నిర్గమకాండం 23:1-33

  • ఇశ్రాయేలీయుల కోసం న్యాయనిర్ణయాలు (1-19)

    • నిజాయితీగా, న్యాయంగా నడుచుకోవడం గురించి (1-9)

    • విశ్రాంతి రోజులు, పండుగల గురించి (10-19)

  • దేవదూత ఇశ్రాయేలీయుల్ని నడిపిస్తాడు (20-26)

  • దేశాన్ని సొంతం చేసుకోవడం, సరిహద్దులు (27-33)

23  “నిజంకాని వార్తను నువ్వు ప్రచారం చేయకూడదు.+ ద్రోహబుద్ధితో అన్యాయపు సాక్ష్యం చెప్పడం ద్వారా దుష్టుడికి సహకరించకు.+  చెడు చేయడానికి సమూహంతో పాటు వెళ్లకూడదు. సమూహాన్ని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో అబద్ధ సాక్ష్యం చెప్పి న్యాయాన్ని పక్కదారి పట్టించకూడదు.  పేదవాడికి సంబంధించిన వివాదంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.+  “నీ శత్రువుకు చెందిన ఎద్దు గానీ గాడిద గానీ దారితప్పి తిరగడం నువ్వు చూస్తే, నువ్వు తప్పకుండా దాన్ని తీసుకెళ్లి అతనికి ఇవ్వాలి.+  నిన్ను ద్వేషించే వ్యక్తికి చెందిన గాడిద దాని బరువు కింద కూలబడి ఉండడం నువ్వు చూస్తే, దాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోకూడదు. ఆ బరువును తీసేయడానికి నువ్వు తప్పకుండా అతనికి సహాయం చేయాలి.+  “నీ మధ్య ఉన్న పేదవాడి వివాదం విషయంలో తీర్పు జరుగుతున్నప్పుడు నువ్వు న్యాయాన్ని పక్కదారి పట్టించకూడదు.+  “అబద్ధ ఆరోపణ జోలికి వెళ్లొద్దు; నిర్దోషిని, నీతిమంతుణ్ణి చంపొద్దు. ఎందుకంటే దుష్టుణ్ణి నేను నీతిమంతునిగా ప్రకటించను.*+  “లంచం తీసుకోకూడదు, ఎందుకంటే అది స్పష్టంగా చూడగలిగేవాళ్లకు గుడ్డితనం కలిగిస్తుంది, నిజాయితీపరుల తీర్పుల్ని మార్చేస్తుంది.+  “పరదేశిని అణచివేయకూడదు. పరదేశిగా ఉంటే ఎలా అనిపిస్తుందో* మీకు తెలుసు. ఎందుకంటే, ఐగుప్తు దేశంలో మీరు పరదేశులుగా నివసించారు. 10  “ఆరు సంవత్సరాల పాటు నువ్వు నీ భూమిలో విత్తనాలు విత్తి, దాని పంట కూర్చుకోవాలి.+ 11  కానీ ఏడో సంవత్సరం దాన్ని సాగుచేయకుండా బీడుగా వదిలేయాలి. అప్పుడు దానిలో ఏమైనా పండితే, నీ మధ్య ఉన్న పేదవాళ్లు దాన్ని తింటారు, వాళ్లు తినగా మిగిలింది అడవి జంతువులు తింటాయి. నీ ద్రాక్షతోట విషయంలో, నీ ఒలీవ తోట విషయంలో కూడా నువ్వు ఇలాగే చేయాలి. 12  “ఆరు రోజులు నువ్వు పని చేయాలి; కానీ ఏడో రోజున నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. దానివల్ల నీ ఎద్దు, నీ గాడిద కూడా విశ్రాంతి తీసుకుంటాయి; నీ దాసురాలి కుమారుడు, పరదేశి సేదదీరుతారు.+ 13  “నేను మీతో చెప్పిందంతా చేసేలా మీరు జాగ్రత్తపడాలి.+ వేరే దేవుళ్ల పేర్లను మీరు పలకకూడదు; అవి మీ నోట వినిపించకూడదు.+ 14  “సంవత్సరానికి మూడుసార్లు మీరు నాకు పండుగ ఆచరించాలి.+ 15  మీరు పులవని రొట్టెల పండుగ ఆచరించాలి.+ నేను మీకు ముందే ఆజ్ఞాపించినట్టు, అబీబు* నెలలో నియమిత సమయంలో ఏడురోజుల పాటు మీరు పులవని రొట్టెలు తింటారు.+ ఎందుకంటే మీరు ఐగుప్తు నుండి బయటికి వచ్చింది ఆ సమయంలోనే. మీలో ఎవ్వరూ నా ముందు వట్టి చేతులతో కనబడకూడదు.+ 16  అంతేకాదు, మీరు కోత పండుగ* కూడా ఆచరించాలి, మీరు పొలంలోని మొదటి పంట కోసే సమయంలో దాన్ని ఆచరించాలి;+ అలాగే సమకూర్చే పండుగ* కూడా ఆచరించాలి; సంవత్సరం చివర్లో, అంటే పొలంలో మీరు చేసిన కష్టానికి ఫలాలు కూర్చుకుంటున్నప్పుడు దాన్ని ఆచరించాలి.+ 17  సంవత్సరంలో మూడుసార్లు మీలోని పురుషులంతా నిజమైన ప్రభువు అయిన యెహోవా ముందు కనిపించాలి.