కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనకు తోచిన దారిలో వెళ్లడం అన్నిసార్లూ సరైనదేనా?

ఏది తప్పు? ఏది ఒప్పు? చాలామంది ఏం చేస్తున్నారంటే . . .

ఏది తప్పు? ఏది ఒప్పు? చాలామంది ఏం చేస్తున్నారంటే . . .

కొన్ని విషయాల్లో ఇది కరెక్ట్‌, ఇది మాత్రం చాలా తప్పు అని అందరికీ ఒకే అభిప్రాయం ఉంటుంది. ఉదాహరణకు హత్య, మానభంగం (రేప్‌), పిల్లలపై అత్యాచారం లాంటివి తప్పని ప్రతీఒక్కరు అంటారు. అందర్నీ సమానంగా చూడడం, దయ చూపించడం, ఎదుటివాళ్ల బాధను అర్థం చేసుకోవడం లాంటి గుణాల్ని ప్రతీఒక్కరు ఇష్టపడతారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం, అంటే సెక్స్‌, నిజాయితీ, పిల్లల్ని పెంచడం లాంటి వాటిలో ఎవరి ఇష్టం వాళ్లది, ఇది తప్పు-అది ఒప్పు అని మనం చెప్పలేం అంటారు. ‘నాకు ఏమనిపిస్తుంది, నా చుట్టూ ఉన్నవాళ్లకు ఏమనిపిస్తుంది’ అనే దాన్నిబట్టే చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అన్నిసార్లూ అది సరైనదేనా?

నాకు ఏమనిపిస్తుంది?

సాధారణంగా, మనకు ఏం అనిపిస్తుంది అనే దాన్నిబట్టే మనం తప్పు-ఒప్పుల్ని నిర్ణయిస్తుంటాం. ఇంకోమాటలో చెప్పాలంటే, మన మనస్సాక్షి చెప్పినట్టు చేస్తుంటాం. (రోమీయులు 2:14, 15) అంతెందుకు, ఏది కరెక్టో ఏది తప్పో చిన్నపిల్లలకు కూడా తెలుసు, ఏదైనా తప్పు చేస్తే వాళ్లు కూడా బాధపడతారు. పెరిగి పెద్దయ్యే కొద్దీ కుటుంబం, స్నేహితులు, టీచర్లు, సమాజం, మతం, సంస్కృతి చెప్పేవన్నీ మెదడులో ఇంకిపోయి, దానికి తగ్గట్టు మనస్సాక్షి మారిపోతుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఏది తప్పో, ఏది ఒప్పో మనస్సాక్షి చెప్తూ ఉంటుంది.

సాయం చేసేలా, కృతజ్ఞత చూపించేలా, న్యాయంగా ఉండేలా, దయ చూపించేలా మనస్సాక్షి మనల్ని కదిలిస్తుంది. మనం గానీ, మనం ఇష్టపడేవాళ్లు గానీ తలదించుకునేలా, బాధపడేలా చేసే పనులు చేయకుండా మనస్సాక్షి మనల్ని ఆపుతుంది.

మనసుకు తోచింది చేయడం అన్నిసార్లూ సరైనదేనా? గారిక్‌ అనే అబ్బాయి, ‘నాకు ఏది నచ్చితే అది చేస్తాను’ అనేవాడు. అలా, తన మనసుకు తోచింది చేయడం వల్ల చివరికి సమస్యల్లో చిక్కుకున్నాడు. ‘అమ్మాయిలతో తిరగడం, డ్రగ్స్‌కి-తాగుడుకి అలవాటుపడడం, గొడవలకు వెళ్లడం వల్ల నా జీవితం చాలా ఘోరంగా తయారైంది’ అని అతను అన్నాడు.

చుట్టూ ఉన్నవాళ్లకు ఏమనిపిస్తుంది?

మనకు ఏమనిపిస్తుంది అనే దానితోపాటు, నలుగురికీ ఏమనిపిస్తుంది అనే దాన్నిబట్టి కూడా మనం నిర్ణయాలు తీసుకుంటాం. వాళ్ల అనుభవం, తెలివి మనకు ఉపయోగపడతాయి. కుటుంబం, స్నేహితులు, సమాజం చెప్పినట్టు నడుచుకుంటే మనం వాళ్ల దగ్గర మంచిపేరు సంపాదించుకుంటాం.

నలుగురూ చెప్పేది చేయడం అన్నిసార్లూ సరైనదేనా? ప్రిస్కిల్ల అనే అమ్మాయి తన ఫ్రెండ్స్‌లా ఉండాలనుకుంది. వాళ్లలాగే, పెళ్లికి ముందే చాలామందితో తిరిగింది. కానీ ఫ్రెండ్స్‌ చెప్పినట్టు చేయడం వల్ల ఆమె సంతోషం ఆవిరైపోయింది. “నా ఫ్రెండ్స్‌లాగే ఉండడం వల్ల నాకు ఎలాంటి మంచీ జరగలేదు. తెలివితక్కువ పనులు చేసి అనవసరమైన సమస్యల్ని కొనితెచ్చుకున్నాను” అని ఆమె చెప్పింది.

మరి ఇంకేదైనా దారి ఉందా?

మనకు ఏం అనిపిస్తుంది, వేరేవాళ్లకు ఏం అనిపిస్తుంది అనే దాన్నిబట్టే మనం తప్పు-ఒప్పుల్ని నిర్ణయిస్తుంటాం. కానీ దానివల్ల, అన్నిసార్లూ మంచి జరగకపోవచ్చు. సరైన ముందుచూపు లేకపోవడం వల్ల మనం గానీ, వేరేవాళ్లు గానీ సమస్యలో పడవచ్చు. (సామెతలు 14:12) మనకు, మన చుట్టూ ఉన్నవాళ్లకు సరైనది అనిపించే దాన్ని చేస్తే, ఖచ్చితంగా మంచే జరుగుతుంది అనే గ్యారెంటీ ఏమీలేదు. అభిప్రాయాలు అనేవి కాలం గడిచేకొద్దీ మారిపోవచ్చు. ఒకసారి ఆలోచించండి: ఒకప్పుడు చాలా తప్పు అని చెప్పినవి, ఇప్పుడు తప్పే కాదంటున్నారు. ఇదివరకు సరైనవని చెప్పిన వాటినేమో, ఇప్పుడు తప్పుపడుతున్నారు.

నలుగురూ వెళ్లే దారిలో వెళ్లడం అన్నిసార్లూ సరైనదేనా?

మరి ఏం చేస్తే బావుంటుంది? ఇవాళ కరెక్ట్‌ అనిపించి, రేపు తప్పుగా అనిపించే విలువల్ని పాటిస్తే మనం ఇబ్బందుల్లో పడతాం. ఎప్పుడూ ఒకేలా ఉండే మంచి విలువలు ఎక్కడైనా దొరుకుతాయా?

కాలంతో పాటు మారిపోకుండా అందరికీ, అన్నిచోట్లా ఉపయోగపడే మంచి విలువల్ని తెలుసుకోవడానికి ఒక దారి ఉంది. దాన్ని మనం పూర్తిగా నమ్మవచ్చు. దాని గురించి తర్వాతి పేజీల్లో చూస్తాం.