కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం—బైబిలు ఇచ్చే సలహా

వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం—బైబిలు ఇచ్చే సలహా

 “వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవిస్తేనే శాంతి ఉంటుంది.”—యునెస్కో (UNESCO) డిక్లరేషన్‌ ఆఫ్‌ ప్రిన్సిపల్స్‌ ఆన్‌ టాలరెన్స్‌, 1995.

 కానీ వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని సహించకపోతే ఒకరినొకరు గౌరవించుకోకపోగా ద్వేషించుకుంటారు. చివరికి అది తిట్టడానికి, వివక్ష చూపించడానికి, హింసించడానికి దారితీస్తుంది.

 వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడమంటే అవతలివాళ్లు తప్పు చేసినా, సరైనది చేసినా, మంచిగా ప్రవర్తించినా, చెడ్డగా ప్రవర్తించినా ప్రతీదానికీ మద్దతివ్వడం అని కొంతమంది అనుకుంటారు. కానీ ప్రతీఒక్కరికి వాళ్ల సొంత విలువల్ని, నమ్మకాల్ని ఎంచుకునే హక్కు ఉందని; మనకు వాళ్ల విలువలు, నమ్మకాలు నచ్చకపోయినా సరే ఆ హక్కును గౌరవించాలని బైబిలు చెప్తుంది.

 ఈ కంప్యూటర్‌ యుగంలో, ఎదుటివాళ్ల నమ్మకాలు వేరుగా ఉన్నా వాళ్లను గౌరవించడానికి బైబిలు సహాయం చేయగలదా?

వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

 వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించమని బైబిలు ప్రోత్సహిస్తుంది. అదిలా చెప్తుంది: “మీరు పట్టుబట్టే ప్రజలు కాదని అందరికీ తెలియనివ్వండి.” (ఫిలిప్పీయులు 4:5) అంటే మనం అవతలివాళ్ల ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటూ వాళ్లతో మర్యాదగా, మంచిగా ప్రవర్తించాలని బైబిలు చెప్తుంది. ఈ సలహాను పాటించే వ్యక్తి అవతలివాళ్ల నమ్మకాల్ని ఒప్పుకోకపోవచ్చు లేదా అలవర్చుకోకపోవచ్చు గానీ, అవతలివాళ్లను వాళ్లకు నచ్చినట్టుగా ఉండనిస్తాడు.

 అయితే, మనుషుల ప్రవర్తన విషయంలో దేవుడు కొన్ని ప్రమాణాలు పెట్టాడని బైబిలు చెప్తుంది. బైబిలు ఇలా అంటుంది: “ఓ మనిషీ, ఏది మంచిదో ఆయన [దేవుడు] నీకు తెలియజేశాడు.” (మీకా 6:8) మంచి చెడుల విషయంలో దేవుని ప్రమాణాలు పాటిస్తే, మన జీవితమే బాగుంటుంది.—యెషయా 48:17, 18.

 వేరేవాళ్లకు తీర్పు తీర్చే అధికారం దేవుడు మనకు ఇవ్వలేదు. బైబిలు ఇలా చెప్తుంది: “నియమాలు ఇచ్చే వ్యక్తి, తీర్పు తీర్చే వ్యక్తి ఒక్కడే ... సాటిమనిషికి తీర్పు తీర్చడానికి నువ్వెవరు?” (యాకోబు 4:12) దేవుడు ప్రతీఒక్కరికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చాడు, కాబట్టి ఎవరి నిర్ణయాలకు వాళ్లే బాధ్యులు.—ద్వితీయోపదేశకాండం 30:19.

గౌరవించడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

 మనం ‘అందర్నీ గౌరవించాలి’ అని బైబిలు చెప్తుంది. (1 పేతురు 2:17, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కాబట్టి బైబిలు ప్రమాణాల్ని పాటించాలనుకునే వాళ్లు, వేరేవాళ్ల నమ్మకాలు లేదా జీవన విధానం ఎలా ఉన్నా సరే అందర్నీ గౌరవిస్తారు. (లూకా 6:31) అంటే దానర్థం, బైబిలు ప్రకారం జీవించేవాళ్లు అవతలి వాళ్లకున్న ప్రతీ నమ్మకాన్ని లేదా అభిప్రాయాన్ని ఒప్పుకుంటారనీ కాదు, వాళ్లు తీసుకునే ప్రతీ నిర్ణయానికి మద్దతిస్తారనీ కాదు. అలాగని వాళ్లు వేరేవాళ్లతో దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించరు. వాళ్లు యేసులాగే ప్రవర్తించడానికి కృషిచేస్తారు.

 ఉదాహరణకు, యేసు ఒకామెను కలిశాడు. ఆమె మత నమ్మకాలు వేరు, ఆయన నమ్మకాలు వేరు. పైగా, ఆమె తన భర్తతో కాకుండా పరాయి పురుషుడితో కలిసి ఉంటుంది. ఆ జీవన విధానం కూడా యేసుకు ఇష్టం లేదు. అయినప్పటికీ యేసు ఆమెతో గౌరవంగా మాట్లాడాడు.—యోహాను 4:9, 17-24.

