కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏది తప్పు? ఏది ఒప్పు? బైబిలు చూపించే దారిలో వెళ్తే మంచే జరుగుతుంది!

ఏది తప్పు? ఏది ఒప్పు? బైబిలు చూపించే దారిలో వెళ్తే మంచే జరుగుతుంది!

బైబిలు ఎన్నో లక్షలమందికి ఈ నాలుగు విషయాల్లో సహాయం చేసింది. వాటి గురించి తెలుసుకోండి.

1. పెళ్లి

పెళ్లి గురించి ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగడం కోసం ఒక్కొక్కరు ఒక్కో సలహా చెప్తుంటారు.

బైబిలు సలహా: “మీలో ప్రతీ ఒక్కరు తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి; భార్య విషయానికొస్తే, ఆమెకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి.”—ఎఫెసీయులు 5:33.

అంటే: భార్యాభర్తల బంధాన్ని మొదలుపెట్టింది దేవుడే కాబట్టి వాళ్లు సంతోషంగా ఉండడానికి ఏం అవసరమో ఆయనకు బాగా తెలుసు. (మార్కు 10:6-9) తమకు ఏం కావాలి అనేదాని మీద కాకుండా, తమ జతకు ఏం కావాలి అనే దానిమీద మనసుపెడితే భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. మంచి భర్త తన భార్యను బాగా చూసుకుంటాడు, ఆమెతో ప్రేమగా ఉంటాడు. మంచి భార్య తన భర్తకు తోడుగా ఉంటుంది, ఆయనకు మర్యాద ఇస్తుంది.

బైబిలు సలహాలు పనికొచ్చాయి: వియత్నాంకు చెందిన క్వాంగ్‌, థి అనే జంట తమ దాంపత్య జీవితంలో సంతోషం కరువైపోయిందని గుర్తించారు. క్వాంగ్‌ తన భార్యను ప్రేమగా చూసుకునేవాడు కాదు. అతను ఇలా అన్నాడు: “నేను నా భార్య ఫీలింగ్స్‌ని అస్సలు పట్టించుకునేవాన్ని కాదు, తనను అవమానించేవాన్ని.” దాంతో ఆమె విడాకులు తీసుకోవాలనుకుంది. “నా భర్త మీద నమ్మకం, గౌరవం పూర్తిగా పోయింది” అని ఆమె అంది.

కొన్నిరోజులకు, వాళ్లిద్దరు బైబిలు ఏం చెప్తుందో తెలుసుకున్నారు, ఎఫెసీయులు 5:33 లో ఉన్న సలహాను పాటించారు. క్వాంగ్‌ ఇలా అన్నాడు: “ఈ వచనం చదివాక, నా భార్యతో ప్రేమగా ఉండాలని, ఆమెను బాగా చూసుకోవాలని అర్థం చేసుకున్నాను. తనంటే నాకు ఇష్టం అనే నమ్మకాన్ని తనలో కలిగించాలి అనుకున్నాను. అలా చేసినప్పుడు ఆమె ప్రేమను, గౌరవాన్ని సంపాదించుకున్నాను.” అతని భార్య ఇలా అంది: “ఎఫెసీయులు 5:33 లో ఉన్న సలహాను పాటిస్తూ నా భర్తకు మర్యాద ఇచ్చే కొద్దీ ఆయన నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించాడు. తను తోడున్నాడనే నమ్మకం ఇప్పుడు నాలో కలిగింది, నా మనసు ప్రశాంతంగా ఉంది.”

భార్యాభర్తలకు ఉపయోగపడే మరిన్ని సలహాల కోసం jw.org వెబ్‌సైట్‌లో, తేజరిల్లు! No. 2, 2018 పత్రికను చదవండి. ఆ పత్రిక అంశం: “కుటుంబ విజయానికి 12 సలహాలు.

2. నలుగురితో మెలగడం

దేశం, జాతి, కనబడే తీరు, మతం లాంటి వాటిని బట్టి ప్రజలు కొందర్ని చిన్న చూపు చూస్తారు.

బైబిలు సలహా: “అన్నిరకాల ప్రజల్ని ఘనపర్చండి.”—1 పేతురు 2:17.