+ 18  “నాకు అర్పించే బలుల రక్తంలో పులిసిందేదీ కలపకూడదు. నా పండుగల్లో అర్పించే కొవ్వును తెల్లారేవరకు ఉండనియ్యకూడదు. 19  “నీ భూమిలో మొదట పండిన ఫలాల్లో శ్రేష్ఠమైనవాటిని నీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి.+ “మేకపిల్లను దాని తల్లి పాలలో ఉడకబెట్టకూడదు.+ 20  “దారిలో మిమ్మల్ని కాపాడడానికి, నేను సిద్ధం చేసిన చోటుకు మిమ్మల్ని తీసుకురావడానికి నేను మీకు ముందుగా ఒక దేవదూతను పంపిస్తున్నాను.+ 21  అతను చెప్పేది శ్రద్ధగా వింటూ, అతని మాటకు లోబడండి. అతని మీద తిరుగుబాటు చేయకండి, అతను మీ తప్పుల్ని మన్నించడు;+ ఎందుకంటే అతను నా పేరున వస్తున్నాడు. 22  అయితే మీరు అతని మాటకు జాగ్రత్తగా లోబడుతూ, నేను చెప్పిందంతా చేస్తే, మీ శత్రువులకు నేను విరోధిగా ఉంటాను, మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్లను వ్యతిరేకిస్తాను. 23  ఎలాగంటే, నా దూత మీకు ముందుగా వెళ్లి అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఉన్న చోటికి మిమ్మల్ని తీసుకొస్తాడు; నేను వాళ్లను సమూలంగా నాశనం చేస్తాను.+ 24  మీరు వాళ్ల దేవుళ్లకు వంగి నమస్కారం చేయకూడదు, వాటిని పూజించడానికి అస్సలు ఒప్పుకోకూడదు, వాళ్ల పద్ధతుల్ని అనుకరించకూడదు.+ బదులుగా మీరు వాటిని కూల్చేయాలి, వాళ్ల పూజా స్తంభాల్ని నలగ్గొట్టాలి.+ 25  మీరు మీ దేవుడైన యెహోవాను సేవించాలి,+ అప్పుడు ఆయన మీ ఆహారాన్ని, నీళ్లను దీవిస్తాడు.+ నేను మీ మధ్య నుండి అనారోగ్యాన్ని తీసేస్తాను.+ 26  నీ దేశంలో స్త్రీలకు గర్భస్రావం కలగదు, వాళ్లు గొడ్రాళ్లుగా ఉండరు;+ అంతేకాదు, నేను నీకు దీర్ఘాయుష్షును* ఇస్తాను. 27  “మీరు అక్కడికి వెళ్లకముందే ఆ ప్రజలు నేనంటే భయపడేలా చేస్తాను,+ మీకు ఎదురయ్యే ప్రజలందర్నీ నేను అయోమయంలో పడేస్తాను; మీ శత్రువులందరూ మీ ముందు ఓడిపోయి పారిపోయేలా* చేస్తాను.+ 28  మీరు అక్కడికి వెళ్లకముందే వాళ్ల గుండెలు జారిపోయేలా చేస్తాను;*+ దానివల్ల హివ్వీయులు, కనానీయులు, హిత్తీయులు మీ ముందు నుండి పారిపోతారు.+ 29  నేను ఒకే సంవత్సరంలో వాళ్లను మీ ముందు నుండి వెళ్లగొట్టను; అలాచేస్తే దేశం నిర్జనమైపోతుంది, దానివల్ల మీకు హానిచేసే అడవి జంతువుల సంఖ్య పెరిగిపోతుంది.+ 30  కాబట్టి, మీ సంఖ్య పెరిగి మీరు దేశాన్ని సొంతం చేసుకునే వరకు నేను మెల్లమెల్లగా వాళ్లను మీ ముందు నుండి వెళ్లగొడతాను.+ 31  “నేను ఎర్రసముద్రం దగ్గర నుండి ఫిలిష్తీయుల సముద్రం* వరకు, ఎడారి దగ్గర నుండి నది* వరకు మీకు సరిహద్దు నియమిస్తాను;+ ఆ దేశంలో నివసించేవాళ్లను నేను మీ చేతికి అప్పగిస్తాను, మీరు వాళ్లను మీ ముందు నుండి వెళ్లగొడతారు.+ 32  మీరు వాళ్లతో గానీ, వాళ్ల దేవుళ్లతో గానీ ఒప్పందం చేసుకోకూడదు.+ 33  నాకు విరోధంగా వాళ్లు మీతో పాపం చేయించకుండా ఉండేలా, వాళ్లు మీ దేశంలో ఉండకూడదు. మీరు వాళ్ల దేవుళ్లను సేవిస్తే, అది తప్పకుండా మీకు ఉరిగా తయారౌతుంది.”+

అధస్సూచీలు

లేదా “దుష్టుణ్ణి నిర్దోషిగా విడుదల చేయను.”
లేదా “పరదేశి జీవితం (ప్రాణం) ఎలా ఉంటుందో.”
అనుబంధం B15 చూడండి.
వారాల పండుగ లేదా పెంతెకొస్తు పండుగ అని కూడా అనేవాళ్లు.
పర్ణశాలల (గుడారాల) పండుగ అని కూడా అనేవాళ్లు.
లేదా “పూర్తి ఆయుష్షును.”
లేదా “మీకు వెన్ను చూపేలా.”
లేదా “వాళ్లకు భయాందోళన కలిగిస్తాను” అయ్యుంటుంది.
అంటే, మధ్యధరా సముద్రం.
అంటే, యూఫ్రటీసు.