కంటెంట్‌కు వెళ్లు

బైబిల్లో ఒకదానికొకటి విరుద్ధమైన విషయాలు ఉన్నాయా?

బైబిల్లో ఒకదానికొకటి విరుద్ధమైన విషయాలు ఉన్నాయా?

బైబిలు ఇచ్చే జవాబు

 లేవు, బైబిల్లోని విషయాలన్నీ ఒకదానికొకటి పొందికగా ఉన్నాయి. బైబిల్లోని కొన్ని భాగాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని అనిపించినా, ఈ కింద ఇచ్చిన వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సూత్రాలను మనసులో ఉంచుకుని ఆ భాగాలను చదివితే అవి సరిగ్గా అర్థమౌతాయి:

  1.   సందర్భం ఏమిటో చూడండి. ఏ రచయిత రాసిందైనా చదివేటప్పుడు సందర్భాన్ని పట్టించుకోకపోతే, అతను రాసినదాన్ని అతనే వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తుంది.

  2.   రచయిత దృక్కోణాన్ని పరిశీలించండి. ఏదైనా సంఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు, దాని గురించి జరిగింది జరిగినట్టు చెప్తారు, కానీ వాళ్లందరూ ఒకేలా చెప్పరు, అందరూ ఒకే వివరాలు ఇవ్వరు.

  3.   చారిత్రక వాస్తవాల్ని, ఆచారాల్ని పరిగణనలోకి తీసుకోండి.

  4.   ఒక పదాన్ని కొన్నిసార్లు దేన్నైనా సూచించడానికి వాడితే, కొన్నిసార్లు మామూలుగా వాడతారు. ఆ తేడా చూడండి.

  5.   ఏదైనా ఒక పనిని ఒక వ్యక్తి స్వయంగా చేయకపోయినా దాన్ని అతని పనిగా చెప్తారు. a ఆ విషయాన్ని గుర్తించండి.

  6.   తప్పులు లేకుండా అనువదించిన బైబిలును ఉపయోగించండి.

  7.   బైబిలు చెప్పేదానికీ మతపరమైన తప్పుడు ఆలోచనలు లేదా సిద్ధాంతాలకూ పొంతన కుదర్చాలని ప్రయత్నించకండి.

 ఈ కింద కొన్ని ఉదాహరణలు ఇచ్చాం. బైబిల్లో పొంతనలేని విధంగా ఉన్నాయనిపించే కొన్ని భాగాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఆ సూత్రాలు ఎలా ఉపయోగపడతాయో ఈ ఉదాహరణలు చూపిస్తాయి.

1వ సూత్రం: సందర్భం

  దేవుడు ఏడో రోజున విశ్రాంతి తీసుకుంటే, ఆయన ఇంకా ఎలా పని చేస్తూ ఉన్నాడు? ఆదికాండములో, సృష్టికి సంబంధించిన భాగంలోని సందర్భాన్ని చూస్తే, దేవుడు “తాను చేసిన తన పనియంతటినుండి యేడవ దినమున విశ్రమించెను” అనే వాక్యం ప్రత్యేకించి భూమికి సంబంధించిన భౌతిక సృష్టి విషయంలో ఆయన చేసిన పని గురించి మాట్లాడుతుంది. (ఆదికాండము 2:2-4) అయితే ఒక సందర్భంలో యేసు మాట్లాడుతూ, దేవుడు ఇప్పటివరకు “పనిచేయుచున్నాడు” అని చెప్పాడు, అయినా ఆయన ఆదికాండములోని వాక్యం తప్పని అనలేదు. ఎందుకంటే, దేవుడు చేసే వేరే పనుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. (యోహాను 5:17) బైబిలు రాయించడం, మనుషులకు నిర్దేశాలు ఇవ్వడం, వాళ్లను బాగా చూసుకోవడం ఇవన్నీ దేవుడు చేసే పనుల కిందకే వస్తాయి.—కీర్తన 20:6; 105:5; 2 పేతురు 1:21.

