మత్తయి సువార్త 4:1-25

  • అపవాది యేసును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం (1-11)

  • యేసు గలిలయలో ప్రకటనా పని మొదలుపెట్టడం (12-17)

  • మొదటి శిష్యుల్ని పిలవడం (18-22)

  • యేసు ప్రకటించడం, బోధించడం, రోగుల్ని బాగుచేయడం (23-25)

4  ఆ తర్వాత, దేవుని పవిత్రశక్తి యేసును ఎడారిలోకి తీసుకెళ్లింది. అక్కడ అపవాది ఆయన్ని ప్రలోభపెట్టడానికి+ ప్రయత్నించాడు.  యేసు 40 పగళ్లు, 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. తర్వాత ఆయనకు బాగా ఆకలేసింది.  అప్పుడు అపవాది* ఆయన దగ్గరికి వచ్చి, “నువ్వు దేవుని కుమారుడివైతే, ఈ రాళ్లను రొట్టెలుగా మారమని ఆజ్ఞాపించు” అని అన్నాడు.  కానీ యేసు ఇలా అన్నాడు: “‘మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదుగానీ యెహోవా* నోటినుండి వచ్చే ప్రతీ మాట వల్ల జీవించాలి’ అని రాయబడివుంది.”+  తర్వాత అపవాది ఆయన్ని పవిత్ర నగరంలోకి+ తీసుకెళ్లి, ఆలయం గోడ* మీద నిలబెట్టి,  ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే, ‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు,’ ‘నీ పాదానికి రాయి తగలకుండా వాళ్లు తమ చేతులమీద నిన్ను మోస్తారు’ అని రాయబడివుంది.”+  అప్పుడు యేసు అతనితో, “‘నువ్వు నీ దేవుడైన యెహోవాను* పరీక్షించకూడదు’ అని కూడా రాయబడివుంది” అన్నాడు.+  మళ్లీ అపవాది ఆయన్ని చాలా ఎత్తైన ఒక కొండ మీదికి తీసుకెళ్లి, లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమనూ ఆయనకు చూపించి,  ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు సాష్టాంగపడి ఒక్కసారి నన్ను పూజిస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను.” 10  అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “సాతానా, వెళ్లిపో! ‘నీ దేవుడైన యెహోవానే* నువ్వు ఆరాధించాలి,+ ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి’ అని రాయబడివుంది.”+ 11  దాంతో అపవాది ఆయన్ని విడిచి వెళ్లిపోయాడు,+ అప్పుడు ఇదిగో! దేవదూతలు వచ్చి ఆయనకు సేవలు చేయడం మొదలుపెట్టారు.+ 12  ఆ తర్వాత, యోహానును బంధించారని విన్నప్పుడు యేసు గలిలయకు వెళ్లిపోయాడు.+ 13  అంతేకాదు, ఆయన నజరేతు నుండి వచ్చేసిన తర్వాత జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో సముద్ర తీరాన ఉన్న కపెర్నహూము నగరంలో నివాసం ఉన్నాడు.+ 14  అలా యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ మాటలు నెరవేరాయి: 15  “జెబూలూను దేశమా, నఫ్తాలి దేశమా, సముద్రానికి వెళ్లే దారిలో యొర్దానుకు అవతలి వైపున ఉన్న అన్యజనుల గలిలయ ప్రాంతమా! 16  చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు, మరణ నీడలో కూర్చున్నవాళ్లపై వెలుగు+ ప్రకాశించింది.”+ 17  అప్పటినుండి యేసు, “పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని చెప్తూ ప్రకటించడం మొదలుపెట్టాడు.+ 18  ఆయన గలిలయ సముద్ర తీరాన నడుస్తున్నప్పుడు, సముద్రంలో వల వేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల్ని చూశాడు. వాళ్లు ఎవరంటే: పేతురు అని పిలవబడిన సీమోను,+ అతని సహోదరుడు అంద్రెయ. వాళ్లు జాలరులు. 19  ఆయన వాళ్లతో, “నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను” అన్నాడు.+ 20  వాళ్లు వెంటనే తమ వలలు వదిలేసి ఆయన వెంట వెళ్లారు.+ 21  యేసు అక్కడి నుండి వెళ్తూవెళ్తూ ఇంకో ఇద్దరు అన్నదమ్ముల్ని చూశాడు. వాళ్లు ఎవరంటే: జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను.+ వాళ్లు తమ తండ్రి జెబెదయితోపాటు పడవలో ఉండి తమ వలలు బాగుచేసుకుంటున్నారు. యేసు వాళ్లను కూడా పిలిచాడు.+ 22  వాళ్లు వెంటనే పడవను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంట వెళ్లారు. 23  తర్వాత ఆయన గలిలయ అంతటా ప్రయాణిస్తూ+ సమాజమందిరాల్లో బోధిస్తూ,+ రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, ప్రజలకున్న ప్రతీ జబ్బును, అనారోగ్యాన్ని నయం చేస్తూ ఉన్నాడు.+ 24  ఆయన గురించిన వార్త సిరియా అంతటా వ్యాపించింది. ప్రజలు రకరకాల జబ్బులతో, వేదనలతో బాధపడుతున్నవాళ్లను, చెడ్డదూతలు* పట్టినవాళ్లను,+ మూర్ఛ రోగుల్ని,+ పక్షవాతం వచ్చిన వాళ్లందర్నీ ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాళ్లను బాగుచేశాడు. 25  అందువల్ల గలిలయ నుండి, దెకపొలి* నుండి, అలాగే యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను అవతలి వైపు నుండి ప్రజలు గుంపులుగుంపులుగా ఆయన వెంట వెళ్లారు.

అధస్సూచీలు

లేదా “ప్రలోభపెట్టేవాడు.”
అనుబంధం A5 చూడండి.
లేదా “అన్నిటికన్నా ఎత్తైన చోటు.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
పదకోశం చూడండి.
లేదా “పది నగరాలున్న ప్రాంతం.”