యోహానుకు ఇచ్చిన ప్రకటన 1:1-20

  • యేసు ద్వారా దేవుడు వెల్లడిచేసిన విషయాలు (1-3)

  • ఏడు సంఘాలకు శుభాకాంక్షలు (4-8)

    • “నేనే ఆల్ఫాను, ఓమెగను” (8)

  • పవిత్రశక్తి వల్ల ప్రభువు రోజున జరిగేవాటిని యోహాను చూశాడు (9-11)

  • మహిమపర్చబడిన యేసు దర్శనం (12-20)

1  ఇవి యేసుక్రీస్తు బయల్పర్చిన* విషయాలు. దేవుడు త్వరలో జరగబోయేవాటిని తన దాసులకు చూపించడానికి+ వాటిని యేసుకు ఇచ్చాడు.+ యేసు తన దూతను పంపించి, తన దాసుడైన యోహానుకు+ సూచనల ద్వారా వాటిని చూపించాడు.  దేవుడు ఇచ్చిన వాక్యం గురించీ యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యం గురించీ, అవును, తాను చూసిన వాటన్నిటి గురించీ యోహాను సాక్ష్యమిచ్చాడు.  ఈ ప్రవచనంలోని మాటల్ని చదివి వినిపించేవాళ్లు, వాటిని వినేవాళ్లు, అందులో రాసివున్న వాటిని పాటించేవాళ్లు సంతోషంగా ఉంటారు.+ ఎందుకంటే, నిర్ణయించిన సమయం దగ్గరపడింది.  ఆసియా ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు యోహాను రాస్తున్న విషయాలు: “ఇప్పుడూ గతంలోనూ ఉన్నవాడు, రాబోతున్నవాడు అయిన దేవుడు,”+ అలాగే ఆయన సింహాసనం ముందున్న ఏడు శక్తులు+ మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.  అంతేకాదు, “నమ్మకమైన సాక్షి,”+ “మృతుల్లో నుండి మొదట బ్రతికినవాడు,”*+ “భూరాజులకు పరిపాలకుడు”+ అయిన యేసుక్రీస్తు కూడా మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి. మనల్ని ప్రేమిస్తున్న, తన సొంత రక్తంతో మన పాపాల నుండి మనల్ని విడిపించిన,+  తన తండ్రైన దేవునికి మనల్ని రాజ్యంగా,+ యాజకులుగా+ చేసిన యేసుకు ఎప్పటికీ మహిమ, శక్తి కలగాలి. ఆమేన్‌.  ఇదిగో! ఆయన మేఘాలతో వస్తున్నాడు,+ ప్రతీ ఒక్కరు ఆయన్ని చూస్తారు, ఆయన్ని పొడిచినవాళ్లు కూడా ఆయన్ని చూస్తారు; భూమ్మీదున్న అన్ని తెగలవాళ్లు దుఃఖంతో గుండెలు బాదుకుంటారు. అవును, ఆమేన్‌.  “నేనే ఆల్ఫాను, ఓమెగను;*+ ఇప్పుడూ గతంలోనూ ఉన్నవాణ్ణి, రాబోతున్నవాణ్ణి; సర్వశక్తిమంతుణ్ణి”+ అని యెహోవా* దేవుడు చెప్తున్నాడు.  యోహాను అనే నేను మీ సహోదరుణ్ణి, అలాగే యేసుకు అనుచరుడిగా ఉండడం వల్ల వచ్చే శ్రమల్లో,+ రాజ్యంలో,+ సహనంలో+ మీతోపాటు భాగస్థుణ్ణి. దేవుని గురించి మాట్లాడడం వల్ల, యేసు గురించి సాక్ష్యమివ్వడం వల్ల నేను పత్మాసు ద్వీపంలో ఉన్నాను. 10  నేను పవిత్రశక్తితో నిండిపోయి ప్రభువు రోజున జరిగే విషయాల్ని చూశాను. నా వెనక నుండి బాకా శబ్దం లాంటి పెద్ద స్వరం వినిపించింది. 11  ఆ స్వరం ఇలా అంది: “నువ్వు చూసే విషయాల్ని గ్రంథపు చుట్టలో రాసి ఎఫెసు,+ స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు.” 12  నాతో మాట్లాడుతున్నది ఎవరో చూడాలని నేను అటువైపు తిరిగాను. అప్పుడు నాకు ఏడు బంగారు దీపస్తంభాలు కనిపించాయి. 13  ఆ దీపస్తంభాల మధ్యలో మానవ కుమారుడి+ లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పొడవాటి వస్త్రం వేసుకొని ఉన్నాడు, ఆయన ఛాతి చుట్టూ బంగారు దట్టీ ఉంది. 14  అంతేకాదు ఆయన తల, తలవెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచులా తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్లు అగ్నిజ్వాలలా ఉన్నాయి. 15  ఆయన పాదాలు కొలిమిలో మెరిసే రాగిలా ఉన్నాయి.+ ఆయన స్వరం అనేక జలాల శబ్దంలా ఉంది. 16  ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి. ఆయన నోటి నుండి రెండువైపులా పదునున్న పొడవాటి ఖడ్గం వస్తోంది.+ ఆయన ముఖం ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.+ 17  నేను ఆయన్ని చూసినప్పుడు, చచ్చినవాడిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. ఆయన నా మీద తన కుడిచెయ్యి పెట్టి ఇలా అన్నాడు: “భయపడకు. నేను మొదటివాణ్ణి,+ చివరివాణ్ణి.+ 18  నేను జీవిస్తున్నవాణ్ణి.+ నేను చనిపోయాను, కానీ ఇదిగో యుగయుగాలు జీవిస్తూనే ఉన్నాను.+ మరణపు తాళంచెవులు, సమాధి* తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి.+ 19  కాబట్టి నువ్వు చూసినవాటి గురించి, ఇప్పుడు జరుగుతున్నవాటి గురించి, వీటి తర్వాత జరగబోయేవాటి గురించి రాయి. 20  నా కుడిచేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాల గురించిన, ఏడు బంగారు దీపస్తంభాల గురించిన పవిత్ర రహస్యం ఇదే: ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతల్ని సూచిస్తున్నాయి, ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాల్ని సూచిస్తున్నాయి.+

అధస్సూచీలు

లేదా “ప్రకటించిన.”
అక్ష., “మృతుల్లో నుండి బ్రతికినవాళ్లలో జ్యేష్ఠుడు.”
అనుబంధం A5 చూడండి.
ఆల్ఫా, ఓమెగ అనేవి గ్రీకు అక్షరమాలలో మొదటి, చివరి అక్షరాలు.
లేదా “హేడిస్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.