కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

A5

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని పేరు

టెట్రగ్రామటన్‌తో (יהוה) సూచించబడే దేవుని పేరు, హీబ్రూ లేఖనాల్ని మొదట రాసినప్పుడు దాదాపు 7,000 సార్లు ఉందని బైబిలు పండితులు ఒప్పుకుంటారు. అయితే, క్రైస్తవ గ్రీకు లేఖనాల్ని మొదట రాసినప్పుడు మాత్రం దేవుని పేరు లేదన్నది చాలామంది అభిప్రాయం. అందుకే, కొత్త నిబంధన అని పిలవబడే పుస్తకాల్ని అనువదించేటప్పుడు చాలా ఆధునిక ఇంగ్లీషు బైబిళ్లు యెహోవా అనే పేరును ఉపయోగించలేదు. చివరికి, టెట్రగ్రామటన్‌ ఉన్న హీబ్రూ లేఖనాల్ని ఉల్లేఖించిన వాక్యాల్ని అనువదిస్తున్నప్పుడు కూడా చాలామంది అనువాదకులు దేవుని పేరుకు బదులు “ప్రభువు” అని వాడారు.

పవిత్ర లేఖనాల కొత్త లోక అనువాదం మాత్రం ఎక్కువమంది పాటించే ఈ పద్ధతిని పాటించలేదు. ఈ అనువాదంలోని క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో యెహోవా పేరు మొత్తం 237 సార్లు ఉంది. అలా పెట్టాలని నిర్ణయించడానికి అనువాదకులు రెండు ప్రాముఖ్యమైన విషయాల్ని పరిగణనలోకి తీసుకున్నారు: (1) నేడు మన దగ్గర ఉన్న గ్రీకు రాతప్రతులు అసలైనవి కావు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వేల ప్రతుల్లో చాలావరకు, అసలు ప్రతుల్ని రాసిన కనీసం రెండు శతాబ్దాల తర్వాతే తయారయ్యాయి. (2) ఆ సమయం కల్లా, వాటిని నకలు చేసినవాళ్లు టెట్రగ్రామటన్‌ స్థానంలో “ప్రభువు” అనే పదానికి ఉపయోగించే గ్రీకు పదమైన Kyʹri·os పెట్టేశారు లేదా అప్పటికే అలా పెట్టేసిన రాతప్రతుల నుండి నకలు చేశారు.

గ్రీకు అసలు రాతప్రతుల్లో టెట్రగ్రామటన్‌ ఉండేది అనడానికి గట్టి రుజువులు ఉన్నాయని కొత్త లోక బైబిలు అనువాద కమిటీ నిర్ధారించుకుంది. అందుకు ఈ రుజువులే ఆధారం:

  •  యేసు, అపొస్తలుల కాలంలో వాడుకలో ఉన్న హీబ్రూ లేఖనాల ప్రతుల్లో అంతటా టెట్రగ్రామటన్‌ ఉండేది. గతంలో కొందరు ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు, కుమ్రన్‌ దగ్గర మొదటి శతాబ్దానికి చెందిన హీబ్రూ లేఖనాల ప్రతులు బయటపడడంతో ఆ వాస్తవం తిరుగులేని విధంగా రుజువైంది.

