సామెతలు 25:1-28

  • విషయాన్ని రహస్యంగా ఉంచడం (9)

  • సరిగ్గా ఎంచుకున్న మాటలు (11)

  • వేరేవాళ్ల ఇంటికి పదేపదే వెళ్లకు (17)

  • శత్రువు తలమీద నిప్పులు కుప్పగా పోయడం (21, 22)

  • మంచి కబురు చల్లటి నీళ్ల లాంటిది (25)

25  ఇవి కూడా సొలొమోను సామెతలే,+ వీటిని యూదా రాజైన హిజ్కియా+ మనుషులు నకలు రాసి సమకూర్చారు:   విషయాన్ని రహస్యంగా ఉంచడం దేవునికి ఘనత,+విషయాన్ని పరిశోధించడం రాజులకు ఘనత.   ఆకాశం ఎత్తును, భూమి లోతును,రాజుల హృదయాన్ని పరిశోధించడం వీలుకాదు.   వెండి నుండి మలినాన్ని తొలగిస్తేపూర్తిగా శుద్ధి అయిన వెండి బయటికి వస్తుంది.+   రాజు సమక్షం నుండి దుష్టుణ్ణి తొలగిస్తే,అతని సింహాసనం నీతితో సుస్థిరమౌతుంది.+   రాజు ఎదుట నిన్ను నువ్వు ఘనపర్చుకోకు,+వెళ్లి ప్రముఖుల మధ్య నిలబడకు;+   అతను ప్రముఖుడి ముందు నిన్ను అవమానించడం కన్నా, “ఇక్కడికి పైకి రా” అని నీతో అనడం బావుంటుంది.+   తొందరపడి వ్యాజ్యంలో తలదూర్చకు,తర్వాత నీ పొరుగువాడు నిన్ను అవమానిస్తే అప్పుడు నువ్వేం చేస్తావు?+   నీ పొరుగువాడితో వాదిస్తే వాదించు,+కానీ రహస్యంగా నీతో చెప్పినవాటిని* బయటపెట్టకు;+ 10  లేదంటే వినేవాడు నిన్ను అవమానించవచ్చు,నువ్వు ప్రచారం చేసిన చెడ్డవార్తను* వెనక్కి తీసుకోవడం వీలుకాదు. 11  సరైన సమయంలో మాట్లాడిన మాటవెండి పళ్లెంలో ఉన్న బంగారు ఆపిల్‌ పండ్ల లాంటిది.+ 12  తెలివితో గద్దించేవాడు వినేవాడి చెవికి బంగారు చెవిపోగు లాంటివాడు,మేలిమి బంగారు ఆభరణం లాంటివాడు.+ 13  నమ్మకమైన సందేశకుడు తనను పంపిన వ్యక్తికికోతకోసే రోజున కురిసే చల్లటి మంచు లాంటివాడు,అతను తన యజమాని ప్రాణాన్ని సేదదీరుస్తాడు.+ 14  అసలు ఎప్పుడూ ఇవ్వని బహుమతి గురించి గొప్పలు చెప్పుకునేవాడువర్షం కురిపించని గాలి, మబ్బుల లాంటివాడు.+ 15  ఓర్పుతో అధికారిని ఒప్పించవచ్చు,మృదువైన* నాలుక ఎముకల్ని విరగ్గొడుతుంది.+ 16  నీకు తేనె దొరికితే, అవసరమైనంతే తిను,మరీ ఎక్కువ తింటే దాన్ని కక్కేస్తావు.+ 17  నీ పొరుగువాడి ఇంట్లో ఎప్పుడో గానీ అడుగుపెట్టకు,లేకపోతే అతనికి నువ్వంటే విసుగొచ్చి నిన్ను అసహ్యించుకుంటాడు. 18  తన పొరుగువాడి గురించి తప్పుడు సాక్ష్యం చెప్పేవాడుయుద్ధంలో వాడే కర్ర, ఖడ్గం, పదునైన బాణం లాంటివాడు.+ 19  కష్టకాలాల్లో నమ్మదగని వాడి* మీద నమ్మకం పెట్టుకోవడంవిరిగిన పన్ను మీద, బెణికిన పాదం మీద ఆధారపడడం లాంటిది. 20  విచార హృదయం గలవాడి ముందు పాటలు పాడేవాడుచల్లగా ఉన్న రోజున వస్త్రాన్ని తీసేసే వ్యక్తి లాంటివాడు,క్షారం* మీద పుల్లటి ద్రాక్షారసం పోసే వ్యక్తి లాంటివాడు.+ 21  నీ శత్రువు ఆకలితో ఉంటే ఆహారం పెట్టు,అతను దాహంతో ఉంటే నీళ్లు ఇవ్వు;+ 22  అలాచేస్తే అతని తలమీద నిప్పులు కుప్పగా పోస్తావు,*+యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. 23  ఉత్తర గాలి వర్షాన్ని తెస్తుంది,పుకార్లు వ్యాప్తి చేసే నాలుక కోపం తెప్పిస్తుంది.+ 24  గయ్యాళి* భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉండడం కన్నాఇంటి పైకప్పు మీద ఒక మూలన నివసించడం మంచిది.+ 25  దూరదేశం నుండి వచ్చిన మంచి కబురుఅలసిన ప్రాణానికి* చల్లటి నీళ్ల లాంటిది.+ 26  దుష్టుడికి లొంగిపోయే* నీతిమంతుడుబురద లేచిన ఊట లాంటివాడు, పాడైన బావి లాంటివాడు. 27  అతిగా తేనె తినడం మంచిదికాదు,+సొంత మహిమ కోసం పాకులాడడం ఘనత కాదు.+ 28  ఆవేశాన్ని* అదుపు చేసుకోలేనివాడుప్రాకారం లేక నాశనమైన నగరం లాంటివాడు.+

అధస్సూచీలు

లేదా “ఇతరుల రహస్యాల్ని.”
లేదా “పేరు పాడుచేసే పుకారును.”
లేదా “సాత్వికమైన.”
లేదా “మోసగాడి” అయ్యుంటుంది.
లేదా “చాకలి సోడా.”
అంటే, అతన్ని మెత్తబర్చి అతని కఠినత్వాన్ని కరిగించేస్తావు.
లేదా “సతాయించే.”
పదకోశం చూడండి.
లేదా “దుష్టుడితో రాజీపడే.” అక్ష., “దుష్టుడి ముందు తడబడే.”
లేదా “మనసును.”