అంటే: వేరే దేశం-జాతి వాళ్లను ద్వేషించడం, హోమోసెక్సువల్స్‌ను హేళన చేయడం బైబిలు తప్పు అని చెప్తుంది. దేశం-జాతి, ధనిక-పేద లాంటి తేడాలు చూడకుండా అందర్నీ గౌరవించమని బైబిలు సలహా ఇస్తుంది. (అపొస్తలుల కార్యాలు 10:34) వేరేవాళ్ల నమ్మకాలు, ప్రవర్తన మనలా లేకపోయినా మనం అందరితో దయగా, గౌరవంగా ఉండాలి.—మత్తయి 7:12.

బైబిలు సలహాలు పనికొచ్చాయి: ‘ఆసియా నుండి వచ్చేవాళ్లు మన దేశానికి ముప్పు’ అనే ఆలోచనల మధ్య డానియెల్‌ పెరిగాడు. దాంతో అతను ఆసియాకు చెందినవాళ్లను ద్వేషించేవాడు, తరచూ అందరి ముందు వాళ్లను అవమానించేవాడు. అతను ఇలా అన్నాడు: ‘నాది దేశభక్తి అనుకునేవాన్ని. నేను చేస్తుంది తప్పు అని అస్సలు గుర్తించలేదు.’

తర్వాత డానియెల్‌, బైబిలు ఏం చెప్తుందో తెలుసుకున్నాడు. అతను ఇలా అన్నాడు: “నా ఆలోచనను పూర్తిగా మార్చుకోవాలని అర్థమైంది. ప్రజల్ని దేవుడు చూసినట్టు చూడాలని, అంటే ఏ దేశం వాళ్లయినా అందరూ సమానమే అన్నట్టు చూడాలని తెలుసుకున్నాను.” ప్రజల విషయంలో తన అభిప్రాయం మారిందని చెప్తూ డానియెల్‌ ఇలా అన్నాడు: “ఎదుటివాళ్లది ఏ దేశం, ఏ ప్రాంతం అనేది ఇప్పుడు నేను అస్సలు పట్టించుకోవట్లేదు. నేను అన్నిరకాల ప్రజల్ని ప్రేమిస్తున్నాను, నాకు ప్రపంచమంతటా స్నేహితులు ఉన్నారు.”

ఎక్కువ తెలుసుకోవడానికి jw.org వెబ్‌సైట్‌లో, తేజరిల్లు! No. 3, 2020 పత్రిక చదవండి. ఆ పత్రిక అంశం: “వివక్ష అనే జబ్బును తీసేయడం సాధ్యమేనా?

3. డబ్బు

డబ్బు బాగా సంపాదిస్తే సంతోషంగా ఉంటామని, భవిష్యత్తు బావుంటుందని చాలామంది అనుకుంటారు.

బైబిలు సలహా: “డబ్బులాగే తెలివి కూడా రక్షణగా ఉంటుంది; కానీ జ్ఞానం వల్ల, తెలివి వల్ల ప్రయోజనం ఏమిటంటే, అవి తమ యజమాని ప్రాణాన్ని కాపాడతాయి.”—ప్రసంగి 7:12.

అంటే: డబ్బు అవసరమే, కానీ అది సంతోషాన్ని, మంచి భవిష్యత్తును ఇస్తుందన్న గ్యారంటీ లేదు. (సామెతలు 18:11; 23:4, 5) నిజమైన సంతోషాన్ని సొంతం చేసుకోవాలంటే, రేపటి గురించిన దిగులు లేకుండా ఉండాలంటే బైబిల్లో దేవుడు ఇచ్చిన సలహాల్ని పాటించాలి.—1 తిమోతి 6:17-19.

బైబిలు సలహాలు పనికొచ్చాయి: ఇండోనేషియాకు చెందిన కార్డో అనే అతను డబ్బు వెనకే పరుగులు తీశాడు. అతను ఇలా అన్నాడు: “అందరూ కలలు కనేవాటిని నేను సొంతం చేసుకున్నాను. ఎన్నో దేశాలు తిరిగాను, ఖరీదైన వస్తువులు, కార్లు, బంగ్లాలు కొన్నాను.” కానీ ఉన్నట్టుండి అంతా ఆవిరైపోయింది. అతను ఇలా అన్నాడు: “అందరూ నన్ను మోసం చేశారు. నేను సంపాదించిందంతా రెప్పపాటులో మాయమైపోయింది. పగలు-రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి పనిచేశాను, కానీ చివరికి మిగిలింది శూన్యమే. అన్నీ కోల్పోయి పనికిరాని వాడిగా మిగిలిపోయాను.”

