మత్తయి సువార్త 20:1-34

  • ద్రాక్షతోట పనివాళ్లు, సమానంగా జీతం (1-16)

  • యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (17-19)

  • రాజ్యంలో స్థానాల కోసం అడగడం (20-28)

    • ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా యేసు (28)

  • ఇద్దరు గుడ్డివాళ్లు బాగవ్వడం (29-34)

20  “ఎందుకంటే పరలోక రాజ్యం, తన ద్రాక్షతోటలో పనివాళ్లను కూలికి పెట్టుకోవడానికి తెల్లవారుజామునే బయల్దేరిన ద్రాక్షతోట యజమానిలా ఉంది.+  అతను రోజుకు ఒక దేనారం* ఇస్తానని చెప్పి పనివాళ్లను తన ద్రాక్షతోటలోకి పంపించాడు.  ఉదయం దాదాపు 9 గంటలకు* అతను మళ్లీ బయటికి వెళ్లినప్పుడు, పని దొరకక సంతలో నిలబడివున్న కొంతమందిని చూసి  వాళ్లతో, ‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్లండి, మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను’ అని చెప్పాడు.  దాంతో వాళ్లు వెళ్లారు. అతను మధ్యాహ్నం దాదాపు 12 గంటలకు* అలాగే దాదాపు 3 గంటలకు* మళ్లీ బయటికి వెళ్లి అలాగే చేశాడు.  చివరికి సాయంత్రం దాదాపు 5 గంటలకు* కూడా అతను బయటికి వెళ్లి, అక్కడ ఖాళీగా నిలబడివున్న కొంతమందిని చూసి, ‘మీరు పనిచేయకుండా రోజంతా ఎందుకు ఇక్కడ నిలబడివున్నారు?’ అని అడిగాడు.  అందుకు వాళ్లు, ‘మమ్మల్ని ఎవరూ పనిలో పెట్టుకోలేదు’ అని చెప్పారు; అప్పుడు అతను, ‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్లండి’ అన్నాడు.  “సాయంత్రం అయినప్పుడు ద్రాక్షతోట యజమాని తన గృహనిర్వాహకుడితో, ‘పనివాళ్లను పిలిచి, చివర్లో వచ్చినవాళ్లతో మొదలుపెట్టి, మొదట వచ్చినవాళ్ల వరకు అందరికీ వాళ్లవాళ్ల కూలి ఇవ్వు’+ అని చెప్పాడు.  సాయంత్రం 5 గంటలకు పనికి కుదిరినవాళ్లు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో దేనారం* ఇచ్చారు. 10  కాబట్టి రోజంతా పనిచేసినవాళ్లు తమకు ఎక్కువ కూలి వస్తుందని అనుకున్నారు. కానీ వాళ్లకు కూడా ఒక్క దేనారమే* ఇచ్చారు. 11  వాళ్లు అది తీసుకుని ద్రాక్షతోట యజమాని మీద సణగడం మొదలుపెట్టి, 12  ‘చివర్లో వచ్చిన వీళ్లు ఒక్క గంటే పనిచేశారు; అయినా రోజంతా ఎండలో కష్టపడి పనిచేసిన మాకు, వాళ్లకు ఒకే కూలి ఇచ్చావు!’ అన్నారు. 13  కానీ ఆ యజమాని వాళ్లలో ఒకరితో ఇలా అన్నాడు: ‘స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నువ్వు నా దగ్గర ఒక దేనారానికి* ఒప్పుకున్నావు కదా? 14  నీ కూలి తీసుకుని వెళ్లు. చివర్లో వచ్చిన వీళ్లకు కూడా, నీకు ఇచ్చినంతే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. 15  నా డబ్బుతో నాకు నచ్చినట్టు చేసే హక్కు నాకు లేదా? నేను మంచివాడిగా* ఉన్నందుకు నీకు ఈర్ష్యగా* ఉందా?’+ 16  అలా, ముందున్నవాళ్లు వెనక్కి వెళ్తారు, వెనకున్నవాళ్లు ముందుకు వస్తారు.”+ 17  వాళ్లు యెరూషలేముకు వెళ్తుండగా, దారిలో యేసు తన 12 మంది శిష్యుల్ని పక్కకు తీసుకెళ్లి ఇలా చెప్పాడు:+ 18  “ఇదిగో! మనం యెరూషలేముకు వెళ్తున్నాం. అక్కడ మానవ కుమారుడు ముఖ్య యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడతాడు. వాళ్లు ఆయనకు మరణశిక్ష విధిస్తారు;+ 19  ఆయన్ని ఎగతాళి చేసి, కొరడాలతో కొట్టి, కొయ్య మీద వేలాడదీయడానికి అన్యజనులకు అప్పగిస్తారు.