కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏది తప్పు? ఏది ఒప్పు? బైబిలు—సరైన దారి చూపిస్తుంది

ఏది తప్పు? ఏది ఒప్పు? బైబిలు—సరైన దారి చూపిస్తుంది

మనకు ఏమనిపిస్తుంది, చుట్టూ ఉన్నవాళ్లకు ఏమనిపిస్తుంది అనే దాన్నిబట్టే నిర్ణయాలు తీసుకుంటే, ప్రతీసారి మంచే జరుగుతుందని చెప్పలేం. దానికి కారణమేంటో బైబిలు చెప్తుంది. అంతేకాదు, తప్పు-ఒప్పుల విషయంలో అది సరైన దారి చూపిస్తుంది. అది చూపించే దారిలో వెళ్తే మన జీవన ప్రయాణం సంతోషంగా, హాయిగా సాగిపోతుంది.

సరైన దారిని దేవుడే చూపించగలడు

మనుషులకు తన సహాయం అవసరం అని, సరైనది ఏదో వాళ్లంతట వాళ్లే తెలుసుకోలేరని యెహోవా a చెప్తున్నాడు. (యిర్మీయా 10:23) అందుకే, మంచి విలువలు నేర్పించే ఎన్నో సలహాల్ని ఆయన మన కోసం బైబిల్లో రాయించాడు. ఆయనకు మనమంటే చెప్పలేనంత ప్రేమ ఉంది. మనం తప్పుడు నిర్ణయం తీసుకుని జీవితాన్ని పాడుచేసుకోవడం, తర్వాత బాధపడడం ఆయనకు ఇష్టంలేదు. (ద్వితీయోపదేశకాండం 5:29; 1 యోహాను 4:8) అన్నిటికి మించి, మనకు ఏది మంచిదో-ఏది కాదో చెప్పే తెలివి, జ్ఞానం సృష్టికర్తగా ఆయనకు ఉంది. (కీర్తన 100:3; 104:24) అయినా, తను చూపించే దారిలోనే వెళ్లమని దేవుడు ఎవ్వర్నీ బలవంతపెట్టడు.

యెహోవా దేవుడు భూమ్మీద మొదట ఆదాము, హవ్వ అనే ఒక జంటను తయారుచేశాడు. వాళ్లు సంతోషంగా ఉండడానికి కావల్సినవన్నీ ఇచ్చాడు. (ఆదికాండం 1:28, 29; 2:8, 15) అలాగే వాళ్లకు కొన్ని మంచి మాటలు చెప్పాడు, వాళ్లు ఆయన మాట వినాలని కోరుకున్నాడు. ఆయన చెప్పిన మాట వినాలో లేదో నిర్ణయించుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. (ఆదికాండం 2:9, 16, 17) కానీ ఆదాము హవ్వ దేవుని మాట వినకుండా, తమకు నచ్చినట్టు నడుచుకున్నారు. (ఆదికాండం 3:6) అప్పుడు ఏమైంది? మనుషులు తమకు కరెక్ట్‌ అనిపించింది చేయడం వల్ల సంతోషంగా ఉన్నారా? లేదు. దేవుని మాట వినకపోవడం మనిషికి శాంతిని, సంతోషాన్ని దూరం చేసిందని చరిత్ర రుజువు చేస్తుంది.—ప్రసంగి 8:9.

తప్పు-ఒప్పుల విషయంలో సరైన నిర్ణయం తీసుకునేలా బైబిలు మనకు సహాయం చేస్తుంది. అందులోని సలహాలు అన్ని దేశాల వాళ్లకు, సంస్కృతుల వాళ్లకు ఉపయోగపడతాయి. (2 తిమోతి 3:16, 17; “ బైబిలు—అందరి కోసం . . . ” అనే బాక్సు చూడండి.) బైబిలు ఎలాంటి సలహాలు ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.

బైబిల్ని “దేవుని వాక్యం” అని ఎందుకు అంటారో తెలుసుకోండి.—1 థెస్సలొనీకయులు 2:13. jw.org వెబ్‌సైట్‌లో బైబిలుకు మూలం ఎవరు? అనే వీడియో చూడండి.

బైబిలు ద్వారా దేవుడు సరైన దారి చూపిస్తున్నాడు

మొదటి నుండి దేవుడు మనుషులకు ఏం చెప్పాడో, వాళ్లతో ఎలా ఉన్నాడో బైబిల్లో ఉంది. దేవుని దృష్టిలో ఏది తప్పో, ఏది ఒప్పో; మనకు ఏది మంచి చేస్తుందో, ఏది హాని చేస్తుందో తెలుసుకోవడానికి బైబిలు సహాయం చేస్తుంది. (కీర్తన 19:7, 11) అది నేర్పించే పాఠాలు ఎప్పటికీ ఉపయోగపడతాయి, వాటిని తెలుసుకుంటే మనం తెలివైన నిర్ణయాలు తీసుకుంటాం.

ఉదాహరణకు సామెతలు 13:20 ఇలా చెప్తుంది: “తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు.” ఆ మాట ఒకప్పుడు ఎంత బాగా ఉపయోగపడిందో, ఇప్పుడు కూడా అంతే బాగా ఉపయోగపడుతుంది. బైబిల్లో అలాంటి విలువైన సలహాలు బోలెడన్ని ఉన్నాయి.—“ బైబిలిచ్చే సలహాలు తరతరాలకు ఉపయోగపడతాయి” అనే బాక్సు చూడండి.

కానీ, “బైబిల్లో ఉన్న సలహాలు ఈరోజుల్లో పనికొస్తాయా?” అని మీకు అనిపించవచ్చు. బైబిలు సలహాలు ఈరోజుల్లో కొంతమందికి ఎలా ఉపయోగపడ్డాయో తర్వాతి పేజీల్లో చూస్తాం.

a దేవుని పేరు యెహోవా.—కీర్తన 83:18.