కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

A4

హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు

బబులోను చెరకు ముందటి కాలంలో వాడిన ప్రాచీన హీబ్రూ అక్షరాల్లో దేవుని పేరు

బబులోను చెర తర్వాతి కాలంలో వాడిన హీబ్రూ అక్షరాల్లో దేవుని పేరు

יהוה అనే నాలుగు హీబ్రూ హల్లులతో సూచించబడే దేవుని పేరు హీబ్రూ లేఖనాల్లో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. ఈ అనువాదంలో, టెట్రగ్రామటన్‌ అని పిలిచే ఆ నాలుగు హల్లుల స్థానంలో “యెహోవా” అని ఉపయోగించబడింది. బైబిల్లో ఎక్కువసార్లు కనిపించే పేరు అదే. ప్రేరేపిత లేఖనాల్ని రాసినవాళ్లు దేవుని గురించి చెప్తున్నప్పుడు “సర్వశక్తిమంతుడు,” “సర్వోన్నతుడు,” “ప్రభువు” లాంటి చాలా బిరుదులు, ఆయన్ని వర్ణించే ఇతర పదాలు వాడినా, దేవుణ్ణి గుర్తించడానికి మాత్రం వాళ్లు ఆయన ఒకేఒక్క పేరును, అంటే టెట్రగ్రామటన్‌ను ఉపయోగించారు.

బైబిలు రాసినవాళ్లు తన పేరు ఉపయోగించాలని స్వయంగా యెహోవా దేవుడే నిర్దేశించాడు. ఉదాహరణకు, ఆయన యోవేలు ప్రవక్తను ప్రేరేపించి ఇలా రాయించాడు: “యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.” (యోవేలు 2:32) అంతేకాదు, ఒక కీర్తనకర్తతో దేవుడు ఇలా రాయించాడు: “యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే భూమంతటి పైన మహోన్నతుడివని ప్రజలు తెలుసుకోవాలి.” (కీర్తన 83:18) నిజానికి, దేవుని సేవకులు పాడడానికి, వల్లించడానికి కవితా శైలిలో కూర్చిన ఒక్క కీర్తనల గ్రంథంలోనే దేవుని పేరు సుమారు 700 సార్లు కనిపిస్తుంది. అలాంటప్పుడు, చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరు ఎందుకు లేదు? ఈ అనువాదంలో “యెహోవా” (ఇంగ్లీషులో “Jehovah”) అని ఎందుకు వాడారు? యెహోవా అనే పేరుకు అర్థమేమిటి?

సా.శ. మొదటి శతాబ్దం తొలి అర్ధ భాగం నాటి మృత సముద్రపు గ్రంథపు చుట్టలో కీర్తనల పుస్తకంలోని ఒక భాగం. ఇందులోని వాక్యాలు బబులోను చెర తర్వాతి కాలంలో వాడిన హీబ్రూ అక్షరాల శైలిలో ఉన్నాయి, అయితే ప్రతీచోట టెట్రగ్రామటన్‌ మాత్రం ప్రాచీన హీబ్రూ అక్షరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది

చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరు ఎందుకు లేదు? దానికి వేర్వేరు కారణాలున్నాయి. సర్వశక్తిగల దేవుణ్ణి గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన పేరు అవసరం లేదని కొందరు అనుకుంటారు. బహుశా దేవుని పేరు అపవిత్రమౌతుందనే భయంతో ఆ పేరును వాడకూడదన్న యూదా సంప్రదాయం ప్రభావం ఇంకొందరి మీద పడి ఉండవచ్చు. దేవుని పేరును సరిగ్గా ఎలా ఉచ్చరించాలో ఎవరికీ ఖచ్చితంగా తెలీదు కాబట్టి కేవలం “ప్రభువు” లేదా “దేవుడు” లాంటి బిరుదులు వాడడం మేలని మరికొందరు నమ్ముతారు. అయితే అలాంటి అభిప్రాయాలు సరైనవి కావని చెప్పడానికి ఈ కారణాలు చూడండి:

  •  సర్వశక్తిగల దేవునికి ఒక ప్రత్యేకమైన పేరు అవసరం లేదని వాదించేవాళ్లు ఒక విషయాన్ని పట్టించుకోవట్లేదు. అదేంటంటే, క్రీస్తు పూర్వానికి చెందినవాటితో సహా దేవుని వాక్య తొలి ప్రతుల్లో ఆయన పేరు ఉంది. మనం ముందే గమనించినట్టు, దేవుడు తన వాక్యంలో దాదాపు 7,000 సార్లు తన పేరు ఉండేలా చూశాడు. అంటే, మనం తన పేరును తెలుసుకోవాలని, దాన్ని ఉపయోగించాలని ఆయన కోరుకుంటున్నాడని తెలుస్తోంది.

