుక్రీస్తు మరో పేరు అని చూపించే మరింత సమాచారం కోసం, అనుబంధంలో 218-219 పేజీల్లోని సమాచారం చూడండి.