కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

A3

బైబిలు మన వరకు ఎలా వచ్చింది?

బైబిల్ని రాయించి ఇచ్చిన దేవుడే దాన్ని కాపాడాడు. ఆయనే ఈ మాటలు రాయించాడు:

“మన దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచివుంటుంది.”యెషయా 40:8.

ఆ మాటలు నిజం. మొదట్లోని హీబ్రూ, అరామిక్‌ లేఖనాల a లేదా క్రైస్తవ గ్రీకు లేఖనాల చేతిరాత ప్రతుల్లో ఏవీ మన కాలం వరకు నిలవలేదు అనే మాట వాస్తవమే. అలాంటప్పుడు, ఈ రోజు మన దగ్గరున్న బైబిల్లో నిజంగా మొదట్లో ప్రేరేపించి రాయించిన సమాచారమే ఉందని మనకెలా తెలుసు?

నకలురాసే వాళ్లు దేవుని వాక్యాన్ని భద్రపర్చారు

హీబ్రూ లేఖనాల విషయంలో, లేఖనాల్ని నకలు రాయాలని b చెప్తూ పూర్వం దేవుడు స్థాపించిన ఒక సంప్రదాయాన్ని గమనిస్తే ఆ ప్రశ్నకు కొంతవరకు జవాబు దొరుకుతుంది. ఉదాహరణకు, ధర్మశాస్త్ర ప్రతిని తమ కోసం సొంతగా నకలు రాసుకోవాలని యెహోవా ఇశ్రాయేలు రాజుల్ని నిర్దేశించాడు. (ద్వితీయోపదేశకాండం 17:18) అంతేకాదు ధర్మశాస్త్రాన్ని భద్రపర్చి, దాన్ని ప్రజలకు బోధించే బాధ్యతను ఆయన లేవీయులకు అప్పగించాడు. (ద్వితీయోపదేశకాండం 31:26; నెహెమ్యా 8:7) యూదులు బబులోనుకు బందీలుగా వెళ్లిన తర్వాత, నకలురాసే వాళ్ల, అంటే శాస్త్రుల (సొఫెరిమ్‌) గుంపు ఒకటి మొదలైంది. (ఎజ్రా 7:6, అధస్సూచి) కాలం గడుస్తుండగా, ఈ శాస్త్రులు హీబ్రూ లేఖనాల 39 పుస్తకాల చాలా నకళ్లు తయారుచేశారు.

వందల సంవత్సరాల పాటు, శాస్త్రులు ఈ పుస్తకాల్ని చాలా జాగ్రత్తగా నకలు చేశారు. మధ్య యుగాల్లో మాసొరెట్స్‌ అనే యూదా శాస్త్రులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అతి పురాతనమైన పూర్తి మాసొరెటిక్‌ చేతిరాత ప్రతి లెనిన్‌గ్రాడ్‌ కోడెక్స్‌, ఇది సా.శ. 1008/1009 సంవత్సరానికి చెందినది. అయితే 20వ శతాబ్దం మధ్యలో, మృత సముద్రపు గ్రంథపు చుట్టల మధ్య దాదాపు 220 బైబిలు చేతిరాత ప్రతులు లేదా భాగాలు దొరికాయి. ఇవి లెనిన్‌గ్రాడ్‌ కోడెక్స్‌ కన్నా 1,000 సంవత్సరాల ముందు రాసినవి. మృత సముద్రపు గ్రంథపు చుట్టల్ని లెనిన్‌గ్రాడ్‌ కోడెక్స్‌తో పోల్చిచూస్తే ఒక ముఖ్యమైన విషయం రుజువౌతుంది. అదేంటంటే: మృత సముద్రపు గ్రంథపు చుట్టల్లో, పదాలకు సంబంధించిన కొన్ని తేడాలు ఉన్నా, వాటివల్ల అసలు సందేశం ఏమీ మారలేదు.

