కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం దేవున్ని తెలుసుకోగలమా?

మనం దేవున్ని తెలుసుకోగలమా?

“దేవుడు మనకు అర్థం కాడు.” —అలెగ్జాండ్రియాకు చెందిన ఫీలో, మొదటి శతాబ్దంలో తత్వజ్ఞాని.

దేవుడు “మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” —తార్సువాడైన సౌలు, మొదటి శతాబ్దంలో ఏథెన్సులో ఉన్న తత్వజ్ఞానులతో అంటున్నాడు.

ఈ ఇద్దరిలో ఎవరి అభిప్రాయం మీ అభిప్రాయాలకు దగ్గరగా ఉంది? తార్సువాడైన సౌలు లేదా అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటలు చాలామందికి ఆదరణనిస్తూ ఆకట్టుకుంటాయి. (అపొస్తలుల కార్యములు 17:26, 27) బైబిల్లో అలాంటి ఆదరణనిచ్చే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు యేసు చేసిన ప్రార్థనలో ఆయన అనుచరులు దేవున్ని తెలుసుకోవచ్చని ఆయనిచ్చే ఆశీర్వాదం పొందవచ్చని మంచి భరోసా ఉంది.—యోహాను 17:3.

కానీ ఫీలో లాంటి తత్వజ్ఞానులు వేరుగా ఆలోచించారు. దేవుడు మనకు అస్సలు అర్థం కాడు కాబట్టి మనం దేవున్ని ఎప్పటికీ తెలుసుకోలేము అని అన్నారు. మరి నిజం ఏంటి?

నిజమే దేవుని గురించిన కొన్ని విషయాలను మనుషులు అర్థం చేసుకోవడం కష్టమని బైబిలు ఒప్పుకుంటుంది. ఉదాహరణకు, దేవుడు ఎంత కాలంగా ఉన్నాడని గానీ, ఆయన అద్భుతమైన తెలివిని గానీ, అంతులేని జ్ఞానాన్ని గానీ, కొలవలేము, అర్థం చేసుకోలేము. అవి పూర్తిగా మనుషుల అవగాహనకు మించినవి. కానీ ఇలాంటి విషయాలు దేవున్ని తెలుసుకోడానికి అడ్డు రావు. అసలు వాటి గురించి ఆలోచించినప్పుడే మనం దేవునికి దగ్గరౌతాము. (యాకోబు 4:8) అలాంటి గొప్ప విషయాల గురించి కొన్ని ఉదాహరణలు, దేవుని గురించి మనం అర్థం చేసుకోగలిగిన విషయాలు చూద్దాం.

అర్థం చేసుకోలేని విషయాలేంటి?

దేవుడు ఎప్పుడూ ఉన్నాడు: దేవుడు “యుగయుగములు” నుండి ఉన్నాడు అని బైబిల్లో ఉంది. (కీర్తన 90:2) ఇంకో మాటలో చెప్పాలంటే దేవునికి ఆది లేదు, అంతం ఉండదు. ఆయన ఎన్ని సంవత్సరాలు నుండి ఉన్నాడనే విషయాన్ని మనుషులు తెలుసుకోలేరు.—యోబు 36:26.

మీరెలా ప్రయోజనం పొందుతారు: మనం ఆయన్ని నిజంగా తెలుసుకుంటే దేవుడు మనకు నిరంతర జీవితం ఇస్తానని మాటిచ్చాడు. (యోహాను 17:3) దేవుడే నిరంతరం ఉండనివాడైతే ఆ మాటను మనం నమ్మగలమా? యుగములకు రాజు మాత్రమే అలాంటి వాగ్దానం నెరవేర్చగలడు.—1 తిమోతి 1:17.

దేవుని మనసు: దేవుని “జ్ఞానమును శోధించుట అసాధ్యము” ఎందుకంటే ఆయన ఆలోచనలు మన ఆలోచనలకంటే చాలా గొప్పవి అని బైబిల్లో ఉంది. (యెషయా 40:28; 55:9) అందుకే బైబిల్లో ఈ ప్రశ్న ఉంది: “ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింప గల వాడెవడు?”—1 కొరింథీయులు 2:16.