2వ, 3వ సూత్రాలు: దృక్కోణం, చరిత్ర

  చూపులేని వ్యక్తిని యేసు ఎక్కడ బాగుచేశాడు? యేసు “యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు” చూపులేని వ్యక్తిని బాగుచేశాడని లూకా పుస్తకంలో ఉంది. కానీ, అదే సందర్భం గురించి మత్తయి పుస్తకంలోనైతే, చూపులేని ఇద్దరు వ్యక్తుల్ని యేసు బాగుచేశాడని, ఆయన “యెరికోనుండి వెళ్లుచుండగా” ఈ సంఘటన జరిగిందని ఉంది. (లూకా 18:35-43; మత్తయి 20:29-34) ఈ రెండు భాగాల్ని రాసినవాళ్లు, విషయాన్ని వేర్వేరు కోణాల్లో నుండి చెప్పారు, నిజానికి ఇద్దరూ కలిసి పూర్తి వివరాలు ఇస్తున్నారు. యేసు ఎంతమందిని బాగుచేశాడనే విషయానికొస్తే, ఇద్దరినని మత్తయి ప్రత్యేకంగా చెప్తున్నాడు. అయితే లూకా మాత్రం యేసు మాట్లాడిన వ్యక్తి మీదే దృష్టి నిలిపాడు. ఇక ప్రదేశం విషయానికొస్తే, యేసు కాలంలో యెరికో రెండు పట్టణాలుగా ఉండేదని పురావస్తుశాస్త్రజ్ఞులు కనిపెట్టారు. యూదుల పాత పట్టణం, రోమీయుల కొత్త పట్టణానికి కిలోమీటరున్నర (1 మైలు) దూరంలో ఉండేది. ఈ అద్భుతం చేసినప్పుడు యేసు ఈ రెండు పట్టణాలకు మధ్య ఉండివుంటాడు.

4వ సూత్రం: సూచనార్థాలు, మామూలు అర్థాలు ఉన్న పదాలు

  భూమి నాశనం అయిపోతుందా? ప్రసంగి 1:4 లో, ‘భూమి ఎల్లప్పుడు నిలుస్తుంది’ అని బైబిలు చెప్తుంది. కానీ మరోచోట, “పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు … కాలిపోవును.” అని చెప్తుంది. (2 పేతురు 3:10) ఈ రెండు వాక్యాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయనడంలో సందేహం లేదని కొంతమంది అనుకోవచ్చు. అయితే, బైబిల్లో “భూమి” అనే పదాన్ని మన గ్రహాన్ని సూచిస్తూ అక్షరార్థంగా వాడారు, అలాగే భూమ్మీద నివసించే ప్రజలను సూచిస్తూ సూచనార్థకంగా కూడా వాడారు. (ఆదికాండము 1:1; 11:1) కాబట్టి, 2 పేతురు 3:10 లోని, “భూమి” నాశనం అయిపోతుందన్న మాటకు అర్థం, మన భూగ్రహం కాలిపోతుందని కాదుగానీ ‘భక్తిహీనులు నాశనం’ అవుతారని.—2 పేతురు 3:7.

5వ సూత్రం: ఏదైనా ఒక పనికి మూలం

  యేసు కపెర్నహూములో ఉన్నప్పుడు, శతాధిపతి విన్నపాన్ని ఆయనకు ఎవరు తెలియజేశారు? స్వయంగా శతాధిపతే (సైనికాధికారి) యేసు దగ్గరకు వచ్చాడని మత్తయి 8:5, 6 వచనాల్లో ఉంది. కానీ లూకా 7:3 మాత్రం, శతాధిపతి తనకోసం వేడుకోవడానికి యూదుల పెద్దలను పంపించాడని చెప్తుంది. ఒకదానికొకటి విరుద్ధంగా కనిపిస్తున్న ఈ రెండు భాగాల్లోని విషయాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు: విన్నపానికి మూలం సైనికాధికారే, కానీ అతను పెద్దలను తన ప్రతినిధులుగా పంపించాడు.

