కంటెంట్‌కు వెళ్లు

యేసును దేవుని కుమారుడు అని బైబిలు ఎందుకు పిలుస్తుంది?

యేసును దేవుని కుమారుడు అని బైబిలు ఎందుకు పిలుస్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిలు తరచూ యేసుక్రీస్తును “దేవుని కుమారుడు” అని పిలుస్తుంది. (యోహాను 1:49) “దేవుని కుమారుడు” అనే మాట దేవుడు మన సృష్టికర్త అని, జీవానికి మూలం ఆయనే అని తెలియజేస్తుంది. అంటే యేసును సృష్టించింది, ఆయనకు జీవాన్ని ఇచ్చింది కూడా దేవుడే. (కీర్తన 36:9; ప్రకటన 4:11) దానర్థం, మనుషులు ఎలాగైతే పిల్లల్ని కంటారో దేవుడు కూడా అలా పిల్లల్ని కన్నాడని బైబిలు చెప్పట్లేదు.

 బైబిలు దేవదూతల్ని కూడా “దేవుని కుమారులు” అని పిలుస్తుంది. (యోబు 1:6, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మొదటి మనిషి అయిన ఆదామును కూడా “దేవుని కొడుకు” అని అంటుంది. (లూకా 3:38) అయితే, దేవుడు మొట్టమొదట సృష్టించింది, స్వయంగా సృష్టించింది యేసునే కాబట్టి, బైబిలు ఆయన్ని దేవుని అద్వితీయ కుమారుడు లేదా ఒక్కగానొక్క కుమారుడు అని పిలుస్తుంది.

 యేసు భూమ్మీదికి రాకముందు పరలోకంలో ఉన్నాడా?

 అవును. భూమ్మీద మనిషి రూపంలో పుట్టకముందు యేసు పరలోకంలో దేవదూతగా జీవించాడు. యేసే స్వయంగా ఇలా అన్నాడు: “నేను ... పరలోకం నుండి దిగివచ్చాను.”—యోహాను 6:38; 8:23.

 సృష్టిలో దేన్నీ చేయకముందే దేవుడు యేసును సృష్టించాడు. యేసు గురించి బైబిలు ఇలా చెప్తుంది:

 ‘ఆయన ఆరంభం ప్రాచీనకాలాల నుండి, పురాతన కాలాల నుండి ఉంది’ అనే ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు.—మీకా 5:2, NW; మత్తయి 2:4-6.

 యేసు భూమ్మీదికి రాకముందు ఏం చేశాడు?

 ఆయన పరలోకంలో ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు. యేసు చేసిన ఒక ప్రార్థన పరలోకంలో ఆయనకున్న స్థానాన్ని తెలియజేస్తుంది. ఆయన ఇలా ప్రార్థించాడు: “తండ్రీ లోకం ఉనికిలోకి రాకముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉందో అదే మహిమతో ఇప్పుడు నన్ను ... మహిమపర్చు.”—యోహాను 17:5.

 మిగతా వాటన్నిటినీ సృష్టించడంలో తన తండ్రికి సహాయపడ్డాడు. యేసు తన తండ్రితో కలిసి ‘ప్రధానశిల్పిగా’ పనిచేశాడు. (సామెతలు 8:30) యేసు గురించి బైబిలు ఇలా చెప్తుంది: “అటు పరలోకంలో ఇటు భూమ్మీద, ... దేవుడు ఆయన్ని ఉపయోగించుకొనే అన్నిటినీ సృష్టించాడు.”—కొలొస్సయులు 1:16.

 దేవుడు యేసు ద్వారానే మిగతా సృష్టి అంతటితో పాటు దేవదూతల్ని, మన విశ్వాన్ని కూడా చేశాడు. (ప్రకటన 5:11) ఒకవిధంగా వాళ్లు చేసిన పనిని ఒక ఇంజనీరు, మేస్త్రీ కలిసి చేసే పనితో పోల్చవచ్చు. ఇంజనీరు డిజైన్‌ ఇస్తాడు, మేస్త్రీ ఆ డిజైన్‌ ఉపయోగించి బిల్డింగ్‌ కడతాడు.

 ఆయన దేవుని ప్రతినిధిగా పనిచేశాడు. భూమ్మీదికి రాకముందు యేసు జీవితం గురించి మాట్లాడుతూ బైబిలు ఆయన్ని “వాక్యం” అని పిలుస్తోంది. (యోహాను 1:1) అంటే, దేవుడు మిగతా దేవదూతలకు సమాచారాన్ని, నిర్దేశాల్ని అందించడానికి తన కుమారుణ్ణి ఉపయోగించుకున్నాడని అర్థమౌతోంది.

 భూమ్మీదున్న మనుషులకు సమాచారాన్ని అందించడానికి కూడా దేవుడు యేసును ఉపయోగించుకుని ఉంటాడు. దేవుడు ఏదెను తోటలో ఆదాముహవ్వలకు యేసు ద్వారానే నిర్దేశాలు ఇచ్చివుంటాడు. (ఆదికాండము 2:16, 17) ప్రాచీన ఇశ్రాయేలీయుల్ని అరణ్యం లేదా ఎడారి గుండా నడిపించిన దేవదూత కూడా యేసే అయ్యుంటాడు. వాళ్లు ‘ఆయన మాటను జాగ్రత్తగా వినాలి’ అని దేవుడు ఆజ్ఞాపించాడు.—నిర్గమకాండము 23:20-23. a

a “వాక్యం,” “మొట్టమొదటి వ్యక్తి” అని పిలవబడిన యేసు ద్వారానే కాక, మిగతా దేవదూతల ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. ఉదాహరణకు, ఆయన ప్రాచీన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని అందజేయడానికి మిగతా దేవదూతల్ని ఉపయోగించుకున్నాడు.—అపొస్తలుల కార్యాలు 7:53; గలతీయులు 3:19; హెబ్రీయులు 2:2, 3.