కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ భాగం

మీ పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వాలి?

మీ పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వాలి?

‘నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి.’—ద్వితీయోపదేశకాండము 6:6, 7.

యెహోవా కుటుంబ వ్యవస్థను స్థాపించినప్పుడు, పిల్లల బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగించాడు. (కొలొస్సయులు 3:20) తల్లిదండ్రులారా, మీ పిల్లలు యెహోవాను ప్రేమించేలా వాళ్లకు శిక్షణనిచ్చే పూచీ, వాళ్లను బాధ్యతాయుత వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత మీదే. (2 తిమోతి 1:4, 5; 3:14, 15) మీ బాబు మనసులో లేదా మీ పాప మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలి. అయితే, మీరు ఆదర్శంగా ఉండడం కూడా చాలా అవసరం. యెహోవా వాక్యాన్ని ముందు మీ మనసులో ఉంచుకుంటేనే దాన్ని మీ పిల్లలకు చాలా చక్కగా బోధించగలుగుతారు.—కీర్తన 40:8.

1 మీ పిల్లలు మీతో మొహమాటం లేకుండా మాట్లాడే వాతావరణం కల్పించండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . ‘వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెను.’ (యాకోబు 1:19) ఏ విషయమైనా నిర్మొహమాటంగా మీతో మాట్లాడవచ్చని మీ పిల్లలకు అనిపించాలి, నిజానికి మీ కోరిక కూడా అదే. వాళ్లు మీతో ఏదైనా మాట్లాడాలనుకుంటే, మీరు వినడానికి సిద్ధంగా ఉంటారని వాళ్లకు తెలియాలి. వాళ్ల మనసులోని మాటల్ని మీతో చెప్పుకునే ప్రశాంతమైన వాతావరణం కల్పించండి. (యాకోబు 3:18) మీరు కఠినంగా ఉంటారని లేదా విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఓ అభిప్రాయానికి వచ్చేస్తారని పిల్లలకు అనిపిస్తే, వాళ్లు ఏదీ మీతో చెప్పుకోకపోవచ్చు. మీ పిల్లలతో ఓపికగా వ్యవహరించండి. మీరు వాళ్లను ప్రేమిస్తున్నారనే హామీని ఇస్తూ ఉండండి.—మత్తయి 3:17; 1 కొరింథీయులు 8:1.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మీ పిల్లలు మాట్లాడాలని మీ దగ్గరికి వస్తే సమయం తీసుకుని వినండి

  • ఏదైనా సమస్య వచ్చినప్పుడే కాదు, పిల్లలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండండి

2 వాళ్ల మాటల అసలు ఉద్దేశాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “వివేకి తెలివిగా ప్రవర్తిస్తాడు.” (సామెతలు 13:16, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) కొన్నిసార్లు మీ పిల్లల అసలు మనోభావాల్ని అర్థంచేసుకోవాలంటే వాళ్ల మాటల వెనక దాగివున్న ఉద్దేశాన్ని గ్రహించాలి. సాధారణంగా పిల్లలు కొన్ని విషయాల్ని చాలా పెద్దవి చేసి చెబుతుంటారు. ఇంకొన్నిసార్లు వాళ్ల మాటల వెనక అర్థం వేరై ఉండవచ్చు. “అసలు సంగతి వినకుండా జవాబు చెప్పేవారు తమ తెలివితక్కువతనం తామే బయటపెట్టుకుంటారు.” (సామెతలు 18:13, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) కాబట్టి, వెంటనే కోపం తెచ్చుకోకండి.—సామెతలు 19:11.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మీ పిల్లలు ఏమి చెబుతున్నా సరే, మధ్యలో కలగజేసుకోకూడదని లేదా అతిగా స్పందించకూడదని నిశ్చయించుకోండి

  • వాళ్ల వయసులో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించేదో, మీరు ఏది ముఖ్యమని అనుకునేవాళ్లో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించండి

3 మీరిద్దరూ ఒక్క మాట మీదే ఉండండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.” (సామెతలు 1:8) పిల్లల మీద తల్లిదండ్రులిద్దరికీ యెహోవా అధికారం ఇచ్చాడు. మిమ్మల్ని గౌరవించడం, మీ మాట వినడం పిల్లలకు నేర్పించాలి. (ఎఫెసీయులు 6:1-3) తల్లిదండ్రులిద్దరూ ఒక్కమాట మీద లేకపోతే పిల్లలు ఆ విషయాన్ని పసిగట్టేయగలరు. (1 కొరింథీయులు 1:10) ఒక విషయం మీద మీ ఇద్దరికి ఏకాభిప్రాయం లేకపోతే, దాన్ని పిల్లల ముందు వెలిబుచ్చకండి. అలా గనక చేస్తే, వాళ్లకు మీమీద గౌరవం తగ్గిపోవచ్చు.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • మీ పిల్లలను ఎలా క్రమశిక్షణలో పెట్టాలో ఇద్దరు మాట్లాడుకొని, ఒకే అభిప్రాయానికి రండి

  • పిల్లలకు శిక్షణ ఇచ్చే విషయంలో మీ ఇద్దరికి భిన్నాభిప్రాయాలు ఉంటే, విషయాన్ని మీ జీవిత భాగస్వామి వైపు నుండి ఆలోచించడానికి ప్రయత్నించండి

4 ప్రణాళిక వేసుకోండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . ‘బాలుడు నడవాల్సిన త్రోవ వానికి నేర్పండి.’ (సామెతలు 22:6) మీ పిల్లలకు మంచి శిక్షణ దానికదే వచ్చేయదు. అందుకోసం మీ దగ్గర చక్కని ప్రణాళిక ఉండాలి. క్రమశిక్షణ ఇవ్వడానికి కూడా ప్రణాళిక వేసుకోవాలి. (కీర్తన 127:4; సామెతలు 29:17) క్రమశిక్షణ ఇవ్వడం అంటే కేవలం శిక్షించడం ఒక్కటే కాదు, మీరు పెట్టే నియమాల అసలు ఉద్దేశాన్ని మీ పిల్లలు అర్థంచేసుకునేలా వాళ్లకు సహాయం చేయడం కూడా. (సామెతలు 28:7) యెహోవా వాక్యాన్ని ప్రేమించడం, అందులోని సూత్రాల్ని గ్రహించడం కూడా నేర్పించండి. (కీర్తన 1:2) దానివల్ల పిల్లలు ఒక మంచి మనస్సాక్షిని పెంపొందించుకోగలుగుతారు.—హెబ్రీయులు 5:14.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • దేవునితో స్నేహం చేయవచ్చని, ఆయన మీద నమ్మకం పెట్టుకోవచ్చని అనిపించేలా మీ పిల్లలకు సహాయం చేయండి

  • నైతికపరమైన ప్రమాదాలను గుర్తించడానికి, వాటి జోలికి వెళ్లకుండా ఉండడానికి పిల్లలకు సహాయం చేయండి. ఉదాహరణకు, ఇంటర్నెట్‌లో, సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్లలో ఉండే ప్రమాదాల గురించి చెప్పండి. పిల్లలపై లైంగిక అఘాయిత్యాలకు పాల్పడే మృగాల చేతుల్లో పడకుండా జాగ్రత్తపడడం ఎలాగో నేర్పించండి

‘బాలుడు నడవాల్సిన త్రోవ వానికి నేర్పండి’