మరైతే క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని 27 పుస్తకాల సంగతేంటి? వాటిని మొదట యేసుక్రీస్తు అపొస్తలులు కొంతమంది, తొలి శిష్యులు కొంతమంది రాశారు. యూదా శాస్త్రుల సంప్రదాయాన్ని అనుసరించి తొలి శిష్యులు ఆ పుస్తకాల్ని నకలు రాశారు. (కొలొస్సయులు 4:16) రోమా చక్రవర్తి డయోక్లెషియన్‌, ఇతరులు తొలి క్రైస్తవ సాహిత్యం అంతటినీ నాశనం చేయడానికి ప్రయత్నాలు చేసినా, వేలాది ప్రాచీన లేఖన భాగాలు, చేతిరాత ప్రతులు మన కాలం వరకు భద్రపర్చబడ్డాయి.

క్రైస్తవ లేఖనాల్ని వేరే భాషల్లోకి కూడా అనువదించారు. బైబిల్ని మొట్టమొదట అర్మేనియన్‌, కాప్టిక్‌, ఇతియోపిక్‌, జార్జియన్‌, లాటిన్‌, సిరియాక్‌ వంటి ప్రాచీన భాషల్లోకి అనువదించారు.

అనువాదం కోసం హీబ్రూ, గ్రీకు మూలపాఠాల్ని ఎంచుకోవడం

ప్రాచీన బైబిలు రాతప్రతులన్నిట్లో ఖచ్చితంగా ఒకేలాంటి పదాలు లేవు. అలాంటప్పుడు, మొదట బైబిల్ని రాసినప్పుడు అందులో ఏముందో మనకెలా తెలుస్తుంది?

ఈ పరిస్థితిని, ఉపాధ్యాయుడు పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని 100 మంది విద్యార్థులకు నకలు రాయమని చెప్పడంతో పోల్చవచ్చు. ఒకవేళ తర్వాత అసలు అధ్యాయం పోయినా, ఆ వంద కాపీలను పోల్చి చూస్తే ఆ అధ్యాయంలో ఏముండేదో తెలుస్తుంది. ఒక్కో విద్యార్థి కొన్ని తప్పులు చేయవచ్చు, కానీ విద్యార్థులందరూ అచ్చం ఒకేలాంటి తప్పులు చేయడం మాత్రం చాలాచాలా అరుదు. అదేవిధంగా, పండితులు తమకు అందుబాటులో ఉన్న ప్రాచీన బైబిలు పుస్తకాల వేలాది భాగాల్ని, నకళ్లను పోల్చి చూసినప్పుడు నకలు రాయడంలో దోషాల్ని కనిపెట్టవచ్చు, అసలు మాటలు ఏమిటో నిర్ధారించుకోవచ్చు.

“మన కాలం వరకు వచ్చిన వేరే ప్రాచీనకాల రాతల్లో ఏదీ వాటంత ఖచ్చితంగా లేదని నమ్మకంతో చెప్పవచ్చు”

బైబిలు మొదట రాసినప్పుడు ఉన్న విషయాలు మన కాలం వరకు ఏమాత్రం మారలేదని మనం ఎంతవరకు నమ్మవచ్చు? హీబ్రూ లేఖనాల గురించి వ్యాఖ్యానిస్తూ విలియమ్‌ హెచ్‌. గ్రీన్‌ అనే పండితుడు ఇలా అన్నాడు: “మన కాలం వరకు వచ్చిన వేరే ప్రాచీనకాల రాతల్లో ఏదీ వాటంత ఖచ్చితంగా లేదని నమ్మకంతో చెప్పవచ్చు.” అలాగే క్రైస్తవ గ్రీకు లేఖనాలు, లేదా కొత్త నిబంధన అని పిలవబడే దాని గురించి ఎఫ్‌. ఎఫ్‌. బ్రూస్‌ అనే బైబిలు పండితుడు ఇలా రాశాడు: “మన కొత్త నిబంధనలోని రాతలకు ఉన్న రుజువులు ఇతర ప్రాచీనకాల రచయితలు రాసిన చాలావాటి కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ, వాటి ప్రామాణికతను ప్రశ్నించాలనే ఆలోచన కూడా ఎవరికీ రాదు.” అతను ఇలా కూడా అన్నాడు: “కొత్త నిబంధన అనేది లౌకిక రాతల సముదాయం అయ్యుంటే గనుక, దాని ప్రామాణికత విషయంలో ఎలాంటి సందేహం ఉండేది కాదు.”