మీరెలా ప్రయోజనం పొందుతారు: దేవుడు లక్షలమంది ప్రార్థనలు ఒకేసారి వినగలడు. (కీర్తన 65:2) ఆయన నేల మీద వాలే పిచ్చుకలను కూడా చూస్తాడు. మిమ్మల్ని చూడలేనంతగా, మీ ప్రార్థనలు వినలేనంతగా దేవుని మనసు వేర్వేరు విషయాలతో నిండిపోయే అవకాశముందా? లేదు. ఆయన మనసుకు అవధులు లేవు. ఇంకా చెప్పాలంటే, “మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.”—మత్తయి 10:29, 30.

దేవుని మార్గాలు: “దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు” మనుషులకు సాధ్యం కాదు అని బైబిలు నేర్పిస్తుంది. (ప్రసంగి 3:11) కాబట్టి దేవుని గురించి మనం పూర్తిగా ఎప్పటికీ తెలుసుకోలేము. దేవుని మార్గాల వెనకున్న జ్ఞానాన్ని కనిపెట్టలేము. (రోమీయులు 11:33) కానీ ఆయనను సంతోషపెట్టాలనుకునే వాళ్లకు దేవుడు ఆయన మార్గాలను తెలియజేస్తాడు.—ఆమోసు 3:7.

దేవుడు ఎంత కాలంగా ఉన్నాడని గానీ, ఆయన అద్భుతమైన తెలివిని గానీ, అంతులేని జ్ఞానాన్ని గానీ, కొలవలేము, అర్థం చేసుకోలేము

మీరెలా ప్రయోజనం పొందుతారు: మీరు బైబిలును చదివి అర్థం చేసుకుంటే, మీరు దేవుని గురించి ఆయన మార్గాల గురించి నేర్చుకుంటూనే ఉంటారు. అప్పుడు మనం మన పరలోక తండ్రికి శాశ్వతంగా దగ్గరవ్వవచ్చు.

అర్థం చేసుకోగలిగిన విషయాలేంటి?

దేవుని గురించి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోలేము కాబట్టి ఆయన్ని అస్సలు తెలుసుకోలేము అని కాదు. బైబిల్లో దేవున్ని బాగా తెలుసుకోడానికి సహాయం చేసే సమాచారం చాలా ఉంది. వాటిలో కొన్ని:

దేవుని పేరు: దేవుడే స్వయంగా ఒక పేరు పెట్టుకున్నాడు అని బైబిల్లో ఉంది. ఆయన, “యెహోవాను నేనే; ఇదే నా నామము” అని చెప్పాడు. దేవుని పేరు బైబిల్లో 7000 సార్లు ఉంది, వేరే ఏ పేరు బైబిల్లో అన్నిసార్లు లేదు.—యెషయా 42:8.

మీరెలా ప్రయోజనం పొందుతారు: ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తూ యేసు ఇలా అన్నాడు: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్తయి 6:9) మీరు కూడా మీ ప్రార్థనల్లో దేవుని పేరు ఉపయోగించగలరా? ఆయన నామానికి చూపించాల్సిన గౌరవం చూపించే వాళ్లందరినీ యెహోవా రక్షించాలి అనుకుంటున్నాడు.—రోమీయులు 10:13.

దేవుడు ఎక్కడ ఉంటాడు: రెండు లోకాలు ఉన్నాయని బైబిలు నేర్పిస్తుంది. ఆత్మ ప్రాణులుండే ఆత్మ సంబంధ లోకం లేదా పరలోకం ఒకటి. భూమి, విశ్వం ఉన్న ఈ లోకం ఇంకొకటి. (యోహాను 8:23; 1 కొరింథీయులు 15:44) బైబిల్లో ఆత్మ ప్రాణులుండే లోకాన్ని “ఆకాశము” అని అంటారు. దేవుడు అక్కడే ఆ “ఆకాశంలో” ఉంటాడు.—1 రాజులు 8:43.