 యేసులాగే క్రైస్తవులు కూడా, తమ నమ్మకాల గురించి అడిగినవాళ్లకు కారణాలు వివరించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే వాళ్లు అలా వివరిస్తున్నప్పుడు “ప్రగాఢ గౌరవంతో” మాట్లాడతారు. (1 పేతురు 3:15) క్రైస్తవులు తమ అభిప్రాయాల్ని వేరేవాళ్ల మీద రుద్దకూడదని బైబిలు చెప్తుంది. అది ఇంకా ఏం చెప్తుందంటే, క్రీస్తును అనుసరించే వ్యక్తి “గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు” కానీ, వేరే నమ్మకాలు ఉన్నవాళ్లతో సహా “అందరితో మృదువుగా వ్యవహరించాలి.”—2 తిమోతి 2:24.

ద్వేషించడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

 “అందరితో శాంతిగా ఉండడానికి ... శాయశక్తులా కృషిచేయండి” అని బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 12:14) శాంతిగా ఉండడానికి కృషిచేసే వ్యక్తి ద్వేషానికి చోటివ్వడు. అతను తన సొంత విలువల్ని వదులుకోకుండానే, అందరితో శాంతిగా ఉండడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. (మత్తయి 5:9) నిజానికి, శత్రువుల్ని సైతం ప్రేమించమని, వాళ్లు కఠినంగా ప్రవర్తించినా సరే వాళ్లమీద దయ చూపించమని బైబిలు క్రైస్తవుల్ని ప్రోత్సహిస్తుంది.—మత్తయి 5:44.

 నిజమే, ప్రజల్ని కించపర్చే లేదా వాళ్లకు హానిచేసే పనుల్ని దేవుడు ‘ద్వేషిస్తాడు’ లేదా “అసహ్యించుకుంటాడు” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 6:16-19) అయితే బైబిలు ఇక్కడ, చెడ్డ పనుల్ని విపరీతంగా చీదరించుకోవడాన్ని వర్ణించడానికి ‘ద్వేషించడం’ అనే పదాన్ని ఉపయోగిస్తుంది. ఎవరైతే చెడు మార్గాల్ని విడిచిపెట్టి, తన ప్రమాణాల ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో వాళ్లను క్షమించడానికి, సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడని బైబిలు చెప్తుంది.—యెషయా 55:7.

వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం గురించి బైబిలు వచనాలు

 తీతు 3:2: ‘పట్టుబట్టేవాళ్లుగా ఉండకండి, అందరి పట్ల పూర్తి సౌమ్యతతో మెలగండి.’

 పట్టుబట్టకుండా ఉండే వ్యక్తి, వేరేవాళ్ల అభిప్రాయాలు తనకు నచ్చకపోయినా వాళ్లతో సౌమ్యంగా మాట్లాడతాడు, గౌరవిస్తాడు.

 మత్తయి 7:12: “ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.”

 వేరేవాళ్లు మనల్ని గౌరవించి, మన అభిప్రాయాల్ని-ఫీలింగ్స్‌ని పట్టించుకోవాలని మనందరం కోరుకుంటాం. యేసు చెప్పిన ఈ సూత్రాన్ని ఇంకా ఎలా పాటించవచ్చో తెలుసుకోవడానికి, “బంగారు సూత్రం అంటే ఏంటి?” అనే ఆర్టికల్‌ చూడండి.

 యెహోషువ 24:15: “మీరు ఎవర్ని సేవిస్తారో ఈ రోజే ఎంచుకోండి.”

 ప్రతీఒక్కరికి వాళ్లకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. మనం ఆ హక్కును గౌరవించినప్పుడు శాంతిని కాపాడతాం.

 అపొస్తలుల కార్యాలు 10:34: “దేవునికి పక్షపాతం లేదు.”

 సంస్కృతి, జాతి, తెగ, నేపథ్యం వంటివాటిని బట్టి దేవుడు ఒకర్ని ఎక్కువగా, ఒకర్ని తక్కువగా చూడడు. పురుషుడు-స్త్రీ అనే తేడాను కూడా దేవుడు చూపించడు. దేవుణ్ణి అనుకరించాలనుకునే వాళ్లు ఆయనలాగే అందర్నీ గౌరవిస్తారు.

 హబక్కూకు 1:12, 13: ‘[దేవుడు] దుష్టత్వాన్ని సహించలేడు.’

 దేవుని సహనానికి హద్దులు ఉన్నాయి. దేవుడు ఎప్పటికీ దుష్టత్వాన్ని ఇలాగే ఉండనివ్వడు. ఎక్కువ తెలుసుకోవడానికి, దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు? అనే వీడియో చూడండి.

 రోమీయులు 12:19: “దేవుణ్ణే ఆగ్రహం చూపించనివ్వండి; ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది: ‘పగతీర్చుకోవడం, ప్రతిఫలం ఇవ్వడం నా పని’ అని యెహోవా a అంటున్నాడు.”

 పగతీర్చుకునే అధికారాన్ని యెహోవా దేవుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. ఆయన అనుకున్న టైంలో న్యాయం జరిగేలా ఆయన చూస్తాడు. ఎక్కువ తెలుసుకోవడానికి, “న్యాయం కోసం పెట్టే కేకల్ని వినేవాళ్లే లేరా?” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్‌ చదవండి.

a యెహోవా అనేది దేవుని పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.