కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ భాగం

డబ్బును జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి?

డబ్బును జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి?

‘ఉద్దేశాలు ఆలోచనతో [“సంప్రదింపులతో,” NW] స్థిరపడతాయి.’—సామెతలు 20:18

కుటుంబ అవసరాలు తీర్చాలంటే మనందరికీ డబ్బు అవసరం. (సామెతలు 30:8) అవును, “డబ్బు ఉన్నవారికి అది అండగా ఉంటుంది.” (ప్రసంగి 7:12, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) దంపతులైన మీకు డబ్బు గురించి మాట్లాడుకోవడం కష్టమనిపించవచ్చు. కానీ ఒక్కటి, డబ్బు వల్ల మీ మధ్య సమస్యలు రాకుండా చూసుకోండి. (ఎఫెసీయులు 4:32) భార్యాభర్తలకు డబ్బు వ్యవహారాల్లో ఒకరిమీద ఒకరికి నమ్మకం ఉండాలి. డబ్బు ఎలా ఖర్చుపెట్టాలో ఇద్దరూ కలిసి నిర్ణయించుకోవాలి.

1 జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?” (లూకా 14:28) మీ డబ్బును ఎలా ఉపయోగించాలనుకుంటున్నారో ఇద్దరూ కలిసి ప్రణాళిక వేసుకోవడం ప్రాముఖ్యం. (ఆమోసు 3:3) మీరు ఏమి కొనాలో, దానికోసం ఎంత ఖర్చుపెట్టగలరో నిర్ణయించుకోండి. (సామెతలు 31:16) ఓ వస్తువు కొనడానికి మీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా దాన్ని కొనాలనేమీ లేదు. అప్పు జోలికి వెళ్లకుండా చూసుకోండి, ఉన్న డబ్బునే ఖర్చుపెట్టండి. —సామెతలు 21:5; 22:7.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • నెలాఖరులో డబ్బు మిగిలితే, దాన్ని ఏమి చేయాలో మీరిద్దరు కలిసి నిర్ణయించుకోండి

  • ఒకవేళ డబ్బు తక్కువైతే, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు వెదకండి. ఉదాహరణకు, సరుకుల్ని హోల్‌సేల్‌ షాపుల్లో కొనుక్కోండి

2 దాపరికంలేకుండా, ఉన్నదున్నట్టుగా మాట్లాడుకోండి

బైబిలు ఏమి చెబుతోందంటే . . . ప్రతీ విషయంలో “ప్రభువు [“యెహోవా,” NW] దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును” నిజాయితీగా శ్రద్ధ తీసుకోండి. (2 కొరింథీయులు 8:21) మీరు ఎంత సంపాదిస్తున్నది, ఎంత ఖర్చుపెడుతున్నది దాచకుండా మీ జీవిత భాగస్వామికి చెప్పండి.

డబ్బుకు సంబంధించి పెద్దపెద్ద నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నా మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి. (సామెతలు 13:10) డబ్బు విషయాల గురించి అలా మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. మీ సంపాదన మీ ఒక్కరిదే అన్నట్టు చూడకండి, మీ కుటుంబానిది అన్నట్టు చూడండి.—1 తిమోతి 5:8.

మీరు ఏమి చేయవచ్చంటే . . .

  • ఒకరినొకరు సంప్రదించుకోకుండా ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెట్టవచ్చో కలిసి నిర్ణయించుకోండి

  • సమస్య వచ్చిపడేదాకా ఆగే బదులు, ముందునుంచే డబ్బు గురించి మాట్లాడుకోండి