  •  యేసు, అపొస్తలుల కాలంలో ఉన్న హీబ్రూ లేఖనాల గ్రీకు అనువాదాల్లో కూడా టెట్రగ్రామటన్‌ ఉండేది. హీబ్రూ లేఖనాల గ్రీకు సెప్టువజింటు అనువాద రాతప్రతుల్లో టెట్రగ్రామటన్‌ లేదని శతాబ్దాలపాటు విద్వాంసులు అనుకున్నారు. అయితే 20వ శతాబ్దం మధ్యలో, యేసు కాలంలో వాడుకలో ఉన్న గ్రీకు సెప్టువజింటు అనువాదపు అతి పురాతన రాతప్రతుల భాగాలు కొన్ని ఆ విద్వాంసుల దృష్టికి తీసుకురాబడ్డాయి. వాటిలో దేవుని పేరు హీబ్రూ అక్షరాల్లో ఉంది. అంటే, యేసు కాలంలోని హీబ్రూ లేఖనాల గ్రీకు భాషా ప్రతుల్లో దేవుని పేరు ఉండేది. అయితే సా.శ. నాలుగో శతాబ్దం కల్లా, గ్రీకు సెప్టువజింటు ప్రముఖ రాతప్రతుల్లో, అంటే కోడెక్స్‌ వాటికానస్‌, కోడెక్స్‌ సైనైటికస్‌ వంటివాటిలో ఆదికాండం నుండి మలాకీ వరకున్న పుస్తకాల్లో దేవుని పేరు లేదు. (కానీ, ముందటి రాతప్రతుల్లో ఆ పుస్తకాల్లో దేవుని పేరు ఉండేది.) కాబట్టి, సా.శ. నాలుగో శతాబ్దం నుండి భద్రపర్చిన ప్రతుల్లో, కొత్త నిబంధన అని పిలవబడే గ్రీకు లేఖనాల్లో దేవుని పేరు లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

    యేసు స్పష్టంగా ఇలా చెప్పాడు: “నేను నా తండ్రి పేరున వచ్చాను.” అంతేకాదు, తాను తన “తండ్రి పేరున” పనులు చేశానని కూడా ఆయన నొక్కిచెప్పాడు

  •  యేసు తరచూ దేవుని పేరు గురించి మాట్లాడాడని, ఆ పేరును ఇతరులకు తెలియజేశాడని స్వయంగా క్రైస్తవ గ్రీకు లేఖనాలే చెప్తున్నాయి. (యోహాను 17:6, 11, 12, 26) యేసు స్పష్టంగా ఇలా చెప్పాడు: “నేను నా తండ్రి పేరున వచ్చాను.” అంతేకాదు, తాను తన “తండ్రి పేరున” పనులు చేశానని కూడా ఆయన నొక్కిచెప్పాడు.—యోహాను 5:43; 10:25.

  •  హీబ్రూ లేఖనాల్లాగే క్రైస్తవ గ్రీకు లేఖనాల్ని కూడా దేవుడే ప్రేరేపించి రాయించాడు కాబట్టి, ఉన్నట్టుండి గ్రీకు లేఖనాల్లో యెహోవా పేరు ఎలా మాయమౌతుంది? దాదాపు సా.శ. 50 ఆ సమయంలో, శిష్యుడైన యాకోబు యెరూషలేములోని పెద్దలతో ఇలా అన్నాడు: “దేవుడు తన పేరు కోసం అన్యజనుల్లో నుండి కూడా ప్రజల్ని ఎంచుకోవడానికి, ఇప్పుడు వాళ్లను అంగీకరిస్తున్నాడని ఇంతకుముందే సుమెయోను వివరంగా చెప్పాడు.” (అపొస్తలుల కార్యాలు 15:14) మొదటి శతాబ్దంలో ఎవ్వరికీ దేవుని పేరు తెలియకపోతే, ఎవ్వరూ ఆ పేరును ఉపయోగించకపోతే యాకోబు అన్న ఆ మాటకు అర్థముండదు.

  •  క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని పేరు సంక్షిప్త రూపంలో కనబడుతుంది. ప్రకటన 19:1, 3, 4, 6 వచనాల్లో దేవుని పేరు “హల్లెలూయా” అనే పదంలో నిక్షిప్తమై ఉంది. అది అక్షరార్థంగా, “యెహోవాను స్తుతించండి” అని అర్థమిచ్చే హీబ్రూ పదబంధం నుండి వచ్చింది. అందులో “యా” అనే అక్షరం యెహోవా అనే పేరుకు సంక్షిప్త రూపం. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని చాలా పేర్లు దేవుని పేరు నుండి వచ్చినవే. అంతెందుకు, కొన్ని రెఫరెన్సు గ్రంథాలు వివరిస్తున్నట్టు, యేసు పేరుకు కూడా “యెహోవాయే రక్షణ” అని అర్థం.

