యోహాను సువార్త 1:1-51

  • వాక్యం శరీరంతో పుట్టాడు (1-18)

  • బాప్తిస్మమిచ్చే యోహాను ఇచ్చిన సాక్ష్యం (19-28)

  • యేసు, దేవుని గొర్రెపిల్ల (29-34)

  • యేసు మొదటి శిష్యులు (35-42)

  • ఫిలిప్పు, నతనయేలు (43-51)

1  మొదట్లో వాక్యం ఉన్నాడు,+ ఆ వాక్యం దేవునితో ఉన్నాడు,+ ఆ వాక్యం ఒక దేవుడు.*+  మొదట్లో ఆయన దేవునితో ఉన్నాడు.  అన్నీ ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి, ఆయన లేకుండా ఏదీ సృష్టించబడలేదు.  ఆయన ద్వారా సృష్టించబడింది ఏమిటంటే, జీవం. ఆ జీవం మనుషులకు వెలుగు.+  ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తోంది, అయితే చీకటి ఆ వెలుగును జయించలేకపోయింది.  దేవుడు పంపించిన ఒక మనిషి ఉన్నాడు, అతని పేరు యోహాను.+  అతని ద్వారా అన్నిరకాల ప్రజలు నమ్మకముంచేలా, అతను ఆ వెలుగు గురించి సాక్ష్యమివ్వడానికి ఒక సాక్షిగా వచ్చాడు.+  అతను ఆ వెలుగు కాదు, కానీ ఆ వెలుగు గురించి సాక్ష్యమివ్వడానికి వచ్చాడు.  అన్నిరకాల మనుషుల మీద ప్రకాశించే నిజమైన వెలుగు లోకంలోకి రాబోతుంది.+ 10  ఆయన లోకంలో ఉన్నాడు. లోకం ఆయన ద్వారానే సృష్టించబడింది,+ అయినా లోకం ఆయన్ని తెలుసుకోలేదు. 11  ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు, కానీ తనవాళ్లే ఆయన్ని అంగీకరించలేదు. 12  ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వాళ్లందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆయన ఇచ్చాడు.+ ఎందుకంటే వాళ్లు ఆయన పేరుమీద విశ్వాసం ఉంచుతున్నారు. 13  వాళ్లు రక్తమాంసాలవల్ల లేదా మానవ తండ్రుల ఇష్టంవల్ల పుట్టలేదు కానీ దేవునివల్ల పుట్టారు.+ 14  ఆ వాక్యం శరీరంతో పుట్టి,+ మన మధ్య జీవించాడు. మనం ఆయన మహిమను చూశాం, అది తండ్రి ఒక్కగానొక్క కుమారునికి+ ఉండేలాంటి మహిమ. ఆయన దేవుని అనుగ్రహంతో,* సత్యంతో నిండివున్నాడు. 15  (యోహాను ఆయన గురించి సాక్ష్యమిస్తూ బిగ్గరగా ఇలా అన్నాడు: “ ‘నా వెనక వచ్చేవాడు ఇప్పుడు నాకంటే గొప్పవాడయ్యాడు, ఎందుకంటే ఆయన నాకన్నా ముందే ఉనికిలో ఉన్నాడు’+ అని నేను చెప్పింది ఈయన గురించే.”) 16  ఆయనలో అపారదయ సమృద్ధిగా ఉంది కాబట్టి మనందరం ఆయన నుండి అపారదయను పొందుతూ వచ్చాం. 17  దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు; అయితే అపారదయను,+ సత్యాన్ని యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు.+ 18  ఏ మనిషీ ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు;+ తండ్రి పక్కన ఉన్న*+ ఒక్కగానొక్క కుమారుడే ఆయన గురించి వివరించాడు, ఆ కుమారుడు దేవునిలా ఉన్నాడు. 19  “నువ్వు ఎవరు?” అని అడగడానికి యూదులు యెరూషలేము నుండి యాజకుల్ని, లేవీయుల్ని పంపించినప్పుడు యోహాను ఈ సాక్ష్యం ఇచ్చాడు.+ 20  అతను జవాబివ్వకుండా తప్పించుకోలేదు కానీ, “నేను క్రీస్తును కాను” అని ఒప్పుకున్నాడు. 