సామెతలు 12:1-28

  • గద్దింపును అసహ్యించుకునేవాడు మూర్ఖుడు (1)

  • “ఆలోచించకుండా మాట్లాడే మాటలు కత్తిపోట్ల లాంటివి” (18)

  • శాంతి కోసం కృషి చేస్తే సంతోషం ఉంటుంది (20)

  • అబద్ధాలాడే పెదాలు యెహోవాకు అసహ్యం (22)

  • ఆందోళన హృదయాన్ని కృంగదీస్తుంది (25)

12  క్రమశిక్షణను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమిస్తున్నాడు,+గద్దింపును అసహ్యించుకునేవాడు మూర్ఖుడు.*+   మంచివాడు యెహోవా ఆమోదం సంపాదించుకుంటాడు,కుట్రలు పన్నేవాడికి ఆయన తీర్పు తీరుస్తాడు.+   దుష్టత్వం వల్ల ఎవరూ స్థిరపర్చబడరు,*+నీతిమంతులు ఎప్పటికీ పెరికేయబడరు.   సమర్థురాలైన భార్య తన భర్తకు కిరీటం,+అవమానం తెచ్చేలా ప్రవర్తించే భార్య అతని ఎముకలకు కుళ్లు.+   నీతిమంతుల ఆలోచనల్లో న్యాయం ఉంటుంది,దుష్టుల నిర్దేశంలో మోసం ఉంటుంది.   దుష్టుల మాటలు రక్తం చిందించడానికి పొంచివుండే శత్రువు లాంటివి,+కానీ నిజాయితీపరుల నోరు వాళ్లను కాపాడుతుంది.+   దుష్టులు పడిపోయినప్పుడు లేకుండా పోతారు,అయితే నీతిమంతుల ఇల్లు నిలిచివుంటుంది.+   ఒక వ్యక్తి మాటల్లోని బుద్ధిని బట్టి ప్రజలు అతన్ని పొగుడుతారు,+అయితే వంకర హృదయం గలవాళ్లను నీచంగా చూస్తారు.+   ఆహారం లేకపోయినా గొప్పలు చెప్పుకునే వ్యక్తి కన్నా,సేవకుడు ఉన్న మామూలు వ్యక్తి మెరుగైన స్థితిలో ఉన్నాడు.+ 10  నీతిమంతుడు తన పశువుల బాగోగులు చూసుకుంటాడు,+అయితే దుష్టుల కరుణ కూడా క్రూరంగా ఉంటుంది. 11  తన భూమిని సాగుచేసేవాడికి సమృద్ధిగా ఆహారం ఉంటుంది,+పనికిమాలిన వాటిని వెంటాడేవాడు వివేచన లేనివాడు. 12  చెడ్డవాళ్లు దోచుకున్నదాన్ని చూసి దుష్టుడు ఈర్ష్యపడతాడు,నీతిమంతుల వేరు ఫలిస్తుంది. 13  చెడ్డవాడు తన పాపపు మాటల వల్ల ఉరిలో చిక్కుకుంటాడు,+నీతిమంతుడు ఆపదను తప్పించుకుంటాడు. 14  తన నోటి మాటల వల్ల ఒక వ్యక్తికి మంచి జరుగుతుంది,+తన చేతుల కష్టం వల్ల అతను ప్రతిఫలం పొందుతాడు. 15  తెలివితక్కువవాడికి తన దారి సరైనదిగా కనిపిస్తుంది,+అయితే తెలివిగలవాడు సలహా* స్వీకరిస్తాడు.+ 16  తెలివితక్కువవాడు తన చిరాకును వెంటనే* చూపిస్తాడు,+అయితే వివేకం* గలవాడు అవమానాన్ని పట్టించుకోడు.* 17  నమ్మకమైన సాక్షి నిజమే* మాట్లాడతాడు,అబద్ధ సాక్షి మోసకరంగా మాట్లాడతాడు. 18  ఆలోచించకుండా మాట్లాడే మాటలు కత్తిపోట్ల లాంటివి,తెలివిగలవాళ్ల మాటలు గాయాల్ని నయం చేస్తాయి.+ 19  నిజం మాట్లాడే పెదాలు ఎప్పటికీ నిలిచివుంటాయి,+అబద్ధాలాడే నాలుక క్షణకాలమే ఉంటుంది.+ 20  కుట్రలు పన్నేవాళ్ల హృదయంలో మోసం ఉంటుంది,శాంతి కోసం కృషి చేసేవాళ్లు సంతోషంగా ఉంటారు.+ 21  నీతిమంతునికి ఏ హానీ కలగదు,+దుష్టులకు అన్నీ కష్టాలే.+ 22  అబద్ధాలాడే పెదాలు యెహోవాకు అసహ్యం,+నమ్మకంగా ప్రవర్తించేవాళ్లను చూసి ఆయన సంతోషిస్తాడు. 23  వివేకం* గలవాడు తనకు తెలిసింది బయటికి చెప్పడు,కానీ తెలివితక్కువవాళ్ల హృదయం వాళ్ల తెలివితక్కువతనాన్ని వెళ్లగక్కుతుంది.+ 24  శ్రద్ధగా పనిచేసేవాళ్లు ఏలతారు,+బద్దకస్తులు వెట్టిచాకిరి చేయాల్సి వస్తుంది.+ 25  హృదయంలో ఉన్న ఆందోళన దాన్ని* కృంగదీస్తుంది,+మంచి మాట దాన్ని సంతోషపెడుతుంది.+ 26  నీతిమంతులు పచ్చిక మైదానాల కోసం వెదుకుతారు,అయితే దుష్టుల ప్రవర్తన వాళ్లను తప్పుదారి పట్టిస్తుంది. 27  బద్దకస్తుడు వేట జంతువు వెనక పరుగెత్తడు,+కష్టపడే స్వభావమే మనిషి అమూల్యమైన ఆస్తి. 28  నీతి మార్గం జీవానికి నడిపిస్తుంది,+ఆ దారిలో మరణమే ఉండదు.

అధస్సూచీలు

లేదా “బుద్ధిలేనివాడు.”
లేదా “క్షేమంగా ఉండరు.”
లేదా “ఆలోచన.”
లేదా “అదే రోజు.”
లేదా “యుక్తి.”
అక్ష., “కప్పేస్తాడు.”
అక్ష., “నీతిగల మాటలు.”
లేదా “యుక్తి.”
లేదా “మనిషిని.”