  •  యూదా క్రైస్తవులు తమ రచనల్లో దేవుని పేరును వాడారని తొలి యూదా రచనలు చూపిస్తున్నాయి. విశ్రాంతి రోజున కాల్చేసిన క్రైస్తవ రచనల గురించి సా.శ. 300కల్లా పూర్తయిన టొసెఫ్టా అనే మౌఖిక నియమాల పుస్తకం ఇలా చెప్తోంది: “వాళ్లు సువార్తికుల [అంటే, యేసు గురించి రాసిన క్రైస్తవుల] పుస్తకాల్ని, మినిమ్‌ల [క్రైస్తవులుగా మారిన యూదుల్ని వాళ్లు అలా పిలిచేవాళ్లని తెలుస్తోంది] పుస్తకాల్ని కాల్చేస్తారు. వాళ్లు ఆ పుస్తకాల్ని, ఆ పుస్తకాలతోపాటు వాటిలో ఉన్న దేవుని పేరును కూడా కాల్చేయవచ్చు.” అంతేకాదు, వారంలోని వేరే రోజుల్లో “వాళ్లు వాటిలో [ఇవి క్రైస్తవ రాతలని అర్థమౌతుంది] ఉన్న దేవుని పేరును కత్తిరించి పక్కనపెట్టి, మిగతా భాగాన్ని కాల్చేసేవాళ్లు” అని సా.శ. రెండవ శతాబ్దం ఆరంభంలో జీవించిన గలిలయుడైన యోసే అనే రబ్బీ అన్నాడని ఆ పుస్తకం చెప్తోంది.

  •  క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉల్లేఖించిన హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు ఉండేవుంటుందని కొందరు బైబిలు విద్వాంసులు ఒప్పుకుంటారు. ది యాంకర్‌ బైబిల్‌ డిక్షనరీ పుస్తకంలో “కొత్త నిబంధనలో టెట్రగ్రామటన్‌” అనే శీర్షిక కింద ఇలా ఉంది: “కొత్త నిబంధన మొదట రాయబడినప్పుడు, అందులో పాత నిబంధన నుండి ఉల్లేఖించిన కొన్ని భాగాల్లో లేదా అన్ని భాగాల్లో టెట్రగ్రామటన్‌ లేదా దేవుని పేరు, అంటే యావే ఉండేదనడానికి రుజువులు ఉన్నాయి.” జార్జ్‌ హోవర్డ్‌ అనే పండితుడు ఇలా అంటున్నాడు: “మొదటి శతాబ్దపు క్రైస్తవుల గ్రీకు బైబిలు [సెప్టువజింటు] ప్రతుల్లో టెట్రగ్రామ్‌ అప్పటికి ఇంకా ఉంది కాబట్టి, కొత్త నిబంధనను రాసినవాళ్లు లేఖనాల్ని ఉల్లేఖిస్తున్నప్పుడు టెట్రగ్రామ్‌ని బైబిల్లో అలాగే ఉంచారని నమ్మడం సబబే.”