21  “మరైతే నువ్వు ఏలీయావా?”+ అని వాళ్లు అడిగినప్పుడు, “కాదు” అన్నాడు. “మరి నువ్వు రావాల్సిన ఆ ప్రవక్తవా?”+ అని అడిగినప్పుడు, “కాదు” అని జవాబిచ్చాడు. 22  కాబట్టి వాళ్లు, “ఇంతకీ నువ్వు ఎవరివి? మాతో చెప్పు, మమ్మల్ని పంపినవాళ్లకు మేము సమాధానం చెప్పాలి. నీ గురించి నువ్వు ఏమని చెప్పుకుంటున్నావు?” అని అతన్ని అడిగారు. 23  అప్పుడు అతను, “యెషయా ప్రవక్త చెప్పినట్టు ‘యెహోవా* మార్గాన్ని ఖాళీగా ఉంచండి’ అని ఎడారిలో* బిగ్గరగా అరుస్తున్న వ్యక్తిని* నేను”+ అని చెప్పాడు.+ 24  వాళ్లను పరిసయ్యులు పంపించారు. 25  కాబట్టి వాళ్లు, “నువ్వు క్రీస్తువు, ఏలీయావు, ఆ ప్రవక్తవు కానప్పుడు బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నావు?” అని అతన్ని అడిగారు. 26  అప్పుడు యోహాను వాళ్లకిలా చెప్పాడు: “నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను. మీ మధ్య ఒకాయన ఉన్నాడు, ఆయన ఎవరో మీకు తెలీదు. 27  ఆయన నా వెనక వస్తున్నాడు, ఆయన చెప్పుల తాడు విప్పే అర్హత కూడా నాకు లేదు.”+ 28  ఈ సంఘటనలు, యోహాను బాప్తిస్మం ఇస్తున్న యొర్దాను నది అవతల ఉన్న బేతనియలో జరిగాయి. 29  తర్వాతి రోజు యేసు తన దగ్గరికి రావడం చూసి యోహాను ఇలా అన్నాడు: “ఇదిగో, లోక పాపాల్ని తీసేసే+ దేవుని గొర్రెపిల్ల!+ 30  ‘నా వెనక ఒకాయన వస్తున్నాడు. ఆయన ఇప్పుడు నాకంటే గొప్పవాడయ్యాడు, ఎందుకంటే ఆయన నాకన్నా ముందే ఉనికిలో ఉన్నాడు’ అని నేను చెప్పింది ఈయన గురించే.+ 31  ఈయన ఎవరో అప్పుడు నాకు కూడా తెలీదు. అయితే ఈయన్ని ఇశ్రాయేలీయులు స్పష్టంగా చూడాలని* నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తూ వచ్చాను.”+ 32  యోహాను ఇలా కూడా సాక్ష్యమిచ్చాడు: “పవిత్రశక్తి పావురం రూపంలో ఆకాశం నుండి దిగిరావడం నేను చూశాను, అది ఈయన మీద ఉండిపోయింది.+ 33  ఈయన ఎవరో అప్పుడు నాకు కూడా తెలీదు. అయితే, నీళ్లలో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపించిన దేవుడే స్వయంగా నాకు ఇలా చెప్పాడు: ‘పవిత్రశక్తి ఎవరిమీదికి దిగివచ్చి ఉండిపోవడం+ నువ్వు చూస్తావో ఆయనే పవిత్రశక్తిలో బాప్తిస్మం ఇస్తాడు.’+ 34  నేను దాన్ని చూశాను, ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చాను.”+ 35  తర్వాతి రోజు యోహాను తన ఇద్దరు శిష్యులతో మళ్లీ అక్కడ నిలబడివున్నాడు. 36  అప్పుడు యేసు అటుగా వెళ్తుండడం చూసి యోహాను, “ఇదిగో, దేవుని గొర్రెపిల్ల!”+ అన్నాడు. 37  ఆ మాట వినగానే, ఆ ఇద్దరు శిష్యులు యేసును అనుసరించారు. 38  యేసు వాళ్లవైపు తిరిగి, వాళ్లు తన వెనక రావడం గమనించి, “మీకేం కావాలి?” అని అడిగాడు. అప్పుడు వాళ్లు, “రబ్బీ (ఆ మాటను అనువదిస్తే, “బోధకుడా” అని అర్థం), నువ్వు ఎక్కడ ఉంటున్నావు?” అని అడిగారు. 