మీరెలా ప్రయోజనం పొందుతారు: మీరు దేవుని గురించి ఇంకా బాగా తెలుసుకుంటారు. దేవుడు అంతటా, అందరిలో ఉండే ఒక అదృశ్య శక్తి కాదు. యెహోవా నిజంగా ఉన్నాడు, ఆయన ప్రత్యేకించి నిజంగా ఒక చోట నివసిస్తాడు. కానీ “ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు.”—హెబ్రీయులు 4:13.

దేవుని లక్షణాలు: యెహోవాకు చాలా మంచి లక్షణాలు ఉన్నా యని బైబిల్లో ఉంది. “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:8) ఆయన అస్సలు అబద్ధం ఆడడు. (తీతు 1:2) ఆయనకు పక్షపాతం లేదు. జాలి, దయ, శాంత గుణం ఉన్నాయి. (నిర్గమకాండము 34:6; అపొస్తలుల కార్యములు 10:34) తనను గౌరవించే వాళ్లకు సృష్టికర్త సన్నిహితుడు అవుతాడని తెలుసుకుని చాలామంది ఆశ్చర్యపోయారు.—కీర్తన 25:14.

మీరెలా ప్రయోజనం పొందుతారు: మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు. (యాకోబు 2:23) యెహోవా లక్షణాల గురించి ఎక్కువగా తెలుసుకున్నప్పుడు మీరు బైబిల్లో చదివే వృత్తాంతాలను బాగా అర్థం చేసుకుంటారు.

‘ఆయనను వెదకండి’

బైబిలు యెహోవా దేవున్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆయన ఊహకందనివాడు కాదు. చెప్పాలంటే సృష్టికర్తే ఆయన గురించి మీరు తెలుసుకోవాలని కోరుతున్నాడు. ఆయన వాక్యమైన బైబిలు ఇలా మాట ఇస్తుంది: “ఆయనను వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును.” (1 దినవృత్తాంతములు 28:9) కాబట్టి బైబిల్లో ఉన్న వృత్తాంతాలు చదువుతూ అర్థం చేసుకుంటూ దేవున్ని ఎందుకు తెలుసుకోకూడదు? తెలుసుకుంటే దేవుడు “మీయొద్దకు వచ్చును” అని బైబిల్లో ఉంది.—యాకోబు 4:8.

బైబిలును చదివి అర్థం చేసుకుంటే, మీరు దేవుని గురించి ఆయన మార్గాల గురించి నేర్చుకుంటూనే ఉంటారు

‘నాకు దేవుని గురించి అన్నీ విషయాలు తెలియనప్పుడు ఆయనతో స్నేహం ఎలా చేయగలను?’ అని మీరనుకోవచ్చు. దీని గురించి ఆలోచించండి: ఒక డాక్టరు ప్రాణ స్నేహితుడు కూడా డాక్టరే అయ్యుండాలా? లేదు. ఆయన వేరే ఏదైనా పని చేస్తుండవచ్చు. ఆ స్నేహితునికి వైద్యానికి సంబంధించిన విషయాలు తెలియకపోయినా వాళ్లిద్దరి మధ్య స్నేహం సాధ్యమే. ఆ స్నేహితుడు డాక్టర్‌ని అర్థం చేసుకుని, ఆయనకేది ఇష్టమో, ఏది ఇష్టం లేదో తెలుసుకోగలిగితే చాలు. అలాగే మీరు కూడా బైబిలు నుండి యెహోవా ఎలాంటి వాడో నేర్చుకోవచ్చు. అప్పుడు మీరు ఆయనతో స్నేహం చేయడానికి ఏమి చేయాలో తెలుసుకుంటారు.

ఏదో కొంత కాకుండా, బైబిల్లో దేవున్ని తెలుసుకోడానికి కావాల్సినంత సమాచారం ఉంది. మీకు యెహోవా దేవుని గురించి తెలుసుకోవాలని ఉందా? యెహోవాసాక్షులు మీకు ఉచితంగా బైబిలు గురించి నేర్పిస్తారు. మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షుల్ని కలవండి, లేదా మా వెబ్‌సైట్‌ www.pr418.com చూడండి. ▪ (w15-E 10/01)