మృత సముద్రపు గ్రంథపు చుట్టల్లో యెషయా పుస్తకం 40వ అధ్యాయం (సా.శ.పూ. 125 నుండి 100 మధ్య కాలానికి చెందినది)

వాటిని వెయ్యి సంవత్సరాల తర్వాతి హీబ్రూ చేతిరాత ప్రతులతో పోల్చి చూసినప్పుడు చిన్నచిన్న తేడాలే ఉన్నాయి, అవీ స్పెలింగ్‌కి సంబంధించినవి.

అలెప్పో కోడెక్స్‌లో యెషయా పుస్తకం 40వ అధ్యాయం, ఈ ప్రముఖ హీబ్రూ మాసొరెటిక్‌ చేతిరాత ప్రతి దాదాపు సా.శ. 930 నాటిది

హీబ్రూ మూలపాఠం: హీబ్రూ లేఖనాల కొత్త లోక అనువాదం (1953-1960) ఇంగ్లీషు బైబిల్ని రూఢాల్ఫ్‌ కిట్టెల్‌ రూపొందించిన బిబ్లియా హెబ్రాయికా ఆధారంగా అనువదించారు. ఆ తర్వాత వచ్చిన బిబ్లియా హెబ్రాయికా స్టట్‌గార్టెన్సియా, బిబ్లియా హెబ్రాయికా క్వింటా అనే హీబ్రూ మూలపాఠం అప్‌డేటెడ్‌ ఎడిషన్‌లలో మృత సముద్రపు గ్రంథపు చుట్టల, ఇతర ప్రాచీన చేతిరాత ప్రతుల పరిశోధనలో తేలిన విషయాల్ని చేర్చారు. వీటిలో లెనిన్‌గ్రాడ్‌ కోడెక్స్‌లోని సమాచారమే కనిపిస్తుంది; అయితే అధస్సూచీల్లో పోల్చి చూడడం కోసం సమరిటన్‌ పెంటాటుక్‌, మృత సముద్రపు గ్రంథపు చుట్టలు, గ్రీకు సెప్టువజింటు, అరామిక్‌ టార్గమ్స్‌, లాటిన్‌ వల్గేట్‌, సిరియాక్‌ పెషిట్టా లాంటి ఇతర మూలాల్లోని పదాలు ఉంటాయి. ఇంగ్లీషు భాషలోని కొత్త లోక అనువాదం రివైజ్డ్‌ ఎడిషన్‌ తయారుచేస్తున్నప్పుడు బిబ్లియా హెబ్రాయికా స్టట్‌గార్టెన్సియా, బిబ్లియా హెబ్రాయికా క్వింటా అనే రెండిటినీ సంప్రదించడం జరిగింది.

గ్రీకు మూలపాఠం: 19వ శతాబ్దం చివర్లో బి. ఎఫ్‌. వెస్ట్‌కాట్‌, ఎఫ్‌.జె.ఎ. హార్ట్‌ అనే పండితులు, మొట్టమొదట రాసిన వాటికి దగ్గరగా ఉన్న గ్రీకు ప్రామాణిక మూలపాఠం తయారుచేస్తున్నప్పుడు అందుబాటులో ఉన్న బైబిలు చేతిరాత ప్రతుల్ని, భాగాల్ని పోల్చి చూశారు. 20వ శతాబ్దం మధ్యలో కొత్త లోక బైబిలు అనువాద కమిటీ తన అనువాదం కోసం ఈ ప్రామాణిక మూలపాఠాన్నే ఉపయోగించింది. అలాగే సా.శ. రెండవ, మూడవ శతాబ్దాలకు చెందిన ఇతర పపైరస్‌లను కూడా ఉపయోగించారు. అప్పటినుండి ఇతర పపైరస్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు నెస్లే & ఆలండ్‌, యునైటెడ్‌ బైబిల్‌ సొసైటీస్‌ రూపొందించిన ప్రామాణిక మూలపాఠాల లాంటివి పండితుల తాజా పరిశోధనలకు అద్దంపడతాయి. ఆ పరిశోధనల్లో కనుగొన్న కొన్ని విషయాలు కూడా ఇంగ్లీషు రివైజ్డ్‌ ఎడిషన్‌లో చేర్చబడ్డాయి.