కార్డో డబ్బు గురించి బైబిలు చెప్పే సలహాల్ని తెలుసుకుని, వాటిని పాటించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతను డబ్బు వెంట పరుగులు పెట్టట్లేదు, చాలా సింపుల్‌గా బ్రతుకుతున్నాడు. “దేవునితో ఉండే స్నేహమే నిజమైన ఆస్తి. నేను రోజూ హాయిగా పడుకుంటున్నాను, సంతోషంగా ఉంటున్నాను” అని కార్డో అన్నాడు.

డబ్బు గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవడానికి jw.org వెబ్‌సైట్‌లో, కావలికోట No. 3, 2021 పత్రికలోని “చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?” ఆర్టికల్‌ చదవండి.

4. సెక్స్‌

సెక్స్‌ గురించి నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు.

బైబిలు సలహా: ‘మీరు లైంగిక పాపానికి దూరంగా ఉండాలి. పవిత్రంగా, గౌరవప్రదంగా ఉండాలంటే, మీలో ప్రతీ ఒక్కరికి మీ శరీరాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలిసుండాలి. మీరు దేవుడు తెలియని ప్రజల్లా అత్యాశతో కూడిన లైంగిక వాంఛతో రగిలిపోకూడదు.’—1 థెస్సలొనీకయులు 4:3-5.

అంటే: సెక్స్‌ విషయంలో బైబిలు కొన్ని కట్టుబాట్లు పెట్టింది. వ్యభిచారం; భార్యాభర్తలుకాని వాళ్ల మధ్య సెక్స్‌; మగవాళ్లు-మగవాళ్లు, ఆడవాళ్లు-ఆడవాళ్ల మధ్య సెక్స్‌ తప్పు అని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 6:9, 10) సెక్స్‌ అనేది దేవుడు ఇచ్చిన వరం. అది కేవలం భార్యాభర్తల మధ్యే ఉండాలి.—సామెతలు 5:18, 19.

బైబిలు సలహాలు పనికొచ్చాయి: ఆస్ట్రేలియాకు చెందిన కైలీ ఇలా అంటుంది: “పెళ్లి కాకముందు నేనేం అనుకున్నానంటే, ‘ఎవరైనా అబ్బాయితో సెక్స్‌ చేస్తే అతను నన్ను ప్రేమిస్తాడు, పట్టించుకుంటాడు.’ కానీ నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. నేను కోరుకున్న ప్రేమ నాకు దొరకలేదు, నా మనసు విరిగిపోయింది.”

తర్వాత సెక్స్‌ గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకుని, కైలీ దాన్ని పాటించింది. ఆమె ఇలా అంది: “ఇబ్బందుల్లో చిక్కుకుని బాధపడే పరిస్థితి రాకుండా మనల్ని కాపాడడానికే దేవుడు కొన్ని విలువల్ని నేర్పిస్తున్నాడని అర్థం చేసుకున్నాను. నేను ఇప్పుడు యెహోవాకు నచ్చినట్టు జీవిస్తున్నాను, నాకు పెళ్లి అయింది. నా భర్త నన్ను చాలా ప్రేమగా, కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.”

ఎక్కువ తెలుసుకోవడానికి jw.org వెబ్‌సైట్‌లో, “పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం గురించి బైబిలు ఏం చెప్తుంది?” అనే ఆర్టికల్‌ చదవండి.

ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోవడానికి సృష్టికర్త సహాయం చేస్తాడు. ఆయన చెప్పే విలువల్ని పాటించడం అన్నిసార్లూ అంత తేలికేం కాదు, కానీ పాటిస్తే మనకే మంచిది. వాటిని పాటించడం వల్ల వచ్చే సంతోషం చిరకాలం ఉంటుందని మీరు పూర్తిగా నమ్మవచ్చు.