రెండో కొరింథీయులు 1:1-24

  • శుభాకాంక్షలు (1, 2)

  • ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుడు ఇచ్చే ఓదార్పు (3-11)

  • పౌలు ప్రయాణ ప్రణాళికల్లో మార్పు (12-24)

1  దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడినైన పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి+ కొరింథులో ఉన్న దేవుని సంఘానికీ, అకయలో+ ఉన్న పవిత్రులందరికీ రాస్తున్న ఉత్తరం.  మన తండ్రైన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.  మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు+ స్తుతించబడాలి. ఆయన ఎంతో కరుణగల* తండ్రి,+ ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు.+  ఆయన మన కష్టాలన్నిట్లో* మనల్ని ఓదారుస్తాడు.*+ దానివల్ల, దేవుని నుండి మనం పొందే ఓదార్పుతో,+ ఎలాంటి కష్టంలో* ఉన్నవాళ్లనైనా మనం ఓదార్చగలుగుతాం.+  ఎందుకంటే క్రీస్తు కోసం మనం పడే బాధలు ఎక్కువయ్యే కొద్దీ,+ క్రీస్తు ద్వారా మనం పొందే ఓదార్పు కూడా ఎక్కువౌతూ ఉంది.  మాకు కష్టాలు* ఎదురైతే, అది మీ ఓదార్పు కోసమే, మీ రక్షణ కోసమే; మాకు ఓదార్పు దొరికినా, అది కూడా మీ ఓదార్పు కోసమే. ఎందుకంటే, మేము పడుతున్న బాధలే మీరు పడేటప్పుడు వాటిని సహించడానికి ఆ ఓదార్పు మీకు సహాయం చేస్తుంది.  మీరు మా బాధల్లో పాలుపంచుకున్నట్టే, మేము పొందే ఓదార్పులో కూడా పాలుపంచుకుంటారని+ తెలుసు కాబట్టి మీ విషయంలో మాకున్న ఆశాభావం చెక్కుచెదరలేదు.  సహోదరులారా, ఆసియా ప్రాంతంలో మాకు ఎదురైన శ్రమ+ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాం. మేము మా సొంత శక్తితో తట్టుకోలేనంత తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాం, ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాం.+  చావు తప్పదని అనుకున్నాం. మేము మా మీద కాకుండా, చనిపోయినవాళ్లను బ్రతికించే దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలని+ అలా జరిగింది. 10  అంతటి ప్రాణాపాయ పరిస్థితి నుండి ఆయన మమ్మల్ని కాపాడాడు, కాపాడతాడు. ముందుముందు కూడా ఆయన మమ్మల్ని కాపాడుతూనే ఉంటాడనే నమ్మకం మాకుంది.+ 11  మా కోసం పట్టుదలగా ప్రార్థించడం ద్వారా మీరు కూడా మాకు సహాయం చేయవచ్చు.+ అప్పుడు, ఎక్కువమంది ప్రార్థనలకు జవాబుగా దేవుడు మాకు సహాయం చేస్తాడేమో,+ దానివల్ల ఎక్కువమంది మా విషయంలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. 12  ఒక విషయంలో మేము గర్వపడుతున్నాం. అదేమిటంటే, మేము ఈ లోకంలో, ముఖ్యంగా మీ విషయంలో పవిత్రంగా, దేవుడు నేర్పించిన నిజాయితీతో నడుచుకున్నామని, మనుషుల తెలివి ప్రకారం కాకుండా+ దేవుని అపారదయకు అనుగుణంగా జీవించామని మా మనస్సాక్షి చెప్తోంది. 13  మీరు చదివి,* అర్థం చేసుకోగలిగే విషయాల్నే మేము రాస్తున్నాం, కాబట్టి మీరు వీటిని పూర్తిగా* అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. 14  మేము మీకు గర్వకారణంగా ఉన్నామని ఇప్పటికే మీలో కొందరు అర్థం చేసుకున్నారు. అలాగే మన ప్రభువైన యేసు రోజున మీరు కూడా మాకు గర్వకారణంగా ఉంటారు. 15  నేను ఆ నమ్మకంతోనే, మీరు ఇంకోసారి సంతోషించేలా* రెండోసారి మీ దగ్గరికి రావాలనుకున్నాను; 16  నేను మాసిదోనియకు వెళ్లేటప్పుడు, అక్కడి నుండి తిరిగొచ్చేటప్పుడు మీ దగ్గరికి రావాలనుకున్నాను. తర్వాత మీరు నన్ను యూదయకు సాగనంపుతారని అనుకున్నాను.+ 17  నేను ఏమీ ఆలోచించకుండా ఊరికే అలా అనుకోలేదు. నేనేమైనా స్వార్థంతో ప్రణాళికలు వేసుకుంటానా? ముందు “అవునవును” అని, తర్వాత “కాదుకాదు” అంటున్నానా? 18  ఈ విషయంలో దేవుడు నమ్మదగినవాడు, మేము ముందు మీకు “అవును” అని చెప్పి, తర్వాత “కాదు” అని అనలేదు. 19  దేవుని కుమారుడు, అంటే యేసుక్రీస్తు ముందు “అవును” అన్నట్టుగా ఉండి తర్వాత “కాదు” అన్నట్టుగా లేడు; నేను, సిల్వాను,* తిమోతి+ మీకు ప్రకటించింది ఆయన గురించే. ఆయన విషయంలో ఎప్పుడైనా సరే “అవును” అనేది “అవును” అన్నట్టుగానే ఉంది. 20  దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్నైనాసరే అవన్నీ యేసుక్రీస్తు ద్వారా “అవును” అన్నట్టుగానే ఉన్నాయి.*+ కాబట్టి, ఆయన ద్వారానే మనం దేవునితో “ఆమేన్‌” అంటాం,+ అలా మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. 21  అయితే మీరు, మేము, మనందరం క్రీస్తుకు చెందినవాళ్లమని భరోసా ఇచ్చేది, మనల్ని అభిషేకించింది దేవుడే.+ 22  అంతేకాదు, ఆయన మన మీద తన ముద్ర కూడా వేశాడు,+ మనం పొందబోయే ఆశీర్వాదాలకు గుర్తును* ఇచ్చాడు; మన హృదయాల్లో ఉన్న పవిత్రశక్తే ఆ గుర్తు.+ 23  దేవుణ్ణి సాక్షిగా పెట్టుకుని ఈ మాట చెప్తున్నాను, మిమ్మల్ని బాధపెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను కొరింథుకు రాలేదు. 24  మీ విశ్వాసం మీద మేము యజమానులమని నేనలా చెప్పట్లేదు.+ బదులుగా మేము మీ సంతోషం కోసం పాటుపడే తోటిపనివాళ్లం, మీ విశ్వాసం వల్లే మీరు స్థిరంగా నిలబడుతున్నారు.

అధస్సూచీలు

లేదా “మృదువైన కరుణగల.”
లేదా “పరీక్షలన్నిట్లో; శ్రమ అంతటిలో.”
లేదా “పరీక్షలో; శ్రమలో.”
లేదా “ప్రోత్సహిస్తాడు.”
లేదా “పరీక్షలు; శ్రమ.”
లేదా “మీకు ఇప్పటికే బాగా తెలిసిన” అయ్యుంటుంది.
అక్ష., “చివరి వరకు.”
లేదా “మీరు రెండుసార్లు ప్రయోజనం పొందేలా” అయ్యుంటుంది.
సీల అని కూడా పిలవబడ్డాడు.
లేదా “నెరవేరాయి.”
లేదా “బయానా (అడ్వాన్సు); పూచీ (టోకెన్‌).”