  •  యూదా సంప్రదాయం మీద గౌరవంతో దేవుని పేరును తీసేసే అనువాదకులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించట్లేదు. కొందరు యూదా శాస్త్రులు దేవుని పేరును పలకకపోయినా, తమ బైబిలు ప్రతుల్లో నుండి మాత్రం దాన్ని తీసేయలేదు. మృత సముద్రం దగ్గర కుమ్రన్‌లో దొరికిన ప్రాచీన గ్రంథపు చుట్టల్లో దేవుని పేరు చాలా చోట్ల ఉంది. కొందరు బైబిలు అనువాదకులు, మొదట్లో రాయబడినప్పుడు దేవుని పేరు ఉండేదని చెప్పడానికి, ఆ పేరు ఉండాల్సిన చోట “ప్రభువు” అనే బిరుదు పెడుతుంటారు. కానీ ప్రశ్నేమిటంటే, బైబిల్ని మొదట రాసినప్పుడు దేవుని పేరు వేలసార్లు ఉందని తెలిసిన ఈ అనువాదకులు దేవుని పేరు స్థానంలో బిరుదును వాడేంత స్వేచ్ఛ లేదా ఆ పేరును తీసేసేంత స్వేచ్ఛ ఎందుకు తీసుకున్నారు? అలాంటి మార్పు చేసే అధికారం వాళ్లకు ఎవరిచ్చారు? వాళ్లకే తెలియాలి.

  •  దేవుని పేరును సరిగ్గా ఎలా ఉచ్చరించాలో తెలీదు కాబట్టి దాన్ని వాడకూడదని చెప్పేవాళ్లు నిజానికి యేసు పేరును స్వేచ్ఛగా ఉపయోగిస్తుంటారు. అయితే, మొదటి శతాబ్దంలో యేసు శిష్యులు ఆయన పేరును పలికిన తీరు, నేడు చాలామంది క్రైస్తవులు పలికే తీరుకు చాలా వేరుగా ఉండేది. యూదా క్రైస్తవులు యేసు పేరును బహుశా యెషువ అని పలికివుంటారు. “క్రీస్తు” అనే బిరుదునేమో మషియాక్‌ (అంటే, “మెస్సీయ”) అని పలికేవాళ్లు. గ్రీకు భాష మాట్లాడే క్రైస్తవులు ఆయన్ని యీసూస్‌ క్రిస్టోస్‌ అని, లాటిన్‌ భాష మాట్లాడే క్రైస్తవులు ఐసస్‌ క్రిస్టస్‌ అని పిలిచేవాళ్లు. అయితే దేవుని ప్రేరణతో గ్రీకు భాషలోని యేసు పేరు బైబిల్లో నమోదైంది. అంటే, మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఆ పేరుకు తమ భాషలో వాడుకలో ఉన్న పద రూపాన్ని ఉపయోగించి సరైన పని చేశారని స్పష్టమౌతోంది. అదేవిధంగా, ప్రాచీన హీబ్రూ భాషలో దేవుని పేరును ఖచ్చితంగా ఇలాగే పలకకపోయినా, “Jehovah” (యెహోవా) అనే పద రూపాన్ని వాడడం సముచితమని కొత్త లోక బైబిలు అనువాద కమిటీ భావిస్తోంది.

కొత్త లోక అనువాదం బైబిల్లో “Jehovah” (యెహోవా) అనే పద రూపాన్ని ఎందుకు వాడారు? ఇంగ్లీషులో, టెట్రగ్రామటన్‌లోని (יהוה) నాలుగు అక్షరాల్ని YHWH అనే హల్లులతో సూచిస్తారు. ప్రాచీన హీబ్రూ భాషలో రాసేటప్పుడు అచ్చులు ఉపయోగించేవాళ్లు కాదు కాబట్టి టెట్రగ్రామటన్‌లో కూడా అచ్చులు లేవు. ప్రాచీన హీబ్రూ భాష వాడుక భాషగా ఉన్నప్పుడు, చదివేవాళ్లు సరైన అచ్చులు కలుపుకొని ఏ ఇబ్బందీ లేకుండా చదువుకునేవాళ్లు.