39  అప్పుడాయన వాళ్లతో, “వచ్చి చూడండి” అన్నాడు. కాబట్టి వాళ్లు వెళ్లి, ఆయన ఎక్కడ ఉంటున్నాడో చూసి ఆ రోజు ఆయనతోనే ఉండిపోయారు; అప్పుడు దాదాపు సాయంత్రం నాలుగు గంటలైంది.* 40  యోహాను మాటలు విని యేసును అనుసరించిన ఇద్దరిలో ఒకతను అంద్రెయ.+ ఇతను సీమోను పేతురుకు సహోదరుడు. 41  అంద్రెయ మొదట తన సహోదరుడైన సీమోను దగ్గరికి వెళ్లి, “మేము మెస్సీయను (ఆ మాటను అనువదిస్తే, “క్రీస్తు” అని అర్థం) చూశాం”+ అని చెప్పి, 42  అతన్ని యేసు దగ్గరికి తీసుకెళ్లాడు. యేసు అతనివైపు చూసి, “నువ్వు యోహాను కుమారుడివైన సీమోనువు;+ నువ్వు కేఫా (దాన్ని అనువదిస్తే, “పేతురు”*+) అని పిలవబడతావు” అన్నాడు. 43  ఆ తర్వాతి రోజు యేసు గలిలయకు వెళ్లాలనుకున్నాడు. అప్పుడు ఆయన ఫిలిప్పును+ చూసి, “వచ్చి, నన్ను అనుసరించు” అన్నాడు. 44  ఫిలిప్పు బేత్సయిదా నగరానికి చెందినవాడు. అంద్రెయ, పేతురు కూడా అక్కడివాళ్లే. 45  ఫిలిప్పు నతనయేలు+ దగ్గరికి వెళ్లి, “ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించైతే రాశాడో, ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయన్ని మేము కనుగొన్నాం. ఆయనే నజరేతువాడూ యోసేపు+ కుమారుడూ అయిన యేసు” అన్నాడు. 46  అయితే నతనయేలు, “నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా?” అని అతనితో అన్నాడు. అప్పుడు ఫిలిప్పు, “వచ్చి చూడు” అన్నాడు. 47  నతనయేలు తనవైపు వస్తుండడం చూసి యేసు, “ఇదిగో, ఇతను ఏ కపటమూ లేని నిజమైన ఇశ్రాయేలీయుడు”+ అని అన్నాడు. 48  అప్పుడు నతనయేలు, “నేను నీకు ఎలా తెలుసు?” అని యేసును అడిగాడు. దానికి యేసు, “ఫిలిప్పు నిన్ను పిలవకముందే, నువ్వు ఆ అంజూర చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అన్నాడు. 49  అప్పుడు నతనయేలు, “రబ్బీ, నువ్వు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజువి”+ అన్నాడు. 50  అందుకు యేసు అతనితో, “నేను నిన్ను అంజూర చెట్టు కింద చూశానని చెప్పాను కాబట్టి నమ్ముతున్నావా? నువ్వు వీటికన్నా గొప్పవాటిని చూస్తావు” అన్నాడు. 51  తర్వాత యేసు అతనితో ఇలా అన్నాడు: “నేను చాలా ఖచ్చితంగా మీతో చెప్తున్నాను, ఆకాశం* తెరవబడడం, దేవదూతలు మానవ కుమారుని* దగ్గరికి దిగిరావడం, పైకి ఎక్కివెళ్లడం మీరు చూస్తారు.”+

అధస్సూచీలు

లేదా “దేవునిలా ఉన్నాడు.”
లేదా “అపారదయతో.”
లేదా “తండ్రి రొమ్మున ఉన్న.” ఇది ప్రత్యేక అనుగ్రహం ఉన్న స్థానాన్ని సూచిస్తుంది.
అక్ష., “వ్యక్తి స్వరాన్ని.”
పదకోశం చూడండి.
అనుబంధం A5 చూడండి.
అక్ష., “ఈయన ఇశ్రాయేలుకు వెల్లడిచేయబడాలని.”
అక్ష., “దాదాపు పదో గంట అయింది.”
“కేఫా” లేదా “పేతురు” అంటే “రాయి” అని అర్థం.
ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం, ఆకాశాన్ని గానీ పరలోకాన్ని గానీ సూచిస్తుండవచ్చు.
యేసు తన గురించి చెప్పడానికే ఈ పదం వాడాడు. పదకోశం చూడండి.