కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి, క్రీస్తుకు సంబంధించిన సత్యం

దేవునికి, క్రీస్తుకు సంబంధించిన సత్యం

మనుషులు ఎంతోమంది దేవుళ్లను ఆరాధించినప్పటికీ, ఒకేఒక్క సత్య దేవుడు ఉన్నాడు. (యోహాను 17:3) ఆయన ‘మహోన్నతుడు,’ అన్నిటినీ సృష్టించిన సృష్టికర్త, అంతేకాదు జీవానికి మూలం. ఆయన మాత్రమే మన ఆరాధనకు అర్హుడు.—దానియేలు 7:18; ప్రకటన 4:11.

దేవుడు ఎవరు?

బైబిలు మూలప్రతిలో దేవుని పేరు దాదాపు 7,000 సార్లు ఉంది

యెహోవా అనేది దేవుని పేరు

ప్రభువు, దేవుడు, తండ్రి​-అనేవి యెహోవాకు ఉన్న కొన్ని బిరుదులు

దేవుని పేరేంటి? ‘యెహోవాను నేనే, ఇదే నా పేరు’ అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. (యెషయా 42:8) దేవుని పేరు బైబిల్లో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. కానీ, బైబిల్ని వేరే భాషల్లోకి అనువదిస్తున్నప్పుడు ఒక తప్పు జరిగింది. దేవుని పేరు తీసేసి, దాని స్థానంలో “ప్రభువు” అనే బిరుదు పెట్టారు. మనం తనతో స్నేహం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందుకే మనల్ని ‘ఆయన పేరున ప్రార్థించమని’ చెప్తున్నాడు.​—కీర్తన 105:1, NW.

యెహోవాకున్న బిరుదులు. “దేవుడు,” “సర్వశక్తిమంతుడు,” “సృష్టికర్త,” “తండ్రి,” “ప్రభువు,” “సర్వోన్నతుడు” అనే బిరుదులు యెహోవాకు ఉన్నాయని మనం బైబిల్లో చదువుతాం. బైబిల్లో ఎంతోమంది చేసిన ప్రార్థనలు ఉన్నాయి. వాటిని గమనిస్తే, వాళ్లు యెహోవాకున్న గౌరవప్రదమైన బిరుదును, అలాగే ఆయన పేరును ఉపయోగించి ప్రార్థించారని అర్థమౌతుంది.​—దానియేలు 9:4.

దేవుని స్వరూపం. ఆయన ఒక అదృశ్య వ్యక్తి. (యోహాను 4:24) “ఏ మనిషీ ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు” అని బైబిలు చెప్తుంది. (యోహాను 1:18) అంతేకాదు ఆయన భావాల గురించి కూడా బైబిలు చెప్తుంది. మనుషులు తమ మాటలవల్ల, పనులవల్ల ఆయన్ని బాధపెట్టే లేదా సంతోషపెట్టే అవకాశం ఉంది.​—సామెతలు 27:11; కీర్తన 78: 40, 41.

దేవుని అద్భుతమైన గుణాలు. దేవునికి పక్షపాతం లేదు. ఆయన అన్నీ దేశాల, నేపథ్యాల ప్రజలను ఒకేలా చూస్తున్నాడు. (అపొస్తలుల కార్యాలు 10:34, 35) అంతేకాదు, ఆయన “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు.” (నిర్గమకాండము 34:6, 7) అయితే, ఆయనకున్న ఎన్నో గుణాల్లో నాలుగు గుణాలు మాత్రం ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయి. అవేంటంటే:

శక్తి. ఆయన “సర్వశక్తిగల దేవుడు” కాబట్టి ఆయనకు అంతులేని శక్తి ఉంది. ఆ శక్తితో, ఆయన చేస్తానని మాటిచ్చిన ఏ పనైనా ఖచ్చితంగా చేస్తాడు.​—ఆదికాండము 17:1.

తెలివి. ఎవ్వరికీ లేనంత తెలివి దేవునికి ఉంది. అందుకే బైబిలు, ఆయన్ని “ఏకైక జ్ఞాని” అని పిలుస్తుంది.​—రోమీయులు 16:27.

న్యాయం. దేవుడు ఎప్పుడూ సరైనదే చేస్తాడు. ఆయన పనులు “సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు.”​—ద్వితీయోపదేశకాండము 32:4.

ప్రేమ. “దేవుడు ప్రేమ” అని బైబిలు చెప్తుంది. (1 యోహాను 4:8) ఆయన కేవలం ప్రేమను చూపించడమే కాదు, ప్రేమకు స్వరూపం కూడా. ఆయన ఏ పని చేసినా తనకున్న గొప్ప ప్రేమను బట్టే చేస్తాడు. దానివల్ల మనం ఎన్నోరకాలుగా ప్రయోజనం పొందుతాం.