  •  గుర్తింపు పొందిన బైబిలు అనువాదకులు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని పేరును ఉపయోగించారు. వాళ్లలో కొంతమంది, ఇంగ్లీషు కొత్త లోక అనువాదం కన్నా చాలా ముందు నుండే అలా ఉపయోగించారు. ఆ అనువాదకులు, వాళ్ల అనువాదాలు: హెర్మన్‌ హేయిన్‌ఫెట్టర్‌ చేసిన ఎ లిటరల్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద న్యూ టెస్టమెంట్‌ . . . ఫ్రమ్‌ ద టెక్స్‌ట్‌ ఆఫ్‌ ద వాటికన్‌ మాన్యుస్క్రిప్ట్‌ (1863); బెంజమిన్‌ విల్సన్‌ చేసిన ది ఎంఫాటిక్‌ డయాగ్లాట్‌ (1864); జార్జ్‌ బార్కర్‌ స్టీవెన్స్‌ చేసిన ది ఎపిసల్స్‌ ఆఫ్‌ పాల్‌ ఇన్‌ మాడర్న్‌ ఇంగ్లీష్‌ (1898); డబ్ల్యు. జి. రూథర్‌ఫర్డ్‌ చేసిన సెయింట్‌ ఎల్స్‌ ఎపిసల్‌ టు ద రోమన్స్‌ (1900); లండన్‌ బిషప్‌ జె.డబ్ల్యు.సి. వాండ్‌ చేసిన ద న్యూ టెస్టమెంట్‌ లెటర్స్‌ (1946). అంతేకాదు, పబ్లో బెస్సన్‌ అనే అనువాదకుడు 20వ శతాబ్దం మొదట్లోని ఒక స్పానిష్‌ అనువాదంలో లూకా 2:15, యూదా 14 వచనాల్లో “Jehová” అనే పేరును ఉపయోగించాడు; అతను తన అనువాదంలో దాదాపు 100 అధస్సూచీల్లో, అక్కడ బహుశా దేవుని పేరు ఉండొచ్చని సూచించాడు. ఆ అనువాదాల కన్నా చాలాకాలం క్రితమే, అంటే 16వ శతాబ్దం నుండి ఉన్న క్రైస్తవ గ్రీకు లేఖనాల హీబ్రూ అనువాదాలు చాలాచోట్ల టెట్రగ్రామటన్‌ను ఉపయోగించాయి. ఒక్క జర్మన్‌ భాషలోనే కనీసం 11 అనువాదాలు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో “యెహోవా” అనే పేరును (లేదా “యావే” అనే హీబ్రూ లిప్యంతరీకరణను) ఉపయోగించాయి. నలుగురు అనువాదకులు మాత్రం “ప్రభువు” అని పెట్టి, దాని పక్కన బ్రాకెట్లలో దేవుని పేరును చేర్చారు. 70 కన్నా ఎక్కువ జర్మన్‌ అనువాదాలు అధస్సూచీల్లో లేదా వ్యాఖ్యానాల్లో దేవుని పేరును ఉపయోగించాయి.

    బెంజమిన్‌ విల్సన్‌ చేసిన ది ఎంఫాటిక్‌ డయాగ్లాట్‌లో (1864), అపొస్తలుల కార్యాలు 2:34​లో దేవుని పేరు

  •  వంద కన్నా ఎక్కువ భాషల్లోని బైబిలు అనువాదాల్లో క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని పేరు ఉంది. ఆఫ్రికా, నేటివ్‌ అమెరికా, ఆసియా, ఐరోపా, పసిఫిక్‌ ద్వీపాల్లో మాట్లాడే చాలా భాషల బైబిళ్లలో దేవుని పేరు విరివిగా కనిపిస్తుంది. ( 1870, 1871 పేజీల్లో ఆ లిస్టు చూడండి.) వాటి అనువాదకులు, పైన చూసిన లాంటి కారణాల వల్లే దేవుని పేరును ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. క్రైస్తవ గ్రీకు లేఖనాల ఈ అనువాదాల్లో కొన్ని ఈ మధ్య కాలాల్లో వచ్చినవే. ఉదాహరణకు, రోటుమన్‌ బైబిల్‌లో (1999) 48 వచనాల్లో 51 సార్లు “Jihova” అని ఉంది; ఇండోనేషియాకు చెందిన బాటక్‌ (టోబ) వర్షన్‌లో (1989) 110 సార్లు “Jahowa” అని ఉంది.

    హవ్వాయన్‌ భాష అనువాదంలో, మార్కు 12:29, 30​లో దేవుని పేరు

కాబట్టి నిస్సందేహంగా, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో దేవుని పేరు, అంటే యెహోవా అనే పేరు తిరిగి పెట్టడానికి బలమైన ఆధారమే ఉంది. అందుకే కొత్త లోక అనువాదం అనువాదకులు అందులో దేవుని పేరును తిరిగి చేర్చారు. వాళ్లకు దేవుని పేరు మీద ప్రగాఢ గౌరవం, మొదట రాసినప్పుడు ఉన్న దేన్నీ తీసేయకూడదనే సరైన భయం ఉన్నాయి.—ప్రకటన 22:18, 19.