ఆ ప్రామాణిక మూలపాఠాల్ని బట్టి ఒక విషయం రుజువైంది. అదేమిటంటే, కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ లాంటి పాత అనువాదాల్లో కనిపించే కొన్ని వచనాలు నిజానికి నకలుచేసే వాళ్లు చేర్చినవి, అవి అసలు ప్రేరేపిత లేఖనాల్లో భాగం కాదు. అయితే బైబిలు అనువాదాల్లో కనిపించే వచనాల విభజనను ఎప్పుడో 16వ శతాబ్దంలో రూపొందించారు కాబట్టి ప్రేరేపిత లేఖనాల్లో భాగంకాని వచనాల్ని తీసేసినప్పుడు, చాలా బైబిళ్లలో ఆ వచనాలు ఉన్న చోట ఖాళీలు కనిపిస్తాయి. ఆ వచనాలు ఏవంటే: మత్తయి 17:21; 18:11; 23:14; మార్కు 7:16; 9:44, 46; 11:26; 15:28; లూకా 17:36; 23:17; యోహాను 5:4; అపొస్తలుల కార్యాలు 8:37; 15:34; 24:7; 28:29; రోమీయులు 16:24. ఈ బైబిల్లో, ఆ వచనాలు తీసేసిన చోట ఒక అధస్సూచి ఉంటుంది.

మార్కు 16వ అధ్యాయం పెద్ద ముగింపు (9-20 వచనాలు), చిన్న ముగింపు, యోహాను 7:53–8:11లో ఉన్న మాటల విషయానికొస్తే, ఆ వచనాల్లో ఏవీ మొదటి చేతిరాత ప్రతుల్లో లేవని తెలుస్తోంది. కాబట్టి ఆ బూటకపు వచనాల్ని ఈ బైబిల్లో చేర్చలేదు. c

మొదట్లో రాయబడిన సమాచారాన్ని ఉన్నదున్నట్టు తెలియజేయడం విషయంలో పండితులు సాధారణంగా అత్యంత ప్రామాణికం అని అంగీకరించే దాని ఆధారంగా ఇంకొన్ని మార్పులు చేయబడ్డాయి. ఉదాహరణకు, కొన్ని చేతిరాత ప్రతుల ప్రకారం మత్తయి 7:13 లో ఇలా ఉంది: “ఇరుకు ద్వారం గుండా వెళ్లండి; ఎందుకంటే నాశనానికి నడిపించే ద్వారం వెడల్పుగా, ఆ దారి విశాలంగా ఉంది.” కొత్త లోక అనువాదం ముందటి ఇంగ్లీషు ఎడిషన్‌లలో “ద్వారం” అనే మాట లేదు. దానివల్ల “నాశనానికి నడిపించే దారి వెడల్పుగా, విశాలంగా ఉంది” అనే అర్థం వస్తుంది. అయితే, చేతిరాత ప్రతుల అదనపు పరిశోధన వల్ల, మొదట రాసినప్పుడు “ద్వారం” అనే మాట ఉండేదని రుజువైంది. అందుకే రివైజ్డ్‌ ఎడిషన్‌లో దాన్ని చేర్చారు. అలా మెరుగు చేసినవి చాలానే ఉన్నాయి. అయితే అవి చిన్నచిన్నవి, వాటివల్ల దేవుని వాక్యంలోని ప్రాథమిక సందేశం ఏమీ మారదు.

దాదాపు సా.శ. 200 నాటి 2 కొరింథీయులు 4:13–5:4 వచనాల పపైరస్‌ చేతిరాత ప్రతి

a ఇక్కడి నుండి వీటినే హీబ్రూ లేఖనాలు అన్నాం.

b మొదట్లో లేఖనాల్ని పాడైపోయే వాటి మీద రాసేవాళ్లు, అందువల్ల కూడా వాటిని నకలు చేయాల్సి వచ్చేది.

c వాటిని ఎందుకు బూటకమైన వచనాలుగా పరిగణిస్తున్నారో తెలుసుకోవడానికి అదనపు వివరాలు, 1984లో ప్రచురించిన పవిత్ర లేఖనాల కొత్త లోక అనువాదం—రెఫరెన్సులతో ఇంగ్లీషు బైబిలు అధస్సూచీల్లో ఉన్నాయి.