6వ సూత్రం: సరైన అనువాదం

  మనమందరం పాపం చేస్తామా? మొదటి మనిషి ఆదాము నుండి మనమందరం పాపాన్ని వారసత్వంగా పొందామని బైబిలు బోధిస్తోంది. (రోమీయులు 5:12) కొన్ని అనువాదాలు, మంచి మనిషి “పాపము చేయడు” అని చెప్తూ దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. (1 యోహాను 3:6) అయితే, 1 యోహాను 3:6 లోని “పాపం” అనే పదం కోసం మూలభాషలో వాడిన గ్రీకు క్రియాపదం వర్తమాన కాలంలో ఉంది, ఆ భాషలో అది సాధారణంగా జరుగుతూ ఉండే పనిని సూచిస్తుంది. వారసత్వంగా వచ్చే పాపాన్ని మనం ఆపలేం. అయితే ఆ పాపానికి, అదేపనిగా దేవుని నియమాలను ఉల్లంఘిస్తూ కావాలని చేసే పాపానికి తేడా ఉంది. కాబట్టి, కొన్ని అనువాదాలు ఈ వాక్యంలో, “పాపం చేస్తూ ఉండడు” లేదా “అలవాటుగా పాపం చేయడు” వంటి సరైన పదాలు ఉపయోగించాయి. అలా వేరే అనువాదాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు కనిపించే సమస్యను ఇవి పరిష్కరించాయి.—పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌.

7వ సూత్రం: బైబిలు, మత సిద్ధాంతం కాదు

  యేసు, దేవునితో సమానమా? లేదా దేవుని కంటే తక్కువవాడా? ఒకసారి యేసు, “నేనును తండ్రియును ఏకమై యున్నాము” అన్నాడు. ఈ వాక్యం, “తండ్రి నాకంటె గొప్పవాడు” అని ఆయన చెప్పినదానికి విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. (యోహాను 10:30; 14:28) ఈ వచనాల్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, బైబిలు యెహోవా గురించి, యేసు గురించి నిజంగా ఏమి చెప్తుందో మనం పరిశీలించాలి. అంతేగానీ, ఈ వచనాలకూ బైబిలు ఆధారం లేని త్రిత్వ సిద్ధాంతానికీ పొంతన కుదర్చడానికి ప్రయత్నించకూడదు. బైబిలు ఏం చెప్తోందంటే, యెహోవా దేవుడు యేసుకు తండ్రి మాత్రమే కాదు యేసుకు దేవుడు కూడా. ఆయన్ని యేసు కూడా ఆరాధిస్తాడు. (మత్తయి 4:10; మార్కు 15:34; యోహాను 17:3; 20:17; 2 కొరింథీయులు 1:3) యేసు, దేవునితో సమానం కాదు.

 అయితే, యేసు “నేనును తండ్రియును ఏకమై యున్నాము” అని చెప్పినప్పుడు, సంకల్పం విషయంలో తన తండ్రికి తనకు మధ్యవున్న ఏకాభిప్రాయం గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత యేసు ఇలా అన్నాడు: “తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నాము.” (యోహాను 10:38) ఇలా సంకల్పం విషయంలో యేసు తన అనుచరులతో కూడా ఐక్యంగా ఉన్నాడు. దేవునికి చేసిన ప్రార్థనలో ఆయన ఇలా అన్నాడు: ‘మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారియందు నేనును నాయందు నీవును ఉన్నాం.’—యోహాను 17:22, 23.

a ఉదాహరణకు, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా అనే పుస్తకం తాజ్‌మహల్‌ గురించిన ఆర్టికల్లో, “మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ దాన్ని నిర్మించాడు” అని చెప్తుంది. నిజానికి దాన్ని అతనే స్వయంగా నిర్మించలేదు, ఎందుకంటే ఆ ఆర్టికల్‌, దాన్ని కట్టడానికి “20,000 కంటే ఎక్కువ మందిని పనిలో పెట్టుకున్నారు” అని కూడా చెప్తుంది.