హెబ్రీయులు 2:1-18

  • ఇంకా ఎక్కువ ధ్యాసపెట్టండి (1-4)

  • అన్నీ యేసుకు లోబర్చబడ్డాయి (5-9)

  • యేసు, ఆయన సహోదరులు (10-18)

    • వాళ్లకు రక్షణనిచ్చే ముఖ్య ప్రతినిధి (10)

    • కరుణగల ప్రధానయాజకుడు (17)

2  అందుకే, మనం విన్నవాటి మీద ఇంకా ఎక్కువ ధ్యాసపెట్టడం అవసరం.+ అలాచేస్తే, మనం ఎప్పటికీ విశ్వాసం నుండి కొట్టుకుపోకుండా ఉంటాం.+  దేవదూతల ద్వారా చెప్పబడిన సందేశం+ స్థిరమైనదని రుజువైంది; అలాగే ప్రతీ పాపానికి, అవిధేయతతో చేసిన ప్రతీ పనికి న్యాయప్రకారం శిక్షపడింది.+  అలాంటప్పుడు, ఇంత గొప్ప రక్షణను అశ్రద్ధ చేస్తే మనం ఎలా శిక్ష తప్పించుకుంటాం?+ ఎందుకంటే ఆ రక్షణ గురించి మన ప్రభువు మొదట ప్రకటించాడు, ఆయన దగ్గర విన్నవాళ్లు దాని గురించి మనకు చెప్పారు.  అంతేకాదు దేవుడు కూడా సూచనలు, అద్భుతాలు, రకరకాల శక్తివంతమైన పనులు చేయడం ద్వారా, తన ఇష్టప్రకారం పవిత్రశక్తి వరాలు ఇవ్వడం ద్వారా+ ఆ రక్షణ గురించి సాక్ష్యమిచ్చాడు.  మేము దేని గురించి మాట్లాడుతున్నామో ఆ రానున్న భూమిని+ దేవుడు దేవదూతలకు లోబర్చలేదు.  కానీ, ఒకసారి ఒక సాక్షి ఇలా రాశాడు: “నువ్వు గుర్తుంచుకోవడానికి మనిషి ఎంతటివాడు? నువ్వు శ్రద్ధ చూపించడానికి మనిషికి పుట్టినవాడు ఎంతటివాడు?+  నువ్వు అతన్ని దేవదూతల కన్నా కాస్త తక్కువవాడిగా చేశావు; మహిమను, ఘనతను అతనికి కిరీటంలా పెట్టావు, నీ చేతులతో చేసినవాటి మీద అతన్ని అధికారిగా నియమించావు.  అన్నిటినీ అతని పాదాల కింద లోబర్చావు.”+ దేవుడు దేన్నీ వదిలిపెట్టకుండా అన్నిటినీ ఆయనకు లోబర్చాడు.+ అయితే ప్రస్తుతానికి, అన్నీ ఆయనకు లోబర్చబడినట్టు మనం ఇంకా చూడట్లేదు.+  కానీ, దేవదూతల కన్నా కాస్త తక్కువవాడిగా చేయబడిన యేసు+ మరణాన్ని చవిచూసినందుకు ఇప్పుడు మహిమను, ఘనతను కిరీటంగా పొందినట్టు+ మాత్రం మనం చూస్తున్నాం. దేవుని అపారదయ వల్ల ప్రతీ మనిషి కోసం ఆయన మరణాన్ని రుచి చూశాడు.+ 10  దేవుని మహిమ కోసమే అన్నీ ఉనికిలో ఉన్నాయి, అన్నీ ఆయన ద్వారానే ఉనికిలో ఉన్నాయి. కాబట్టి ఆయన అనేకమంది కుమారుల్ని మహిమపర్చడం+ కోసం, వాళ్లకు రక్షణనిచ్చే ముఖ్య ప్రతినిధిని+ బాధల ద్వారా పరిపూర్ణుణ్ణి చేయడం+ సరైనదే. 11  పవిత్రపర్చే వ్యక్తికి, పవిత్రపర్చబడేవాళ్లకు+ తండ్రి ఒక్కడే+ కాబట్టి వాళ్లను సహోదరులని పిలవడానికి+ ఆయన సిగ్గుపడడు. 12  ఎందుకంటే ఆయన ఇలా అన్నాడు: “నేను నీ పేరును నా సహోదరులకు ప్రకటిస్తాను; సమాజం మధ్యలో పాటలతో నిన్ను స్తుతిస్తాను.”+ 13  ఆయన ఇంకా ఇలా అన్నాడు: “నేను ఆయన మీద నమ్మకం ఉంచుతాను.”+ అంతేకాదు ఆయన ఇలా కూడా అన్నాడు: “ఇదిగో! నేనూ, యెహోవా* నాకిచ్చిన పిల్లలూ.”+ 14  ఆ “పిల్లలు” రక్తమాంసాలు గలవాళ్లు కాబట్టి ఆయన కూడా రక్తమాంసాలుగల మనిషి అయ్యాడు. మరణాన్ని కలగజేసే సామర్థ్యం ఉన్నవాణ్ణి,+ అంటే అపవాదిని తన మరణం ద్వారా నాశనం చేయడానికి,+ 15  అలాగే మరణ భయం వల్ల జీవితాంతం బానిసత్వంలో ఉన్నవాళ్లందర్నీ విడుదల చేయడానికి+ ఆయన అలా అయ్యాడు. 16  ఎందుకంటే ఆయన వచ్చింది దేవదూతలకు సహాయం చేయడానికి కాదు, అబ్రాహాము సంతానానికి* సహాయం చేయడానికి.+ 17  కాబట్టి ఆయన అన్నిరకాలుగా తన “సహోదరుల్లా” అవ్వాల్సి వచ్చింది.+ అలా ఆయన, ప్రజల పాపాల కోసం ప్రాయశ్చిత్త* బలిని అర్పించడానికి+ వీలుగా దేవుని పనిని కరుణతో, నమ్మకంగా చేసే ప్రధానయాజకుడు అవ్వగలుగుతాడు. 18  పరీక్షలు ఎదురైనప్పుడు ఆయన స్వయంగా బాధ అనుభవించాడు కాబట్టి పరీక్షలు ఎదుర్కొంటున్నవాళ్లకు ఆయన సహాయం చేయగలడు.+

అధస్సూచీలు

అనుబంధం A5 చూడండి.
అక్ష., “విత్తనానికి.”
లేదా “దేవునితో శాంతియుత సంబంధం తిరిగి నెలకొల్పుకోవడానికి తోడ్పడే.”