కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు రక్తమార్పిడులను ఎందుకు అంగీకరించరు?

యెహోవాసాక్షులు రక్తమార్పిడులను ఎందుకు అంగీకరించరు?

తప్పుడు అభిప్రాయాలు

 అపోహ: యెహోవాసాక్షులు మందులు వేసుకోరు, వైద్య చికిత్సలు చేయించుకోరు.

 నిజమేంటి? మేము మా కోసం, మా ఇంటివాళ్ల కోసం అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య సహాయం తీసుకుంటాం. ఆరోగ్యం బాలేనప్పుడు, రక్తం లేని వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు చేసే నైపుణ్యం గల డాక్టర్ల దగ్గరకు వెళ్తాం. వైద్యరంగం పురోభివృద్ధి సాధించినందుకు మేమెంతో కృతజ్ఞులం. నిజానికి యెహోవాసాక్షుల కోసం రూపొందించిన అనేక రక్తరహిత చికిత్సల వల్ల ఇప్పుడు సమాజంలో అందరూ ప్రయోజనం పొందుతున్నారు. చాలా దేశాల్లో, రక్తమార్పిడి వల్ల వచ్చే ప్రమాదాలను అంటే, రక్తం ద్వారా సంక్రమించే రోగాలను, రోగనిరోధక వ్యవస్థ ప్రతిచర్యలను, మానవ తప్పిదం వల్ల జరిగే హానిని తప్పించుకోవాలని నేడు ఏ రోగి అయినా నిర్ణయించుకోవచ్చు.

 అపోహ: విశ్వాసం ఉంటే రోగాలు నయమౌతాయని యెహోవాసాక్షులు నమ్ముతారు.

 నిజమేంటి? విశ్వాస స్వస్థతలు జరుగుతాయని యెహోవాసాక్షులు నమ్మరు.

 అపోహ: రక్తమార్పిడి ప్రత్యామ్నాయ చికిత్సలు చాలా ఖరీదైనవి.

 నిజమేంటి? రక్తమార్పిడి లేకుండా చేసే వైద్య చికిత్సల వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది. a

 అపోహ: రక్తాన్ని ఎక్కించుకోకపోవడం వల్ల ప్రతీ ఏడాది చాలామంది యెహోవాసాక్షులు, చివరికి వాళ్ల పిల్లలు కూడా చనిపోతున్నారు.

 నిజమేంటి? ఇది పూర్తిగా అబద్ధం. గుండె, ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి వంటి సంశ్లిష్టమైన చికిత్సలను వైద్యులు తరచూ రక్తమార్పిడి లేకుండానే చేస్తున్నారు. b రక్తం ఎక్కించుకోనివాళ్లు రక్తం ఎక్కించుకున్న వాళ్లలాగానే కోలుకుంటారు, కొన్నిసార్లు వాళ్లకన్నా త్వరగా కోలుకుంటారు. c ఏదేమైనా, ఒక వ్యక్తి రక్తం ఎక్కించుకోకపోతే చనిపోతాడని, రక్తం ఎక్కించుకుంటే బ్రతుకుతాడని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు.

యెహోవాసాక్షులు రక్తమార్పిడులను ఎందుకు అంగీకరించరు?

 ఇది వైద్యానికి సంబంధించిన ప్రశ్న కాదుగానీ మతానికి సంబంధించిన ప్రశ్న. రక్తాన్ని విసర్జించాలనే ఆజ్ఞ పాత నిబంధనలో, కొత్త నిబంధనలో రెండిట్లోనూ కనిపిస్తుంది. (ఆదికాండము 9:4; లేవీయకాండము 17:10; ద్వితీయోపదేశకాండము 12:23; అపొస్తలుల కార్యములు 15:28, 29) అంతేకాదు, దేవుడు రక్తాన్ని ప్రాణానికి ప్రతీకగా ఎంచుతున్నాడు. (లేవీయకాండము 17:14) కాబట్టి దేవునికి లోబడాలని మాత్రమే కాదుగానీ, జీవదాతగా ఆయన మీదున్న గౌరవం వల్ల కూడా మేము రక్తాన్ని ఎక్కించుకోం.