దేవుడు మనుషులతో స్నేహం చేస్తాడు. దేవుడు మన ప్రేమగల పరలోక తండ్రి. (మత్తయి 6:9) మనం ఆయన్ని నమ్మితే, ఆయనకు స్నేహితులం కావచ్చు. (కీర్తన 25:14) నిజానికి మనల్ని ప్రార్థన చేయమని, ఆ విధంగా తనకు దగ్గరవ్వమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అంతేకాదు, ‘మనమంటే ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి మన ఆందోళనంతా ఆయన మీద వేయమని’ చెప్తున్నాడు.​—1 పేతురు 5:7; యాకోబు 4:8.

దేవునికి, క్రీస్తుకు ఉన్న తేడా ఏంటి?

యేసు దేవుని కుమారుడు. యేసు ప్రత్యేకమైన వ్యక్తి, ఎందుకంటే దేవుడు ఆయనను మాత్రమే తన చేతులతో సృష్టించాడు. అందుకే, బైబిలు ఆయన్ని దేవుని కుమారుడు అని పిలుస్తుంది. (యోహాను 20:31) యెహోవా తన మొట్టమొదటి కుమారుడైన యేసును సృష్టించిన తర్వాత, ఆయన్ని ‘ప్రధానశిల్పిగా’ ఉపయోగించుకుని మిగతా సృష్టిని, సృష్టిప్రాణుల్ని చేశాడు.—సామెతలు 8:30, 31; కొలొస్సయులు 1:15, 16.

తాను దేవుడని యేసుక్రీస్తు ఎన్నడూ చెప్పుకోలేదు. బదులుగా, “నేను [దేవుడి] దగ్గర నుండి వచ్చాను; ఆయనే నన్ను పంపించాడు” అని వివరించాడు. (యోహాను 7:29) యేసు తన శిష్యురాలైన ఒకామెతో మాట్లాడుతున్నప్పుడు, యెహోవాను “నా తండ్రీ మీ తండ్రీ, నా దేవుడూ మీ దేవుడూ” అని అన్నాడు. (యోహాను 20:17) యేసు చనిపోయినప్పుడు, యెహోవా ఆయన్ని బ్రతికించి, పరలోకంలో జీవించేలా చేశాడు. ఆ తర్వాత తన కుడివైపున కూర్చునేలా ఆయనకు గొప్ప అధికారం ఇచ్చాడు.—మత్తయి 28:18; అపొస్తలుల కార్యాలు 2:32, 33.

మీరు దేవునికి దగ్గరవ్వడానికి యేసు సహాయం చేయగలడు

యేసు తన తండ్రి గురించి బోధించడానికి భూమ్మీదకు వచ్చాడు. యేసు గురించి యెహోవాయే ఇలా చెప్పాడు, “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినండి.” (మార్కు 9:7) దేవుని గురించి వేరే ఎవ్వరికన్నా ఎక్కువగా యేసుకే తెలుసు. అందుకే యేసు ఇలా చెప్పాడు, “తండ్రి ఎవరో కుమారుడికీ, ఆ కుమారుడు తండ్రిని ఎవరికి వెల్లడిచేయడానికి ఇష్టపడతాడో వాళ్లకూ తప్ప ఇంకెవరికీ తెలీదు.”—లూకా 10:22.

యేసు దేవుని గుణాల్ని పరిపూర్ణంగా చూపించాడు. యేసు తన తండ్రిని ఎంతగా అనుకరించాడంటే, “నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు” అని ఆయన అనగలిగాడు. (యోహాను 14:9) యేసు తన మాటల్లో, పనుల్లో తండ్రి ప్రేమను చూపించాడు; అలా ప్రజలు దేవునికి దగ్గరయ్యేలా సహాయం చేశాడు. యేసు ఇలా అన్నాడు, ‘నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు.’ (యోహాను 14:6) ఆయన ఇంకా ఇలా అన్నాడు, ‘దేవుణ్ణి సరైన విధంగా ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధిస్తారు. నిజానికి తనను అలా ఆరాధించాలని కోరుకునేవాళ్ల కోసమే తండ్రి చూస్తున్నాడు.’ (యోహాను 4:23) ఒకసారి ఆలోచించండి, తన గురించి సత్యం తెలుసుకోవాలని కోరుకునే మీలాంటి వాళ్ల కోసమే యెహోవా వెదుకుతున్నాడు!