+ కానీ మూడో రోజున ఆయన మళ్లీ బ్రతికించబడతాడు.”+ 20  అప్పుడు, జెబెదయి కుమారుల తల్లి+ యేసును ఒక విషయం అడగాలని, తన ఇద్దరు కుమారులతో ఆయన దగ్గరికి వచ్చి వంగి నమస్కారం చేసింది.+ 21  యేసు ఆమెను, “నీకు ఏం కావాలి?” అని అడిగాడు. ఆమె, “నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారుల్లో ఒకర్ని నీ కుడివైపు, ఒకర్ని నీ ఎడమవైపు కూర్చోబెట్టుకో” అని అంది.+ 22  అందుకు యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియట్లేదు. నేను తాగబోతున్న గిన్నెలోది మీరు తాగగలరా?” అని అడిగాడు.+ వాళ్లు, “మేము తాగగలం” అన్నారు. 23  అప్పుడు యేసు, “నా గిన్నెలోది మీరు ఖచ్చితంగా తాగుతారు,+ కానీ నా కుడివైపు గానీ, నా ఎడమవైపు గానీ కూర్చోబెట్టుకోవడం నా చేతుల్లో లేదు, నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధం చేశాడో వాళ్లే ఆ స్థానాల్లో కూర్చుంటారు” అని వాళ్లతో అన్నాడు. 24  మిగతా పదిమంది ఆ విషయం గురించి విన్నప్పుడు, వాళ్లు ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద మండిపడ్డారు.+ 25  కానీ యేసు వాళ్లను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: “దేశాల పరిపాలకులు ప్రజల మీద అధికారం చెలాయిస్తారనీ, వాళ్లలో గొప్పవాళ్లు వాళ్లమీద పెత్తనం చేస్తారనీ మీకు తెలుసు కదా. 26  కానీ మీలో అలా ఉండకూడదు;+ మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి,+ 27  మీలో అందరికన్నా ముఖ్యమైన స్థానంలో ఉండాలనుకునేవాడు మీకు దాసుడిగా ఉండాలి. 28  అలాగే మానవ కుమారుడు కూడా ఇతరులతో సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ ఇతరులకు సేవచేయడానికి,+ ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా* తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు.”+ 29  వాళ్లు యెరికో నుండి వెళ్తుండగా చాలామంది ప్రజలు ఆయన వెనక వెళ్లారు. 30  అప్పుడు ఇదిగో! దారి పక్కన కూర్చొనివున్న ఇద్దరు గుడ్డివాళ్లు యేసు ఆ దారిలో వెళ్తున్నాడని విని, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని కేకలు వేశారు.+ 31  కానీ ప్రజలు వాళ్లను నిశ్శబ్దంగా ఉండమని గద్దించారు; అయినా వాళ్లు ఇంకా గట్టిగా, “ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు!” అని అరిచారు. 32  అప్పుడు యేసు ఆగి, వాళ్లను పిలిచి, “మీ కోసం నన్ను ఏం చేయమంటారు?” అని అడిగాడు. 33  వాళ్లు, “ప్రభువా, మాకు చూపు తెప్పించు” అన్నారు. 34  యేసు జాలిపడి వాళ్ల కళ్లను ముట్టుకున్నాడు,+ వెంటనే వాళ్లకు చూపు తిరిగొచ్చింది; దాంతో వాళ్లు ఆయన్ని అనుసరించారు.

అధస్సూచీలు

అనుబంధం B14 చూడండి.
అక్ష., “దాదాపు మూడో గంట అప్పుడు.”
అక్ష., “దాదాపు ఆరో గంట అప్పుడు.”
అక్ష., “దాదాపు తొమ్మిదో గంట అప్పుడు.”
అక్ష., “దాదాపు పదకొండో గంట అప్పుడు.”
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
అనుబంధం B14 చూడండి.
లేదా “ఉదారంగా.”
అక్ష., “నీ కన్ను చెడ్డగా.”
పదకోశం చూడండి.