మారుతున్న అభిప్రాయాలు

రక్తాన్ని ఎక్కించకుండానే సంశ్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా చేయవచ్చు

 ఒకప్పుడు డాక్టర్లు, రక్తం ఎక్కించకుండా చేసే చికిత్సలను (రక్తరహిత వైద్యాన్ని) ప్రాణాంతకమైనవిగా పరిగణించేవాళ్లు, వాటిని చేయించుకోవడం ఆత్మహత్యతో సమానమని కూడా ఎంచేవాళ్లు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఆ వైఖరిలో మార్పు వచ్చింది. ఉదాహరణకు 2004లో ఒక వైద్య విద్యా పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్‌లో ఇలా ఉంది: “యెహోవాసాక్షుల కోసం రూపొందించిన అనేక చికిత్సా విధానాలు రానున్న రోజుల్లో ప్రమాణంగా నిలవనున్నాయి.” d 2010లో, హార్ట్‌, లంగ్‌ అండ్‌ సర్క్యులేషన్‌ అనే జర్నల్‌లో వచ్చిన ఒక ఆర్టికల్‌లో ఇలా ఉంది: ‘“రక్తరహిత శస్త్రచికిత్స” కేవలం యెహోవాసాక్షులకు మాత్రమే పరిమితం కాకూడదు, అది శస్త్రచికిత్సా విధానంలో పూర్తిగా అంతర్భాగమవ్వాలి.’

 నేడు ప్రపంచవ్యాప్తంగా వేలాది డాక్టర్లు రక్త వృథాను అరికట్టే విధానాలు ఉపయోగిస్తూ, రక్తాన్ని ఎక్కించకుండానే ఎన్నో సంశ్లిష్టమైన శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అలాంటి ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలను వర్ధమాన దేశాల్లో కూడా ఉపయోగిస్తున్నారు, అలాగే యెహోవాసాక్షులుకాని రోగులు కూడా వాటిని కావాలంటున్నారు.

a ట్రాన్స్‌ఫ్యూజన్‌ అండ్‌ అఫ్ఫారసిస్‌ సైన్స్‌ (Transfusion and Apheresis Science), సంపుటి 33, సంఖ్య 3, పేజీ 349 చూడండి.

b ద జర్నల్‌ ఆఫ్‌ థొరాసిక్‌ అండ్‌ కార్డియోవాస్క్యులర్‌ సర్జరీ (The Journal of Thoracic and Cardiovascular Surgery), సంపుటి 134, సంఖ్య 2, పేజీలు 287-288; టెక్సాస్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ జర్నల్‌ (Texas Heart Institute Journal), సంపుటి 38, సంఖ్య 5, పేజీ 563; బేసిక్స్‌ ఆఫ్‌ బ్లడ్‌ మానేజ్‌మెంట్‌ (Basics of Blood Management), పేజీ 2; కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ అనస్తీషియా, క్రిటికల్‌ కేర్‌ & పెయిన్‌ (Continuing Education in Anaesthesia, Critical Care & Pain), సంపుటి 4, సంఖ్య 2, పేజీ 39 చూడండి.

c ద జర్నల్‌ ఆఫ్‌ థొరాసిక్‌ అండ్‌ కార్డియోవాస్క్యులర్‌ సర్జరీ, సంపుటి 89, సంఖ్య 6, పేజీ 918; హార్ట్‌, లంగ్‌ అండ్‌ సర్క్యులేషన్‌ (Heart, Lung and Circulation), సంపుటి 19, పేజీ 658 చూడండి.

d కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ అనస్తీషియా, క్రిటికల్‌ కేర్‌ & పెయిన్‌, సంపుటి 4, సంఖ్య 2, పేజీ 39.