1530లో విలియమ్‌ టిండేల్‌ పెంటాటుక్‌ అనువాదంలోని ఆదికాండం 15:2 లో దేవుని పేరు

హీబ్రూ లేఖనాలు రాయడం పూర్తయిన దాదాపు వెయ్యేళ్ల తర్వాత, హీబ్రూ చదివేటప్పుడు ఏ అచ్చుల్ని కలపాలో గుర్తించేందుకు వీలుగా యూదా విద్వాంసులు ఉచ్చారణ చిహ్నాలతో ఒక పద్ధతి రూపొందించారు. కానీ ఆ సమయానికల్లా, చాలామంది యూదులకు దేవుని పేరును బయటికి పలకడం తప్పు అనే మూఢనమ్మకం ఉండడంతో, ఆ పేరుకు బదులు ప్రత్యామ్నాయ పదాలు వాడేవాళ్లు. అందుకేనేమో నకలు చేసేటప్పుడు టెట్రగ్రామటన్‌ వచ్చిన చోట, అలాంటి ప్రత్యామ్నాయ పదాల్లో వాడే అచ్చుల్నే దేవుని పేరును సూచించే నాలుగు హల్లులతో కలిపేవాళ్లు. దానివల్ల, మొదట్లో హీబ్రూ భాషలో దేవుని పేరును ఖచ్చితంగా ఎలా పలికేవాళ్లో తెలుసుకోవడానికి అలాంటి రాతప్రతులు సహకరించవు. కొందరు దేవుని పేరును “యావే” (“Yahweh”) అని పలికేవాళ్లని అంటున్నారు, ఇంకొందరు ఇతర అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక మృత సముద్రపు గ్రంథపు చుట్టలో గ్రీకు భాషలోని లేవీయకాండంలో కొంతభాగం ఉంది, అందులో దేవుని పేరును యావో (Iao) అని లిప్యంతరీకరించారు. అంతేకాదు, యాయే (Iae), యాబే (I·a·be′), యావూవి (I·a·ou·e′) అనే ఉచ్చారణలు కూడా ఉండివుంటాయని తొలి గ్రీకు రచయితల అభిప్రాయం. అయితే, ఈ విషయంలో మొండిగా వాదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రాచీనకాల దేవుని సేవకులు హీబ్రూలో దేవుని పేరును ఎలా పలికేవాళ్లో మనకు తెలీదు. (ఆదికాండం 13:4; నిర్గమకాండం 3:15) మనకు తెలిసిందల్లా, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు తన పేరును చాలాసార్లు ఉపయోగించాడు, వాళ్లు ఆ పేరుతో ఆయన్ని పిలిచారు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆ పేరును విరివిగా వాడారు.—నిర్గమకాండం 6:2; 1 రాజులు 8:23; కీర్తన 99:9.

ఇంతకీ కొత్త లోక అనువాదంలో “Jehovah” (యెహోవా) అనే పద రూపాన్ని ఎందుకు వాడారు? ఎందుకంటే, ఇంగ్లీషు భాషలో చాలాకాలం నుండి దేవుని పేరును అలాగే ఉపయోగిస్తున్నారు.

ఇంగ్లీషు బైబిల్లో దేవుని పేరు మొట్టమొదటిసారి 1530లో విలియమ్‌ టిండేల్‌ చేసిన పెంటాటుక్‌ అనువాదంలో కనిపించింది. అతను “Iehouah” అనే రూపం ఉపయోగించాడు. కాలం గడుస్తుండగా ఇంగ్లీషు భాష మారుతూ వచ్చింది, దాంతో దేవుని పేరు స్పెలింగ్‌ కూడా మారిపోయింది. ఉదాహరణకు, 1612లో హెన్రీ ఎయిన్స్‌వర్త్‌ తాను చేసిన కీర్తనల పుస్తకం అనువాదం అంతటిలో “Iehovah” అనే రూపాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత 1639లో ఆ అనువాదాన్ని రివైజ్‌ చేసి పెంటాటుక్‌తో పాటు ముద్రించినప్పుడు, “Jehovah” అనే రూపాన్ని ఉపయోగించారు. 1901లో, అమెరికన్‌ స్టాండర్డ్‌ వర్షన్‌ బైబిల్ని తయారుచేసిన అనువాదకులు హీబ్రూ లేఖనాల్లో దేవుని పేరు వచ్చిన చోట “Jehovah” అనే రూపాన్ని ఉపయోగించారు.

