కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏది తప్పు? ఏది ఒప్పు? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది

ఏది తప్పు? ఏది ఒప్పు? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది

మన జీవితం సంతోషంగా ఉంటుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? మనం పాటించే విలువల్ని బట్టి. ఆ విషయం యెహోవా దేవునికి తెలుసు. అందుకే, మనం తన విలువల్ని తెలుసుకుని, వాటిని పాటించాలని ఆయన కోరుకుంటున్నాడు.

మనం హాయిగా, సంతోషంగా జీవించాలని యెహోవా కోరుకుంటున్నాడు.

“యెహోవా అనే నేనే నీ దేవుణ్ణి. నీకు ప్రయోజనం కలిగేలా నేనే నీకు బోధిస్తున్నాను, నువ్వు నడవాల్సిన దారిలో నేనే నిన్ను నడిపిస్తున్నాను. నువ్వు నా ఆజ్ఞల్ని శ్రద్ధగా వింటే ఎంత బావుంటుంది! అప్పుడు నీ శాంతి నదిలా, నీ నీతి సముద్ర తరంగాల్లా ఉంటుంది.”—యెషయా 48:17, 18.

యెహోవా దేవుడే మన సృష్టికర్త, కాబట్టి మనం ఎలా జీవిస్తే మంచిది అన్నది ఆయనకే బాగా తెలుసు. మన మేలు కోరే ఆయన సలహాలు ఇస్తున్నాడు. వాటిని పాటిస్తే మనకు మంచి జరుగుతుందా లేదా అని సందేహించాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్టు నడుచుకుంటే మనం ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటాం, హాయిగా-సంతోషంగా జీవిస్తాం.

మన వల్లకాని పనుల్ని చేయమని యెహోవా చెప్పడు

“నేడు నేను నీకు ఇస్తున్న ఈ ఆజ్ఞ నువ్వు పాటించలేనంత కష్టమైనది కాదు, నువ్వు అందుకోలేనంత దూరంలో కూడా లేదు.”—ద్వితీయోపదేశకాండం 30:11.

యెహోవా చెప్పినట్టు నడుచుకోవాలంటే మన ఆలోచనల్లో, పనుల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే యెహోవా మన నుండి మరీ ఎక్కువ ఆశించట్లేదు. మన వల్ల ఏది అవుతుందో, ఏది కాదో సృష్టికర్తకు తెలుసు. యెహోవా గురించి బాగా తెలుసుకుంటే, “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని మీకు అర్థమౌతుంది.—1 యోహాను 5:3.

తను చెప్పినట్టు నడుచుకునేవాళ్లకు సహాయం చేస్తానని యెహోవా మాటిస్తున్నాడు.

“నీ దేవుడైన యెహోవా అనే నేను నీ కుడిచేతిని పట్టుకుంటున్నాను, ‘భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను’ అని నేనే నీతో చెప్తున్నాను.”—యెషయా 41:13.

యెహోవా కోరుకుంటున్నట్టు మనం జీవించగలం, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన వాక్యమైన బైబిలు మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మనలో ఆశను చిగురింపజేస్తుంది.

బైబిలు సలహాల్ని పాటించడం వల్ల తమ జీవితం ఇప్పుడు చాలా బాగుందని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలమంది చెప్తున్నారు. బైబిల్లోని సలహాల్ని మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అందులోని కొన్ని సలహాలు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే బ్రోషురులో ఉన్నాయి. మీరు దాన్ని jw.org వెబ్‌సైట్‌ నుండి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందులో ఈ పాఠాలు ఉన్నాయి:

  • మీరు సంతోషంగా జీవించడానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు?

  • మంచి రోజులు వస్తాయని దేవుడు మాటిస్తున్నాడు

  • దేవుడు చెప్పేవి మీరు నమ్మవచ్చా?

బైబిల్ని బాగా చదివితే, అందులో ఉన్న సలహాలు ఇప్పటికీ పనికొస్తాయని మీరు అర్థం చేసుకుంటారు. బైబిలు సలహాలు ‘ఇప్పుడూ, ఎప్పుడూ ఆధారపడదగినవి.’ (కీర్తన 111:8) మీ జీవన ప్రయాణం బాగుండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే బైబిలు సలహాల్ని పాటించడం కన్నా గొప్ప దారి ఇంకొకటి లేదు. ఆ దారిలోనే వెళ్లమని దేవుడు మనల్ని బలవంతపెట్టడు. (ద్వితీయోపదేశకాండం 30:19, 20; యెహోషువ 24:15) నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.