జోసెఫ్‌ బ్రయంట్‌ రోథర్‌హామ్‌ అనే ప్రముఖ బైబిలు పండితుడు 1911లో తాను రూపొందించిన స్టడీస్‌ ఇన్‌ ద సామ్స్‌ అనే పుస్తకంలో “Yahweh” కాకుండా “Jehovah” అనే రూపాన్ని ఎందుకు ఉపయోగించాడో వివరిస్తూ, “సాధారణంగా బైబిలు చదివే ప్రజలకు బాగా తెలిసిన (అదే సమయంలో పూర్తిగా ఆమోదించబడిన) రూపాన్ని” ఉపయోగించాలని కోరుకున్నట్టు చెప్పాడు. “Jehovah” అనే రూపాన్ని ఉపయోగించడం గురించి 1930లో ఎ. ఎఫ్‌. కర్క్‌ప్యాట్రిక్‌ అనే పండితుడు కూడా అలాంటి కారణాన్నే చెప్పాడు. అతనిలా అన్నాడు: “ఆ పేరును Yahveh లేదా Yahaveh అని చదవాలని కొందరు ఆధునిక వ్యాకరణవేత్తలు వాదిస్తారు; కానీ JEHOVAH అనేది ఇంగ్లీషు భాషలో బలంగా పాతుకుపోయిందని అనిపిస్తుంది. ఆ పేరు ఖచ్చితమైన ఉచ్చారణ అంత ముఖ్యం కాదుగానీ అది ఒక నామవాచకమని, ‘ప్రభువు’ లాంటి ఒక బిరుదు కాదని గుర్తించడమే ముఖ్యమైన విషయం.” తెలుగులో దేవుని పేరును సాధారణంగా “యెహోవా” అని అంటారు. తెలుగు బైబిళ్లు ఎక్కువగా ఈ రూపాన్నే వాడాయి.

టెట్రగ్రామటన్‌, YHWH: “ఆయన అయ్యేలా చేస్తాడు”

క్రియాపదం, HWH:  “అవ్వడం”

యెహోవా అనే పేరుకు అర్థం ఏమిటి? హీబ్రూలో, యెహోవా అనే పేరు “అవ్వడం” అనే అర్థమున్న క్రియాపదం నుండి వచ్చింది; చాలామంది పండితులు ఆ హీబ్రూ క్రియాపదం, ఒక వ్యక్తి ఒక పని చేయడం గురించి చెప్తుందని భావిస్తారు. కాబట్టి, కొత్త లోక బైబిలు అనువాద కమిటీ దేవుని పేరుకు అర్థం, “ఆయన అయ్యేలా (జరిగేలా) చేస్తాడు” లేదా “తానే కర్త అవుతాడు” అని భావిస్తుంది. ఈ విషయంలో విద్వాంసులకు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఆ అర్థం గురించి మొండిగా వాదించలేం. అయితే, అన్నిటినీ సృష్టించిన సృష్టికర్తగా, తన సంకల్పాన్ని నెరవేర్చే వ్యక్తిగా యెహోవా పాత్రకు ఆ నిర్వచనం చక్కగా సరిపోతుంది. ఎందుకంటే, యెహోవా ఈ విశ్వాన్ని, తెలివిగల ప్రాణుల్ని ఉనికిలోకి వచ్చేలా చేయడమే కాదు, కాలం గడుస్తుండగా ఆయన తన ఇష్టం, తన సంకల్పం నెరవేరేలా చేస్తూ ఉన్నాడు.

కాబట్టి, యెహోవా అనే పేరుకున్న అర్థం నిర్గమకాండం 3:14 లో వాడిన సంబంధిత క్రియాపదానికి పరిమితం కాదు. ఆ వచనంలో ఇలా ఉంది: “నేను ఎలా అవ్వాలని అనుకుంటే అలా అవుతాను.” నిజానికి ఆ మాటలు దేవుని పేరుకు ఉన్న పూర్తి అర్థాన్ని చెప్పట్లేదు. బదులుగా అవి దేవుని వ్యక్తిత్వంలోని ఒక అంశాన్ని, అంటే యెహోవా ఒక్కో పరిస్థితిలో తన సంకల్పం నెరవేర్చడానికి ఎలా అవసరమైతే అలా అవుతాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి, యెహోవా అనే పేరుకు ఆ అర్థం కూడా ఉన్నా, అది ఆయన ఎలా అవ్వాలని అనుకుంటాడు అనే దానికి మాత్రమే పరిమితం కాదు. అది, తన సంకల్పం నెరవేర్చడానికి ఆయన తన సృష్టిని ఎలా అయ్యేలా చేస్తాడో కూడా చెప్తుంది.